Wednesday, June 30, 2021

ఇస్తే దానకర్ణుడు మరి ఇవ్వకపోతే...........

ఇస్తే దానకర్ణుడు మరి ఇవ్వకపోతే...........
సాహితీమిత్రులారా !ప్రతిరోజూ  బిక్షం పెట్టించుకొంటూ
ఒకరోజు పెట్టకపోతే నానాబూతులు తిడతారుకదా!
అలానే కవులూ దానమివ్వని వారిని ఎలా పద్యాలలో
ఈ సడించుకున్నారో కొన్ని పద్యాలను చూద్దాం-

ఎంత వేడినా, ఏమన్నా ఇవ్వని వారిని
చూసి ఒక కవి ఇలా అంటున్నాడు-

ఇల లోభి నెంత వేడిన
వలవని వెతలంతె కాని వా డిచ్చెడినే
జలమును వెస గిల కొట్టిన
కలుగునె నవనీతమాశగాక ----పెద్దగా లేక పోయినా ఇచ్చేవాళ్ళున్నారు
ఉండీ ఇవ్వని వాళ్ళున్నారు
అటువంటి వారిని గురించి చెప్పిన పద్యం -

కలుగక యిచ్చెడు మనుజులు
తలవెండ్రుకలంతమంది తర్కింపంగా
కలిగియు నీయని యధములు
మొలవెండ్రుకలంతమంది మోహనరంగా!చాలా మంది ఇస్తున్నపుడు
ఒక లోభి ఇవ్వకపోతేనేమి
గోష్ఠంలో పెక్కావులు పాలిస్తుండగా
ఒక బక్కావు ఇవ్వకపోతే ఏమిలే అంటున్నాడో కవి-

పెక్కావు లిచ్చుచో నొక
బక్కా వీకుండెనేని పాడికి కరవా
పెక్కు దొర లిచ్చుచో నొక
కుక్కల కొడు కీయకున్న కూటికి కొరవా!


దీనిలో ఇవ్వని వాని శునకపుత్రునితో పోల్చాడు
మరి అతని బాధ అలాంటిది.

ఒక కవి అంటాడు - దానమనేది పుట్టుకతోచేతిలో పుట్టే గుణం.
దాన్ని బలవంతాన చేతికి - అటూ - ఇటూ నులిమి
ఎక్కించటానికేమన్నా గాజువంటిదా?

పుట్టుక తో డుత కరమున
పుట్టవలెన్ - దానగుణము - పుట్టకపోతే
యిట్టట్టు నులిమి బలిమిని
బట్టింపను గాజ తాళ్ళపలి కొండ్రాజా!ఇక్కడ మరో కవి అంటున్నాడు పదిమందికిచ్చి
పదకొండవవానికివ్వకపోతే వాడూరుకోడు
తిట్టి పోస్తాడు అంటున్నాడు చూడండి-

పదివేలమంది కిచ్చియు
తుది నొక్కని కీయకున్న దొరకువు కీర్తుల్
పదివేల నోము నోచిన
వదలదె యొక రంకు వంక వన్నియసుంకా!


పదివేల నోములు నోస్తే వచ్చిన పేరు,
ఒక రంకుతనపు అపకీర్తి వస్తే నిలువదు.
అలాగే దాత అన్నవాడు పేరుండాలంటే ఇస్తూనే ఉండాలి.

Monday, June 28, 2021

ఆరు ముఖాల షణ్ముఖుడు

 ఆరు ముఖాల షణ్ముఖుడు 
సాహితీమిత్రులారా!షట్ అంటే ఆరు, ఆరుముఖాలుకలవాడు
షణ్ముఖుడు, షడాననుడు - సుబ్రహ్మణ్యస్వామి.
ఆయన ఆరు ముఖాల ప్రత్యేకత-
ఆరు ముఖాలలో మొదటిది వెలుగునిస్తుంది.
రెండవముఖం వరాలను ఇస్తుంది.
మూడవ ముఖం యజ్ఞాలను రక్షిస్తుంది.
నాలుగవ ముఖం వేదాల అర్థాన్ని బోధిస్తుంది.
ఐదవ ముఖం దుష్టశక్తులను నాశనం చేస్తుంది.
ఆరవముఖం వల్లీదేవిమీద ప్రేమ కటాక్షాన్ని ప్రసారం చేసి,
ధర్మాన్ని ఆచరించాలని అందరికి ప్రబోధిస్తుంది.
అలాగే ఆరుముఖాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు
అనే అరిషడ్వర్గములను నాశనం చెస్తాయి.
కుమారస్వామిని ఆరాధించటాన్ని కౌమారం అంటారు.
ఇప్పుడు ఈ మతం హిందూ సనాతన ధర్మంలో కలిసిపోయింది.


Saturday, June 26, 2021

కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2

 కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2

సాహితీమిత్రులారా!కాశీమజిలీ కథల్లో మణిసిద్ధుడు, గోపడు ఇద్దరూ ఊరూరూ

మజిలీలు చెస్తూ వెళుతున్నారు కాశీకి. మధ్యలో కనపడ్డ

వింతలు విశేషాలూ వివరిస్తున్నాడు గోపనికి మణిసిద్ధుడు.

ఇలా వెళుతూండగా ఒకఊరిలో గోడమీద క్రింది పద్యం

చూశాడు శిష్యుడు(గోపడు) ఈ పద్యం పై ఒక బొమ్మకూడ

ఉంది. ఆ పద్యం-


భూపతిఁజంపితిన్, మగఁడు భూరిభుజంగము చేతఁజచ్చె, నే

నాపదఁజెంది చెంది యుదయార్కుని పట్టణముఁజేరి వేశ్యనై

పాపము గట్టుకొంటి, తన పట్టి విటుండయి కౌఁగిలింప, సం

తాపముఁబొంది, యగ్గిఁబడి, దగ్ధనుగా, కిటు గొల్లభామనై

యీ పని కొప్పుకొంటి, నృపతీ వగపేటికిఁజల్ల చిందినన్


దీన్ని చూచిన తరువాత గోపనికి కొండెత్తు కుతూహలం పెరింది

ఈ బొమ్మేమిటి, ఈ పద్యమేమిటి, ఇందులో ఎన్నో సన్నివేశాల

ప్రసక్తి ఉంది. దాని పూర్వాపరాలేమిటి

ఈ గొల్లభామ ఏ భూపతిని చంపింది

ఆమె మగడు ఎందువల్ల పాముకాటుతో మరణించాడు

వారికి పుట్టిన కుమారుడెక్కడ పెరిగాడు

ఆమె వేశ్యగా ఎందుకు మారింది

ఆమె దగ్గరకే ఆమె కొడుకు విటునిగా ఎందుకొచ్చాడు

ఇవన్నీ తెలిసి తెలిసి అగ్నిప్రవేశం చేయకుండా

ఎందుకు చల్లనెత్తుకొంది

అందులోంచి చల్లచిందితే ఏ నృపతి ప్రశ్నించాడు

శిష్యుడు వేసిన ప్రశ్నలన్నిటికి గురువుగారు మణిసిద్ధుడు

పూసగ్రుచ్చినట్లు సమాధానం చెప్పాడు ఇదంతా వింటుంటే

చదువుతుంటే ఎంత ఆసక్తికా కథాకథనం వుందో మదిర

సుబ్బన్నదీక్షితుల గొవ్వభామ కథలో


   ఈ పద్యంలోని సంఘటనలుగాని, ఇందులోని కల్పనలుగాని

సుబ్బన్నదీక్షితులు సృష్టించిన కల్పనలుకాదు. ఇందులోని

కథాకథనమే వారిది. ఈ పద్యం మూలశ్లోకం రసిక జీవనం అనే

సంస్కృత ప్రబంధంలో ఉంది.


ఆ శ్లోకం-

హత్వా నృపంపతి మవేక్ష్య భుజంగదష్టం

దేశాంతరే విధివశాద్ గణికాస్మితాజాతా

పుత్రం భుజంగ మధిగమ్యచితాం ప్రవిష్టా

శోచామి గోపగృబిణీ కథ మద్యతక్రమ్


రసిక జీవనం కంటే ప్రాచీనమైన ఇంకొక సంస్కృత సంకలన గ్రంథం

ఒకటుంది. దానిపేరు ప్రబంధ చింతామణి దాన్లో రెండవ ప్రకరణంలోని

12వ శ్లోకంలో ఉన్న గోపగృహిణీ ప్రబంధం ఈ కథకుమూలమని

చాటుపద్య రత్నాకంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు పొందుపరిచారు.

ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులుగారు మూలశ్లోకాన్ని

వివరాలుతెలిపారట. కాశీమజిలీ కథలు కపోల కల్పితాలు కావని

దీని బట్టి తెలుస్తున్నది.

Thursday, June 24, 2021

కాశీమజిలీకథలు - కొన్ని విషయాలు

 కాశీమజిలీకథలు - కొన్ని విషయాలు
సాహితీమిత్రులారా!
ఒకనాడు ఆబాలగోపాలాన్ని అలరించిన కథలు
కాశీమజిలీకథలు వీటిని మధిర సుబ్బన్నదీక్షితులు
కూర్చారు. ప్రజాబాహుళ్యంలో ప్రచారంలోని కథలకు
మంచి కథనంతో కూర్చాడు మధిర సుబ్బన్నదీక్షితులు.
ఇవి మొదట్లో వ్యానహారిక భాషలోనే వ్రాయబడ్డాయి.
తరువాతి కాలంలో ఇవి గ్రాంథికంలోని మార్చారు.

ఇవి ఎంత ప్రచారంలోకి వచ్చాయో ఈ పద్యం చెబుతుంది.

పండితులైన మెచ్చవలె, పామరకోటికినైన నింపుగా
నుండవలెన్, ప్రబంధమునయోక్తుల నిర్వురకున్ హితంబుగా
కుండిన తత్ప్రబంధమది యొక్క ప్రబంధమె సాధుపాఠకా
ఖండ సుఖ ప్రదం బగుటగా ఫలమా కవితా ప్రసక్తిన్

దీన్ని బట్టి పామరులకుకూడ ఇంపుగా వుండాలంటే
వ్యావహారిక భాషలోనే సాధ్యం. మనకు ఇప్పుడు దొరికే
పుస్తకాలు గ్రాంథికంగా ఉన్నాయి. మరొక విషయమేమంటే
ఇటీవల వీటిని చదువగలిగే సామర్థ్యం ప్రజల్లో తగ్గిందనే
చెప్పవచ్చు అందుకే వీటిని సాధారణ కథల్లాగా అనువదించి
బజారులో ఉంచారు. అంటే ఎంత ప్రసిద్ధమైనవైతేనో
అనువాదాని పూనరుకదా.  పూర్తి విషయంలోకి వస్తే
ఇవి పండ్రెండు భాగాలు 359 మజిలీలు 12 ప్రధాన
కథలతోపాటు 496 ఉపకథలున్నాయి.
వీటినుండే మనకు కొన్ని సినిమాలు కూడ వచ్చాయి
అందులో భామావిజయం, కీలుగుర్రం, చిక్కడు దొరకడు
(కొంత భాగం) మొదలైనవి..ఇలా చెబితే చాలా వున్నాయి.

         మధిర సుబ్బన్నదీక్షితులు (1868-1928) తూర్పగోదావరి జిల్లా
తాళ్లపూడి గ్రామంలో జన్మించారు. ఈయన ఇవిగాక అనేక పుస్తకాలు
వ్రాశారు. అష్టావధానాలు చేశారు. ఈ పుస్తకాల ఆదరణ
చూసి ఆ కాలంలో అనేక కథా పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి కానీ
వీటివలె ప్రసిద్ధం కాలేదు.

1. కాశీమజిలీకథలు - మధిర సుబ్బన్నదీక్షితుల(1898)
2. నిజమైన కాశీమజిలీలు - నంది చలపతిరాజు(1903)
3. శ్రీరంగమజిలీలు - బత్తల లక్ష్మయ్య(1911)
4. కాశీరామేశ్వర మజిలీలు -గుడిపాటి శేషగిరిరావు(1915)
5. రామేశ్వరపు మజిలీలు - కె. వెంకటరంగనాయకమ్మ(1919)
6. కాశీమజిలీలు - నందిరాజు చలపతిరావు(-)
Tuesday, June 22, 2021

లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

 లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

సాహితీమిత్రులారా!లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో

తెలిపే శ్లోకం ఇది గమనించండి-

క్షీరసాగరా త్పారిజాత పల్ల లేభ్యో, రాగమిందు

శకలా దేశాంతవక్రతా, ముచ్ఛైశ్రవైశ్చంచలతాం

కాల కూటన్మోహనశక్తిం, మదిరయా మదం,

కౌస్తుభమణి రతి నైష్ఠుర్యం, ఇత్యే తాని సహవాస

పరిచయవశా ద్విరహ వినోద చిహ్నాని గృహీత్యేవోద్గతా


పూర్వం అమృతమధనం కోసం దేవతలూ - దానవులూ

కలిసి పాలసముద్రం చిలికినపుడు, దాన్నుండి

కల్పవృక్షం - కామధేనువు - పాంచజన్యం - పారిజాతం-

ఉచ్ఛైశ్రవం - ఐరావతం - కౌస్తుభమణి - కాలకూటం -

చంద్రుడు - లక్ష్మీదేవి - ఇవన్నీ కూడ ఉద్భవించాయి.


ఈ ప్రకారంగా ఇవ్నీ లక్ష్మీదేవికి సోదరసోదరీమణులు కదా

వీటి పోలికలు కొన్నయినా ఉంటాయికదా

ముఖ్యంగా లక్ష్మీదేవికి వారి పోలికలు కొన్ని వచ్చాయి-

అవి చంద్రుని నుంచి వక్రత్వం

ఉచ్ఛైశ్రవం నుంచి చాంచల్యం

విషం నుంచి మైకం,

అమృతం నుండి మదం,

కౌస్తుభం నుండి కాఠిన్యం

వచ్చాయి అందువల్ల లక్ష్మీదేవి

స్వభావం ఎప్పుడు ఎలా ప్రదర్శించబడుతుందో

మానవులకు అంతు చిక్కకుండా పోయింది.

Sunday, June 20, 2021

అదొక్కటే దారి

 అదొక్కటే దారి
సాహితీమిత్రులారా!ప్రతిదానికి భయపడటం నుండి తప్పించుకోవడానికి

ఉన్నదొకే మార్గమని తన వైరాగ్య శతకంలో 

భర్తృహరి వివరించారు అది గమనించండి-

భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలా ద్భయం,
మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయా భయమ్,
శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాన్తా ద్భయం,
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమే వాభయమ్


భోగాలనుభవిస్తున్నా మనే తృప్తి మిగలకుండా రోగాలోస్తాయేమోనని
రోగభయం, మంచి కులంలో పుట్టామని తృప్తి పడటానికి ఏం తప్పు
జరిగినా కులానికి అప్రతిష్ట వస్తుందేమోనని భయం, బాగా డబ్బు (ఐశ్వర్యం)
ఉన్నదిలే అని ఆనందపడితే రాజు ఆ ధనాన్ని కైంకర్యం చేస్తాడేమోనని భయం,
మానశౌర్యం చేత విర్రవీగే వీలు లేకుండా అనుక్షణం ఎప్పుడు ఏం జరుగుతుందోననే
భయం, సౌందర్యం ఉందనుకుంటే ముసలితనం వస్తుందనే భయం, శాస్త్ర విజ్ఞానం
వుందంటే ప్రతివాదులతో వాదనా భయం, మంచి శరీరం వుందంటే దీనికి ఎప్పుడు
యముని బాధ కలుగుతుందోనని భయం ఇలా ప్రతిదానికి ఏదో ఒక విఘాతం ఉందికాని భయంలేనిది ఒక్క వైరాగ్యానికే - అని శ్లోకభావం


Friday, June 18, 2021

మొదటిది వదలి రెండవదాన్ని పాటించు

 మొదటిది వదలి రెండవదాన్ని పాటించు
సాహితీమిత్రులారా!విప్రతిషేధే పరం కార్యమ్ - అనేది పాణినీయం
వ్యాకరణ సూత్రం. విప్రతిషేధే పరం కార్యమ్ - అంటే
మొదట చెప్పిన విధీ(కార్యము), తరువాత చెప్పిన విధీ
(కార్యము) రెండూ ఒకే శబ్దం విషయంలో తారసిల్లినపుడు
(వచ్చినపుడు) మొదటి విధిని విడిచి రెండవ విధిని
గ్రహించాలి అనేది సూత్రార్థం.
దీన్ని గ్రహించిన ఒక కవి
ఎంత చమత్కారంగా వాడాడో చూడండి-

"నిజపలి రాద్యః ప్రణయీ,
హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!"

"శృణుసఖీ పాణి సూత్రం
విప్రతిషేధే పరం కార్యమ్"


రాధ ఆమె చెలికత్తెల సంభాషణగా కూర్చబడినది

రాధ - నిజపలి రాద్యః ప్రణయీ,
           హరిర్ద్విలీయః, కరోమి కిమ్ గోపి!

(నా భర్త నామీద మొదటి నుంచి ప్రణం ఒలికించాడు
 ఇప్పుడేమో కృష్ణుడొకడు  నా జీవితంలో ప్రవేశించాడు
 ఏమిచెయ్యనే)

గోపిక - శృణుసఖీ పాణి సూత్రం
              విప్రతిషేధే పరం కార్యమ్

(ఏముందీ అటువంటి వాటన్నిటికి  శాస్త్రకారులు మనకు దారి
చూపించే పోయారు పాణిని సూత్రం వినలేదా
విప్రతిషేధే పరం కార్యమ్- అని)

అంటే మొదటివాడైన భర్తను వదిలేసి రెండవవాడైన కృష్ణుని
ఆశ్రయించమని సలహా ఇచ్చింది - పాణిని సూత్రం ఎంతబాగా
ఉపయోగించింది

Wednesday, June 16, 2021

నరక కుండాలు - అంటే ఏవి?

 నరక కుండాలు - అంటే ఏవి?
సాహితీమిత్రులారా!భారతీయుల నమ్మకం ప్రకారం
చేసిన పాపాలను బట్టి ప్రాణి మరణానంతరం
నరకానికి వెళతారు. వారు ఎవరుచేసిన దానినిబట్టి
వారికి ఆ నరకం ప్రాప్తిస్తుంది. వీటిని బ్రహ్మవైవర్త
పురాణంలో కృష్ణపరమాత్మ నందునికి చెప్పిన
కర్మవిపాక వర్ణననుండి మరి కొన్ని గ్రంథాలనుండి
గమనిస్తే నరక కుండాలు 86. వీటిలో ప్రాణి
అనుభవించాల్సిన శిక్షలను విధిస్తారు.
86 కుండాల పేర్లు-
1. వహ్ని 2. తప్త 3. క్షర 4.విట(ఉప్పు) 5. మూత్ర
6. శ్లేష్మ 7. గర(విషం) 8. దూషికా 9. వసా 10. శుక్ర
11. అసృక్(నెత్తురు) 12. అశ్రు 13. గాత్ర మల, 14. కర్ణ మల
15. మద్య 16. మాంస 17. నఖ 18. రోమ 19. కేశ 20. అస్థి
21. తామ్ర 22. లోహ, 23. తీక్షణ కంటక 24. విష 25. ఘర్మ
26. తప్ర సురా 27. ప్రతప్త తైల  28. కుంత 29. కృమి 30. పూయ
31. సర్ప 32. మశక 33. దంశ 34. గరళ 35. వజ్ర దంష్ట్ర
36. వృశ్చిక 37.శర 38. శూల 39. ఖడ్గ 40. గోళ 41. నక్ర 
42. కాక 43. సంచాల 44. వాళ 45. వజ్ర 46. తప్తపాషాణ
47. తీక్షణ పాషాణ 48 లాలా 49. మసీ 50. చూర్ణణ 51. చక్ర
52. వక్ర 53. కూర్మ 54. జ్వాలా 55. భస్మ 56. దండ 
57. తప్తనూర్మీ 58. అసివత్ర 59. క్షురధారా 60. సూచీముఖ
61. గోధాముఖ 62. నక్రముఖ 63. గజదంశ గోముఖ 65. కుంభీపాక
66. కాలసూత్ర 67. అవలోభ 68. అరుంతుద 69. పాంశుభోజ
70. పాశవేష్ట 71. శూలప్రోత 72. శునీముఖ 73. ప్రకంపన
74. ఉల్కాముఖ 75. అకూప 76. వేదన 77. దండతాడన 
78. జాలబద్ధ 79. దేహచూర్ణ 80. దళన 81. శోషణ 82. కష
83. శూర్ప 84. జ్వాలాజిహ్వ 85. ధూమాంధ 86. నాగవేష్టన
కుండములు.

వీటిలో కొన్నయినా విన్నామా ?
విన్నాంకదా అపరిచితుడు సినిమాలో
ఇక్కడ చాలవిన్నాం గమనించండి
ఇవి వున్నాయో లేదో అన్నది అనవసరం
కానీ ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ
ఒకరిని ఇబ్బంది పెట్టకుండా వుంటే
వీటితో పనిలేదని కొందరి నమ్మకం
కాదంటామా? లేదుకదా!

Monday, June 14, 2021

బ్రాహ్మణాలు అంటే ఏమిటి?

 బ్రాహ్మణాలు అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!వైదికమంత్రాల అర్థాన్ని వివరించి వాటి వినియోగాన్ని
నిర్తేశించేవి బ్రాహ్మణాలు. వేదమంత్రద్రష్టలను ఋషులు అనీ,
బ్రాహ్మణ ద్రష్టలను ఆచార్యులు అనీ అంటారు. ఆదిలో 
బ్రహ్మణాలు అనేకం ఉండేవి. అవి ప్రస్తుతం లభించిన
కొద్ది బ్రాహ్మణాలు తప్ప మిగిలినవన్నీ కాలగర్భంలో కలిసి 
పోయాయని విద్వాంసులు భావిస్తున్నారు. యజ్ఞకర్మల 
విధానంలోని భేదాలనుబట్టి,  మతభేదాలను బట్టి ఏయజ్ఞంలో
ఏ మంత్రాలను ఉపయోగించాలో, మంత్రాలకూ యజ్ఞాలకూ గల 
సంబంధం ఎటువంటిదో, బ్రాహ్మణాలు సూక్ష్మంగా వివరిస్తాయి.
అట్టి వివరణలలో మధ్యమధ్య కొన్ని కథలను కూడ చెప్పడం 
జరిగింది. పురూరవ ఊర్వశుల కథ (శతపథబ్రాహ్మణం - 11-5-1),
జతౌషు వృత్తాంతం (శతపథబ్రాహ్మణం - 1-8-1), హరిశ్చంద్రోపాఖ్యానం 
అలాంటి కథలే. కథా కథనశిల్పం బ్రాహ్మణ గ్రంథాలలో పరిణత
రూపంలో కనిపిస్తాయి. బ్రాహ్మణాలు గద్యాత్మకరచనలు.
బ్రాహ్మణాలలో నాలుగు భాగాలున్నాయి.
1. విధివిభాగం, 2. అర్థవిభాగం, 3.ఉపనిషద్విభాగం,
4. ఆఖ్యానవిభాగం.

ఋగ్వేదబ్రాహ్మణాలు - 2
1. ఐతరేయ బ్రాహ్మణం, 2. శాంఖాయన బ్రాహ్మణం

యజుర్వేద బ్రాహ్మణాలు - 
శుక్లయజుర్వేదానికి - శతపథబ్రాహ్మణం
కృష్ణయజుర్వేదానికి - తైత్తిరీయ బ్రాహ్మణం

సామవేద బ్రాహ్మణాలు -
దీనిలో 9 బ్రాహ్మణాలున్నాయి.
కాండ్య, షడ్వింశ, సామవిధాన, ఆర్షేయ, దేవతాధ్యాయ,
ఉపనిషద్, సంహితోపనిషద్, వింశ, జైమినీయ బ్రాహ్మణాలు

అధ్వరవేద బ్రాహ్మణాలు-
దీనిలోనూ 9 బ్రాహ్మణాలు ఉన్నాయని చెబుతున్నా
ఒక్కటి మాత్రమే లభించింది.
అదీ గోపథ బ్రాహ్మణం.


Saturday, June 12, 2021

అర్జునుని ధనుర్విద్యాపాటవం

 అర్జునుని ధనుర్విద్యాపాటవం
సాహితీమిత్రులారా!అర్జునుని ధనుర్విద్యాపాటవము గురించి వేరు
చెప్పక్కరలేదు అదిలోక విదితమే. కాని కొన్నిటిని
ఇక్కడ చెప్పుకొంటున్నము చూడండి-

ఒకనాడు ద్రోణుడు గంగానదిలో స్నానం చేస్తున్నాడు.
అప్పుడొక మొసలి వచ్చి అతని తొడను పట్టుకొంది.
ద్రోణుడు ఎంత ప్రయత్నించినా అది అతన్ని విడువలేదు.
అప్పుడు కురుకుమారులు అందరు వచ్చి ఏంచేయటానికి
సాహసించక పోయారు గురువుగారికి నొప్పితగలకుండ
మొసలిని చంపడం ఎలాగో వారికి తెలియదు పైగా
అది నీటి అడుగున ఉంది. గురువుగారి తొడకే తగలవచ్చు
దాంతో వారికి ఏంచేయాలో తెలియక నిలబడిపోయారు.
కాని అర్జునుడు మాత్రం అలా ఉండలేదు.
వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి ఏడు బాణాలతో దాన్ని ముక్కలుచేసి
ద్రోణున్ని వదిలించాడు. ఇది అర్జునుని ధనుర్విద్యాపాటవాలను
తెలిపేవాటిలో ఒక సంఘటనమాత్రమే

ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని
కొట్టడం సామాన్య విషయంకాదు.

ఖాండవదహనం నాడు  అగ్నిదేవుని
అగ్నిమాంద్యాన్ని తొలగించటానికి
ఖాండవాన్ని దహించటానికి సహకరించి
నిలబడగా ఇంద్రుడు తన మిత్రుడైన తక్షకుని
రక్షించటానికి వర్షాన్ని కురిపిస్తే అర్జునుడు
తన ధనుర్విద్యాకౌశలంతో బాణాలతోనే
ఛత్రాన్ని నిర్మించి  అగ్నిదేవుడు ఖాండవాన్ని
పూర్తిగా దహించేట్లుచేశాడు.

అరణ్యవాసకాలంలో దుర్యోధనుణ్ణి చిత్రసేనుడనే గంధర్వుడు
బంధించి అదృశ్యుడై ఆకాశానికి వెళ్ళినపుడు కూడ అర్జునుడు
తన శరపరంపరలను వదలి ఆకాశంలో ఒక చిక్కంలాగా కట్టి,
అతణ్ణి వెళ్ళకుండా చేస్తాడు.

Thursday, June 10, 2021

సన్యాసం అంటే ఏమిటి?

 సన్యాసం అంటే ఏమిటి?
సాహితీమిత్రులారా!మన హిందూసమాజంలో సన్యాసి అనే పదం సుపరిచితమైనదే.
దీన్ని గురించి ఇంకెందుకు తెలుకోవడం అనే అనుమానం రావచ్చు.
కానీ మనకు తెలిసిన విషయం స్వల్పం. అందుకే మరికొంత 
తెలుసుకుందాని ఇక్కడ చర్చించడం జరుగుతోంది.

ఆశ్రమ ధర్మాల్లో సన్యాసం నాలుగవది. మొదటిది బ్రహ్మచర్యం,
రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం.
సన్యాస మనే ఈ పదాన్ని ఇంతకుపూర్వం సన్న్యాసం అని,
సంన్యాసం అని వాడేవాళ్ళు.
సన్యాసం అంటే వైరాగ్య భావనతోనో, అదే లక్ష్యంగానో 
సంసారిక జీవితాన్ని త్యజించివేయడం. వైరాగ్య తీవ్రతను బట్టి మంద వైరాగ్యం,
తీవ్ర వైరాగ్యం, తీవ్రతర వైరాగ్యం అని మూడు విధాలుగా చెబుతారు.
1. గృహసంబంధమైన సమస్యలను తట్టుకోలేక 
    సన్యసించటాన్ని మందవైరాగ్యం అంటారు. 
2. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణత్రయాన్ని వదలిన
    సన్యాసాన్ని తీవ్రవైరాగ్యం అంటారు.
3. కర్మకాండలలో చెప్పిన విధివిధానాలు ప్రయోజనరహితమని
    విడిచి పెట్టిన సన్యాసాన్ని తీవ్రతర వైరాగ్యమని అంటారు.

ఈ విభజన కాకుండా సన్యాస తీవ్రతను బట్టి మరి 
రెండు రకాల విభజన వుంది. అందులో నాలుగు విధాలని,
ఆరు విధాలని చెప్పబడుతున్నవి.
మొదట నాలుగు విధాలైన వాటిని గమనిస్తే-
1. కుటీచకం, 2. బహూదకం, 
3. హంస సన్యాసం, 4. పరమహంస సన్యాసం

తీవ్ర వైరాగ్యం వల్ల తీసుకునే సన్యాసాలు మొదటి రెండు సన్యాసాలు.
వాటిలో మొదటిది 1. కుటీచకం- 2. బహూదకం. 
తీవ్రతర వైరాగ్యం కలిగిన సన్యాసులు హంసలు, పరమహంసలు

సంచారం చేసే శక్తిలేని సన్యాసి ఊరివెలుపలో, ఏదైనా ఒక నదీతీరంలోనో మఠం ఏర్పరచుకొని, కాషాయవస్త్రాలు దండ కమండలలాలు ధరించి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకునే
సన్యాసి కుటీచకుడు.

పుణ్యతీర్థాలను, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడా ఆరు రోజులకు
ఎక్కువ కాకుండా గడుపుతూ సంచారం చేస్తుండే సన్యాసి బహూదకుడు.

హంసలు ఆచార విహితమైన మార్గంలో సన్యాస వ్రతం కొనసాగిస్తారు.
పరమహంసలు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాసతో తీవ్ర సాధన చేస్తుంటారు. ఒక జీవిత కాలం సాధనలో కృతకృత్యులు కాలేని
పరమహంసలు తిరిగి జన్మలు ఎత్తి సాధన కొనసాగించి గమ్యం చేరుతుంటారని ప్రతీతి.
రెండవ విధానంలో పైన చెప్పిన నాలుగు విధాలే కాకుండా మరో రెండు విధాలున్నాయి. తురీయాతీత, అవధూత అనే వ్యవస్థలు.

మరో విభజనప్రకారం 6 విధాలు ఇవే-
1. కర్మఫల సన్యాసం / కర్మసన్యాసం
2. వైరాగ్య సన్యాసం / జ్ఞాన సన్యాసం
3. ఆతుర సన్యాసం / క్రమ సన్యాసం
4. వివిదిషా సన్యాసం / విద్వత్సన్యాసం
5. కర్మైక దేశ సన్యాసం / పరమార్థ సన్యాసం
6. గౌణ సన్యాసం 
గౌణ సన్యాసంలో బ్రహ్మణేతరులు స్త్రీలు కూడ 
సన్యాసం తీసుకోవచ్చు. పురాణ కాలంలో 
బ్రహ్మణేతరులు సన్యాసం తీసుకోవడం ఉంది.
ఉదాహరణకు విదురుడు ఇలా సన్యాసం తీసుకొన్నవాడే.