Friday, May 29, 2020

కవిగారి బహుమానం


కవిగారి బహుమానం





సాహితీమిత్రులారా!

కొమాండూరు కృష్ణమాచార్యులవారు 20వ శతాబ్ది ప్రథమార్థంలో
ఉన్న పండిత కవులు. గుంటూరు వాసులు.
వారొకనాడు మండు వేసవిలో వడగాడ్పుల మధ్య తమ పొలమున్న
గ్రామానికి పోతున్నారు. త్రోవలో విపరీతంగా దప్పికైంది.
అప్పుడొక గొల్లవాడు చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీర్చాడు.
వెంటనే అతనికి పద్యాన్నిలా
బహూకరించారు
ఆచార్యులవారు.

పురజిత్పాల మహోగ్రనేత్ర జనిత స్పూర్జన్మహాగ్నిచ్ఛటా
పరుష స్పూర్తి వహించి వీచెడు మహావాతంబు ప్రాణాంకురో
త్కరమున్ మ్లానము నొందజేయ - మము తక్రంబిచ్చి రక్షించితో
పురుష గ్రామణి! గోప మాత్రుండవె! నీ పుణ్యంబు సామాన్య మే?

అన్నాడట.
ఆ గోపాలునికి ఈ పద్యం అర్థంకాలేదు.
సంస్కృత పద సమాస బంధురమైన శైలి కొమాండూరి వారిది.
వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
అది గ్రహించి అర్థం చెప్పారు కవిగారు.

"త్రిపురాలను తగలబెట్టిన రుద్రుడి మూడో కంటి మంటలాగా 
ఎండకాస్తున్నది. వడగాడ్పు కొడుతున్నది. 
ప్రాణం అలసిపోతున్నది. ఈ స్థితిలో మజ్జిగ ఇచ్చి కాపాడావు. 
నీవు మామూలు గొల్లవు కాదు. 
నీ పుణ్యం సామాన్యమైందికాదు."

అర్థం తెలిసిన తర్వాత
అంత గొప్ప పద్యం
తన మీద చెప్పినందుకు
ఎంతో కృతజ్ఞత ప్రకటించాడతను.

Tuesday, May 26, 2020

బోదురుకప్ప


బోదురుకప్ప





సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ అనువాదకవిత ఈ బోదురుకప్ప
దీని మూలరచయిత - ట్రిస్టోన్ కోర్బియేర్
ఇది కవనకుతూహలం నుండి -

గాలిలేని రాత్రిపూట ఏదోపాట............
- దట్టపుటాకుల కత్తిరింపు బొమ్మలకి
జిలుగు మలామాలు సింగారిస్తున్నాడు చంద్రుడు.
ఓపాట; ప్రతిధ్వనిలో అకస్మాత్తుగా, వడిగా,
పూడ్చబడి, అల్లక్కడ, ఆ బోలెడు బురద కింద
- ఆగింది దా! అక్కడే ఉంది, అదృశ్యంగా .........
-- బోదురుకప్ప! - అదిగో నీడలో! నాదగ్గరా జడుపు?
నీ నమ్మకమైత కసాయిని కానూ నేను!
           చూడండతణ్ణి, క్షౌరమైన కవిని, రెక్కైనా లేదు
బురదకుపుట్టిన కోకిల దారుణం! 
            --పాడుతున్నాడే అరే! దారుణం!! ఏం?
                                            ఎందుకని దారుణం?
బాగాచూశారా అతని ప్రకాశించే నేత్రాల్ని? ........ 
ఉహుఁ! నిష్క్రమించాడు చల్లబడి. తన రాతి కిందికి 
గుడ్ నైట్ - మీరు విన్న బోదురు కప్పని నేనే

Saturday, May 23, 2020

అదొక్కటే పెద్దలోపం


అదొక్కటే పెద్దలోపం




సాహితీమిత్రులారా!

ఒక అభిసారికను ఆమె చెలికత్తె
"నీకు అందమైన భర్త - సమర్థుడు ఉండగా వ్యభిచారమేల?" -
అని ప్రశ్నించిందట.
దానికి ఆమె సమాధానం చూడండి.

ఆకారే శశీ, గిరా పరభృత:, పారావతశ్చుంబనే
హంసశ్చంక్రమణే సమం దయితయా, రత్యాం ప్రమత్తో గజ:
ఇత్థం భర్తరిమే సమస్త యువతి శ్లాఘ్యై: గుణై: శోభతే
శూన్యం నాస్తి వివాహిత: పతిరివ స్యాన్నైక దోషోయది!

నా భర్త ఆకారంలో చంద్రుడు, మాటలలో కోకిల,
ముద్దుమాటలలో పావురము, నన్ను కొంగుపట్టుకొని
తిరగడంలో రాజహంస, రతిలో మత్తగజమే నా భర్తలో
యువతులు మెచ్చుకొనే గుణాలన్నీ ఉన్నాయి.
తాళికట్టినమగడగుటే పెద్దలోపము ఆ ఒక్క లోపం
వల్లనే పరపురుషులను
అభిసరిస్తున్నాను.
- అని చెప్పిందట.

Wednesday, May 20, 2020

అవి వాటి సహజగుణం


అవి వాటి సహజగుణం




సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలో కవి ఎంత సహజంగా
చమత్కరించాడో!
చూడండి.

అభూచ్ఛామా జంబూ: దళితహృదయం దాడిమఫలం
సశూలం సంధత్తే హృదయ మవమానేన పనస
భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలిఫలం
సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి!

మామిడిపండు ఫలరాజంగా ప్రపంచంలో
ప్రఖ్యాతి పొందుతూంటే
నేరేడుపండు మొగం మాడ్చుకున్నది.
దానిమ్మపండుకు గుండె బ్రద్దలైంది.
పనసపండు గుండెలో గసిక(మొనదేలి
త్రవ్వటానికి అనువైన కొయ్య) గ్రుచ్చుకొంది.
కొబ్బరి ఫలము గుండె నీరైంది - అని భావం.
అన్ని పండ్లకు వాటి సహజ గుణాలతోనే
కవి ఎంతగా చమత్కరించాడో కదా!

Monday, May 18, 2020

ఆ రాజుగారి కీర్తి ఎంతదో!


ఆ రాజుగారి కీర్తి ఎంతదో!




సాహితీమిత్రులారా!

ఒక రాజు  కీర్తిని కవి
ఎంత చమత్కారంగా వర్ణించాడో
ఈ శ్లోకం చూడండి.

విద్వద్రాజ శిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశ:
కైలాసంచ నిరీక్ష్య తత్రలఘుతాం, నిక్షిప్తవాన్ పూర్తయే
ఉక్షాణం, తదుపర్యుమా సహచరం తన్మూర్ధ్నిగంగాజలమ్
తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరిస్ఫారం సుధా దీధితిమ్

ఓరాజా! నీ కీర్తిని తూచాలని బ్రహ్మ అనుకొన్నాడు.
తక్కెడ ఒక సిబ్బెలో కీర్తిని ఉంచి వేరొక సిబ్బెలో వెండి కొండను పెట్టాడు.
చాల్లేదు.
ఆపై నందీశ్వరుని -
(అదీ చాలక) ఆ పై శివుని -
ఆపై గంగాజలమును -
ఆపై వాసుకిని -
ఆపై చంద్రకళను పెట్టి
తూచలేక విఫలుడైనాడు -
అని భావం

Friday, May 15, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం 




సాహితీమిత్రులారా!
Welcome to Andhra Pradesh Library Association | 1st President of ...
ఒకనాటి సాయంకాలం నాటకసమాజంలో
అందరూ కలిసి పకోడీలు
తింటూ ఉండగా చిలకమర్తి వారితో
టంగుటూరు ప్రకాశంపంతులుగారు
 "మీరు పకోడీమీద పద్యాలు చెప్పండి
పద్యానికి ఒక పకోడీ ఇస్తాను" అన్నాడట.
"కవులకు అక్షరలక్షలు ఇచ్చే కాలం గతించింది.
పద్యానికి పకోడీ ఇచ్చే దుర్దినాలొచ్చినై" అని,
వెంటనే
ఈ క్రింది పద్యాలు చెప్పారట
చిలకమర్తివారు.

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటేగాని లేదట
కనుగొన నీ యందమృతము గలదు పకోడీ!

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యీ ఘుమ ఘుమ యా పొంకము లా
రాలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధన తండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుఁడనుచుఁ జెప్పకూర్మి పకోడీ!

Tuesday, May 12, 2020

లోకరీతి


లోకరీతి





సాహితీమిత్రులారా!


ఈ  శ్లోకాన్ని చూడండి.

విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా:
తేపి స్త్రీ ముఖ పంకజం సులలితం సంవీక్ష్య మోహంగతా:
శాల్యన్నం సఘృతం పయో దధియుతం భుంజంతి యే మానవా:
తేషా మింద్రియనిగ్రహో యది భవేత్ వింధ్యప్లవేత్ సాగరే!

విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలైనవారు
గాలి- నీరు - ఆకులను తినినవారు.
అలాంటివారు కూడ స్త్రీని చూచి మోహాన్ని పొందారు.
సన్నన్నం,
నెయ్యి,
పాలు,
పెరుగు
తిన్నవారికి ఇంద్రియ నిగ్రహం ఉంటే !
సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది.
- అని భావం.
ఇది నిజమే కదా! కాదంటారా?

Sunday, May 10, 2020

పాఠకునికి ఉండకూడని లక్షణాలు?


పాఠకునికి ఉండకూడని లక్షణాలు?




సాహితీమిత్రులారా!

మనమంతా చదువుతున్నాము. చదివేవాళ్ళను చూస్తున్నాము.
కాని ఏ లక్షణాలు ఉత్తమమైనవి? ఏవి అధమమైనవి?
 ఈ శ్లోకం చూస్తే అర్థమౌతుంది.


శీఘ్రీ గీతీ శిర: కంపీ యథా లిఖిత పాఠక:
అనర్థజ్ఞో2ల్పకంఠశ్చ షడేతే పాఠకాధమా:


తొందరా చదవటం
మూలుగుతూ చదవటం
తల ఆడిస్తూ చదవటం
వ్రాస్తున్నట్లుగా చగవటం
అర్థ జ్ఞానం లేకుండా చదవటం
నీరసంగా చదవటం - అనే
ఈ 6 అధమ పాఠకుని లక్షణాలు.
గమనించండి మనవారిలో ఎవరైనా ఉన్నారేమో?
ఇప్పటినుండైనా ఈ లక్షణాలను మానేట్లు చేద్దాం.

Friday, May 8, 2020

మాటంటే మాటలా


మాటంటే మాటలా





సాహితీమిత్రులారా!

మాట అంటే పదము, వాక్యం, వార్త, సూక్తి, లోకోక్తి, ప్రతిజ్ఞ, కథ, ప్రార్థన ఇలా అనేక అర్థాలున్నాయి. మాట్లాడటమంటే అంత సులువుకాదు. మాటలు అందరూ మాట్లాడలేరు కాని మాటలు రాకపోతే ఎంత ఇబ్బందో ఈ పద్యంలో కవి వివరించాడు చూడండి-

మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్
మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్
మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్
మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగ మున్

కాబట్టి మంచి మాటలు నేర్చి, అర్థం చేసికొని, చక్కగా వివరించడం కూడా అభ్యాసం చేయాలి. లేకుంటే అగౌరవం, హీనత్వం, గర్వభంగం మొదలైనవి ఎన్నో గలుగుతాయి. కావున ప్రతి మనిషి సమయానికి తగిన విధంగా మాట్లాడవలెనని కవి హెచ్చరికగా దీన్ని భావించవచ్చు. మాటమీద ఎంత మంచి పద్యం.

Wednesday, May 6, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం





సాహితీమిత్రులారా!

                            కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల పేర్లు అనేక విధాలుగా చెప్పడం జరుగుతోంది. ఈ పేర్లలో కవయిత్రి మొల్ల పేరుకూడా వినబడుతూవుంది. కవయిత్రిమొల్ల మొదటిసారి రాయలవారిని దర్శించుకున్న సమయంలో ఆమె ప్రభువులను ప్రస్తుతిస్తూ ఇలా చెప్పారు.

అతఁడు గోపాలకుండితఁడు భూపాలకుం 
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవపక్షుఁడితఁడు పండిత రక్షుఁ 
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచకపోషి 
యెలమి నాతనికన్ననితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి 
యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
పల్లె కాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీలకితఁడు
సురల కాతండు తలప భూసురులకితఁడు
కృష్ణుఁడాతండు శ్రీ మహాకృష్ణుఁడితఁడు
అని కృష్ణుని, శ్రీకృష్ణదేవరాయలను పోల్చి, కృష్ణునికన్న రాయలే గొప్ప అని చమత్కరించి చెప్పినది. ఈ పద్యాన్ని విన్న తెనాలిరామకృష్ణుడు తన సహజ వికట స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఇలా చమత్కరించాడు.

అతఁడంబకు మగఁడు ఈతఁడమ్మకుమగఁ 
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలముద్రిప్పు నితఁడు వాలముద్రిప్పు 
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్ముననేయు నితఁడు కొమ్మునఁడాయు 
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటనుజిచ్చు నితని కంటను బొచ్చు 
డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
దాతయాతండు గోనెల మోతయితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుఁడాతండు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు.
అని ఈశ్వరుని, నందీశ్వరుని పోల్చి, ఈశునికన్న నందీశుడే గొప్పని వికటంగా చమత్కరించాడు.

Sunday, May 3, 2020

అడుక్కోవడమే పట్టుకొన్నది


అడుక్కోవడమే పట్టుకొన్నది




సాహితీమిత్రులారా!

ఒక కవి రాజుతో చెప్పుకొన్నమాటలు ఈ శ్లోకం చూడండి.

అర్థం దానవవైరిణా గిరిజయాప్యర్థం శివస్యాహృతమ్
దేవేత్థం జగతీతలే పురహరాభావే సమున్మీలతి
గంగాసాగర మంబరం శశికళా నాగాధిపక్ష్మాతలమ్
సర్వజ్ఞత్వ మధీశ్వరత్వ మగమత్త్వాం మాంతుభిక్షాటనమ్

శివునిలో సగము నారాయణుడు ఆక్రమించాడు.
మిగిలిన సగము పార్వతి ఆక్రమించింది.
శివుడే లోకంలో లేకుండా పోయినాడు.
ఆయన్ను ఆశ్రయించి ఉన్న గంగ సముద్రంలో కలిసింది.
చంద్రకళ ఆకాశాన్ని ఆశ్రయించింది.
సర్పరాజు పాతాళానికి పోయినాడు.
సర్వజ్ఞత్వము- అధీశ్వరత్వము నిన్ను ఆశ్రయించాయి.
భిక్షాటనం నన్ను పట్టుకున్నది
(అంటే నా దారిద్య్రం తొలగిచమని మొర).

Saturday, May 2, 2020

పెదవిపై తుమ్మెద కొరికింది



పెదవిపై తుమ్మెద కొరికింది




సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

కస్యవా నభవతి రోషా దృష్ట్వా ప్రియాయా: సవ్రణ మధరమ్
సభ్రమర పద్మాఘ్రాణ శీలే సహస్వేదానీమ్!

నాయిక పరపురుషుని దంతక్షతము పొందినది
అంతలోనే భర్త వచ్చినాడు.
అతనికి అనుమానం రాకుండా
చెలికత్తె నాయికతో
"ప్రియురాలి పెదవి గాటు చూచిన ఏ ప్రియునికి రోషం రాదు?
నేను చెప్పినా వినక తుమ్మెద ఉన్న పద్మమును అఘ్రాణించితివి!
కర్మను అనుభవింపుము!"
అని భర్త వినేట్లుగా అంటున్నది.