Showing posts with label శ్రీశ్రీ. Show all posts
Showing posts with label శ్రీశ్రీ. Show all posts

Sunday, April 15, 2018

ఆంధ్రకవితా పితామహుడు


ఆంధ్రకవితా పితామహుడు




సాహితీమిత్రులారా!



అల్లసాని పెద్దనకు "ఆంధ్రకవితా పితామహుడ"ని పేరు
ఆయనను గురించి "శ్రీశ్రీ" వ్రాసిన కవిత చూడండి-


ఈ యఖండ ప్రతిభ విరిసి య
నేక రుచుల తురంగలించెడు 
మధువు లొలికిన మంజుకవితల
మనుచరిత్రమున..

ఆ దినమ్మున కృష్ణరాయ ధ
రాధిపుని పేరోలంగమ్మున
త్వత్కవిత్వ రస స్రవంతిని
ధార కట్టినది

మృదు మధుర గాన ధ్వనుల విని
కృష్ణ సర్పము లవశమొందిన 
విధములపు డట  నున్న పండిత
హృదయముల తోచె 

అపుడు మ్రోగెను నీదు పాదము
నందునుండి జనించి సభలో
గండ పెండారపు సముజ్జ్వల
గాన గీతములు

గౌరవము గని గరువముం గని
పారవశ్యము చెంది ఆశీ
ర్ధ్వనులతో కృష్ణరాయని
ధన్యుని చేసితివి

ఏండ్లు పూండ్లును నాడు మొ1దలు గ
తించె కాని భవద్యశస్సులు
నేటి వరకు శరత్సుధాకర
నిర్మలత తాల్చు

నీవు నాటిన తోటలోపల 
చేవ తరుగని పూల గుత్తులు
నేటివరకును తేటవలపులు
నింపెడిని దెసల

జీవచిత్ర కళారహస్యము
చిందు వార్చిన నీకవిత్వము
చిత్రకారుల చేతగల కుం
చియల విచ్చినది

తెలుగు కవనపు తీరు తీయము
నిలిచి వెలుగుట కొక మెరుంగును
చిలికి చుక్కల నడుమ మింటను
కులుకుచున్నావు.

రచన - 1928 జులై, 22
ముద్రణ - కవితాసమితి తొలివార్షిక సంచిక,1929

Monday, April 2, 2018

అభిసారికి కడసారి


అభిసారికి కడసారి




సాహితీమిత్రులారా!



"శ్రీశ్రీ" గారి
"ఖడ్గసృష్టి" కవితా సంపుటిలోని
ఈ కవిత చూడండి

ఆకాశంమీద రాకాసికోర
ఏడవకయ్యా పోతావు
కోరచుట్టూ నెత్తుటి చుక్కలు
ఏడవకయ్యా పోతావు

కనుమలోనిది - కొ-కొ-కొ-కొలిమి
వెళ్ళకయ్యా చెడతావు
నీడచూడకు నీకే హాని
సంకేతం నీ శ్మశానం

వింతైనది విహంగం
ఏడవకయ్యా పోతావు
చూపులలోనివి సూదులు
ఎందుకయ్యా పోతావు

పడుచుదనానికి జడుపులేదు
సంకేతం నా సరస్సు
వెళ్ళకు వెళ్ళకు చస్తావు
నాడు నిండిన కోనేరు

ఏమిటి దంతపు చర్మంమీద
ఎర్రని పచ్చని దేదోమచ్చ
లోతులోయలో భూతాలు
కొలిమి నిప్పులో గుర్రాలు
సూదికి కంట్లో సోపానం
కాళ్ళకి కళ్ళూ సంకెళ్ళూ
సంకేతం నీ సాల్వర్సాన్
జలపాతంలో జంఝాటి

                - ప్రతిభ - జులై, 1940

Monday, February 19, 2018

విద్యున్మాలికలు


విద్యున్మాలికలు




సాహితీమిత్రులారా!


శ్రీ.శ్రీ. గారి ప్రభవ నుండి
విద్యున్మాలికలు అనే ఈ కవిత చూడండి-

బారులు బారులుగా తీరిన
మబ్బు గుబ్బలుల దారుల
దారి తప్పి చరించె
ఆ రేయి తరళ సరళేరమ్మదములు
అవి కవిడెంబమంబు గగురుపొడిచి
ఓరగా,
కోకిలపాట జీరగా
పైరుల పైపయి సోకి చను
తూరుపు గాలి
తీరుగా కవిడెందమున 
తాకి తాకనటుల తరలిపోయిన 
ఏ పిన్న భావాలొ
భావంపు సిగ్గు తడియారక
నుడిలో విడుదల వడ జాలక
విహ్వలించు
ఏ పిన్న భావాల పరిమళ తరంగాలొ
ఆనాటి చకచకిత చంచలావితతి

స్వర్గ వీథీవిహార తారకలు మారి
శాపవశాన,
మానవునితోట మడికట్లలోన
ప్రవాసపు బ్రతుకుతోన
నవయుచుండియు నవ్వు వెల్లువల జల్లు
రకరకాల రంగుల వికచ లతాంత సంతతులుగ
వినువీథి మీద


తమ కోరికల తోడ  పరిపూతములైన
కనుల కాంతి  వినయ విసృమతరలేమొ
ఆ నాటి రేయి నవఘళించిన
శంపాసహస్ర 
నిశావిశాల కుహర విహారములు

అవి యేమొ
యామినీవినీల గేహదేహళీ
విష్ణు క్రాంత నితాంత తోరణములొ
ఆటలాడు వేలుపు బాలికల
పావడా అంచుల బంగారు తీవియలొ
కావవి
వేటకాని కోలలకు కూలి 
వేదనల తూలు హరిణాల కండ్లు 
జాలికి పురుటిండ్లు -
దిక్కు దిక్కుల కంపిన దీనంపు చూడ్కులే
ఆనాటి
ప్రళయ తాండవ భయంకర సౌదామినులు

- ముద్రణ - భారతి (మార్చి- 1933)

Monday, February 5, 2018

భ్రమరగీత


భ్రమరగీత




సాహితీమిత్రులారా!


శాంతిలోంచి అశాంతి
అశాంతిలోనే శాంతిని
అనుభవించగలడు శ్రీశ్రీ

ఈ భ్రమరగీతిని చూడండి-
ఇది "ఖడ్గసృష్టి"నుండి-

గిరగిరగిరాం
భ్రమరం
గిరాం
భ్రమణం
భ్రమం
'భ్రమరణం'
భ్రమణ భ్రమరం
భ్రమర భ్రమణం
గిరగిర గిరాగిరా గిరాం భ్రమణం
రణం మరణం
రణమరణం దారుణహననం
ధిషణానిధనం
వృథామధనం
అది నా చెవిలో కథనం
లోకధనం 
కదనం
కదన కథాకథనం
అది నాయెదలో రణనం
ఝణ ఝణ ఝంఝణ ఝణాఝణా నిక్వణనం
అది నా పయనంలో ప్రథ మారుణ కిరణం
రణ నిస్సహణం
వధా విధా నాచరణం
నాలో లోలోపల భ్రమా భ్రమర సంచరణం
రణద్రణ నిస్సహన ప్రణవం
అది నా హృదయంలో రుథిరజ్వలనం గీతాజననం

(ధిషణానిధనం = మనీష(బుద్ధి)నాశనము
దారుణహననం = దారుణ హత్య
నిస్సహణం = A large double drum.)

Saturday, December 23, 2017

శ్రీశ్రీ ముత్యాలసరాలు


శ్రీశ్రీ ముత్యాలసరాలు



సాహితీమిత్రులారా!



ముత్యాలసరాలనగానే మనకు
గుర్తుకు వచ్చే మహాకవి గురజాడ
కాని ఇక్కడ శ్రీశ్రీ వ్రాసిన ముత్యాసరాలు
ఇవి "ప్రభవ" అనే పద్యకావ్యాన్ని తన సవతితల్లికి
అంకితమిస్తూ వ్రాసిన ముత్యాలసరాలు
1928 ఫిబ్రవరి - మార్చి నెల్లో వ్రాసినవి
చూడండి-

నవ వసంత ప్రాత రంచిత
భువన మోహన కుసుమవల్లరి
గ్రీష్మకాలాతప భరమ్మున
గీటడంగినది.

గాఢనిద్రాముద్రమేల్కని
కనులఁదెఱచి క్షణమునందున
స్నానమని వినినంత నిలువున
జలదరించితిని

ఆ యకాల ప్రళయ ఝంఝా
వాయువులలో తెన్ను తెలియని
యత్యప్రాయ స్థితిగతుల యం
దవశతలు గలిగె

నా శిశుత్వాజ్ఞాన వేళా
నష్ట మాతృ చరిత్ర నెఱుఁగను
తావకాని ర్వాచ్య సద్వా
త్సల్యమునఁ దల్లీ

ఇప్పుడు నీవు గతించినంతట
నెచటఁదెలియనిలోపమొదవెడు
ఇవి నితాంతాజ్ఞాత నిష్ఠుర
దివస నిచయములు

త్రిదిన ధామప్రధిత గాయక
మధుర రుతముల నడుమ నించుక
మామకీనాలస రవమ్ముల
మనసు నిల్పఁగదే




Wednesday, January 4, 2017

పంచుకోవడం ఎలా? ( శ్రీ.శ్రీ. అముద్రిత కవిత )


పంచుకోవడం ఎలా? ( శ్రీ.శ్రీ. అముద్రిత కవిత )



సాహితీమిత్రులారా!

మహాకవి శ్రీ.శ్రీ. గారి
అముద్తిత కవిత చూడండి-

పిల్లుల దెబ్బలాటలో  
కోతి మధ్యవర్తి అయినపుడు         
తక్కెడకైనా జున్ను      
ముక్కకైనా ప్రమాదమే       
ప్రజలే పిల్లులు        
ప్రజలే కోతి         
ప్రజలే త్రాసు     
ప్రజలేజున్ను       
కవులే జున్నూ త్రాసూ కోతీ   
కవులే పిల్లులు    
ధర్మం ప్రధానమా 
రసం ప్రధానమా కవికి      
అసత్కార్యంలో కూడా రసం ఉండొచ్చు    
అయినా రసం సామాజిక నిష్ఠం     
ప్రజలకి ధర్మం కావాలి     
కవికి రసం కావాలి        
రసహీనులైన ప్రజకి 
అధర్మం బోధించేకవి జతపడితే        
అప్పుడు పంచుకోవడానికి       
అసత్యమే మిగులుతుంది 
                                                      -  శ్రీ.శ్రీ.    14-1-1955.                    
                                               సేకరణ :చలసాని ప్రసాద్.                
                              ( రామలక్ష్మి ఆరుద్ర గారికి కృతజ్ఞతలతో)
పంపినవారు : అలంకారం విజయకుమార్.

Monday, July 11, 2016

శ్రీ శ్రీ పద్యాలు - 3



శ్రీ శ్రీ పద్యాలు - 3


సాహితీమిత్రులారా!

ఇప్పుడు మరికొన్ని
శ్రీశ్రీ పద్యాలు ఆస్వాదించండి.

అసలు సమస్యలు గ్రాసం,
వసనం, వాసం అలాంటి వాటిని చూసే
పస లేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రభుత సిరిసిరిమువ్వా!

జగణంతో జగడం కో
రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా
నగలాగ వెలుగును గదా
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా!

తేనెకు సీసా, బంగరు
పళ్ళెమునకు గోడచేర్పు కావాలి సరే
మధుకనక ప్రాముఖ్యం
సీసా గోడలకు లేదు సిరిసిరిమువ్వా!


కందం తిక్కనగారిది
కుందవరపువారి ముద్దుకుర్రని దంతే
అందరి తరమా కందపు
చిందుల కిటుకుల్ గ్రహింప సిరిసిరిమువ్వా!

మునుపటి వలె కాదంటా,
మన లోకం రూపమసలె మారిందంటా,
వెనుకటి గొప్పలు తలపో
సిన లాభం బండిసున్న సిరిసిరిమువ్వా!

ఇమిటేషన్ తప్ప స్వతం
త్రముగా నూహించగల మెదడులేక సమ
ర్థముగా కృతులను విరచించి
మమ్ములను పొగడుమండ్రు సిరిసిరిమువ్వా!

Saturday, July 2, 2016

శ్రీ శ్రీ - పద్యాలు - 2


శ్రీ శ్రీ - పద్యాలు - 2


సాహితీమిత్రులారా!

మనం శ్రీశ్రీ పద్యాలను ఒకసారి చూశాం.
మరి కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

"దెయ్యాలను చూపిస్తా
నయ్యా!" రమ్మనుచు నొక్క ఆసామీ నా
కయ్యో, తన కూతుళ్ళను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా!

నాకేమో లోకంలో
కాకవులే కానరారు, కవిదూషణ న
న్నాకర్షించదు, రచనో
త్సేకాన్నే మెచ్చుకొండు సిరిసిరిమువ్వా!

తెగకుట్టి వదలి పెట్టిన
వగణిత వైడాగు దోమలశ్వత్థామల్
పొగరెక్కిన రెక్కేన్గులు
సెగలెగసెడు తమ్మముళ్ళు  సిరిసిరిమువ్వా!

బారెట్లా అయితే సాం
బారెట్లా చెయ్యగలడు? భార్య యెదుట తా
నోరెట్లా మెదలించును?
చీరెట్లా బేరమాడు? సిరిసిరిమువ్వా!

నాలాగ కందబంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్ సద్గీతా
లాలపించే కవితా
శ్రీలోలుడు నహినహీతి సిరిసిరిమువ్వా!

తొందరగా చిందరగా
వందరగా పరుగులెత్తు వాళ్ళకు వేరే
గందర భూగోళంలో
చిందుల చదివింతలేల సిరిసిరిమువ్వా!

Saturday, June 11, 2016

జనస్వామ్య వీరుడికో సలహా


జనస్వామ్య వీరుడికో సలహా


సాహితీమిత్రులారా!
ఇది శ్రీశ్రీ  "ప్రాసక్రీడలు: లోనిది.

"ముష్టి మైథునంలో 
సవ్యసాచివిరా నా కొడకా
నాలుగు గోడల మధ్యా
రహస్యంగా ఏమిటాపని
నాలుగు వీధుల కూడలి వద్ద నిలబడి
నలుగురి మధ్యా
నిరూపించుకో నీ మగతనం
ప్రదర్శించు నీ వ్యక్తి స్వాతంత్ర్యం
ఆంధ్రుల జాతీయ పత్రికల 
సంపాదకీయాలకు
ఆదర్శప్రాయంగా...."

రచన- 12-9-1970
ముద్రణ - లాంగ్ మార్చ్ మాసపత్రిక
               విశాఖపట్టణం
               అక్టోబరు 1970

Thursday, June 9, 2016

స్వేచ్ఛా విహంగము


స్వేచ్ఛా విహంగము


సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ - 'ప్రభవ'లోని పద్యకవిత ఈ 'స్వేచ్ఛా విహంగము' చూడండి.

ఉచ్పలమాల-
నీవు నభో వికటంమున నిర్మల పాండు పయోద మాలికల్
త్రోవ యొసంగ పక్షముల దూయుచు హాయిగ సంచరించు స్వే
చ్ఛా విలసద్విహంగమవు స్వామి! క్షుధావిలమైన చూడ్కులన్ 
నీ విహరించు మార్గమున నిల్పి కనుగొనుచుందు  నే నిటన్

ఉత్పలమాల-
ఏ రుచిరాను రాగముల నీనెడు దూర దిశా నిశాంతమున్
చేరెదవో నినున్ కనక నేనిట గాసిల, ఏ ప్రపుల్ల క
ల్హార సుమావళీ పరిమళమ్ములు మూగు సురాపగా సుధా
తీరములో చరించెదవొ దీనత నాకిట సంఘటించగన్ 

ఉత్పలమాల-
నూతన పారిజాత సుమనో రమణీయములైన భావముల్ 
పూతలు పూచునా యెద, విముక్త మహాశుగ మట్లు దాటుచున్ 
ద్యోతలమున్ విహార పరిధూత గరుస్మృదుకాంతివాహినీ
స్నాత మనోహరమ్మగ నొనర్చు నినున్ కనునంత వింతగన్

ఉత్పలమాల -
కోమల పల్లవమ్ము లయి   కోర్కులు క్రొందనమున్ వహించగా
నామదియే ప్రసూన నవనందనమై వికసించు, అంత నో
స్వామి! వియత్పథాల దిగి వచ్చెద వీవు నిగూఢ వీధికా 
ధామములన్ త్యజించుచు నితాంతము నిందె నివాసమొందగన్


                                                                  రచన - 1930 జనవరి 30
                                                                  ముద్రణ - ఆంధ్రపత్రిక ప్రమోదూత సంవత్సరాది సంచిక 1930-31

Tuesday, June 7, 2016

శ్రీశ్రీ - పద్యాలు


శ్రీశ్రీ - పద్యాలు

సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ  - "సిరిసిరిమువ్వా" మకుటంలోని మరికొన్ని పద్యాలు.


కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకుచెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా!

ఊళ్ళో తిరిగే కుక్కలు
మళ్ళీ కనబడని యెడల మనకేం పోయెన్
జిల్లా కలెక్టరున క
ర్జీ ల్లిఖియించిన పనేమి సిరిసిరిమువ్వా!


ఈ క్రింది పద్యం సిరిసిరిమువ్వా శతకానికి ఫలశ్రుతి చూడండి.

ఈ శతకం యెవరైనా 
చూసి, చదివి, వ్రాసి, పాడి, సొగసిన, సిగరెట్
వాసనలకు కొదవుండదు 
శ్రీశు కరుణ బలిమివలన సిరిసిరిమువ్వా!

                                               ఇంకోసారి మరికొన్ని..........

భావిదృష్టి


భావిదృష్టి


సాహితీమిత్రులారా!

ఇది శ్రీశ్రీ  "ప్రభవ" లోని పద్యకవిత చూడండి.

చ. అట కవితా ప్రపంచము లహర్నిశమున్ రసవన్నవీన వి
    స్ఫుట నటనాప్రసక్తి మెయిసోలును, తేలుననంత హర్షపున్ 
    ఘటికలలో సహస్ర రవికాంతులు మేదుర రమ్య వర్ణ సం
    ఘటనము కూర్చి, నాకదియె కామ్యపథమ్ము భవిష్యదాశలన్

ఉ. నా తలపోత లీక్షణమునన్ పరువెత్తు నదృశ్య పక్ష సం
    పాతముతో, రయోద్ధత సుపర్వ విమాన పలాయన క్రియా
    తీతములై - సుధామధుర దివ్యపధాలకు, భావికాల వి
    ద్యోతిత నాట్యశాలలకు, జ్యోతిరఖండ యశోంగణాలకున్ 

ఉ. భావి వికాస వాటికల బాటలలో చనునాకు నా కవి
    త్వావృత గీతులే వినగనౌను చలద్గరుదంచలమ్ములై 
    దైవధనీ ప్రసన్న సికతాస్థలులన్  విహరించు నాకు నా 
    పూవుల పాటలే వరద పోవును తేనియ తేట యూటలన్ 

ఉ. నా నిపుడే  వదించిన అనేక రహశ్శృతు లాలకించగా 
    లేని జగత్తులో ప్రతిఫలించదు నా హృదయమ్ము నేడు సం
    ధ్యా నిశితారుణ  ప్రభలు దాచిన యామినిలో చరించు నా 
    మానస మింక  భావి సుషమా వికసద్రుచు లాస్వాదించెడున్

రచన - 1929 సెప్టెంబరు 16
ముద్రణ - భారతి - నవంబరు 1929

Monday, June 6, 2016

శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!


శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!


సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ పద్యాలు రాయలేదని కొందరు
కేవలం గేయాలే రాశాడని అపోహలో ఉన్నారు.
అది సత్యంకాదు.
శ్రీశ్రీ పద్యాలు చూడండి.
ఇవి అన్నీ కందపద్యాలే. సిరిసిరిమువ్వా మకుటంతో రాశారు.

"పందిన చంపిన వాడే
కందం రాయాల" టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా రా
సేందు కయో షరతులేల సిరిసిరిమువ్వా!

కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా!

అవురా! శ్రీరంగం శ్రీ
నివాసరావూ, బలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలిం
చి వెళ్ళి పొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా!

                                                   ఇంకొన్ని మరోసారి.........



Sunday, May 15, 2016

మరోప్రపంచం, మరోప్రపంచం

మరోప్రపంచం, మరోప్రపంచం


సాహితీమిత్రులారా!

మహాప్రస్థానంలో మొదటి గేయం 
మరోప్రపంచం మరోప్రపంచం శ్రీశ్రీ గొంతుకతో వినండి.


Saturday, May 7, 2016

ఏవి తల్లీ!


ఏవి తల్లీ!


సాహితీమిత్రులారా!

ఖడ్గసృష్టి లో
శ్రీశ్రీ రాసిన
"ఏవి తల్లీ"
("THE SNOWS OF YESTER YEAR" )
 (ఇది F. Villon  అనుసరణ.)
అనే కవిత చూడండి.

చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?

కాళిదాస మహా కవీంద్రుని 
కవన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది? చూపించు?

షాజహాన్ అంత:పురములో
షట్పదీ శింజాన మెక్కడ!
ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ?

రుద్రమాంబా భద్రకాళీ
లోచనోజ్వల రోచులేవీ!
ఖడ్గతిక్కన కదనకాహళ
కహకహ ధ్వనులెక్కడమ్మా?

ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహు జాగ్రద్బాడబగ్నులు?
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవి తల్లీ?

జగద్గురువులు, చక్రవర్తులు, 
సత్కవీశులు, సైన్యనాధులు
మానవీరులగు మహారాజ్ఞులు
కానరారేమీ?

పసిడిరెక్కలు విసిరికాలం
పారిపోయిన జాడలోవీ?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?