Friday, March 31, 2017

సుమతి వేమన శతకాలు సంస్కృతంలో - 1


సుమతి వేమన శతకాలు సంస్కృతంలో - 1




సాహితీమిత్రులారా!




మనం అన్నీ సంస్కృతంనుండి
తెలుగులో అనువదించటం చూశాం
కానీ సుమతి వేమన శతకాలు సంస్కృతంలోకి
శ్రీ యస్.టి.జి.వరదాచార్యులువారు అనువదించగా
దాన్ని తెలుగు సాహిత్య అకాడమీ వారు
ముద్రించారు.  అందులోని కొన్ని పద్యాలు శ్లోకాలు-

అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కిన బాఱని గుఱ్ఱముఁ 
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!


ఆపద్యసాహ్యకృద్భంధుః 
వరదాయీ సురో2ర్చిరః
యుధ్యారూఢో2చలన్నశ్వః
త్యక్తవ్యా సుమతే ద్రుతమ్


అడిగిన జీతం బియ్యని 
మిడిమేలపు దొరను గొల్చి మిడుగుట కంటెన్ 
వడిగల యెద్దులుఁ గట్టుక 
మడిదున్నగ బ్రదువచ్చు మహిలో సుమతీ!


అపి జీవేత్ సుఖం క్షేత్రం 
కృషన్ జవయుతై ర్వృషై
నత్వర్ధితమదాతారం
సుమతే స్వామినం భజన్


Thursday, March 30, 2017

ఏది ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది?


ఏది ఎన్నో సందర్భాలలో  రక్షిస్తుంది?




సాహితీమిత్రులారా!



కర్మాచరణం వల్లకలిగే ఫలితం ఎంత బలీయమైనదో
ఆపదల్లో సైతము పూర్వపుణ్యమే రక్షిస్తుంది. ఈ పుణ్యం
గత జన్మ సంప్రాప్తం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా
వారికి లోటేమీ ఉండదు. దానికి ఉదాహరణగా
భర్తృహరి శ్లోకం చూడండి

వనే రణే శత్రుజలాగ్ని మధ్యే
గుహార్ణ వే పర్వత మస్తకే వా
సుప్తం ప్రమత్తం విషమస్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని

అంటే - గతజన్మలో పుణ్యకార్యాలు చేయడం
వల్ల సంపాదించిన పుణ్యరాశి ప్రభావం ఎంతటి దంటే---
అది మనుష్యుని ఎన్నో సందర్భాలలో  రక్షిస్తుంది.
అతడు అడవిలో ఉన్నా, యుద్ధంలో ఉన్నా,
శత్రువుల మధ్య ఉ్నా, మహాసముద్రాలలో ఉన్నా
కొండచివరల ఉన్నా, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా
అపాయంలో ఉన్నా పుణ్యమే రక్షిస్తుంది - అని భావం.

చివురా? వాతెఱ


చివురా?  వాతెఱ




సాహితీమిత్రులారా!


హంసవింశతిలోని కొన్ని స్త్రీ వర్ణనలు-
చిన్న చిన్న పదాలతో కూర్చినవి-

చివురా? వాతెఱ; నల్లని
కవురా? నునుసోగవెండ్రుకలు; పుత్తడిమేల్
సవురా? దేహము; ముద్దుల
దవురా! అని జనులు పొగడ నాబిడ యలరున్
                                                                               (3-194)
(వాతెఱ -పెదవి
నల్లని కవురా - నల్లని నిగనిగల తళుకా
పుత్తడి మేల్సవురా - మేలిమి బంగారు చాయయా)


విరులా? నగవులు, నీలపు
సరులా? కురు,లుబ్బుగబ్బి చన్నులు జాళ్వా
గిరులా? యూరువు లనఁటుల
సిరులా? యని జనులు మెచ్చఁ జెలువ చెలంగున్
                                                                     (4-71)

(జాళ్వాగిరులా - బంగారు కొండలా
అనఁటుల సిరులా - అరటి స్తంభముల సంపదలా)

చిందమ్మనఁదగు గళమును;
గుందమ్ములతీరు రదనకోరకపంక్తుల్;
మందమ్ములు గమనమ్ములు;
కెందమ్ములచందములు సకియపాదమ్ముల్
                                                                   (4-72)

(గళము - కంఠము
చిందమ్ము - శంఖము
రదనకోరకపంక్తుల్ - మొగ్గల వంటి పలువరుస
కుందమ్ముల తీరు - మల్లెమొగ్గల వంటివి
గమనమ్ములు - నడకలు
మందమ్ములు - మెల్లనైనవి
పాదమ్ములు - పాదములు
కెందమ్ములచందమ్ములు - ఎర్రదామర
పద్మములవంటివి.)

Wednesday, March 29, 2017

విధీ నీకు తెలివిఉందా?


విధీ నీకు తెలివిఉందా?




సాహితీమిత్రులారా!


దైవం బలీయమైనదని ఒకవైపు అంగీకరిస్తూనే,
భగవల్లీలల్లో కొన్నిటిని ఆక్షేపిస్తున్నాడు కవి.
దీనికి ఉదాహరణగా భర్తృహరి నీతిశతకంలోని
ఈ శ్లోకం చూడండి-

సృజతి తావ దశేషగుణాకరం
పురుషరత్నమఙ్కరణం భువః
తదపి త, తక్ష్ణభఙ్గి కరోతి చే
దహహ కష్టమపన్డితతా విధేః

అన్నీ సద్గుణాలను ఇచ్చి, అందరిచేతా
ప్రశంసించబడే విధంగా ఒక మహాపురుషుణ్ని
సృష్టిస్తావు - కానీ, ఓ దైవమా! అంతలోనే వానిని
ఎక్కువకాలం బ్రతుకనీకుండా కానరానిలోకాలకు
తీసుకుపోతావు అయ్యయ్యో ఇదేమి మూర్ఖపు చేష్ట
నీది విధీ నీకు తెలివి అనేది ఉన్నదా - అని కవి
ఆవేదన  చెందుతున్నాడు.



హేవళంబి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు


హేవళంబి నామసంవత్సర
ఉగాది శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు
హేవళంబి నామసంవత్సర 
ఉగాది శుభాకాంక్షలు


Tuesday, March 28, 2017

రతి సుఖాసక్తులు ఎవరు?


రతి సుఖాసక్తులు ఎవరు?




సాహితీమిత్రులారా!


సాముద్రిక శాస్త్రం ప్రకారం చెయ్యి,
గోళ్లు, పాదాల ఉపరితలం, పెదవులు,
నేత్రాల చివరలు, నాలుక ----
మొదలైనవి ఎర్రగా ఉన్నవారు రతి
సుఖాసక్తులు - అనుభవించేవారు
అవుతారు
ఈ విషయాన్నే భర్తృహరి శ్లోకంలో
గమనిద్దాం-

దిశ వనహరిణేభ్యో వంశకాణ్డచ్ఛవీనాం
కబళ ముపలకోటిచ్ఛిన్న మూలం కుశానామ్
శకయువతికపోలాపాణ్డుతామ్బూలవల్లీ
దళమరుణనఖైగ్రైః పాటితం వా వధైభ్యః

ఓ మానవా! నీకు సంసారం అంటే విరక్తి పుడితే
ఏదైనా తపోవనంలో జింకలకు లేలేతగడ్డి కోసి
మేత పెట్టి్ తాపసివలె జీవించు అటా కాకపోతే
అనురక్తి గలవాడివే అయితే - శకదేశపు జవరాళ్ల
చెక్కిళ్లలా తెల్లగా ఉండే లేలేత తమల పాకుల్ని
నీ ఎర్రని గోళ్ల కొనలతో చీర్చి ఆ పడతులకు ఇవ్వు
అంటే సంసార విషయాసక్తత గాని ఉంటే, స్త్రీలతో
కూడి తాంబూల చర్వణం చేస్తూ వారి పెదాల
అధరామృతాన్ని గ్రోలు - అని భావం
అంటే ఎర్రని పెదాలు ఉండటం వల్ల
పై చెప్పిన విషయం రతి అనుభవం
జరుగుతుందని భావం.

యరలవ మదనస యనుచును


యరలవ మదనస యనుచును



సాహితీమిత్రులారా!


గుండ్రని దస్తూరికై మనవారు
ఈ పద్యాన్ని పిల్లలచే వ్రాయించేవారు-

యరలవ మదనస యనుచును
బరువడి నీ యక్షరముల భయనయతతులన్
నిరతమును వ్రాయనేర్చిన
వరకరుణా వానివ్రాలు వట్రువ లమరున్

ఈ పద్యం ప్రతిరోజూ వ్రాయడం వలన
అక్షరాలు గుండ్రంగా వ్రాయగలరట
ఇది సరైన పద్దతే ఇది వాస్తవమే
ఇందులోని అక్షరాలన్నీ
చేయి బాగా తిరుగుటకు పనికి వస్తాయి.

Monday, March 27, 2017

వెన్నెలలే ఎండను మించిన తాపాన్ని కలిగిస్తున్నాయి


వెన్నెలలే ఎండను మించిన 

తాపాన్ని కలిగిస్తున్నాయి




సాహితీమిత్రులారా!


శృంగారం రెండురకాలట
అందులో సంభోగశృంగార ఒకటైతే
రెండవది విప్రంభ శృంగారం
విప్రలంభ శృంగారంలో విరహతాపం
వివరించడానికి అనువైనది-
ఇక్కడ ఈ శృంగారానికి సంబంధించిన
భర్తృహరి శ్లోకం ఒకటి చూడండి-

విశ్రమ్య విశ్రమ్య అనే ద్రుమాణాం
ఛాయాసు తన్వీ విచచార కాచిత్,
స్తనో త్తరీయేణ కరోద్ధృతేన
నివారయన్తీ శశినో మయూఖాన్

ఒకానొక స్త్రీ, తన ప్రియుని విరహ
వేదనా భారాన్ని భరించలేక శరీరం
కృశించి, ఒక తోటలో రోజంతా గడిపి,
రాత్రి కాగానే ఏర్పడిన పండువెన్నెల
చల్లదనం కూడా తాపం నివారించలేక
పోవడంతో మరింత నిట్టూర్చసాగింది.

అందులో భాగంగానే, తన పైట కొంగును
పైకెత్తి పట్టుకొని ఆ వెన్నెలలు తన మీద
పడకుండా చూసుకుంటూ, మాటిమాటికీ
దట్టమైన చెట్లనీడకు చేరి అలసట
తీర్చుకుంటోంది. ఆ స్త్రీకి వెన్నెలలే
ఎండను మించిన తాపాన్ని కలిగిస్తున్నాయని
అతిశయోక్తి.

Sunday, March 26, 2017

అధరామృతాన్ని తనివితీరా ఆస్వాదిస్తాడు


అధరామృతాన్ని తనివితీరా ఆస్వాదిస్తాడు




సాహితీమిత్రులారా!



భర్తృహరి నీతులేకాదు శృంగారపరమైనవాటిని
శృంగారశతకంలో వివరించాడు ఈ శ్లోకం చూడండి-

ఉరసి నిపతితానాం స్రస్తధమ్మల్లకానాం
ముకుళితనయనానాం కించి దున్మీలితానామ్
ఉపరిసురతఖేద స్విన్నగండస్థలానాం
అధరమధు వధూనాం భాగ్యవస్తః పిబంతి

పురుషుడు కింద ఉండగా, స్త్రీ పైన ఉండి రతి చేయడం పురుషాయితం.
 దీనివల్ల అనాయాసంగా ఒకరి మొఖాలొకరికి అందుబాటులోకి వస్తాయి.
దీనిలో నాయిక సిగ్గి విడిచి యధేచ్ఛగా తానే రతికి సంసిద్ధురాలై ఉన్నందున,
అలాంటి భాగ్యం తనకు కలిగినందుకు  ఆనందిస్తూ ప్రియురాలి అధరామృతాన్ని
తనివితీరా ఆస్వాదిస్తాడు  పురుషుడు. అట్టివాడే నిజమైన కామతంత్రం తెలిసినవాడు -
అని శ్లోక భావం
కామయుద్ధపు పట్లలో ధేనూకము, పురుషాయితము
వంటివి స్త్రీకి రతిలో గొప్ప తృప్తిని కలిగిస్తాయి.


దీన్నే ఏనుగు లక్ష్మణకవి తెలుగులో-

అక్కున వ్రాలి, కొప్పువిడి యల్లలనాఁడగఁ, గన్ను దామరల్
చక్కఁగ మోడ్చి, చొక్కి, పురుషాయితసంజనితశ్రమంబునం
జెక్కుల ఘర్మబిందువులు చిందఁగ, విందొనరించుబోంట్లమే
ల్చొక్కపుమోవితేనె చవిజూతురు భాగ్యముఁ గల్పు నేర్పరుల్

Saturday, March 25, 2017

కాళిదాసు రచనా చమత్కారం


కాళిదాసు రచనా చమత్కారం



సాహితీమిత్రులారా!



కాళిదాసుకు వివాహమైన తరువాత గదిలో  పడుకొని ఉండగా
ఆయన భార్య ఆయన అరసికత చూసి
అస్తి కశ్చి ద్వాగ్విశేషః -  అని అడిగిందట.
 అది ఆయనకు అర్థంకాక
భార్యను అనాదరణ చేశాడని చెబుతారు.
వాగ్విశేషమేమైనా కలదా అని దాని అర్థం.
అంటే ఏమైనా పాండిత్యం కలదా - అని.
తరువాత కాళికాదేవి వరప్రసాదం వలన
పండితుడైన తరువాత భార్యను వీడుకొని
దేశాంతరములకు బోయి భార్యవలననే
తనకు అట్టి విద్యావిశేషములు కలిగెనని
ఆమె మీది విశ్వాసం కలిగి మొట్టమొదట
తనను ఆమె ప్రశ్నించిన ప్రశ్నలో ఉన్న
అస్తి, క్వచిత్,  వాక్, విశేషః - అను
నాలుగు పదాలను  నాలుగు కావ్యాలలో
మొదట చేర్చి గ్రంథరచన చేసెనని
ఆర్యులంటారు.
కుమారసంభవము మొదటి శ్లోకంలోని
మొదటి పాదం-
అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా- దీనిలో
అస్తి అనే మొదటి మాటను.
మేఘసందేశంలోని మొదటి శ్లోకం
మొదటిపాదం
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారా త్ప్మ్రమత్తః
అనే మాయలో కశ్చి అనే మొదటిమాటను

రఘువంశములోని మొదటిశ్లోకంలోని
మొదటిపాదము
వాగర్థావివసంపృక్తౌ-
లో వాగ్ - అనే మొదటిమాటను,
ప్రయోగించాడు. కాని
విశేషః - అనేమాటను ఏ కావ్యంలో
ప్రయోగించాడో తెలియరాలేదు
ఇది కాళిదాసు రచనా చమత్కారం
అంటారు.



Friday, March 24, 2017

పాండవులు - సతులు - సుతులు


పాండవులు - సతులు - సుతులు




సాహితీమిత్రులారా!

పాండవులు వారి పేర్లు అందరికి తెలుసు
కానీ వారికెవరెవరికి ఎంత మంది భార్యలు
వారికి పుత్రులులెవరు అన్ససంగతి అంతగా
తెలియదు వారిగురించి ఇక్కడ గమనిద్దాం-

పాండవులు -                   భార్యలు     -   కుమారులు
============================================

1. ధర్మరాజు -                    ద్రౌపది       -   ప్రతివింద్యుడు
                                             రేవతి          -   యౌధేయుడు
                                             పౌరవతి        - దేవకుడు
===========================================
2. భీముడు  -                    ద్రౌపది          -   శ్రుతసోముడు
                                            జలంధర       -  సర్వగుడు
                                            కాళి                -   సర్వగతుడు
                                            హిడింబ       -    ఘటోత్కచుడు
============================================

3. అర్జునుడు                - ద్రౌపది           -    శ్రుతకీర్తి
                                          ఉలూచి          -     ఇరావంతుడు
                                         చిత్రాంగద     -      బభ్రువాహనుడు
                                         సుభద్ర           -      అభిమన్యుడు
                                         ప్రమీల          -        ------------
==============================================
4. నకులుడు              - ద్రౌపది             -         శతానీకుడు
                                       రేణుమతి           -      నిరమిత్రుడు
                                       (కరేణుక)
==============================================
5.సహదేవుడు          -  ద్రౌపది                -      శ్రుతకర్ముడు
                                       విజయ                -       సుహోత్రుడు
                                       భానుమతి            -        -----------
==============================================

ద్రౌపది కుమారులను ఉపపాండవులు అంటారు

1. ప్రతివింద్యుడు,
2. శ్రుతసోముడు,
3. శ్రుతకీర్తి
4. శతానీకుడు
5. శ్రుతకర్ముడు
       

Thursday, March 23, 2017

కాలమాగదు మనకోసం


కాలమాగదు మనకోసం




సాహితీమిత్రులారా!



మహాభారతం శాంతిపర్వంలోని
ఈ శ్లోకం చూడండి-

శ్వః కార్య మద్య కుర్వీత పూర్వాహ్ణేచాపరాహ్ణికమ్
నహి ప్రతీక్ణతే మృత్యుః కృతంచాస్య నచాకృతమ్
                                                                              (శాంతిపర్వం -321-73)

రేపు చేయవలసిన పనిని ఇప్పుడే చేయవలెను.
మధ్యాహ్నం చేయవలసిన పనిని ఉదయమే చేయాలి
మనము పనులు పూర్తి చేసినామా లేదా అని మృత్యువు ఆగదు
- అని శ్లోక భావం.

ఒకనాటి పుస్తక ఉవాచ


ఒకనాటి పుస్తక ఉవాచ




సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి-
పుస్తకమే తనను రక్షించే
ఉపాయం చెబుతోంది

అగ్నే రక్ష జలాద్రక్ష రక్షమాం శ్లథ బంధనాత్
పునశ్చ యాచకాత్ రక్ష యాచకాంతంహి పుస్తకమ్

అగ్ని నుండి, జలం నుండి నన్ను రక్షించుము
(పూర్వం అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి-
జలప్రళయాలు - నదులు పొంగటం వంటివి
అధికంగా ఉండేవి) కట్టిన త్రాడు ఊడిపోకుండా
కాపాడము(నాటి పుస్తకాలన్నీ తాళపత్రాలేకదా).
మరిచాను యాచకుని నుండి రక్షించటం
అన్నిటికంటె ముఖ్యం.
(యాచకుడు ఒక్కసారి చదివిస్తానని
అభ్యర్థించి తీసుకెళతాడు
తిరిగి ఇవ్వడు ఇంకరాదు ఆ పుస్తకం.)

ఇప్పటి పుస్తకాలకు మరోవిధమైన
సమస్యలున్నాయి పుస్తకం పాతదై పోయి
పట్టుకుంటే రాలిపోయే విధంగా తయారుకావడం.
అలాంటి పుస్తకం శిధిలమై పోయిందంటే
మళ్ళీ దొరకదు అలాంటి వాటిని
ఇప్పుడు డిజిటల్ రూపంలో కి మార్చుకొంటే
భద్రంగా ఉంచుకోవచ్చు
ఇవికూడ కాలానుగుణంగా తెలుసుకుంటూ
మార్పులు చేసుకుంటే పుస్తకం పదిలం పదిలం.

Tuesday, March 21, 2017

తావలచింది రంభ


తావలచింది రంభ




సాహితీమిత్రులారా!


ఈ ప్రపంచంలో తను ఏది అనుకుంటే
అదే నిజమని వాస్తవమి వాదిస్తారు అంతా
నిజమే అదే విషయం చెప్పే శ్లోకం చూడండి-

దధి మధురం, మధమధురం,
ద్రాక్షామధురా, సుధాపి మధురైవ
తస్య తదేవ హి మధురం
యస్య మనోయత్ర సంలగ్నమ్

పెరుగు తీపి, తేనె తీపి, అమృతం తీపి,
ఎవడిమనసు దేనిమీద లగ్నమై ఉంటుందో
వానికి అదే తీపి - అని భావం

అందుకే గదా మనవారు అంటుంటారు
అదె లాంటిదైనా తను ముగింది గంగ
అదెంత కురూపిదైనా తనువలచింది రంభ

ఎద్దనవలె మొద్దనవలె


ఎద్దనవలె మొద్దనవలె




సాహితీమిత్రులారా!



ఎవరినిపడితే వారిని పెద్ద అనకూడదట
చూడండి కవిచౌడప్పగారి పద్యం-

పెద్దన వలె కృతిచెప్పిన
పెద్దనవలె నల్పకవిని పెద్దనవలెనా
ఎద్దనవలె మొద్దనవలె
గ్రద్గనవలె కుందవరపు కవిచౌడప్పా!


పెద్దన చెప్పిన విధంగా కవిత్వం చెబితే
పెద్ద అనవచ్చు లేకుంటే అల్పకవిని
పెద్ద అనవలెనా అలాంటివాణ్ని
ఎద్దు అనాలి మొద్దు అనాలి
గ్రద్ద అనాలి అంటున్నాడు -
కవిచౌడప్పగారు
నిజమేకదా
దానికి తగిన తాహతు
ఉండాలికదా!

Monday, March 20, 2017

వృద్ధనారీ పతివ్రతా


వృద్ధనారీ పతివ్రతా




సాహితీమిత్రులారా!




వృద్దనారీ పతివ్రతా - అనేది నానుడిగా మారింది.
ఏదీ చేయలేనివాడు మంచిగా ఉంటాడట.
ఇలాంటి విషయాలను వివరించే
ఈ శ్లోకం చూడండి-

అశక్తస్తు భవేత్సాధుః
బ్రహ్మచారీ తు నిర్ధనః
వ్యాధితో దైవభక్తిశ్చ
వృద్ధనారీ పతివ్రతా

బలహీనుడు ఏమీ చేయలేడు కావున
వాడు మంచివాడుగా ఉంటాడట.
మరి ధనంలేనివాడు ఓలిచ్చి పెండ్లాన్ని
తెచ్చుకోలేడు, డబ్బిచ్చి ఇంకే దారైనా
చూసుకోలేడు కావున గుట్టుగా బ్రహ్మచర్యం
పాటిస్తుంటాడట. వ్యాధిగ్రస్తుడు అన్నిరకాలమందులు
వాడి అన్నిరకాల వైద్యులను కలిసి ఇక ఎవరూ ఏమీ
చేయలేరని తేలినతరువాత ఇక మిగిలింది దేవుడే కదా
అందుకే దైవభక్తిపరుడుగా ఉంటాడు. మరి వయసంతా
ఉడిగిన తరువాత ఏమి చేస్తుంది అందుచేత వృద్ధనారి
అంటే వార్ధక్యంలోకి వచ్చిన స్త్రీ పతివ్రతగా మెలుగుతుందట.
ఇది భావం.

ఇది ఎంతటి సత్యమో?


ఇది ఎంతటి సత్యమో?




సాహితీమిత్రులారా!


బలిజేపల్లి లక్ష్మీకాంతగారి
సత్యహరిశ్చంద్ర నాటకంలోని
శ్మశానరంగంలో కూర్చిన ఈ పద్యం
ఎంతటి సత్యమో చూడండి-

మాయామేయజగంబె నిక్యమని సంభావించి మోహంబునన్
నా యిల్లాలని నాదు పుత్రుఁడని ప్రాణంబుండునందాక యెం
తో యల్లాడిన యా శరీర మిపు డిందున్ గట్టెలన్ గాలుచో
నా యిల్లాలును రాదు నా సుతులు తోడైరారు తప్పింపగన్

ఈ ప్రపంపచమే మాయ ఇందులో మోహంలో పడి నరుడు
నాభార్య, నాకొడుకులు, అని శరీరమున్నంతవరకు తాపత్రయ
పడిపోతున్నాడు. ఇప్పుడో (ప్రాణంపోయిన తరువాత) ఆ శరీరం
చితిలో పడి కాలుతూంది దీన్ని రక్షించడానికి ఆ భార్యగాని పిల్లలుగాని
ఎవరూరావడంలేదు - అని భావం
అంతే కదా ప్రాణం పోయిన తరువాత ఎవరికెవరు
ఈ ప్రాణం ఉన్నంతవరకే అన్ని బంధాలు బాంధవ్యాలు
ఇదే విషయాన్ని మరో రకంగా
ధూర్జటి
శ్రీకాళహస్తీశ్వర శతకములో

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్‌ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహా ర్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా, శ్రీ కాళహస్తీశ్వరా!    

ఆలోచించినచో ఈ జగత్తంతా మాయేకదా! మానవుడా సంగతి తెలిసీ కూడా, భార్య, పుత్రులు, ధనము, తన శరీరము అన్నీ శాశ్వతము అని భావించి మోహము పొందుచూ, జీవనమునకు పరమార్థభూతుడవైన నిన్ను మనసులో ఒక్క నిమిషమైననూ ధ్యానించడు కదా! ఎంత అజ్ఞానము - అని భావం

ఎవరు ఎన్ని విధాల చెప్పినా సరైన సమయంలో
భగవంతుని స్మరించుకొంటూ చివరికి భగవంతునిలో
చేరడమే మానవజీవిత పరమార్థం
ఇది ఎంటి సత్యమో కదా ఆలోచించండి.

Sunday, March 19, 2017

ఒక సీసా రెండు స్ట్రాలు


ఒక సీసా రెండు స్ట్రాలు




సాహితీమిత్రులారా!



మనం ఈ మధ్యకాలంలో ప్రేయసి ప్రియుల
విలాసాలను గమనిస్తున్నాము కాని
ఇవి ఏనాటివి ఈ ఊహలు
ఆ ఊహలను
ఈ శ్లోకాలు చూస్తే తెలుస్తుంది -

కాళిదాసు కుమారసంభవంలోని
ఈ వర్ణన చూడండి-

మధుర్విరేఫః కుసుమైకపాత్రే
వపౌ ప్రియాం స్వా మనువర్తమానః
శృంగేణ సంస్పర్శ నిమీలితాక్షీం
మృగీ మండూయత కృష్ణసారః
దదౌ రసాత్ పంకజరేణుగన్ధి
గజాయ గండూషజలం కరేణుః
ఆర్ధోపభుక్తేన బిసేన జాయాం
సంభావయామాస రథాంగనామా

మగతుమ్మెద పుష్పమనే ఏకపాత్రలో
ప్రేయసితో పాటు మధుపానము చేసెను.
మగలేడి ఆడులేడిని తనకొమ్ములతో గోకెను.
ఆడులోడి ఆ స్పర్శ సుఖమునకు పరవశయై
నిమీలితలోచన అయ్యెను. ఆడయేనుగు
తామరపూల పుప్పొడిపరిమళంతో గుబాళించే
నీటిని తన తొండంతో మగఏనుగు నోటిలోకి
అందిచెను. మగచక్రవాకము సగము కొరికి తినిన
తామరతూడును ప్రేయసికిచ్చెను -
ఆని ఆ శ్లోకాల భావం.

Saturday, March 18, 2017

ఎంతటి భ్రాతృప్రేమ!


ఎంతటి భ్రాతృప్రేమ!




సాహితీమిత్రులారా!




వాల్మీకి - రామాయణ యుద్ధకాండలో
లక్ష్మణుడుమూర్ఛితుడైన సందర్భములో
రాముని విలాపవర్ణన వాల్మీకి ఈ విధంగా చేశాడు
చూడండి-

దేశేదేశే కళత్రాణి
దేశేదేశే చ బాంధవాః
తం తు దేశం న పశ్యామి
యత్ర భ్రాతా సహోదరః

దేశదేశాలలో భార్యలు లభించవచ్చు.
ఏ దేశంలోనైనా బాంధవులుండవచ్చు.
ఒకే గర్భంనుండి ఉద్భవించిన తమ్ముడు
ఎక్కడ లభిస్తాడు.... - అని రాముడు వాపోయాడు
ఎంతటి భ్రాతృప్రేమ
ఇప్పుడైతే ఇలాంటివారున్నారా?
అంటి ప్రేమ అభిమానాలున్నాయా?
ఇందులో మనం గమనించవలసినది
మరొకటుంది. అదేమిటంటే
రామలక్ష్మణులు ఒక తండ్రి బిడ్డలేగాని
ఒకే తల్లి బిడ్డలుకాదుగదా
మరి రాముడలా ఎందుకన్నాడో
ఎందు కంటే వారి ప్రేమ అలాంటిది..

ఉపమాలంకార విశేషాలు- 3


ఉపమాలంకార విశేషాలు- 3




సాహితీమిత్రులారా!


26. బహూపమ -
చందనోదక చంద్రాంశు చంద్రకాంతాదికమువలె
నీ స్పర్శ అధికశీతలముగ ఉండును

27. విక్రియోపమ -
తన్వంగి నీ ముఖము చంద్రబింబమునుండి త్రవ్వి తీసినట్లు,
పద్మగర్భము నుండి లాగి తీసినట్లు ఉన్నది.

28. మాలోపమ -
సూర్యునియందు ఎండవలెను,
పగటియందు సూర్యునివలెను,
ఆకసమునందు పగటివలెను,
విక్రమము నీయందు లక్ష్మిని గూర్చెను.

29. వాక్యార్థోపమ -
ఒక వాక్యమును మరియొక వాక్యార్థముతో పోల్చిన అది
వాక్యార్థోపమ. ఇది రెండు విధములు
1. ఏకేవశబ్ద ఘటితము -
చంచల నేత్రములు కలదియు, ఆవిర్భవించిన దంతకాంతి
కలదియును అగు నీముఖము భ్రమద్భృంగమును,
ఈషల్లక్ష్య కేసరమునగు పంకజము వలె తోచుచున్నది

2. అనేకేవ శబ్దఘటితము-
తామరతీగవంటి ఆ తన్వంగియొక్క పద్మమువంటి
మోము మధుకరమువంటి నాచే మరలమరల త్రాగబడెను.

30. ప్రతివస్తూపమ-
పుట్టిన రాజులలో నీవంటివాడు లేనేలేడు.
పారిజాతమువంటి పాదపము రెండవది లేదుకదా

31. తుల్యయోగోపమ-
ఓ నృపా ఇంద్రుడు స్వర్గరక్షణకు,
నీవుభూరక్షణకు మేల్కొని ఉందురు.
అతనిచే అసురులు, నీచే గర్వితులు చంపబడుదురు.

32. హేతూపమ -
రాజా కాంతిచే చంద్రుని, తేజస్సుచే సూర్యుని,
ధైర్యముచే సముద్రుని అనుకరించుచున్నావు.

ఇవి దండి చేసిన ఉపమా విభాగాలు.


Friday, March 17, 2017

ఉపమాలంకార విశేషాలు - 2


ఉపమాలంకార విశేషాలు - 2





సాహితీమిత్రులారా!
క్రితం తరువాయి.....



14. సమానోపమ-
నీ ముఖము పద్మము వలె శిశిరాంశుప్రతిస్పర్ధియు,
శ్రీ గలదియు, సురభిగంధియు అగును.

15. శ్లేషోపమ -
ఈ ఉద్యానమాల బాలికవలె సాలకానన శోభిని.
సాల + కాననశోభిని = సాలవృక్షములతో కూడిన
అడవితో శోభించునది.
స + అలక + ఆననశోభిని = ముంగురులతోడి
ముఖముతో శోభించునది.

16. నిందోపమ -
కమలము పరాగపూర్ణము, చంద్రుడు క్షయశీలుడు.
నీముఖము వానితో సమానమైనను వానికంటె ఉత్కర్షకలిగినది.

17. ప్రశంసోపమ -
 బ్రహ్మకు పుట్టినిల్లయిన పద్మమును,
శివునిచే శిరస్సున ధరించబడిన
చంద్రుడును నీముఖముతో సమానములు

18. ఆచిఖ్యాసోపమ -
నీ ముఖము చంద్రునితో సమానమని
నేను ప్రతిపాదించుచున్నాను.
అది గుణమో!  దోషమో!

19. విరోధోపమ -
శతపత్రము - శరచ్చంద్రుడు - నీ ముఖము-
ఈ మూడు పరస్పర విరోధము కలవి.

20. ప్రతిషేధోపమ -
కళంకియు, జడుడును, అగు చంద్రునకు
నీ ముఖముతో స్పర్ధవహించు శక్తి లేదు.

21. చాటూపమ- 
నీ ముఖము మృగేక్షణాంకితము,
చంద్రుడో మృగాంకుడు,
అయినను నీతో సమానుడేగాని
అధికుడుగాడు.

22. తత్త్వాఖ్యానోపమ -
 ఇది పద్మము కాదు, ముఖమే
 అవి తుమ్మెదలు కావు, కన్నులే.

24. అసాధారణోపమ -
చంద్రారవిందముల కాంతి నతిక్రమించి
నీ ముఖము తనకు తనే సాటియాయెను.

24. అభూతోపమ -
నీ ముఖము, ఒక చోటను సంగ్రహించి రక్షించబడిన
అన్ని పద్మముల కాంతిపుంజమువలె శోభించుచున్నది.
(దీన్ని ఉత్ప్రేకగ కొందరు భావిస్తారు)

25. అసంభావితోపమ -
నీ ముఖమునుండి కఠినవాక్యములు వచ్చుట
చంద్రబింబమునుండి విషము వచ్చుటవలెను,
చందనమునుండి అగ్ని వచ్చుటవలెను ఉండును.



ఎవరికి ఏది గడ్డి పరక?


ఎవరికి ఏది గడ్డి పరక?




సాహితీమిత్రులారా!



ప్రతివారికి ఏదో ఒకటి గడ్డిపరకతో
సమానంగా భావించేదిగా ఉంటుంది
ఈ శ్లోకం చూడండి -
ఎవరికి ఏది గడ్డి పరకో-

ఉదారస్య తృణం విత్తం
శూరస్య మరణం తృణమ్
విరక్తస్య తృణం భార్యా
నఃస్పృహస్య తృణం జగత్


ఔదార్యవంతునికి ధనం గడ్డి పరకతో సమానం.
మరి శూరునికి మరణం గడ్డి పరక.
వైరాగ్యవంతునికి భార్య గడ్డిపరక.
ఆశలేనివానికి ఈ జగత్తు గడ్డిపరక
చూశారా ఎవరి మానసిక స్థితిని బట్టి
ఆలోచనను బట్టి, లక్ష్యాన్ని బట్టి
వారికది తృణప్రాయమవుతున్నది.

Thursday, March 16, 2017

సుఖ దుఃఖాల లక్షణాలివి


సుఖ దుఃఖాల లక్షణాలివి




సాహితీమిత్రులారా!


ఈ ప్రపంచంలో అనేక వింతలున్నాయి
కానీ ప్రతి వ్యక్తి సుఖానికి దుఃఖానికి
గురి అవుతూనే ఉంటాడుకదా
ఎల్లపుడు.............
దీని లక్షణమేమైనా గ్రహించాడా
అంటే లేదనే చెప్పాలి -
ఈ క్రింది శ్లోకం వివరిస్తున్నది చూడండి-

సర్వం పరవశం దుఃఖం,
సర్వ మాత్మవశం సుఖమ్
ఏత ద్విద్యా త్సమానేన
లక్షణం సుఖదుఃఖయోః

ఇతరులకు స్వాధీనమైన వన్నీ దుఖకరములు.
తనకు లోబడినవన్నీ సుఖకరములు.
సుఖదుఃములకు ఇది లక్షణమిని బాగుగా
సులభంగా తెలియవలెను - అని భావం
అంటే స్వ పర ఆధీనాలే అన్నిటికి కారణం.

Wednesday, March 15, 2017

వీటిని ఎంత దూరంలో ఉంచితే అంతమేలు


వీటిని ఎంత దూరంలో ఉంచితే అంతమేలు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

దీర్ఘ శృంగ మనడ్వాహం
నిర్లజ్జాం విధవా స్త్రియామ్
దుష్ట మక్షర సంయుక్తం
దూరతః పరివర్జయేత్

వీటిని దూరంగా ఉంచాలి
ఎంత దూరంగా ఉంటే అంతమేలు
సిగ్గు లజ్జా వదిలేసిన విధవాస్త్రీ,
పొడుగాటి కొమ్ములున్న ఎద్దు,
బాగా విద్యార్జన కలిగిన దుష్టుడు
వీరికి దూరంగా లేక పోతే అపాయం తప్పదు.
అని భావం

బౌద్ధమతంలో విద్య తదితరాలు


బౌద్ధమతంలో విద్య తదితరాలు




సాహితీమిత్రులారా!



బౌద్ధమతంలో  హిందూమతంలో ఉపనయనంలా
ప్రవజ్య విద్యా ప్రారంభం. దీనితో విద్యార్థి తన
సమాజాన్ని వదలి బౌద్ధ సంఘంలో అడుగు
పెడుతున్నాడని అర్థం. దీని కనీసం 8 సం. వయస్సు
గాని అంతకు మించిన వయసుగాని కలిగిన ఏ వ్యక్తి
అయినా (ఏ తెగవాడైనా, ఏ వర్ణం వాడైనా) ప్రవ్రజ్య
తీసుకోవచ్చు.

ప్రవ్రజ్య చాలా సాదాగా ఉండేది. శిష్యుడు శిరోముండనం
చేయించుకొని పసుపు పచ్చ అందీ చేతిలో తీసుకొని విహారానికి
వస్తాడు. విహారంలో ఒక శ్రమణకుని ఎంచుకొని పాదాలకు
ప్రణమిల్లుతాడు, తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థస్తాడు.
గురువు పసుపుపచ్చ అంగీ తొడిగి అతన్ని శిష్యునిగా స్వీకరిస్తాడు.
శిష్యుడు క్రింద కూర్చొని రెండు చేతులెత్తి నమస్కరిస్తూ
 గురువుచెప్పిన ప్రతిజ్ఞ చేస్తాడు.

బుద్ధం శరణం గచ్ఛామి,
ధర్మం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి

అని మూడుసార్లు ప్రతిజ్ఞ చేస్తాడు. దీనితో ప్రవ్రజ్య పూర్తవుతుంది.
శిష్యుణ్ని సమరేణ అంటారు.12 సం. పూర్తయిన తర్వాత
ఉపసంపద అనే ఉత్సవం జరుగుతుంది.
ఈ ఉత్సవంలో కనీసం పదిమంది బిక్షువులు ఉండాలి.
వీళ్ళు కనీసం పదేళ్ళు బిక్షుజీవనం గడిపినవారు, విద్వాంసులు
అయి ఉండాలి. వీరు విద్యార్థిని పరీక్షిస్తారు. ఉత్తీర్ణుడయితే
ఉత్తీర్ణుడయినట్లు ప్రకటిస్తారు. సంగీతిలో జరిగిన
ఈ ప్రక్రియనంతా రికార్డు చేస్తారు. అతడు చేయకూడని
 పనులను జాగ్రత్తా బోధిస్తారు.

చేయవలసిన పనులు-
1. బిక్షాపాత్రలోనే భుజించాలి.
2. పాతగుడ్డ పీలికలతో తయారు చేసిన వస్త్రాలు ధరించాలి
3. వృక్షమూలంలోనే నివసించాలి
4. గోమూత్రాన్నే ఔషధంగా తీసుకోవాలి

చేయకూడని పనులు -

1. సంభోగం, 2. దొంగతనం, 3. హత్య,
4. మానవాతీత శక్తులున్నట్లు చెప్పుకోవడం

సంఘంనుండి విరమించుకోవాలంటే
ఒక సాక్షిముందు ఆ విషయం వెల్లడించి వదలి వేయవచ్చు
ఆధ్యత్మిక విషయంలో బలవంపరెట్టి సంఘంలో కొనసాగడం
బౌద్ధధర్మానికి విరుద్ధం..

Tuesday, March 14, 2017

ఇది తెలుసా? దీనిపేరు మహాప్రభ


ఇది తెలుసా? దీనిపేరు మహాప్రభ




సాహితీమిత్రులారా!




మనం ఈ మధ్యన రకరకాల నరకాల పేర్లు
అపరిచితుడనే చలన చిత్రంలో చూచాంకదా!
అలాంటిదే ఈ మహాప్రభ దాన్ని గురించి చెప్పే
ఈ శ్లోకం చూడండి-

మహా ప్రభేతి నరకం
దీప్త శూల మహోచ్ఛ్రయం
తత్ర శూలేన ఛింద్యం తే
పతి భార్యోప భేదినః

భార్యా భర్తలు అన్నోన్యంగా ఉంటే
కళ్లలో నిప్పులు పోసుకునే వారుంటారు.
వాళ్లమధ్య చిచ్చు పెట్టేదాకా కొందరికి
నిద్రపట్టదు. అట్లా వారి మధ్య విరోధం
కల్పించడం లక్ష్యంగా ఉన్నవారికి
ఇహలోకంలో పుష్కలంగా వినోదమైతే
దొరుకుతుంది సరదా తీరుతుంది-
కానీ పరలోకంలో వారికి నరకమే గతి
ఆ నరకంలోనైనా ఎట్లాంటి శిక్షకు గురౌతారంటే--
శూలాలతో అనుక్షణం చిత్రవధ చేయటమే
ఈ శిక్ష అమలు జరిపే నరకం పేరు
మహాప్రభ.
దంపతుల్ని విడదీయటమనేంతటి
పాపకార్య మరొకటిలేదు

Monday, March 13, 2017

మూడు సంఖ్య మంచిది కాదట


మూడు సంఖ్య మంచిది కాదట




సాహితీమిత్రులారా!




ఈ ఆర్యోక్తి గమనించండి-
మూడు అనేది ఎక్కడ అమంగళమో

తిస్రో భార్యాస్త్రయః శ్యాలా
స్త్రయో భృత్యాశ్చ బాంధవాః
ధ్రువం వేద విరుద్ధాశ్చ
నహ్యేతే మంగళప్రదాః

మూడు సంఖ్యకు అమంగళం ఆపాదించబడింది.
పైగా వేద విరుద్ధమని అంటున్నారు. ఎందుకంటే-
ముగ్గురు భార్యలుగానీ, ముగ్గురు బావమరుదులుగానీ,
ముగ్గురు సేవకులుగానీ, చివరకు ముగ్గురు బంధువులుగానీ
ఉండకూడదని ఆర్యోక్తి.

ఉపమాలంకార విశేషాలు


ఉపమాలంకార విశేషాలు




సాహితీమిత్రులారా!





సాహితీజగత్తులో ఉపమాలంకారానికి చాల ప్రత్యేకత ఉంది.
అప్పయ్యదీక్షితుల మాటల్లో చూడండి-

ఉపమైకా శైలూషీ సంప్రాప్తా చిత్రభూమికా భేదాన్
రంజయతి కార్యరంగే నృత్యంతీ తద్వించేతః

ఉపమ ఒక నటి. అదియే చిత్రవిచిత్రములైన వేషములు ధరించి కావ్యరంగమున లాస్యమాడుచు కావ్యవేత్త మనస్సులను రంజింపచేయుచున్నది అని భావం.

అసలు ఉపమాలంకారమంటే---------

ఒక వస్తువును మరొకవస్తువుతో పోల్చి చెప్పడం
ఉదాహరణ-
సీతముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది
ఇందులో నాలుగు భాగాలున్నాయి

1. ఉపమేయము -
   వర్ణించబడే వస్తువు - సీతముఖము
   దీనికే ప్రస్తుతము, ప్రకృతముఅయినది అని కూడ అంటారు.

2. ఉపమానము-
   దేనితో పోలుస్తున్నామో దానికి ఉపమానమని పేరు
   - చంద్రబింబము
   దీనికి అవర్ణ్యము, అప్రస్తుతము, అప్రకృతమైనవస్తువు
   అని కూడ అంటారు

3. సమానధర్మము-
   ఉపమేయమునందు ఉపమానమునందు ఉన్న పోలిక
  - అందముగా ఉండటం

4. ఉపమావాచకము-
   సమానధర్మమును సూచించు శబ్దము, లేక పదము
   - వలె

ఉపమాలంకారాన్ని అనేకులు అనేకరకాలుగా వివరించారు
దండి సమానధర్మాన్ని బట్టి 32 విధములని వివరించాడు
వాటిని సోదాహరణలుగా తెలుసుకుందాము-

1. ధర్మోపమ -
   ఓ ముద్దరాల నీ అరచేయి పద్మమువలె నెఱ్ఱగా ఉన్నది

2. వస్తూపమ -
   నీముఖము పద్మమువలె ఉన్నది
   (దీనలో సమానధర్మము ప్రతీపమానము)

3. విపర్యాసోపమ -
   నీముఖమువలె అరవిందము వికసించియున్నది
   (కొందరలంకారికులు ప్రతీపాలంకారమన్నారు)

4. అన్యోన్యోపమ -
   నీ ముఖము పద్మమువలెను, పద్మము నీ ముఖమువలెను ఉన్నది
   (దీన్ని ఉపమేయోపమ అని కొందరలంకారికుల వ్యపదేశము)

5. నియమోపమ -
   నీ ముఖము కమలమునే పోలి ఉన్నది. మరి దేనిని పోలదు.

6. అనియమోపమ -
   నీ ముఖము పద్మమును అనుకరించుచున్నది. 
    దానిని అనుకరించి మరి వేరు వస్తువులుండుగాక

7. సముచ్ఛయోపమ -
   కాంతిచేతనేగాక ఆహ్లాదకరత్వమున గూడ 
   నీముఖము చంద్రుని బోలును

8. అతిశయోపమ -
   నీముఖమును నీ యెడనే చూచినాను.
   చంద్రుని ఆకసమందే చూచినాను.

9. ఉత్ప్రేక్షతోపమ-
   ఆమె ముఖశ్రీ నా యందే యున్నదని చంద్రుడు 
   గర్వపడక్కరలేదు. పద్మమునందుకూడ నది కలదు.

10. అద్భుతోపమ -
    పద్మము విభ్రాంతనయమైన యెడల నీ ముఖశ్రీని బొందవచ్చును.

11. మోహోపమ -
    కృశాంగి చంద్రుని చూచి నీ ముఖమనుకొని దానివైపు పోయినాను.

12. సంశయోపమ -
    ఇది లోపల తిరుగుచున్న భ్రమరములు గల పద్మమా
    లోలేక్షణములు గల నీ ముఖమా - అని నా మనస్సు డోలాయమానమైనది

Sunday, March 12, 2017

కాలుతున్న ఇసుకలో కాలు పెట్టగలమా?


కాలుతున్న ఇసుకలో కాలు పెట్టగలమా?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం గమనించండి-

అన్య స్మా ల్లబ్ద పదః ప్రాయో
నీ చోపి దుః సహో భవతి,
రవి రపి న దహతి తాదృశా
దృగయం దహతి వాలుకా నికరః


ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి,
ఉన్నతాసనాలు అలంకరించే
అథముల వల్ల అందరికీ
ఇక్కట్లు ప్రాప్తిస్తాయి.
స్వశక్తితో పైకొచ్చిన వారికీ
నీచప్రవర్తన ఉండదు.
ఎలాగంటే
సూర్యుని వేడిని భరించగలమేమో గాని,
సూర్యరశ్మిలో బాగా కాలుతున్న ఇసుకమీద
కాలు పెట్టగలమా - అని శ్లోక భావం.

నాయికలు భేదాలు


నాయికలు భేదాలు




సాహితీమిత్రులారా!



శృంగారనాయికలు 8 విధాలుగా
కావ్యాలంకార సంగ్రహములో వివరించారు
ఈ పద్యం చూడండి-

వరుఁడు కైవస మైన వనిత స్వాధీన భ
         ర్తృక, ప్రియాగమవేళ గృహముఁ దనువు
సవరించు నితి వాలక సజ్జ, పతి రాక
         తడవుండ నుత్కంఠఁ దాల్చు నింతి
విరహోత్క, సంకేత మరసి నాథుఁడు లేమి
         వెస నార్త యౌకాంత విప్రలబ్ద
విభుఁడన్యసతిఁ బొంది వేకుఁవ రాఁ గుందు
         నబల ఖండిత, యల్క నధిపుఁదెగడి
అనుశయముఁ జెందు సతి కలహాంతరిత, ని
జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషిత పతిక, కాంతాభిసరణ
శీల యభిసారి కాఖ్య యై చెలువు మెఱయు
                                                                (కావ్యాలంకార సంగ్రహము - 2- 40)



ఇందులో 8 విధాలైన నాయికలను గురించి విరించారు.

1. స్వాధాన పతిక - 
భర్తను స్వాధీనము నందుంచుకొను యువతు
ఇతర స్త్రీలను కోరుకొనక తన యందే అనురక్తుడై
యుండును.

2. వాసకసజ్జిక -
భర్త వచ్చే సమయానికి తనను గృహాన్ని
అలంకరించుకొని సిద్ధముగా ఉండు యువతి

3. విరహోత్క -
భర్తచెప్పిన వేళకు రాక ఆలస్యమైన మిక్కలి తహతహలాడుతూ
ఉండే యువతి - విరహోత్కంఠిక లేక విరహోత్క.

4. విప్రలబ్ద -
సంకేతస్థలంలో తన ప్రియుడు లేకుండుటను
చూచి ఆర్తి వహించే యువతు - విప్రలబ్ద

5. ఖండిత -
ప్రియుడు పరకాంతతో రేయి గడపి ఉదయాన్నే
ఇంటికి రాగా బాధపడెడి యువతి

6. కలహాంతరిత -
కోపించి భర్తను దూషించి వెడలగొట్టి, అతడు వెలిపోయిన
తరువాత పశ్చాత్తాము పొందెడి యువతి కలహాంతరిత

7. ప్రోషితభర్తృక -
తన ప్రియుడు విదేశాలకు  వెళ్ళియుండగా
కృశించు యువతి ప్రోషితపతిక

8. అభిసారిక -
ప్రియని వద్దకు తానే స్వయంగా పోవునది,
ప్రియుని తన వద్దకు రప్పించుకోనేది అయిన యువతి
అభిసారిక


ఇందులో విప్రలబ్ద, విరహోత్కంఠిత, ప్రోషితపతిక,
విరహిణికి పర్యాయపదాలు.


Saturday, March 11, 2017

ఇందువల్లనే మనదేశంలో విద్యలు అంతరించాయి


ఇందువల్లనే మనదేశంలో
విద్యలు అంతరించాయి




సాహితీమిత్రుిలారా!



ఈ సూక్తి చూడండి
ఎంత గొప్పదో

విద్యయైవ సమం కామం
మర్తవ్యం బ్రహ్మవాదినా
ఆపద్య పిహి ఘోరాయాం
సత్యేన మిరిణే వపేత్

సరైన శిష్యుడు లభించనపుడు,
తనకు వచ్చిన గొప్ప - గొప్ప
విద్యలు బైటికు వెల్లడించరాదు.
ఎవరికో ఒకరికి నేర్పరాదు.
తనతోనే అంతరించిపోవాలి
ఎంతటి క్లిష్టసమయం వచ్చినా
అయోగ్యులకు ఇటువంటి అద్భుత
విద్యలు అందించకూడదు
ఎందుకంటే...........

ధర్మార్థౌ యత నస్యాతాం
శుశ్రూషా వాపి తద్విధా
తత్ర విద్యా న వప్తవ్యా
శుభం బీజమి వోషరే

ధర్మం - ధనం లేనివానికీ,
వినయం గుణం లేనివానికీ
ఎటువంటి విద్యనూ చెప్పరాదు
చౌడు భూములలో వేసిన
విత్తనాలు వ్యర్థమైన రీతిగా,
ఇటువంటి వారికి చెప్పే విద్య
కూడా వృథా కాగలదు అని భావం
ఇందుకే గదా మనదేశంలోని విద్యలు
అన్నీ అయోగ్యులని తలచి తమతోటే
నాటి గురువులు అంతరింపచేశారు

Friday, March 10, 2017

ఆనాటి ప్రజల విశ్వాసం


ఆనాటి ప్రజల విశ్వాసం




సాహితీమిత్రులారా!



పూర్వం ముద్రణాలయాలులేని కాలంలో
తాళపత్ర గ్రంథాలకు ప్రతులు వ్రాయడం పరిపాటి.
ఒకడు చాల కష్టపడి ఆంధ్రమహాభాతం ప్రతిని
ఆరు మాసాలలో పూర్తి చేశాడట చివరలో
పాఠకులకు అప్పగింతలు పెట్టుచున్నాడు.
ఆ అప్పగింతల పద్యం చూడండి-

వ్రాలా తప్పులు సెబ్రలు
చాలంగల నేను శబ్దగతులెఱుగన్
గేలింబెట్టక తిట్టక
పోలంగా దిద్దరయ్య బుధజనులారా!

(వ్రాయటంలో చాల తప్పులు దొర్లినవి
నాకు వ్యాకరణ జ్ఞానంలేదు
పరిహసించక - తిట్టక - తప్పులు దిద్ద
కోరుచున్నాను)

మరొక పద్యం మరోకరు వ్రసినది-

వ్రాతతప్పువలన వాచకు లలుగక
తప్పుగల్గెనేని తగిన యెడల
వలయు నక్షరములు వర్ణించి నిలుపుడీ!
సుకవులైనవారు సురుచిరముగ!

(వ్రాతలో దొర్లిన తప్పులను చూచి
చదువుకొనువారు కోపగించవద్దు
నేను మరచిన ఒత్తులను అక్షరములను
కావలసినచోట నిలుపుడు.
వ్యాకరణము- ఛందస్సు తెలిసిన సుకవులారా
నా తప్పును సవరించుకొనుడు)

పూర్వం తాళపత్ర గ్రంథాలకు ప్రతులు వ్రాయడం
రామకోటి వ్రాసినట్లుగా మహాపుణ్యమని భావించి
కొందరు వ్రాసేవారు
ఇది నాటి ప్రజల విశ్వాసం.

ఏ వాసనాలేని పువ్వుమీద తుమ్మెద ఎందుకు వాలుతుంది?


ఏ వాసనాలేని పువ్వుమీద తుమ్మెద 
ఎందుకు వాలుతుంది?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

కిం మాలతి మాయసి మా విహాయ
చుచుంబ తుంబీకుసుమం షడంఘ్రిః
లోకే చతుర్భిశ్చణైః పశుస్సాల్
సషడ్భి రత్యర్ధ పశుర్న కింస్యాత్?

ఏ వాసనా లేని తుంబిడి పువ్వుమీద
తుమ్మెద దేనికి వాలుతుంది
మాలతీలతను వదిలిపెట్టి మరీ
ఈ పువ్వుమీద వాలడానికి కారణం-
కేవలం తేనె కోసమే!

లోకంలో - పశువులకు నాలుగే కాళ్లుంటే,
తుమ్మెదకు ఆరు కాళ్లున్నందున
ఇది పశువుకంటే హీనం.
బుద్ధిలేని ఈ పశువున్నర జాతి
అలా ప్రవర్తించడంలో వింతేముందీ?
అంతమాత్రంతో మాలతీలతకు
వచ్చే నష్టమేమీలేదు. మూర్ఖులు కూడ ఇంతే!
గొప్పవారిని నిర్లక్ష్యంగా చూసి,
పనికిమాలిన వారి దగ్గరకే చేరుతారు-
ఇచ్చకపు మాటలకోసం.


Thursday, March 9, 2017

పైన పటారం లోన లొటారం


పైన పటారం లోన లొటారం




సాహితీమిత్రులారా!




భాస్కరరామాయణంలోని
యుద్ధకాండలో 1562 పద్యాలను
అయ్యలభట్టు కూర్చాడు.
అందులోని ఈ పద్యం చూడండి-
ఇంద్రజిత్తు వేసే బాణాలకు వానరులు
భావించిన తీరు ఇందులోని విషయం-

పిడుగులొకో కావు పొడతేవు ఘనము 
                              లుల్కా సహస్రంబులో కావుధరణి
యడలదు కాల సర్పావళు లొకొ కావు 
                              పాతాళ వివరంబు బయలుపడదు
ఖరమైన ముక్కంటి కంటి మంటలొ కావు 
                              జగదవసానంబు జాడలేదు
కాలకూటార్చులో కావు మందరగోత్ర 
                               మానితాంభోరాశి గానబడదు
మొదలెరుంగరాదు ముసుకొని పుట్టిన
చొప్పు దెలియరాదు చూడ నెచట
నని కపీంద్రు లిట్టు లాజి దల్లడ మంది
రింద్రజిత్తు తూపు లేపు మాప
                                       (భాస్కరరామాయాణము - యుద్ధ. 1268)

పద్యం చూడటాని చాల బాగుందికదా
లోతు పాతులలోకెళితే విషయం అర్థమౌతుంది
చూడండి-

ఇవి పిడుగులా, కావు, మబ్బులు లేవు.
ఉల్కాసహస్రాలా ధరణి కంపిచదు.
కాలసర్పాలా కావు, పాతాళం బయటకు కనబడదు
శివుని కంటి మంటలా, జగత్ప్రళయం కనబడదు
అని వానరులు తల్లడిల్లారట
ఇంతవరకు పద్యం బాగానే ఉంది కాని
ఇందులో ఔచిత్యం లేదు అని
ఆరుద్రగారు తన ప్రాణాలమీదకు
వచ్చినపుడు  ప్రపంచం అంతమై
పోతుందని భావిస్తే సహజంగా ఉంటుంది
ఇందులో జగదవసానకాలం కాదనుకోవడంలో
ఏమి ఔచిత్యం ఉంది అని అంటారు.

కొన్నిటికి ఇవి స్వభావ సిద్ధాలు


కొన్నిటికి ఇవి స్వభావ సిద్ధాలు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఏవి ఎలా వ్యాపిస్తాయో చెబుతుంది.

జలే తైలం, ఖ లే గుహ్యం
పాత్రే దాన మనాగపి,
ప్రాజ్ఞే శాస్త్రం స్వయం యాతి
విస్తరం వస్తు శక్తి తః


వీటికివి స్వతస్సిద్ధమైనవి-

నీటిలో పడిన నూనె
ఎంత త్వరగా వ్యాపిస్తుందో కదా
అలాగే యోగ్యనికి ఇచ్చిన దానం కూడ
అనేక రెట్లు ఫలితాన్నిస్తుంది.
బుద్ధిమంతుకి విద్య కూడ అంతే
ఇవన్నీ మంచిని విస్తరించటానికి
ఉదాహరణలు అయితే
ఇక రహస్యం అనేది పొరపాటునైనా
దుష్టుని చెవిని పడితే దానికి అపయోగం
తప్పదు. అందరికీ వెల్లడైపోతుంది.
ఇవి అన్నీ సహజసిద్ధమైనవని భావం.


Wednesday, March 8, 2017

మగనాలికి నింత విలాస మేటికిన్?


మగనాలికి నింత విలాస మేటికిన్?




సాహితీమిత్రులారా!


ఆడవాళ్ల సౌందర్యాన్ని నిశితంగా పరీక్షించడంలో
సహజంగా వర్ణించడంలో శ్రీనాథుడు అందెవేసిన చేయి.
ఇటువంటి పద్యాలు ఎక్కువగా చెప్పడం వల్ల ఆయన స్రీ
లోలుడనే అపఖ్యాతి అతణ్ణి అలుముకొంది.
శ్రీనాథుడు అవినీతి పరుడుకాదు. రసికుడుమాత్రమే.
ఆనాటి శాస్త్రాలు, సమాజం అంగీకరించిన విధంగా
భోగంవాళ్ళ దగ్గర తన రసికతను చూపి సుఖించే
వాడేగాని మగనాలి జోలికి పోలేదని చెప్పడానికి
సాక్ష్యం ఈ పద్యం చెబుతుంది చూడండి-

వాసనగల్గు మేను నిడువాలుకనుంగవ గబ్బిగుబ్బలున్
గేసరిమధ్యమున్ మదనకేళికి నింపుగ బాహుమూలవి
న్యాసముగల్గి నట్టి యెలనాగను బోగముదాని జేయ కా
దాసరిదాని జేసిన విధాతను నేమనవచ్చు నీశ్వరా!

బోగముదానిగా పుట్టించకుండా
దాసరి వనితా పుట్టించిన విధిని
ఏమనచ్చు ఓ ఈశ్వరా! అంటున్నాడు.


ఇలాగే ఇంకొక పద్యంలో వగలాడిని
మగనాలిగా సృష్టించినందుకు బ్రహ్మను
నిందిస్తున్నాడు చూడండి-

గుబ్బలగుమ్మ లేజిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపుది దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంటగట్టితీవి పెద్దవునిన్ననరాదుగాని దా
నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాస మేటికిన్?




దీనితో ఏ పనైనాకలిసిరాకపోవడమన్నది ఉండదు


దీనితో ఏ పనైనాకలిసిరాకపోవడమన్నది ఉండదు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఎలా ఉండాలో చెబుతుంది.

నాత్మాన మవమన్యేత
పూర్వాభి ర సమృద్ధిభిః
అమృత్యోః శియమన్విచ్చేః
న్నైనాం మన్యేత దుర్లభమ్


ధనమంతా పోగొట్టుకొని, దుర్భరమైన
దారిద్ర్యంలో మగ్గిపోతూ నానా కష్టాలు
పడుతున్నా సరే .........
ఎప్పుడూ తనను తాను నిందించుకోకూడదు.
జీవించినంతకాలం ఏదో విధంగా ధనాన్ని
సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి
కాని అది అధర్మ మార్గంలో మాత్రం కాకూడదు.
ధైర్యం - దీక్షకలవారికి చేసే ఇటువంటి ఏ పనైనా
కలిసిరాకపోవడమన్నది ఉండదు అని భావం.

Tuesday, March 7, 2017

కలి పరిపక్వతకు ఇవి నిదర్శనాలు


కలి పరిపక్వతకు ఇవి నిదర్శనాలు




సాహితీమిత్రులారా!


కలియుగంలోని వింతను
వివరించే శ్లోకం ఇది
చూడండి-

దానా దరిద్రః కృపణో ధనాఢ్యః
పాపీ చిరాయు స్సుకృతీ గతాయుః
రాజా కులీన స్సుకులీన భృత్యుః
కలౌయుగే షడ్గుణ మాశ్రయంతి

కలియుగంలో ఈ ఆరు ప్రసిద్ధమైనవి-
అవి-
1. దానం చేస్తే దారిద్ర్యం కలగడం
2. మహాలోభి పరమధనవంతుడై వెలగడం
3. పాపి ఎక్కువకాలం జీవించటం,
4. పుణ్యాత్మునికి త్వరగా మరణం సంప్రాప్తించడం,
5. ఉత్తమకులంలో పుట్టినవాడు సేవక వృత్తిలో జీవించడం
6. హీనకులజుడు అధికారం చెలాయించడం

ఇవి కలియుగ పరిపక్వతకు నిదర్శనాలు - అని భావం

కవిసమయములు -1


కవిసమయములు -1




సాహితీమిత్రులారా!


సమయము అంటే సాంప్రదాయం,
ఆచారం లేదా మర్యాద.
ఈ సాంప్రదాయాలు దేశంలోని
ఆచారాలవెనే ఎప్పుడో ఏర్పడినవి.
సంఘముతో సంబంధము ఉన్నంతవరకు
దేశాచారములను ప్రజలు పాటించవలసిన విధంగా
కవులు సరైన సందర్భములో వాటిని పాటించవలసినదే.
వాటిని మార్చటానికి వీలులేదు.
మార్చితే భాషే తలక్రిందులౌతుంది.
ఔచిత్యం దృష్టిలో ఉంచుకొని కొత్తవాటిని సృష్టించుకోవచ్చు.

కవిసమయాలు మూడు విధాలు-
1. ఉన్న ధర్మాన్ని నిబంధించకూడదు
2. లేని ధర్మాన్ని నిబంధించవచ్చు
3. నియతముగా కొన్నిటికి కొన్ని చోటులనే ఉనికిని నిబంధిచాలి
వీటిని ఒక్కొకదానినిగురించి విరించుకుందాం

ఈ క్రంది వస్తువులలో ఉన్న ఆయా ధర్మాలను నిబంధించరాదు

1. మాలతీ(జాజి)లత వసంతంలో 
    పుష్పించునట్లు వర్ణించరాదు.

2. చందన వృక్షాలకు ఫలపుష్పాలు 
    ఉన్నట్లు వర్ణించరాదు.

3. అశోకవృక్షమునకు 
    ఫలములు ఉన్నట్లు వర్ణింపరాదు.

4. కృష్ణపక్షంలో వెన్నె ఉన్నట్లు వర్ణించరాదు.

5. శుక్లపక్షంలో చీకటి ఉన్నట్లు వర్ణించరాదు

6. మల్లెమొగ్గలకు, కాముకుల దంతాలకు
     (తాంబూలం నమలినా ఎర్రగా ఉన్నట్లు)
      ఎర్రగా ఉన్నట్లు వర్ణించరాదు

7. కమల ముకుళము(అరవిరిసిన 
     మొగ్గ)లను పచ్చదనము ఉన్నా
     వర్ణించరాదు.

8. ప్రియంగు(కుంకుమ) పుష్పములకు
     పచ్చదనము ఉన్నా వర్ణించరాదు

9. పగటిపూట నీలోత్పలము
     (నల్లకలువల వికాసము వర్ణింపరాదు

10. పగటిపూట వావిలిచెట్టు పూలు 
      రాలిపోయినట్లు వర్ణించరాదు.

11. స్త్రీలకు నల్లదనమును, 
      స్తనపాతమును వర్ణించరాదు

Monday, March 6, 2017

కాశీలో మరణిస్తే ఆ విభూతి కలుగుతుంది


కాశీలో మరణిస్తే ఆ విభూతి కలుగుతుంది




సాహితీమిత్రులారా!



ప్రౌఢకవి మల్లన కృత
రుక్మాంగదచరిత్రలోని
ఈ పద్యం చూడండి-
కాశీలో మరణిస్తే ఎలాంటి
విభూతికలుగుతుందో తెలుస్తుంది.

కరి కరితోలుఁ గప్పు నురగం బురగంబు ధరించు శాక్వరం
బిరవుగ శాక్వరంబుఁగని యెక్కు మృగంబు మృగంబుఁ బొల్చు భూ
సురవర కాశిలో నధికసుప్తి వహించిన తత్క్షణంబ యే
పురముల కివ్విభూతిపరిపూర్ణత నొందుఁ దలంచి చూచి నన్
                                                                                         (రుక్మాంగదచరిత్రము - 5-59)


ఓబ్రాహ్మణుడా!  కాశీపట్టణంలో
మరణాన్ని పొందినట్లయితే,
వెంటనే ఏనుగు వచ్చి ఏనుగు
తోలును కప్పుతుంది. ఆ జీవుడు
పామయితే పాము వచ్చి తనలో
కలుపుకుంటుంది. ఎద్దయితే
ఎద్దును ఎక్కుతుంది. లేడి అయితే
లేడిగా భాసిస్తుంది. ఎంత ఆలోచించినా
ఐశ్వర్యం తాలూకు (విభూతి) ఈ పరిపూర్ణ
వైభవం ఏ పురాలకు ఉంటుంది.
గజచర్మధారి, నాగభూషణుడు,
వృషభవాహనుడు, మృగహస్తుడు
కావున ెఅక్కడ మరణించిన జీవకోటికి
ఈ విభూతి కలుగుతుంది - అని భావం.