Thursday, June 30, 2016

తర్ణకము అంటే ఏమిటి?


తర్ణకము అంటే ఏమిటి?


సాహితీమిత్రులారా!

ఆంగ్లంలో ఆవుదూడను "కాఫ్"(Calf) అంటారు.
ఆవుదూడలను మనవారు ఎన్నిరకాలుగా
విభజించారో చూడండి.

తర్ణకము - అప్పుడే పుట్టిన దూడ
తఱపి బష్కయము - ఆరునెలల దూడ
వత్సము - ఏడాదిలోపు దూడ
వత్సతరము(లేక) దమ్యము - పనికి మఱగింపదగిన దూడ
ఆర్షభ్యము - ఆబోతు కాదగినది
గోపతి - ఆబోతు
శాకటము - బండినిలాగు ఎద్దు
యుగ్యము - కాడిమోయు ఎద్దు
ప్రాసంగ్యము - తలకాడి మోయు ఎద్దు

ఆవులలో కూడ చాల రకాలున్నాయి.
 అన్నిటికి ఇంగ్లీషులో కౌ (Cow) అనే అంటారు.

ఉపసర్యము - చూలి అగుటకు తగిన కాలము కలది లేక తొలిచూలావు
ప్రష్టౌహి - పెయ్యగా ఉన్నపుడే చూలి అయినది.
పినోద్ని (లేక) పీవర స్తని - పెద్ద పొదుగుగల ఆవు
ధేనుక్య - కుదువ పెట్టబడిన ఆవు
గృష్టి - ఒకసారి ఈనిన ఆవు (లేక) నిరుడుమాలి ఆవు
సమాంసమీన - ప్రతియేడు ఈను ఆవు

కవిత్రయస్తుతి


కవిత్రయస్తుతి


సాహితీమిత్రులారా!


జక్కన విక్రమార్కచరిత్ర లో కవిత్రయాన్ని
మొట్టమొదటిసారిగా స్తుతించాడు.
కావ్యాదిన కవిత్రయాన్ని స్తుతించడానికి జక్కన ఆద్యుడు.
ఆయన కవిత్రయస్తుతి చూడండి.

నన్నయ స్తుతి-
వేయివిధంబులందుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్
పాయక చెప్పిరిట్లు రసబంధుర వాగ్విభవాభిరామ ధౌ
రీయులు శబ్దశాసనవరేణ్యులు వాఁగఁ బ్రశస్తి కెక్కిరే
యేయెడ నన్నపార్యుగతి నిద్ధర నట్టి మహాత్ముఁ గొల్చదన్

తిక్కన స్తుతి -
పరువడి భారతాఖ్య గల పంచమవేదము నాంధ్రభాష సు
స్థిర రచించుచోఁ గృతిపతితత్వముఁ గోరి ప్రసన్నుఁడైన యా
హరిహరనాథుచేఁ బడసె నవ్యయసౌఖ్యపదంబు నెవ్వఁడా
పురుషవరేణ్యుఁ దిక్కకవిఁ బూని నుతింతుఁ గృతాధ్వరోత్సవున్

ఎఱ్ఱన స్తుతి -
ఈత్రయిఁ దాఁ బ్రబంధపరమేశ్వరుఁడై విరచించె శబ్దవై
చిత్రి నరణ్యపర్వమున శేష శ్రీనరసింహరామచా
రిత్రములన్ బుధవ్రతగరిష్ఠత నెఱ్ఱయ శంభుదాసుఁడా
చిత్రకవిత్వ వాగ్విభవజృంభితుఁ గొల్చద భక్తియుక్తితోన్

Wednesday, June 29, 2016

ఏది నిజమో దేవునికే తెలుసు


ఏది నిజమో దేవునికే తెలుసు


సాహితీమిత్రులారా!


లోకరీతిని తెలిపే ఈ చమత్కారశ్లోకం చూడండి.

వైద్యా: వదన్తి కఫ పిత్త మరుద్వికారాన్
జ్యోతిర్విదో గ్రహగతిం పరివర్తయన్తి
"భూతాభిషంగ" ఇతి భూతవిదో వదన్తి
ప్రాచీనకర్మ బలవాన్ మునయో వదన్తి

మానవలోకంలో శారీరక బాధలు వచ్చినపుడు
వైద్యులు కఫ - వాత - పిత్త వికారాలని అంటారు.
జ్యోతిష్యులు గ్రహస్థితి గురించి చెబుతారు.
భూతవైద్యులు భూతసంబంధమైందని అంటారు.
పూర్వజన్మ కర్మము అని మునీశ్వరులు అంటారు.
ఏది నిజమో దేవునికే తెలుసు
- అని భావం. 

భవనాలు ఎన్ని రకాలు?


భవనాలు ఎన్ని రకాలు?


సాహితీమిత్రులారా!


ఆంగ్లంలో అవి కట్టబడేదాన్ని బట్టి
రకరకాల భవంతుల పేర్లు వింటుంటాము.
కాని మన భాషలోకూడ అనేక రకాల పేర్లున్నాయి
వాటిని ఇప్పుడు తెలుసుకుందాము.

సౌధము - గచ్చుతో కట్టబడినది.
భవనం - కాల్చిన ఇటుకలతో కట్టబడినది.
మందిరం - రాళ్ళతో కట్టబడినది.
సుధారము - మట్టి గోడలతో తయారైనది.
సుమనము - పచ్చి ఇటుకలతో నిర్మించబడినది.
మానస్యము - కర్రలతో కట్టబడినది.
చందనము - బెత్తములతో అల్లబడినది.
విజయము - వస్త్రముతో(గుడ్డతో) రూపొందినది(డేరా)
కాలము - గడ్డి, ఆకులతో రూపొందిచబడినది.
ప్రాయువము - జల గర్జితము (ఎయిర్ కండీషన్)
అనిలము - లక్కతో నిర్మించినది.
కరము - బంగారు శిఖరము కలది.
శ్రీపదం - వెండి శిఖరము కలది.
సూర్యమంత్రం - రాగి శిఖరము కలది.
చండము - ఇనుప శిఖరము కలది.

Tuesday, June 28, 2016

అనామికా సార్థవతీ బభూవ!


అనామికా సార్థవతీ బభూవ!


సాహితీమిత్రులారా!


ఈ చమత్కార శ్లోకం చూడండి.

పురా కవీనాం గణనాం ప్రసంగే, కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస:
అద్యాపి తత్తుల్య కవే రభావత్, అనామికా సార్థవతీ బభూవ!

('అనామికా' అంటే ఉంగరపు వ్రేలు,
దీనికి "మరొకపేరులేదు" అనికూడా అర్థం.)
ఒకసారి అందరూ కూర్చొని మాట్లాడుకొనేప్పుడు
పూర్వకవులను గూర్చి లెక్కించుచు
ఒక రసికుడు - చీటికెనవ్రేలు తీసి ఒకటి కాళిదాసు అన్నాడట.
రెండవ పేరుకై ఉంగరపువ్రేలు(అనామిక)తీసినాడు.
మరొక్కపేరు చెప్పలేక పోయినాడు.
అందుచేత ఉంగరపువ్రేలుకు "అనామిక" అనేపేరు సార్థకమైంది!
(కాళిదాసు పేరు చెప్పిన తరువాత
చెప్పుటకు మరియొక కవి లేడని భావం.)

కొడుకులు ఎన్ని రకాలు?


కొడుకులు ఎన్ని రకాలు?


సాహితీమిత్రులారా!

కొడుకులు స్వభావాన్ని బట్టి కాకుండా
పుట్టుకను బట్టి 12 (ద్వాదశ పుత్రులు) విధాలు.

1. ఔరసుడు - తనభార్య యందు తనకు పుట్టినవాడు.
2. క్షేత్రజుడు - పెద్దల అనుజ్ఞచేత భర్త అన్న, తమ్ముడు మొదలైన
                      వారికి పుట్టినవాడు (దీన్నే దేవరన్యాయము వలన అని కూడ అనవచ్చు.)
3. దత్తుడు - దత్తత తీసుకోబడినవాడు.
4. కృత్రిముడు - అభిమానించి పెంచుకోబడినవాడు
5. గూఢోత్పన్నుడు - తనకు తెలియకుండా ఱంకు మగనికి పుట్టినవాడు
6. అపవిద్ధుడు - తండ్రిచేతగాని తల్లిచేతగాని విడువబడగా, తెచ్చి పెంచుకోబడినవాడు.
7. కానీనుడు - తన భార్య యందు కన్యాత్వదశలో రహస్యముగా ఇతరునికి పుట్టినవాడు.
8. సహోఢజుడు - గర్భిణిగా ఉండగా, తెలిసిగాని తెలియకగాని
                              వివాహము చేసికొన్న భార్యకు పుట్టినవాడు.
9. క్రీతుడు - తల్లిదండ్రులకు ధనాన్నిచ్చి కొనుక్కోబడినవాడు
10. పౌనర్భవుడు - మారుమనువు చేసికొన్న స్త్రీకి పుట్టినవాడు
11. జ్ఞాతిరేతుడు - దాయాది కొడుకు (కొందరు పుత్రిక పుత్రుడు అని అంటారు.)
12. స్వయందత్తుడు - తల్లిదండ్రులు లేక గాని వారిచేత అకారణంగా విడువబడిగాని ,
                                   తనంతట తాను నీకు పుత్రుడనౌతానని వచ్చిన కొడుకు.

కొడుకులు ఇన్నిరకాలుగా ఉన్నారు.
వీరికి ఇతిహాసంలోగాని చరిత్రలోగాని
ఉదాహరణలు గుర్తించండి.

Monday, June 27, 2016

హతా: పాణినినా వయమ్


హతా: పాణినినా వయమ్


సాహితీమిత్రులారా!


వ్యాకరణ కర్తయైన పాణిని మనసును
నపుంసకలింగంగా చెప్పాడు వ్యాకరణంలో.
ఐతే ఇక్కడ ఒక తమాషా జరిగింది.
వ్యాకరణం నేర్చుకున్న పండితుడు
పాణిని చెప్పింది నిజమే అనుకున్నాడు.
దానివల్ల కలిగిన ఫలితంగా ఏర్పడింది ఈ శ్లోకం.

ఆ చమత్కార శ్లోకం చూడండి.

నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తతు తత్రైవ రమతే హతా: పాణినినా వయమ్

మనసు నపుంసకలింగమని పాణిని మాటలు
నమ్మి ప్రియురాలి దగ్గరకు పంపాను నా మనస్సును.
అది అక్కడ రమిస్తూంది నాదగ్గరకు రావడంలేదు.
పాణిని వలన నేను మోసపోయాను -
అని ఈ శ్లోకం భావం.

అర్థాలు మార్చకున్న పదాలు


అర్థాలు మార్చకున్న పదాలు


సాహితీమిత్రులారా!

కాలప్రవాహంలో పదాలకు అర్థాలు మారుతున్నాయి.
అలాంటి పదాలను కొంచెం కొంచెంగా తెలుసుకుందాము.

సెలవు - నేటి అర్థం- హాలిడే
             అసలు అర్థం - ఆజ్ఞ, ఖర్చు
రేపు - నేటి అర్థం - మరుసటిరోజు
           అసలు అర్థం - ప్రొద్దుట(ప్రాత: కాలం)
సవ్యము- నేటి అర్థం - సక్రమం
                 అసలు అర్థం- కుడి, ఎడమ, ప్రతికూలం
సభాజనము - నేటి అర్థం - సభలోని ప్రజలు
                        అసలు అర్థం - చుట్టములను ఆలింగనము మొదలైన
                                               వాటితో సంతోషపరచుట.
ఆకట్టు - నేటి అర్థం - ఆకర్షించు
              అసలు అర్థం - అడ్డగించు
అవాంతరము - నేటి అర్థం - అనుకోని సంఘటన
                         అసలు అర్థం - లోపలి భాగం
సొద - నేటి అర్థం - గోల, అల్లరి
           అసలు అర్థం - శవమును కాల్చటానికి పేర్చిన కట్టెల ప్రోవు
బ్రహ్మరథం - నేటి అర్థం - గొప్పగా ఆదరించు
                      అసలు అర్థం - మృతి చెందిన సన్యాసులను తీసుకుపోవు వాహనము.
చీర - నేటి అర్థం - స్త్రీలు ధరించే వస్త్రం
          అసలు అర్థం - వస్త్రం

Sunday, June 26, 2016

నారాయణ ప్రణయినీ నయనాంబువాహ:


నారాయణ ప్రణయినీ నయనాంబువాహ:


సాహితీమిత్రులారా!

శంకరాచార్యులవారి "కనకధారా స్తవం" నినే ఉంటారు.
అందులోని ఓ ముఖ్య శ్లోకం చూడండి.

దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబు ధారామ్ 
అస్మి న్నకించన విహంగ శిశౌ విషణ్ణే 
దుష్కర్మ ఘర్మ మపనీయ చీరాయదూరం
నారాయణ ప్రణయినీ నవాంబువాహ:
                                      ( కనకధారా స్తవం-8)
"ఓ పరమేశ్వరుడా "ధనం" అనే మేఘాల సమూహానికి -
 నీ "దయ" అనే  వాయువుని వీచవలసినంత అనుకూలతతో వీచి -
 "లక్ష్మీకటాక్షం" అనే వర్షాన్ని కురిపించి -
"పేదతనం" అనే వేసవి ఎండకి తట్టుకోలేక అవస్థపడుతున్న
ఈ "స్త్రీ" - అనే పక్షిపిల్లని రక్షించి - పుణ్యం కట్టుకోవయ్యా!" అని దీని అర్థం.

అంతే
ఆమె ఇంటినిండా
బంగారు ఉసిరిక కాయల
వర్షం కురిసింది.

హృదయం ముష్టిభి రేవ తాడ్యతే


హృదయం ముష్టిభి రేవ తాడ్యతే


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి.

మధు తిష్ఠత వాచి యోషితాం
హృది హాలాహలమేవ కేవలమ్
అత ఏవ నిపీయ తే2ధరో
హృదయం ముష్టిభి రేవ తాడ్యతే
                               (భర్తృహరి సుభాషితములు -2-60)
తేనె ధారలు కారేలా మాట్లాడటం స్త్రీల స్వభావం.
కావున ఆ తీపి పెదాలను పీల్చడానికీ పురుషులు
ఉబలాటపడతారు. అవి పైపై మధురపు పలుకులని తెలిశాక,
హృదయంలో హాలాహలం ఉందని బైటపడ్డాక కసి కొద్దీ
వారి స్తనాలను మర్దిస్తారు.
అధర చుంబనం - స్తనపీడనం రతిలో స్వాభావిక అంశాలు.

ఈ శ్లోకంలో ఒకదాన్నొకటి సమర్ధిస్తున్నట్లుగా చెప్పడం కవి చాతుర్యం.
తీయగా మాట్లాడే స్త్రీలను మొదట తెలీక నమ్మినప్పటికి వారిలో విషముందని
గ్రహించాక నిక్కిన చన్నులను చేత్తో అణచటం - పిడికిళ్ళతో గ్రుద్దడం కాముకులు
వెనువెంటనే ఆచరించే కృత్యాలు.
ఇది ఆ స్త్రీల పట్ల ఆచరించతగినదే
ఇక్కడ వేశ్యలని ప్రత్యేకంగా
వర్ణించినప్పటికి
ఈ స్వభావం అధికం అనేది సర్వసమ్మతం.

ఇదే పద్యరూపంలో
కలదు కదా సుధారసము కంజదళాక్షులముద్దుఁబల్కులన్
వెలయుఁగదా హాలాహలము వీరలచిత్తమునందుఁ గావునన్
బలుమఱుఁ బల్లవాధరముఁ బానమొనర్తురు నిండు వేడుకన్
బలియుతఱొమ్ము ముష్టితలపాతములం బ్రహరింతు రెంతయున్
                                                                        (ఏనుగు లక్ష్మణకవి)

Saturday, June 25, 2016

తాళికట్టిన మగడుకావడమే పెద్దలోపము


తాళికట్టిన మగడుకావడమే పెద్దలోపము


సాహితీమిత్రులారా!

ఒక అభిసారికను ఆమె చెలికత్తె
"నీకు అందమైన భర్త - సమర్థుడు ఉండగా వ్యభిచారమేల?" -
అని ప్రశ్నించిందట.
దానికి ఆమె సమాధానం చూడండి.

ఆకారే శశీ, గిరా పరభృత:, పారావతశ్చుంబనే
హంసశ్చంక్రమణే సమం దయితయా, రత్యాం ప్రమత్తో గజ:
ఇత్థం భర్తరిమే సమస్త యువతి శ్లాఘ్యై: గుణై: శోభతే
శూన్యం నాస్తి వివాహిత: పతిరివ స్యాన్నైక దోషోయది!

నా భర్త ఆకారంలో చంద్రుడు, మాటలలో కోకిల,
ముద్దుమాటలలో పావురము, నన్ను కొంగుపట్టుకొని
తిరగడంలో రాజహంస, రతిలో మత్తగజమే నా భర్తలో
యువతులు మెచ్చుకొనే గుణాలన్నీ ఉన్నాయి.
తాళికట్టినమగడగుటే పెద్దలోపము ఆ ఒక్క లోపం
వల్లనే పరపురుషులను
అభిసరిస్తున్నాను.
- అని చెప్పిందట.

తల్లిదండ్రులకుఁ బన్నుగఁ గూర్చు గజాస్యు నెన్నెదన్తల్లిదండ్రులకుఁ బన్నుగఁ గూర్చు గజాస్యు నెన్నెదన్

సాహితీమిత్రులారా!

అప్పకవీయంలోని ఈ విఘ్నేశ్వర స్తుతి చూడండి.

తనయుని యొక్క యెత్తుననె దక్షజయు న్నిటలాక్షుఁడున్ముదం
బున నిరిచెక్కులుం గదిసి ముద్దు గొనంగ నొకింత నెమ్మొగం
బనువుగ వెన్కకుం దిగిచి యత్నవిహీనపరస్పరాస్యచుం
బనలు దల్లిదండ్రులకుఁ బన్నుగఁ గూర్చు గజాస్యు నెన్నెదన్
                                                                                   (1-22)

ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు
తమ కుమారుడైన గణపతిని
వారిద్దరిమధ్య కూర్చోబెట్టుకొని
ఇద్దరూ ఒకేమారు అతనిని ముద్దు
పెట్టుకోవాలనుకున్నారు.
తీరా వారట్లు ముద్దు పెట్టుకొనె సమయంలో
గణపతి తనముఖం క్రిందికి దించుకున్నాడు.
దానితో అనుకోకుండా పార్వతీ పరమేశ్వరులిద్దరూ,
ఏ ప్రయత్నం లేకుండానే, ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు.
ఆవిధంగా తల్లిదండ్రులను కూర్చిన గజాస్యుని
నేను ప్రార్థిస్తున్నాను
అంటున్నాడు
అప్పకవి.
ఈ పద్యం
ఎంత చమత్కారపూరితం!
ఎలాంటి ఊహ!
ఎంత నవీనం ఈ కల్పన.
మహాద్భుతం కదా!

Friday, June 24, 2016

నీ యందమృతము గలదు పకోడీ


నీ యందమృతము గలదు పకోడీ


సాహితీమిత్రులారా!

ఒకనాటి సాయంకాలం నాటకసమాజంలో
అందరూ కలిసి పకోడీలు
తింటూ ఉండగా చిలకమర్తి వారితో
టంగుటూరు ప్రకాశంపంతులుగారు
 "మీరు పకోడీమీద పద్యాలు చెప్పండి
పద్యానికి ఒక పకోడీ ఇస్తాను" అన్నాడట.
"కవులకు అక్షరలక్షలు ఇచ్చే కాలం గతించింది.
పద్యానికి పకోడీ ఇచ్చే దుర్దినాలొచ్చినై" అని,
వెంటనే
ఈ క్రింది పద్యాలు చెప్పారట
చిలకమర్తివారు.

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటేగాని లేదట
కనుగొన నీ యందమృతము గలదు పకోడీ!

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యీ ఘుమ ఘుమ యా పొంకము లా
రాలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధన తండున్
కోడి వలదా బదులు ప
కోడిం దినుఁడనుచుఁ జెప్పకూర్మి పకోడీ!

Thursday, June 23, 2016

కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి ........


కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి ........


సాహితీమిత్రులారా!

ఇదొక అరుదైన వింత గణపతి ప్రార్థన చూడండి.

అరుదుగ వామభాగలలనాకలనాచలనాత్ముఁడైన యా 
హరుగురుఁగాంచి తానును దదాకృతియౌగతి నేకదంతుఁడై
కరికరణీగుణంబులు మొగంబునఁ దాల్చి జగంబు లేలు నాం
తరకరుణాననాథు గణనాథు మరిద్గణనాథుఁ గొల్చెదన్
                                                            (కావ్యాలంకారసంగ్రహము -1-6)

తన తండ్రి అయిన ఈశ్వరుడు అర్థనారీశ్వరుడు
అంటే సగం పురుషభాగము సగం స్త్రీ భాగము కలవాడు.
అలాగే నేను కూడ  అర్థనారీశ్వరుడని ఈ రూపం ధరించాడట గణపతి.
అంటే గణపతి స్వరూపంలో ఒక భాగంలో దంతం ఉంటుంది
మరో భాగంలో దంతం ఉండదు అందుకే ఆయన్ను ఏకదంతుడంటారు.
ఏనుగుల విషయానికొస్తే దంతాలున్నది మగ ఏనుగు దాన్ని కరి అంటారు.
దంతాలు లేని దాన్ని కరణి(ఆడ ఏనుగు) అంటారు.
అందు వల్ల గణపతి ముఖంలో ధంతం ఉండేభాగం పురుషభాగం
అలాగే దంతంలేని భాగం స్త్రీభాగం.
కావున గణపతి కూడ అర్థనారీశ్వర తత్వం కలవాడే.
కావున తన తండ్రి ఈశ్వరునితో సమానుడు.
అటువంటి గణనాథుని నేను కొలుస్తానంటున్నాడు
మన కావ్యాలంకారసంగ్రహము(నరసభూపాలీయము)లో
భట్టుమూర్తి(రామరాజభూషణుడు)
.
ఈ భావన ఈయనకు ఎలావచ్చిందంటే ఈయనకు 8 శతాబ్దాల
ముందు ఉన్న మహాపండితుడు శివభక్తుడు అయిన
హలాయుధుడు అనే ఆయన కూర్చిన హలాయుధస్తవములో
ఇలాంటి భావన ఉన్న శ్లోకం ఉందట.
ఆ శ్లోకం

విఘ్నం నిఘ్నన్ ద్విరదవదన:  ప్రీతయేవో2స్తు నిత్యం
వామేకుంఠత్ ప్రకటిత బృహదక్షిణేస్థూల దంత:
య: శ్రీకంఠం పితరమునుయాశ్లిష్ట వామార్థదేహం
దృష్ట్వానూనం స్వయమపి దధావర్థనారీశ్వరత్వం

ఈ విషయం "గణపతి-తెలుగు సాహిత్యం" అనే వ్యాసంలో
నిడుదవోలు వెంకట్రావుగారు
భారతి మాసపత్రికలో వివరించారు.

దష్టం బిమ్బధియాధరాగ్ర మరుణం


దష్టం బిమ్బధియాధరాగ్ర మరుణం


సాహితీమిత్రులారా!

పుష్పబాణవిలాసం లోని ఈ శ్లోకం చూడండి.
ఒక నాయిక చెలికత్తెలతోటి పూవులు కోయుటకు వెళ్ళగా,
అక్కడ ఒక కుంటెనకత్తె ఈ నాయికను పూచిన తీగలను పూవులను
వెదకే నెపంతో ఒక రహస్యప్రదేశానికి తీసుకెళ్ళి జారునితో కూర్చి
తాను బయట కాపలాగా ఉన్నది.
అనుకోకుండా అక్కడికి నాయిక ఆడబిడ్డ రావడం గమనించి
ఆమెకు అర్థంకాకుండా నాయికకు
ఈ విధంగా సంకేతం ఇస్తున్నది.

దష్టం బిమ్బధియాధరాగ్ర మరుణం, పర్యాకులో ధావనా
ధ్ధమ్మిల్ల, స్తిలకం శ్రమామ్బుగళితం, ఛిన్నా తను: కణ్టకై:
ఆ: కర్ణజ్వరకారిఙ్కణఝణత్కారం కరౌధూన్వతీ 
కింభ్రామ్యస్యటవీశుకాయ? కుసుమాన్యేషా ననాన్దాగ్రహీత్

ఎర్రనైన మోవి అంచు దొండపండనే భ్రాంతితో కొరికి ఆ చిలుక పారిపోయింది.
దాన్ని పట్టుకోవాలని పరుగెత్తగా కొప్పు వూడిపోయింది,
చెమటతో తిలకం జారిపోయింది. ముండ్లన్నీ కుచ్చుకొన్నాయి.
అయ్యో! వెర్రిదానా! చెవులు తూట్లు పడేట్లునీగాజులు శబ్దం చేస్తున్నాయి.
ఆ అడవి చిలుకను పట్టుకోవడానికి ఎందుకు? అట్లా అల్లాడుతున్నావు.
ఇక్కడ నీ ఆడుబిడ్డ పూవులన్నీ కోసుకున్నదిచూడు.
- అని భావం.   

Wednesday, June 22, 2016

తెల్లవారను గడుసరి గొల్లవారు


తెల్లవారను గడుసరి గొల్లవారుసాహితీమిత్రులారా!


అది భారతస్వాతంత్య్రసంగ్రామం జరుగుతున్నరోజులు.
అతివాదయుగమని చరిత్రకారులు చెప్పుకొనే రోజులు.
ఆ ఉద్యమంలో లాల్(లాలాలజపతిరాయ్), బాల్(బాలగంగాధర తిలక్),
పాల్ (బిపిన్ చంద్రపాల్), ఘోష్ (అరవిందఘోష్) ల ప్రభావంతో
ఉద్యమం జరుగచున్నరోజులు.
1907 సంవత్సరంలో  రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఆంగ్లోపన్యాసానికి
తెలుగు అనువాదం చేయటానికి చిలకమర్తి లక్ష్మీనరసిహంగారు పూనుకొన్నారు.
సభ పూర్తిఅయి ముగిసే సమయంలో చిలకమర్తివారు ఈ పద్యం చెప్పారు.

భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు మూతులు బిగియగట్టి

ఈ పద్యం కష్టమైన పదాలు లేకుండా సరళంగా ఉండటంమూలాన
నాటి దేశదుస్థితిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నందున
ప్రేక్షకులను ఏంతగానో ఆకట్టుకుంది.
మిన్నుమార్మోగేలా కరతాళ ధ్వనులు చెలరేగాయి.
సభకాగానే ఎందరో దగ్గరకు వచ్చి
ఆ పద్యాన్ని మళ్ళీమళ్ళీ చదివించుకొని కంఠస్థం చేశారు.
ఆ నాటి పత్రికలన్నీ ఈ పద్యాన్ని ప్రచురించాయి.
ఊళ్ళోగోడల మీది కెక్కింది ఈ పద్యం. అయితే
నాటిప్రభత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని
పోలీసువారు చర్యకు పూనుకొన్నారు.
ఆ సమయంలో భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు
తెల్లవారను - అంటే తెల్లవారఁగా అని అర్థం చెప్పి
ప్రభుత్వాన్ని శాంతింపచేశారు.
చూడండి
ఈ పద్యం ఎంత ప్రభంజనం సృష్టించిందో!
నేటికీ మరువని పద్యమైందికదా!

లలిత లావణ్య విలాసినీ వక్షోజ.....


లలిత లావణ్య విలాసినీ వక్షోజ.....


సాహితీమిత్రులారా!


కూచిమంచి నరసింహంగారు కవిత్వం ఎంత తృప్తినిస్తుందో
ఈ పద్యంలో వివరించారు చూడండి.

మాణిక్య మకుటంబు మౌళిపైఁ దులకింప
          రాజ్యంబు నేలెడు రాజు కంటె
లలిత లావణ్య విలాసినీ వక్షోజ
          పరిరంభ సౌఖ్యానుభవునికంటె
సతతంబు నానంద సౌరాబ్దిలోఁదోఁగు
          భర్మహర్మ్యస్థ సంపన్నుకంటె
ధన వయో రూప సంతానాది భాగ్యాళిఁ
          దనియ సంతుష్టుఁడౌ ధన్యునికంటె
మధురమృదువాక్య సంపద మనసు గరఁచు
కవిత యబ్బిన కవియె యెక్కువ యటంచు
నెంచెదరుగానఁదత్సుఖ మెంత సుఖమొ
స్వానుభవమునఁ గనుగొనఁబూన వలదె!


మాణిక్యకిరీటధారుడైన రాజ్యాన్నేలే రాజు కంటె,
లలితలావణ్యవిలాసవతి కౌగిటిలో సుఖాన్నునుభవించే వానికంటె,
ఎల్లప్పుడు గొప్ప గొప్ప భవంతులలో ఆనందం సంద్రంలే ఓలలాడే సంన్నుని కంటె,
ధనంతో వయసుతో రూపంతో సంతానంతో అన్ని భాగ్యాలను తృప్తిగా అనుభవించే ధన్యునికంటె
మృదుమధురమైన మాటలతో కవిత్వం అబ్బిన కవి ఎక్కువ అని ఎంచి ఆ సుఖమెంతో
స్వానుభవంతోనె తెలుసుకోవాలిగాని అది చెప్పడం ఎలా?
- అని భావం.

Monday, June 20, 2016

విద్వద్రాజ శిఖామణే........


విద్వద్రాజ శిఖామణే........సాహితీమిత్రులారా!

ఒక రాజు  కీర్తిని కవి
ఎంత చమత్కారంగా వర్ణించాడో
ఈ శ్లోకం చూడండి.

విద్వద్రాజ శిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశ:
కైలాసంచ నిరీక్ష్య తత్రలఘుతాం, నిక్షిప్తవాన్ పూర్తయే
ఉక్షాణం, తదుపర్యుమా సహచరం తన్మూర్ధ్నిగంగాజలమ్
తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరిస్ఫారం సుధా దీధితిమ్

ఓరాజా! నీ కీర్తిని తూచాలని బ్రహ్మ అనుకొన్నాడు.
తక్కెడ ఒక సిబ్బెలో కీర్తిని ఉంచి వేరొక సిబ్బెలో వెండి కొండను పెట్టాడు.
చాల్లేదు.
ఆపై నందీశ్వరుని -
(అదీ చాలక) ఆ పై శివుని -
ఆపై గంగాజలమును -
ఆపై వాసుకిని -
ఆపై చంద్రకళను పెట్టి
తూచలేక విఫలుడైనాడు -
అని భావం

నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును
నిన్నును నిన్ను నిన్నునున్


సాహితీమిత్రులారా!

పూర్వం నెల్లూరు మండలంలో ఉన్న తెట్టు గ్రామ నివాసి మోచర్ల వెంకన.
వెంకటగిరి సంస్థానంలో యాచభూపతి ఇచ్చిన అనేక సమస్యలకు
పూరణ చేసిన గొప్ప ఆశుకవితా ధురీణుడు. ఆ రాజుగారు ఇచ్చిన
సమస్యలలో ఈ సమస్య ఒకటి-
"నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్"
దీన్ని రామాయణ, భాగవత, భారతార్థాలలో పూరించమన్నాడు రాజుగారు.
వెంకన్నగారు ఈ విధంగా పూరించారు.

రామాయణార్థం వచ్చేలా పూరణ  -

అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాయుపుత్ర! యో
పనస సుషేణ! నీల! నల! భానుకులుండగు రాఘవేంద్రుఁడ
ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁజంపగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

కిష్కింధలో  ఉన్న వానర ప్రముఖులను పేరు పేరున రామచంద్రుడు
రాక్షసులతో వెంటనే యుద్ధం చేసి వారిని సంహరిచడానికి
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
రమ్మన్నాడని భావం వచ్చే విధంగా పూరించాడు.

భాగవతార్థం వచ్చేలా పూరణ -

అనఘ సురేశ! వాయుసఖ! అర్యమనందన! రాక్షసేంద్ర! యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర
మ్మను మని చెప్పె మాధవుఁడుమారుని పెండ్లికి మిమ్ము నందరన్
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ప్రద్యుమ్నుని పెండ్లికి ఇంద్రుని, అగ్నిని మొదలైన దేవతల నందరిని పేరుపేరున
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్
రమ్మన్నాడు కృష్ణుడు అనే భావం వచ్చేలా పూరించాడు.

భారతార్థం వచ్చేలా పూరణ -

అనఘ సురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం
దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర
మ్మనె రాజసూయము యమాత్మజుఁడిప్పుడుచేయఁబూని తా
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్

ధర్మరాజు రాజసూయానికి భీష్ముని, కర్ణుని, ధృతరాష్ట్రుని, అశ్వత్థామ, ద్రోణ,
కృపాచార్య మొదలైన వారినందరిని ధర్మరాజు రాజసూయానికి పేరుపేరున
నిను నిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్ అని
అందరిని పిలువమని చెప్పినట్లు భావం వచ్చేలా పూరించాడు.

దీన్ని బట్టి మోచర్ల వెంకనకవికి ఎంతటి సమయస్పూర్తో! ఎంతటి ఆశుధారయో!

Sunday, June 19, 2016

కవిత్వంలో అలంకారం


కవిత్వంలో అలంకారం


సాహితీమిత్రులారా!

కవిత్వంలో అలంకార ప్రాధాన్యాన్ని తెలిపే కథలు అనేకం ఉన్నాయి.
వాటిలో భోజ- కాళిదాసు కథలో కూడ ఉంది.
ఈ కథలోని  శ్లోకం చూడండి.


పండితులు - భోజనం దేహి రాజేంద్ర ఘృతంసూప సమన్వితమ్
కాళిదాసు -  మాహిషంచ శరచ్చంద్ర చంద్రికాధవళం ధధి


పండితులు చెప్పిన పాదం అర్థం -
ఓ రాజా మాకు పప్పు, నేతితో కూడిన భోజనం పెట్టు -
ఇందులో కవిత్వంలేదు సాధారణమైన మాటలే తప్పమరేముంది.
మరి కాళిదాసు చెప్పిన పాదం అర్థం -
శరత్కాలపు చంద్రుని వెన్నెలవంటి తెల్లటిగేదె పెరుగుతో భోజనం పెట్టు -
ఇందులో అలంకార పూరితమైన కవిత్వం ఉందికదా!
అందుకే రాజు ఈ పాదాలకుగాను పండితులకు  ధనంమాత్రమే ఇచ్చాడు.

శంభూ! ప్రేతభూతప్రభూ!


శంభూ!  ప్రేతభూతప్రభూ!


సాహితీమిత్రులారా!


ఈ పద్యాలు
మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి గారి
శృంగారచాటువులు లోనివి చూడండి.

ఒకతే చాలుగదయ్య యేలుకొన నీహోదాకటయ్య యొక
ర్తుక నొంటన్ మరియొక్కతెన్ శిరసునందుం గట్టుకొన్నావు చా
లక, పైగామెడనిండఁబాము లొడలెల్లన్ బూదియుంగూడ నీ 
మొకమున్  మామొకమేమి రూపమిది శంభూ!  ప్రేతభూతప్రభూ!


కొంచెమ్ముగ  నందముండినదొ లేదో దారుకస్త్రీల మ
చ్చిక లేకుండనె వెంబడింతు వెదొ పిచ్చింజేసి యాఁనాడు నీ
విఁక ఆలాశివమెత్తుటీశునకు నీకేయంతయుండంగ నిం
చుక మాకుండుట యెట్లు దోసమనిపించున్ నీకు శంభయ్యకున్!


అది నీకర్మము మూడుకాళ్ళ ముసలయ్యల్ ముండమోపుల్ మొదల్
పెదపెద్దల్ వఱకెల్లవారలకు కాఫీలోకమై పోవ నే
మిది యా చాచినచేయి చాచినటుగానే యుంచుకొన్నాఁవిఁకన్ 
బ్రదుకత్యంతము చేదుమేయు కొఱకేనా నీకు శంభయ్యకున్!

సరి చేదే వలెనన్న నచ్చము డికాక్షన్ గాని నీకట్టు ల
క్కఱలే కించుక చేదుచేదుగ ననన్ కాఫీనొకింతేని శ
ర్కర లేకుండనె యిచ్చు అయ్య రరకప్ కప్ కాఫీ యాముండ మో
సిరి చేఁజాచుట కింతతో నయిన స్వస్తింజెప్పి వేంచేసినన్

Saturday, June 18, 2016

ప్రతి పర్వ రసోదయమ్ప్రతి పర్వ రసోదయమ్


సాహితీమిత్రులారా!

                             ఈ శ్లోకం చూడండి.

భారతంఇక్షుఖండంసముద్రమపి వర్ణయ
పాదే నైకేన వక్ష్యామి "ప్రతి పర్వ రసోదయమ్"


ఈ కవిని ఏవరో ఒక మహానుభావుడు
"భారతము - చెఱకుగడ - సముద్రము" ఈ మూడింటిని
ఒకశ్లోకంలో చెప్పమన్నారట.
ఆయన చెప్పాడు ఒక శ్లోకంలో కాదు
ఒక పాదంలో చెబుతాను
నీకేమైనా అభ్యంతరమా!  అని అన్నాడట.
ఆ పాదం
ప్రతి పర్వ రసోదయమ్ -
ప్రతి పర్వ రసోదయమ్  =  భారతంలో ప్రతి పర్వం నందు
                                       రసము చిప్పిలుచుండును.
 ప్రతి పర్వ రసోదయమ్ = చెఱకుగడలో ప్రతి కణుపు
                                     నందును రసముండును.
 ప్రతి పర్వ రసోదయమ్ = సముద్రము ప్రతి
                                      పర్వదినను పొంగును.
                                                             - అని భావం.

మీనాహతం పద్మమివాభితామ్రమ్


మీనాహతం పద్మమివాభితామ్రమ్


సాహితీమిత్రులారా!

రామాయణం సుందరకాండలో
హనుమంతులవారు అశోకవనం ప్రవేశించాడు.
అప్పుడు సీతాదేవికి శుభసూచకంగా
ఎడమకన్ను అదిరింది.
అది ఎలా అదిరిందో
వాల్మీకి మాటల్లోనే వినాలి
ఆ శ్లోకం చూడండి.


తస్యాశ్శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణ విశాల శుక్లమ్
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా:
మీనాహతం పద్మమివాభితామ్రమ్

మంచి కేశపాశములు గలిగిన సీతాదేవికి ఎడమకన్ను అదిరింది.
ఆ ఎడమకన్ను ఎలా ఉందంటే శుభకరమైనదిగా ఉంది.
వంకరతిరిగిన కనురెప్పల వెండ్రుకల పంక్తితో చుట్టబడి ఉంది.
నల్లగ్రుడ్డు చుట్టూ తెల్లని విశాలప్రదేశం కలిగి ఉంది.
అటువంటి ఎడమకన్ను - సరస్సులోని నీళ్ళలో
(తామర)తూడుమీద చేపదెబ్బతిన్న
ఎఱ్ఱతామరపువ్వులా అదిరింది.

Friday, June 17, 2016

ఇలాంటి మరుదులున్నారా?


ఇలాంటి మరుదులున్నారా?


సాహితీమిత్రులారా!

పూర్వం ఎలాంటి మరుదలుండేవారో
ఈ శ్లోకం చూడండి.


నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే!
నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్!
                                                    (వాల్మీకి రామాయణము)

సీతను అన్వేషిస్తూ వెళ్ళే రామలక్ష్మణులకు సుగ్రీవుని దగ్గర నగలమూట దొరికింది.
అవి సీతవేనేమో? చూడమని సుగ్రీవుడు చూపించాడు.
నగలు చూడగానే కళ్ళనీళ్ళు క్రమ్ముచున్న రాముడు,
లక్ష్మణా!
ఆ నగలు సీతవేనేమో? చూడు అన్నాడు.
దండలు కడియాలు
కర్ణాభరణాలు సీతవగునో?  కాదో?
నాకు తెలియదు
అందెలు(కాళ్ళగొలుసులు) మాత్రం సీతవని నాకు బాగా తెలుసును.
నిత్యము పాదాభివందనం చేసేవాడిని కావడంవల్ల
అవి సుపరిచితాలు అన్నాడు.
వదినగారియందు లక్ష్మణునికి ఉన్న పవిత్రభావం
దీన్ని బట్టి వ్యక్తమౌతుంది.
మరి
ఇప్పుడు ఇలాంటి మరుదులు ఉన్నారా?

కమలభవనో హంస మధునా


కమలభవనో హంస మధునా


సాహితీమిత్రులారా!

ఒక కవి తమ రాజుయొక్క కీర్తి ఏవిధంగా ఉందో
చమత్కారగా ఈ శ్లోకం చెప్పాడు చూడండి.

మహారాజ శ్రీమాన్ జగతి యశసా తే ధవళితే
పయ: పారావారం పరమపురుషోయం మృగయతే
కపర్ధీ కైలాసం కరివరభౌమం కులిశభృత్
కళానాథం రాహు: కమలభవనో హంస మధునా

ఓ మహారాజా! నీ కీర్తి ప్రపంచమంతటను వ్యాపించింది.
అన్నీ తెల్లగానే కనబడుతున్నాయి.
విష్ణువుకు ఏది పాలసముద్రమో? తెలియటంలేదు.
శివుడు తన వెండి కొండ ఏదో? తెలియటంలేదు.
ఇంద్రునికి ఐరావతం ఏదో? తెలియడంలేదు.
రాహువు చంద్రుని మ్రింగటానికి అసలు చంద్రుని కనుక్కోలేకపోతున్నాడు.
బ్రహ్మదేవుడు తన వాహనమైన హంసను గుర్తు పట్టలేకపోతున్నాడు.
 - అని భావం.
(అంతగా మహారాజుగారి కీర్తి వ్యాపించిందట)

Thursday, June 16, 2016

లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?


లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?


సాహితీమిత్రులారా!

మద్దుపల్లి వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు
వేంకటేశ్వరునిపై చేసిన నిందాస్తుతి పద్యం చూడండి.

కడు నాపత్తున నుండి కావుమని మ్రొక్రన్ నిల్వుదోపించు - పే
ర్వడగా కొండలపాలుసేయు - దరిచేరన్ బోడికొట్టించుచుం
డెడుగా - తిర్పతి వేంకటేశ్వరుడు! కానీ యింత గావించినన్
చెడువాడందురె లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?

ఆపదలో నిలువుదోపిడి - కొండను కాలినడక - బోడి కొట్టించుకొనుట-
ఇవి మ్రొక్కులు ఈ పనులు వేంకటేశ్వరుని చేష్టలుగా చెప్పి -
డబ్బున్నవాడు చేసిన చెడ్డపనులనుగూడ గొప్పగా చెప్పుకొంటారు.
ధనవంతుని తప్పులు కనిపించవులే -
అని
శాస్త్రిగారు నిందాపూర్వక స్తుతి చేస్తున్నారు.

ఏనాం అర్ణవ మధ్య సుప్త మురజిన్నాభీ సరోజాసనం


ఏనాం అర్ణవ మధ్య సుప్త మురజిన్నాభీ సరోజాసనం


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకం చూడండి

హే గోదావరి దేవి! తావక తటోద్దేశే కళింగ: కవి:
వాగ్దేవీం బహుదేశ దర్శన సఖీం త్యక్త్వా విరక్తిం గత:
ఏనాం అర్ణవ మధ్య సుప్త మురజిన్నాభీ సరోజాసనం
బ్రహ్మాణం గమయ క్షితౌ కథమసా వేకాకినీ స్థాస్యతి?

ఓ గోదావరీదేవీ అనేకదేశములు సంచరించుటలో నాకు సహాయమైన కవితా సరస్వతిని నీలో విడచి ఈ కళింగ కవి విరక్తి చెందినాడు. ఈ సరస్వతిని సముద్ర మధ్యమున యోగనిద్రలో ఉన్న మురారి నాభికమలములోని బ్రహ్మకు అప్పగించుము. పాపము ఈమె ఒంటరిగా ఎట్లుండగలదు- అని భావం
అంటే నేను బ్రహ్మదేవుడు తప్ప ఇతరులు సరస్వతీ పోషకులు కారు అనే సాత్విక అహంకార ధ్వని.

Wednesday, June 15, 2016

సద్యో మదమొదవి పూర్వ సరసతలుడుగున్


సద్యో మదమొదవి పూర్వ సరసతలుడుగున్


సాహితీమిత్రులారా!

ఈ పద్యం గమనించండి.

ఉద్యోగ మొదవినప్పుడు
సద్యోమదమొదవి పూర్వ సరసతలుడుగున్
విద్యావంతులకైనను
విద్యావిహీనులకు వేరె వివరం బోలా?

ఎంతో కష్టపడి, ఎన్నోవిద్యలు నేర్చి, ఎంతో చదివి, అతిప్రయత్నంతో
 ఏదో ఒక పదవి రాగానే, విద్యావంతులైన వారిలోకూడా
పూర్వమున్న సరసత, మంచితనం మటుమాయమై పోయి,
వెంటనే, ఏంతో గర్వం(సద్య: + మదం) కలుగుతూ ఉంటే,
ఇక విద్యావిహీనులు సామాన్యమైన వారి సంగతి వేరేగా చెప్పవలెనా?
 - అని భావం.

శ్రీకరంబగు నాకమలాకరంబు


శ్రీకరంబగు నాకమలాకరంబు


సాహితీమిత్రులారా!
ఒక సరస్సును నన్నెచోడు కుమారసంభవములో
స్త్రీవలె వర్ణించిన తీరు
ఈపద్యంలో ఎంత రమ్యంగా వర్ణించాడో
పరికించండి.

లోలాంబుజాలముల్ నీలాలకములుగా
           బాలమృణాలముల్ కేలు గాఁగ
దళితాంబుజాతంబు దెలిమోముగా నుత్ప
           లములు విశాలనేత్రములు గాఁగ
జక్కవకవ నిండుచనుఁగవగాఁ బులి
          నస్థల మురుజఘనంబు గాఁగ
మొలచు లేఁదరఁగలు ముత్తరంగలు గాఁగ
           శోభిల్లుసుడి నిమ్ననాభి గాఁగ
నబ్జవనలక్ష్మి శంభువీర్యమునఁ గొడుకుఁ
బడసి దివిజుల కీఁబూని పావకునకు
నొలసి తనరూపుచూపున ట్లొప్పు దోఁచె
శ్రీకరంబగు నా కమలాకరంబు
                                                    (10-29)


ఈ పద్యం శివుని వీర్యాన్ని శరవణమను సరస్సులో,
బ్రహ్మ ఆదేశానుసారం అగ్నిదేవుడు వదలడానికి
వెళ్ళే సమయంలో సరస్సును వర్ణించినది.

భావం-
శోభాకరమైన ఆ పద్మాకరము
చంచలములగు నీరుల సమూహములు నల్లని కురులుగను,
లేత తామరతూడులు చేతులుగను,
వికసించిన పద్మము నిర్మలమైన ముఖముగను,
కలువలు విశాలమైన నయనాలుగాను,
చక్రవాకద్వయము నిండు స్తనద్వయముగను,
ఇసుకతిన్నె గొప్ప కటిస్థలముగను,
అప్పుడే పుడుతున్న లేత అలలు పొట్టమీది ముడుతలు(త్రివళులు)గా,
 ప్రకాశించే సుడి లోతైన నాబిగా
తామరతోపు అనెడి లక్ష్మి
శివుని వీర్యంచే కొడుకును పొంది
దేవతలకు ఇచ్చేందుకు పూని
అగ్నికి సమీపించి తనరూపును
చూపుచున్నదా!
అన్నట్లు ఒప్పినది.

Tuesday, June 14, 2016

మధ్యమాగాత్ దిగంతాన్!


మధ్యమాగాత్ దిగంతాన్!


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి.

లజ్జా - కీర్తి: - జనకతమయా శైవకోదండ భంగే
తిస్ర: కన్యా నిరుపమతయా భేజిరే రామచంద్రం
అంత్యా పాణిగ్రహణ సమయే దాయసీ జాతరోషా
భూపై స్సార్థం ఖలు గతవతీ మధ్యమాగాత్ దిగంతాన్!

రాముడు శివధనుర్భంగం చేయగానే ముగ్గురు కన్యలు (లజ్జ - కీర్తి - సీత)
రాముని దగ్గరకు వచ్చిరి. రాముడు మూడవ ఆమె పాణీగ్రహణం చేయగానే
పెద్ద ఆమె(లజ్జ)కు కోపం వచ్చి రాజులతో వెళ్ళిపోయింది. మధ్య ఆమె(కీర్తి)
దిగంతాలకు వ్యాపించింది - అని భావం.

కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ


కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ


సాహితీమిత్రులారా!

1925 ప్రాంతంలో బెజవాడలో పిసుపాటి చిదంబరశాస్త్రిగారు
శతావధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు
ఎవరికీ దిక్కుతోచని సమస్యను ఇచ్చాడు.
దీనితో సదస్యులు దిగ్భ్రాంతి చెందారు.
సమస్య ఇది-
కాఖాగాఘాకిఙ కాటన్నాయాటాఙ

చిదంబరశాస్త్రిగారు చిరునవ్వుతో
వ్రాసుకోండి అన్నారు.
అర్థరహితమైన ఈ సమస్యను ఎలా పూరిస్తారా? అని అందరూ
ఆశ్చర్యంతో చూస్తున్నారు.
శాస్త్రిగారు ఇలా పూరించారు.

చాఛాజాఝాచి ఙ చంచన్నాయా ఛీఙ
తాథాదాధాతిఙ తాతన్నాయా థూఙ
పాఫాబాభాపిఙ పాపన్నాయా పీఙ

ఇది వినేసరికి  పృచ్ఛకుడు బిత్తరపోయాడు.
కాస్తలో తేరుకొని "పూరణకేమైనా అర్థముందా?" అని ప్రశ్నించాడు.
"మీ సమస్యకు అర్థం ఉంటే మా పూరణకు అర్థం ఉంటుంది"- అన్నారు శాస్త్రిగారు.

అప్పుడు సమస్యార్థాన్ని పృచ్ఛకుడు ఇలా వివరించాడు.
              కాటన్నాయడనే ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి చదువు అబ్బలేదు.
కానీ తాను గొప్పవాడినని పొగిడించుకోవాలని తపన. అలా పొగిడించుకొని
వారికి తృణమో పణమో ఇచ్చేవాడు. మిగతా వారికి పైసా కూడా విదిల్చేవాడు కాదు.
ఈ రహస్యం తెలుసుకొన్న ఒక చతుర పండితుడు అతని దగ్గరికి వెళ్ళి తాళం వేస్తూ
ఈ సమస్యను గానం చేసి గొప్ప సత్కారం పొందాడు.

అప్పుడు శాస్త్రిగారు "ఈ విశాల విశ్వంలో మీ కాటన్నాయని వంటివారు
చంచన్నాయుడు, తాతన్నాయుడు, పాపన్నాయుడు అనే లుబ్దాగ్రేసర
చక్రవర్తులు ఉన్నారు. మీ పండితుని కన్నా మా పండితులు అధిక
విద్యాప్రౌఢులు కనుకనే అన్యాపదేశంగా ఛీ, థూ - అని వారి మూర్ఖతను
నిందిస్తూనే పొగిడినట్టుల భాసింప చేసి గౌరవం పొందారు." అని వివరించేసరికి
సభ్యులంతా కరతాళ ధ్వనులతో పిసుపాటివారిని అభినందిచారు.

పృచ్ఛకుడు కూడా  తనదారంటే వచ్చిన శాస్త్రిగారి చాతుర్యానికి కాదనలేక
హృదయపూర్వకంగా సంతృప్తిని, సంతోషాన్నీ వ్యక్తపరిచాడట.Monday, June 13, 2016

అర్చకుని వాక్యము నిక్కముగా శిరోజముల్ విరివిగ జూపి


అర్చకుని వాక్యము నిక్కముగా శిరోజముల్ విరివిగ జూపి


సాహితీమిత్రులారా!

తాడేపల్లి పానకాలరాయ కవి రచించిన
"మనసా! హరిపాదము లాశ్రయింపుమా!" అని మనసా శతకం లోని పద్యం
ఒకదాన్ని తెలుసుకొని ఉన్నాము.
ఇపుడు చిత్తమా! అనే మకుటంతో వ్రాసిన
శతకంలోని పద్యం చూడండి.
అనేక గాథలను పొదిగి కూర్చిన శతకం ఇది.
ఈ పద్యంలోనూ ఒక గాథ ఇమిడి ఉంది చూడండి.


విరిసరు లీయ కైకొనుచు వింతనెరుక సరులందు గాంచి భూ
వరుడలుగన్ త దర్చకుని వాక్యము నిక్కముగా శిరోజముల్
విరివిగ జూపి ఆ బెడద వీడగ జేసెను మున్ను కాకుళాం
తరమున అట్టి శ్రీహరి పదమ్ములు కోరి భజించు చిత్తమా!


ఈ పద్యంలోని గాథ -
 శ్రీకాకుళాంధ్ర విష్ణువు దేవాలయ అర్చకుడు శృంగారి.
స్వామి పూజకోసం కోసిన పూలను అతని ప్రియురాలు
సిగలో తురుముకొన్నది. హడావిడిలో ఆ పూలను పూజకు
తీసుకు వెళ్ళాడు పూజారి.
దేవుని పూజించిన పూలమాలను ప్రసాదంగా రాజుకు పంపాడు పూజారి.
అందులో ఉన్న వెంట్రుకను చూసి రాజు మండిపడ్డాడు.
అర్చకుని పిలిపించి అడిగితే "స్వామి శిరోజమే" అన్నాడు.
"ఱంకు నేర్చినమ్మ బొంకునేర్వదా!" అన్నట్లు.
"రాతి విగ్రహానికి శిరోజాలెక్కడి" వన్నాడు ప్రభువు.
"నిరూపించకపోతే శిక్షిస్తా"నన్నాడు.
తన భక్తుడైన అర్చకుని కాపాడటానికి ఆంధ్రవిష్ణువు మరునాడు
రాజు వచ్చిన సమయానికి శిరోజాలను చూపించాడు.
రాజు దిగ్భ్రాంతుడై అర్చకుని భక్తిని మెచ్చుకొన్నాడు.
ఇది పద్యంలోని గాథ.
ఈ కవి ఈ రెండు శతకాలనేగాక పార్థసారథి, లక్ష్మీనృసింహ,
రుక్మిణీపతి శతకాలు కూడా రచించాడట.


కవిత్వం ఎలా ఉండాలి?


కవిత్వం ఎలా ఉండాలి?


సాహితీమిత్రులారా!

కవిత్వం ఎలా ఉండాలి? అనేది ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా
వారివారి అభిప్రాయాలను వెలిబుచ్చారు.
అందులో భాగంగా ఈ రోజు
మరో కవి అభిప్రాయం చూడండి.


కింకవే: తస్య కావ్యేన కిం కాండేన ధనుష్మత:
పరస్య హృదయే లగ్నం న ఘూర్ణయతి యచ్ఛిర:

ఇది త్రివిక్రమభట్టు రచిత నలచంపూ కావ్యంలోనిది.

ఇతని అభిప్రాయం మేరకు
కవిత్వం అంటే అది -
"వీరుడు విడిచిన బాణంలా ఉండాలి"
బాణంలాగే కవిత్వం కూడా ఎదుటివాడి గుండెల్లోకి లోతుగా నాటుకోవాలి.
ఆ దెబ్బతో వాడు తల ఊపాలి. బాణం దెబ్బకి హాహాకారాలు చేస్తూ తల ఊపి చావాలి!
కవిత్వం దెబ్బకి "ఆహా!  ఆహా!" అంటూ తల ఊపుతూ ఆనందంతో తన్మయుడైపోవాలి!
అలా కాకపోతే -
ఆ వీరుడు పట్టింది బాణమూకాదు
ఈ కవి వ్రాసింది కావ్యమూకాదు
 కవిత్వం శ్రోత హృదయంలో గాఢంగా నాటుకోవాలనీ,
అది అతన్ని ఆనందపరవశుణ్ణి చేయాలని తాత్పర్యం.


ఇదే శ్లోకానికి అనువాదప్రాయమైనది
మనకు తెలుగులో కనిపిస్తుంది  ఒక పద్యం
అది నన్నెచోడుని కుమారసంభవంలోనిది చూడండి.

ముదమున సత్కవి కావ్యము, 
నదరఁగ విలుకాని పట్టినమ్మును, బర హృ
ద్భిదమై తలయూపింపని
యది కావ్యమె మఱియుఁ బట్టినదియున్ శరమే?
                                                         (1-41)

Sunday, June 12, 2016

మూఢుండెరుగునె? సత్కవి గూఢోక్తుల సారమెల్ల?


మూఢుండెరుగునె?  సత్కవి గూఢోక్తుల సారమెల్ల?


సాహితీమిత్రులారా!

ఈ పద్యం పరికించండి కవి ఎంత సూటిగా నిక్కచ్చిగా చెప్పాడో

మూఢుండెరుగునె సత్కవి 
గూఢోక్తుల సారమెల్ల, కోవిదుని వలెన్!
గాఢాలింగన సౌఖ్యము
ప్రౌఢాంగన యెరుగుగాక, బాలేమెరుగున్?

ప్రౌఢకవి ప్రయోగించిన శబ్దశక్తుల, మాటలయొక్క అర్థామును,
అంతస్సారాన్ని, పండితుడు తెలుసుకున్నట్లుగా, మూర్ఖుడు,
అజ్ఞాని తెలుసుకోగలడా?
 ఏవిధంగా అంటే  -
గాఢంగా కౌగిలించుకుంటే దానిలోని సుఖాన్ని
ప్రౌఢాంగన (18 సంవత్సరాలు పైబడిన అమ్మాయి)
 అనుభవించగలదుకాని బాల్యావస్థలో ఉన్న
చిన్నపిల్లకేం తెలుస్తుంది?  - అంటాడు కవి.

కలుగక ఇచ్చెడు దాతలు తలవెండ్రుకలంతమంది


కలుగక ఇచ్చెడు దాతలు తలవెండ్రుకలంతమంది


సాహితీమిత్రులారా!

దాతలను గురించి ఒక కవి
ఈ పద్యం చెప్పాడు పరికించండి.

కలుగక ఇచ్చెడి దాతలు
తల వెండ్రుక లంతమంది తర్కింపంగా
కలిగియు ఈయని లోభులు 
కలరు బొమల వెండ్రుకలకు కడు తక్కువగా
(మొలవెండ్రుకలంత మంది మోహనరంగా)
                                        (చాటుపద్య మణిమంజరి)

దాతలలో రెండు రకాలు తేల్చాడు కవి.
ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేనివారు కారణం వారి దగ్గర
దాతృబుద్ధి అయితే ఉందిగాని ధనంలేదు
ఇలాంటివారు తలవెండ్రుకలంతమందట అంటే
చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీరు మొదటిరకంవారు.

ఇక రెండవ రకంవారు -
వీరికి ఆస్తి ఉంటుంది, పదవి ఉంటుంది,
పలుకుబడి ఉంటుంది, అన్నిరకాలా ధనంసమృద్ధిగా ఉంటుంది.
కాని వీరికి ఉండనిది దానం చెయ్యాలనే బుద్ధి వీరు ధర్మసంస్థలకుగాని,
కవి పండితులకుగాని ఇవ్వని లోభులు ఇలాంటివారు కనుబొమలకు
ఉన్న వెండ్రుకలంత మంది అంటే చాల తక్కువ మంది.
మొదట ఈకవి వీరిపై మండిపాటుతో
"మొలవెండ్రుకలంత మంది మోహనరంగా" అన్నాడట
కాలక్రమంలో ఇది పాఠాంతరంగా మార్చడట.

నే నెవరు? నే నెవరు? నే నెవరు?


నే నెవరు?  నే నెవరు?  నే నెవరు?


సాహితీమిత్రులారా!

బెల్లంకొండ రామదాసు(1923-1983)గారు వ్రాసిన కవిత చూడండి.

వెడుతాను మరి, సెలవు
విడిచి వెడుతున్నాను నా కండ్లు
వెలలేని కలల బరువెక్కి 
పండి రాలిన పండ్లు
వెదకి వేసారి విశ్రయించిన పుండ్లు
వెడతాను మరి, సెలవు
ఎన్నో దినాలు గడిపాను మీ మధ్య
ఎన్నో దినాలు నడిచాను ఈ రధ్య
వెడతాను మరి, సెలవు
ఎన్నో దీపాలు వెలిగించుకొని వచ్చాను 
ఎన్నో కలలు మోసుకొని వచ్చాను
ఎన్నో జలాలు నింపుకొని వచ్చాను.
ప్రవేశించాను
ఈ విచిత్ర భవనంలోకి
ఈ విశాల సదనంలోకి
పాట వలె
పరిమళం వలె
మాటరాని మౌనివలె
ఎన్నో ముఖాలు కనిపించినవి
ఎన్నో కండ్లు ఎక్కుపెట్టినవి నాపైన
ఎన్నో గుసగుసలు రుసరుసలు
ఎన్నో కంఠాలు ప్రశ్నించినవి
నీవెవరు?  నీవెవరు?  నీవెవరు?
నే నెవరు?  నే నెవరు?  నే నెవరు?

(నవకవితాపిత వ్యాసం సెప్టెంబరు-1995)

Saturday, June 11, 2016

జనస్వామ్య వీరుడికో సలహా


జనస్వామ్య వీరుడికో సలహా


సాహితీమిత్రులారా!
ఇది శ్రీశ్రీ  "ప్రాసక్రీడలు: లోనిది.

"ముష్టి మైథునంలో 
సవ్యసాచివిరా నా కొడకా
నాలుగు గోడల మధ్యా
రహస్యంగా ఏమిటాపని
నాలుగు వీధుల కూడలి వద్ద నిలబడి
నలుగురి మధ్యా
నిరూపించుకో నీ మగతనం
ప్రదర్శించు నీ వ్యక్తి స్వాతంత్ర్యం
ఆంధ్రుల జాతీయ పత్రికల 
సంపాదకీయాలకు
ఆదర్శప్రాయంగా...."

రచన- 12-9-1970
ముద్రణ - లాంగ్ మార్చ్ మాసపత్రిక
               విశాఖపట్టణం
               అక్టోబరు 1970

విధి చక్కగ జేసె సతీ తటాకమున్


విధి చక్కగ జేసె సతీ తటాకమున్


సాహితీమిత్రులారా!

ఒక రసజ్ఞ మిత్రుని రసరమ్యభావన -
ఏమిటంటే మన్మథుడు తన పూలబాణాలతో
కాముకుల్ని దహిస్తుంటే వారి దేహతాపాల్ని
చల్లార్చటానికి బ్రహ్మ స్త్రీ అనే సౌందర్య భరితమైన
సరోవరాన్ని సృష్టించాడు.
ఆ శ్లోకం చూద్దాం.

బాహు ద్వౌ చ మృణాళకాస్య కమలం లావణ్య లీలాజలం
శ్రోణీ తీర్థశిలా చ నేత్ర శఫరీ ధమ్మిల్ల శైవాలకమ్
కాంతాయా: స్తనచక్రవాక యుగలం కందర్పబాణానలై
ర్దగ్ధానా మవగాహనాయ విధినా రమ్యం సరోనిర్మితమ్
                                                           (శృంగారతిలకం -1)

అనువాద పద్యం
కరములు తమ్మితూడులు ముఖం బరవిందము సౌరు నీరముల్
పిరుదులు తీర్ధ హట్టములు వేణియె నాచు కనుల్ ఝషంబులున్
తరుణి యురోజ యుగ్మము రథాంగ యుగంబయి పూరుషాళికిన్ 
స్మరశరతామార్ప విధి చక్కగ జేసె సతీ తటాకమున్

(యువతుల బాహువులే తామర తూళ్ళు,
లక్ష్మీ కళ ఉట్టిపడే ఆమె ముఖమే కమల సంపద.
ఆమె యౌవన కాంతులు లీలా విలాసాలె అందులోని శీతల జలాలు,
అందమైన ఆమె కటి ప్రదేశమే స్నానఘట్టం,
చంచలమైన కనులే బేడిస చేపలు,
ముచ్చటగొలిపే ఆమె వాలు జడే శైవాలము(నాచు),
వటృవలైన స్తనాలే ప్రేమకు ప్రతిరూపాలై విహరించే చక్రవాకాలు,
మన్మథబాణాలతో పరితపించే వ్యక్తులు సుస్నాతులై తాపం
తీర్చుకోవటానికి ఇలా స్త్రీనే అందమైన సరస్సును బ్రహ్మ సృష్టించాడు.)

భారతామృతముఁ గర్ణపుటంబులనారఁ గ్రోలి


భారతామృతముఁ గర్ణపుటంబులనారఁ గ్రోలి


సాహితీమిత్రులారా!

నన్నయ మహాభారతంలో తన రచనను గురించి
ఈవిధంగా చెప్పుకున్నాడు.

సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థ యుక్తిలో
నారసి మేలు నా నితరు లక్షరరమ్యత నాదరింప నా
నారుతార్థసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారతసంహితారచనబంధురుఁడయ్యె జగద్ధితంబుగాన్
                                                                                  (1-26)
(కవిపుంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగుణంతో కూడిన కథలందును,
కవిత్వమందును గల మనోహరాలైన అర్థాలతోడి కూడికను లోపల
తరచి తరచి గ్రహించి బాగుబాగు అని ప్రశంసిచగా సామాన్యుల చెవులకు విందు
చేకూర్చే అక్షరాలకూర్పలోని సౌందర్యాన్ని మెచ్చుకోగా
హృద్యమైన అర్థాలతో అనేకవిధాలైన రమణీయార్థ
ప్రతిపాదకాలైన సుందరకవితాభివ్యక్తులకు నిధానమైన
నన్నయభట్టు లోకానికి శ్రేయస్సుకలిగేట్లు మహాభారతం
అనే వేదాన్ని రచించటంలో ఒప్పిదమైనాడు.)

మరి తిక్కన ఈ విధంగా తన కవిత్వం ఉంటుందని
విరాటపర్వం (1-30)లో చెప్పుకున్నాడు.

కావున భారతామృతముఁ గర్ణపుటంబులనారఁ గ్రోలి యాం
ధ్రావళి మోదముం బొరయునట్లుగ సాత్యవతేయ సంస్కృతి
శ్రీ విభవాస్పదం బయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ
క్షావిధి నొంది పద్యముల గద్యములన్ రచియించెదన్ కృతుల్

(అందువలన - ఆంధ్రులందరూ మహాభారతమనే అమృతాన్ని
చెవులనే దొప్పలతో  తనివితీరా త్రాగి, ఆహ్లాదాన్ని పొందేట్లుగా -
వ్యాసమహర్షి భావనమనే సంపదయొక్క వైభవంతో నిండిన
మనస్సుతో భారతపర్వాలను మహాకావ్యంలో ఉండదగిన
ఉత్తమ కవిత్వంతో రచించవలెనన్న గొప్పదీక్షను పూని
నియమంతో పద్యాలలో గద్యాలలోనూ
(చంపూ రచనగా) రచిస్తాను.)

ఆ విధంగా దీక్షాకంకణబద్ధులై ఆకాలంలో కవిత్వం వ్రాసేవారు. 

Friday, June 10, 2016

సంభవంతుమమ జన్మ జన్మని

సంభవంతుమమ జన్మ జన్మని


సాహితీమిత్రులారా!
కోటి విద్యలు కూటికొరకే ఇది అందరికి తెలిసిన సామెతే.
కానీ ప్రతి ఒక్కరు తిండి గురించి ఏదో ఒక సందర్భంలో
వారివారి ఇష్టాలు చెప్పుకుంటూ ఉంటారు.
అలానే కావ్యాలలో కవులు తిండి గురించిన విషయం కూడా రాశారు
వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.

మొదట మహాకవి జయదేవుడు చెప్పిన
శ్లోకం చూద్దాం.

కాళిదాస కవితా నవంవయ:
మాహిషందధి సశర్కరంపయ:
ఐణ మాంస మబలాచ కోమలా
సంభవంతుమమ జన్న జన్నని

(కాళిదాస కవిత,
మంచి వయస్సు,
గేదె పెరుగు,
పంచదార వేసిన పాలు,
లేడి మాంసం,
అబల అయిన కోమలాంగి
జన్మ జన్మలకు కావాలి.)

మాంసాహార ప్రియులైనవారు శాకాహారాన్ని లెక్కచేయరు.
ప్రాచీన కవులలో ఎక్కువమంది ముఖ్యంగా తెలుగు కవులలో -
శాకాహారులు కావడం వల్ల వాటి వర్ణన ఎక్కవగా కనబడుతుంది.

ఒక కవికి వంకాయంటే చాలా ఇష్టం.
ఆ ఇష్టాన్ని ఇలా పద్యరూపంలో వ్యక్తం చేశాడు.
ఇది తెలుగువారికి చాల ప్రసిద్ధమైన పద్యం.

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీతవంటి భామామణియున్
శంకరుని వంటి దైవము
లంకాపతి వైరి వంటి రాజుంగలడే!

(వంకాయ వంటి కూర, సీత వంటి స్త్రీ, శివుని వంటి దేవుడు,
రాముని వంటి రాజు మరెవరూ లేరని -  అతని భావన)

తెలుగు కవులలో శ్రీనాథుని వలె భోజన పదార్థాలను
వర్ణించిన కవి ఇంకొకరు లేరు.
ఆయన కావ్యాలలోని వాటిని తరువాత చూద్దాం.
ఇపుడు శ్రీనాథునుని సంచారంలోని ఒక విషయాన్ని తెలుసుకుందాం.
ఒకమారు నడగూడెం అనే గ్రామంలో రుచికరమైన భోజనం దొరికిందని
దాన్ని గురించి చెప్పిన పద్యం ఇది.

వడి నూక లేని యన్నము
వడబోసిన నెయ్యి బుడమవరుగున్ బెరుగున్
గడిమాడ సేయబెట్టిన 
నడగూడెపు నంబి పడుచు నడిగి తిననుమా!

(నూకలేని అన్నం, మంచి నెయ్యి, బుడమ దోసకాయ వరుగు,
పెరుగు, ఒక్కడికి - మాడ (ఆకాలపు నాణెం) చేసేలా
అడిగి అడిగి తినమని పెట్టిన గేస్తురాలు నడగూడెపు
నంబి పడుచును తలచు కొన్నాడు)

బ్రహ్మ కంటె కవి యధికుడగున్


బ్రహ్మ కంటె కవి యధికుడగున్


సాహితీమిత్రులారా!

కవి బ్రహ్మకంటె ఎలా ఎక్కువో?
ఒక కవి ఎంత చమత్కారంగా చెప్పాడో చూడండి.


భువి షడ్రసములు నాలుక
చవిగొనగా జేసె బ్రహ్మ; సత్కృతి వలనన్
చెవి నవరసములు చవిగొన
కవి చేసెను; బ్రహ్మ కంటె కవి యధికుడగున్


కవి బ్రహ్మ కంటె ఎక్కువ -  ఎందుకంటే
బ్రహ్మ నాలుకకు తీపి,పులుపు,వగరు,కారం,చేదు మొదలైన
6 రుచులనే సృష్టించాడు.
మరి కవో అలా కాదు
శృంగారం, హాస్యం కరుణ, వీరం, భయానకం,
భీభత్సం, రౌద్రం, అద్భుతం మొదలైన
9 రసాలను అనుభవింప చేస్తున్నాడు.
మరి కవేకదా! గొప్ప.

Thursday, June 9, 2016

స్వేచ్ఛా విహంగము


స్వేచ్ఛా విహంగము


సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ - 'ప్రభవ'లోని పద్యకవిత ఈ 'స్వేచ్ఛా విహంగము' చూడండి.

ఉచ్పలమాల-
నీవు నభో వికటంమున నిర్మల పాండు పయోద మాలికల్
త్రోవ యొసంగ పక్షముల దూయుచు హాయిగ సంచరించు స్వే
చ్ఛా విలసద్విహంగమవు స్వామి! క్షుధావిలమైన చూడ్కులన్ 
నీ విహరించు మార్గమున నిల్పి కనుగొనుచుందు  నే నిటన్

ఉత్పలమాల-
ఏ రుచిరాను రాగముల నీనెడు దూర దిశా నిశాంతమున్
చేరెదవో నినున్ కనక నేనిట గాసిల, ఏ ప్రపుల్ల క
ల్హార సుమావళీ పరిమళమ్ములు మూగు సురాపగా సుధా
తీరములో చరించెదవొ దీనత నాకిట సంఘటించగన్ 

ఉత్పలమాల-
నూతన పారిజాత సుమనో రమణీయములైన భావముల్ 
పూతలు పూచునా యెద, విముక్త మహాశుగ మట్లు దాటుచున్ 
ద్యోతలమున్ విహార పరిధూత గరుస్మృదుకాంతివాహినీ
స్నాత మనోహరమ్మగ నొనర్చు నినున్ కనునంత వింతగన్

ఉత్పలమాల -
కోమల పల్లవమ్ము లయి   కోర్కులు క్రొందనమున్ వహించగా
నామదియే ప్రసూన నవనందనమై వికసించు, అంత నో
స్వామి! వియత్పథాల దిగి వచ్చెద వీవు నిగూఢ వీధికా 
ధామములన్ త్యజించుచు నితాంతము నిందె నివాసమొందగన్


                                                                  రచన - 1930 జనవరి 30
                                                                  ముద్రణ - ఆంధ్రపత్రిక ప్రమోదూత సంవత్సరాది సంచిక 1930-31

కోమలితో పవళించునట్టి నా సరసుని జేర


కోమలితో పవళించునట్టి నా సరసుని జేర


సాహితీమిత్రులారా!

పానకాలరాయకవి మనోహరమైన ఊహాకల్పన పద్యం,
తన మనసుకు బోధిస్తున్నాడు.


తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!


 తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!

నీ పుణ్యంబు సామాన్యమే?


నీ పుణ్యంబు సామాన్యమే?


సాహితీమిత్రులారా!
కొమాండూరు కృష్ణమాచార్యులవారు 20వ శతాబ్ది ప్రథమార్థంలో
ఉన్న పండిత కవులు. గుంటూరు వాసులు.
వారొకనాడు మండు వేసవిలో వడగాడ్పుల మధ్య తమ పొలమున్న
గ్రామానికి పోతున్నారు. త్రోవలో విపరీతంగా దప్పికైంది.
అప్పుడొక గొల్లవాడు చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీర్చాడు.
వెంటనే అతనికి పద్యాన్నిలా
బహూకరించారు
ఆచార్యులవారు.

పురజిత్పాల మహోగ్రనేత్ర జనిత స్పూర్జన్మహాగ్నిచ్ఛటా
పరుష స్పూర్తి వహించి వీచెడు మహావాతంబు ప్రాణాంకురో
త్కరమున్ మ్లానము నొందజేయ - మము తక్రంబిచ్చి రక్షించితో
పురుష గ్రామణి! గోప మాత్రుండవె! నీ పుణ్యంబు సామాన్యమే?

అన్నాడట.
ఆ గోపాలునికి ఈ పద్యం అర్థంకాలేదు.
సంస్కృత పద సమాస బంధురమైన శైలి కొమాండూరి వారిది.
వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
అది గ్రహించి అర్థం చెప్పారు కవిగారు.

"త్రిపురాలను తగలబెట్టిన రుద్రుడి మూడో కంటి మంటలాగా 
ఎండకాస్తున్నది. వడగాడ్పు కొడుతున్నది. 
ప్రాణం అలసిపోతున్నది. ఈ స్థితిలో మజ్జిగ ఇచ్చి కాపాడావు. 
నీవు మామూలు గొల్లవు కాదు. 
నీ పుణ్యం సామాన్యమైందికాదు."

అర్థం తెలిసిన తర్వాత
అంత గొప్ప పద్యం
తన మీద చెప్పినందుకు
ఎంతో కృతజ్ఞత ప్రకటించాడతను.

Wednesday, June 8, 2016

త్వ మేవ చతురో జానాసి కాలోచితమ్!


త్వ మేవ చతురో జానాసి కాలోచితమ్!


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఎండాకాలంలో చలివేంద్ర నడిపే యువతి అటుగావెళ్ళే
ఆగంతకునితో
ఈ విధంగా చెప్పింది.
శ్లోకం.........


జ్యేష్ఠేమాసి కఠోర సూర్యకిరణై: సంతప్త గాత్రో భవాన్!
ఏకాకీవ భవాన్! అహంచ తరుణీ! శూన్య ప్రపా వర్తతే!
అస్మిన్ కుబ్జవటే నిరంతరదళే - భోపాంథ! విశ్రామ్యతామ్!
లజ్జా మే కథితుం త్వ మేవ చతురో జానాసి కాలోచితమ్!

నీవు గ్రీష్మసూర్య కిరణముల వేడిమికి అలసిపోయావు!
నేనా ఒంటరిగా ఈ చలివేంద్రలో ఉంటిని!
యువతిని! చలివేంద్రం కనుచూపు వేరలో ఎవ్వరూ లేరు!
ఈ పొట్టి మఱ్ఱిచెట్టు దట్టమైన ఆకులతో గుట్టుగా ఉన్నది.
ఇక్కడ నీవు విశ్రమింపుము.
ఇంతకంటే చెప్పటానికి నాకు సిగ్గుగా ఉంది.
ఇపుడు కర్తవ్యమేమో? నీవే గ్రహింపగలవు!
నీవు చాతుర్యం కలవాడవు!

(ఆమె ఎందుకు పిలిచిందో పాఠకులకూ తెలుసు
  ఇంకేమీ చెప్పక్కరలేదనుకుంటాను.)

రాజులు రాజులే పెను తరాజులు గాక


రాజులు రాజులే పెను తరాజులు గాక


సాహితీమిత్రులారా!

ఒక కవి  పూసపాటి విజయరామరాజుపై చెప్పిన పద్యం చూడండి.

రాజు కళంకమూర్తి!  రతిరాజు శరీర హీను, డంబికా
రాజు దిగంబరుండు! మృగరాజు గుహాంతరసీమవర్తి! వి
భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాలుడె రాజుగాక, యీ
రాజులు రాజులే? పెను తరాజులు గాక ధరాతలంబునన్!

రాజు - చంద్రుడు కళంకమూర్తి - చంద్రునిలో మచ్చ ఉంది.
రతిరాజు - మన్మథునికి శరీరమేలేదు,
అంబికారాజు - శివుడు దిగంబరుడు,
మృగరాజు - సింహం గుహలలోనే ఉంటుంది.
ఇక్కడున్న రాజులు రాజులా? పెనుతరాజులు(పెద్దతక్కెడలు)
అవి గొప్పవాటిని క్రింద ఉంచి
తక్కువదాన్ని పైకి పెట్టును. ఐనవారిని క్రిందను,
కానివారిని పైన పెడతారు -  అని  భావము.

Tuesday, June 7, 2016

శ్రీశ్రీ - పద్యాలు


శ్రీశ్రీ - పద్యాలు

సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ  - "సిరిసిరిమువ్వా" మకుటంలోని మరికొన్ని పద్యాలు.


కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకుచెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా!

ఊళ్ళో తిరిగే కుక్కలు
మళ్ళీ కనబడని యెడల మనకేం పోయెన్
జిల్లా కలెక్టరున క
ర్జీ ల్లిఖియించిన పనేమి సిరిసిరిమువ్వా!


ఈ క్రింది పద్యం సిరిసిరిమువ్వా శతకానికి ఫలశ్రుతి చూడండి.

ఈ శతకం యెవరైనా 
చూసి, చదివి, వ్రాసి, పాడి, సొగసిన, సిగరెట్
వాసనలకు కొదవుండదు 
శ్రీశు కరుణ బలిమివలన సిరిసిరిమువ్వా!

                                               ఇంకోసారి మరికొన్ని..........

చిత్రము శైలములో యురోజముల్


చిత్రము శైలములో యురోజముల్


సాహితీమిత్రులారా !

ప్రణయ కోపంతో  ప్రియురాలు మూతిముడుచు కుంది.
చందమామలాంటి ముఖం కందగడ్డ చేసుకుంది.
దానితో ఆమెకు ప్రీతి కలిగించడానికి ప్రియుడు
ఆమె ప్రత్యంగ సౌందర్యన్ని పదేపదే ప్రశంసిస్తున్నాడు.
పొగడ్తలకు పరవశించని వారు ఉండరుకదా!
ఈ శ్లోకం(శృంగారతిలకంలోనిది)
పద్యం(శ్లోకానికి అనువాదం)
చూడండి.


ఇందీవరేణ నయనం ముఖమంబుజేన
కుందేన దంత మధరం నవపల్లవేన 
అంగాని చంపకదలై: స విధాయ వేధా:
కాంతే కథం ఘటితవా నుపలేన చేత:?

(కలువలతోడ కన్నులు ముఖంబును తామరపూవుతోడ మ
 ల్లెల రదవారమున్ పెదవి లేజిగురాకుల చంపకంబులన్ 
 బలు సొబగైన యంగముల బ్రహ్మ సృజించి త్వదీయ చిత్తమున్ 
 శిలగ సృజించెనో యతివ! చిత్రము శైలములో యురోజముల్! )

ఓ కాంతా! ఆ సృష్టికర్త అందమైన కలువలతో నీ కళ్ళను కాంతివంతంగా సృజించాడు.
చల్లని పరిమళాలను వెదజల్లే పద్మాలతో నీ ముఖాన్ని మనోహరంగా మలిచాడు.
తెల్లని మల్లెమొగ్గలతో నీ పలువరుసను తీర్చాడు.
ఎర్రటి నవపల్లవాలతో నీ పెదవులను అతిసుందరంగా తయారు చేశాడు.
సుకుమారమైన చంపకదళాలతో నీ ఇతర అవయవాలను అతి లావణ్యంగా శిల్పీకరించాడు.
ఇలా సుకుమార కుసుమ పేశలమైన వస్తు సంపదతో నీ దేహనిర్మితి చేసిన ఆ విధాత,
నీ చిత్తాన్ని మాత్రం కఠిన శిలతో చేశాడెందుకో?
ఆ రహస్య మేమిటో మరి.

(ఆమె కఠిన స్తనాల ప్రభావంతో మనసు రాయిగా మారిందని భావం)

భావిదృష్టి


భావిదృష్టి


సాహితీమిత్రులారా!

ఇది శ్రీశ్రీ  "ప్రభవ" లోని పద్యకవిత చూడండి.

చ. అట కవితా ప్రపంచము లహర్నిశమున్ రసవన్నవీన వి
    స్ఫుట నటనాప్రసక్తి మెయిసోలును, తేలుననంత హర్షపున్ 
    ఘటికలలో సహస్ర రవికాంతులు మేదుర రమ్య వర్ణ సం
    ఘటనము కూర్చి, నాకదియె కామ్యపథమ్ము భవిష్యదాశలన్

ఉ. నా తలపోత లీక్షణమునన్ పరువెత్తు నదృశ్య పక్ష సం
    పాతముతో, రయోద్ధత సుపర్వ విమాన పలాయన క్రియా
    తీతములై - సుధామధుర దివ్యపధాలకు, భావికాల వి
    ద్యోతిత నాట్యశాలలకు, జ్యోతిరఖండ యశోంగణాలకున్ 

ఉ. భావి వికాస వాటికల బాటలలో చనునాకు నా కవి
    త్వావృత గీతులే వినగనౌను చలద్గరుదంచలమ్ములై 
    దైవధనీ ప్రసన్న సికతాస్థలులన్  విహరించు నాకు నా 
    పూవుల పాటలే వరద పోవును తేనియ తేట యూటలన్ 

ఉ. నా నిపుడే  వదించిన అనేక రహశ్శృతు లాలకించగా 
    లేని జగత్తులో ప్రతిఫలించదు నా హృదయమ్ము నేడు సం
    ధ్యా నిశితారుణ  ప్రభలు దాచిన యామినిలో చరించు నా 
    మానస మింక  భావి సుషమా వికసద్రుచు లాస్వాదించెడున్

రచన - 1929 సెప్టెంబరు 16
ముద్రణ - భారతి - నవంబరు 1929

Monday, June 6, 2016

శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!


శ్రీ శ్రీ - సిరిసిరిమువ్వా!


సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ పద్యాలు రాయలేదని కొందరు
కేవలం గేయాలే రాశాడని అపోహలో ఉన్నారు.
అది సత్యంకాదు.
శ్రీశ్రీ పద్యాలు చూడండి.
ఇవి అన్నీ కందపద్యాలే. సిరిసిరిమువ్వా మకుటంతో రాశారు.

"పందిన చంపిన వాడే
కందం రాయాల" టన్న కవి సూక్తికి నా
చందా యిస్తానా రా
సేందు కయో షరతులేల సిరిసిరిమువ్వా!

కుర్చీలు విరిగిపోతే
కూర్చోడం మాననట్లు గొప్ప రచనలన్
కూర్చే శక్తి నశిస్తే
చేర్చదగునొకింత చెత్త సిరిసిరిమువ్వా!

అవురా! శ్రీరంగం శ్రీ
నివాసరావూ, బలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలిం
చి వెళ్ళి పొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా!

                                                   ఇంకొన్ని మరోసారి.........వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చువారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు


సాహితీమిత్రులారా!

చేమకూర వేంకటకవి విజయవిలాసకావ్యంలో
రఘునాథనాయకుని దానగుణం
ఏవిధంగా
వర్ణించాడో చూడండి.

అడుగు మాత్రమె కాక యంత కెక్కుడుగ నీఁ
           జాలెనే యల బలిచక్రవర్తి?
యావేళ కటు దోఁచినంత మాత్రమె కాక
           కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి?
తూఁగిన మాత్ర మిత్తుననెఁగా కిచ్చవ
           చ్చినది కొమ్మనియెనే శిబివిభుండు?
కలమాత్ర మపుడిచ్చెఁగాక కట్టడగాఁగ
           ననిశంబు నిచ్చెనే యమృతకరుఁడు?
వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు నెల్ల
యర్థులఁగృతార్థుల నొనర్చునట్టి యప్ర
తీప వితరణికి మహాప్రతాప తిగ్మ
ఘృణికి నచ్యుత రఘునాథ నృపతి మణికి?
                                  (విజయవిలాసము -1-25)

నాడు బలిచక్రవర్తి వామనునకు ఆయన అడిగిన అడుగులే
ఇచ్చినాడుకానీ ఒక్క అంగుళంకూడా
ఎక్కువ ఇవ్వలేకపోయాడు
ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలు అడిగినపుడు
అడిగినంతే ఇచ్చాడు కానీ కోరినదానికన్న
ఎక్కువ ఇవ్వలేక పోయాడు.
శిబి చక్రవర్తి శరణార్థియైన పావురము తూగినంత బరువుకు
బదులుగా తన శరీరంలోని మాంసం డేగకు తూగినంతనే ఇచ్చాడు
కానీ కొంచం కూడా ఎక్కువ ఇవ్వలేదు.
అమృతకిరణుడైన చంద్రుడు తన పదహారు కళలలో
ఏదినానికి ఆదినం ఒక్క కళమాత్రమే
నియమం ప్రకారం ఇస్తున్నాడు కానీ ఏల్లప్పుడూ
(రాత్రికాని సమయంలోను) ఇవ్వగలిగెనా
ఇవ్వలేకున్నాడు.
యాచకులందరికి సఫలమనోరథులుగా చేయునట్టి
ఎదురులేని దాతయు,
తేజములో సూర్యునితో సమానమైనవాడు
అయిన
రఘునాథనృపాలునికి ఆ బలి, కర్ణ, శిబి, చంద్రులు
ఏరీతిగా సరి పోల్చవచ్చు.
- అని భావం.

Sunday, June 5, 2016

కాలు జవ్వాడ మట్టియల్ కదిపి మ్రోయ


కాలు జవ్వాడ మట్టియల్ కదిపి మ్రోయ


సాహితీమిత్రులారా!

ఒకానొక సమయంలో ఒక వన్నెలాడి సింహాద్రి ఎక్కుతూ వెళుతున్న
శివభక్తురాలు కవిసార్వభౌముని కంటపడింది
ఆమె తీరును కవి ఈ విధంగా
వర్ణించాడు
చూడండి.

పొలు పొందగ విభూతి బొట్టు నెన్నొసలిపై తళుకొత్తు చెమట కుత్తల పడంగ
సొగసుగా పూదండ జొనిపిన కీల్గొప్పు జారగ నొక చేత సర్దుకొనుచు
బిగి చన్నుగవ మీద బిరుసు పయ్యెదచెంగు దిగజారి శివ సూత్ర మగపడంగ
ముక్కున హురు మంజి ముత్యాల ముంగర కమ్మ వాతెరమీద గంతు లిడగ
కాలు జవ్వాడ మట్టియల్ కదిపి మ్రోయ
కమ్మ విలుకాని జాళువా బొమ్మ యనగ
మెల్ల మెల్లన సింహాద్రి మీద కేగె 
కన్నె పూబోడి అగసాలి వన్నెలాడి

మెట్లెక్కే శ్రమ వల్ల చెమటపట్టి ముఖాన విభూతి బొట్టు తడిసిపోతున్నది.
అందంగా పూలదండ జొనిపిన కొప్పు జారుతుంటే ఒక చేత్తో సర్దుకొంటున్నది.
ఇంతలో స్తనాలమీది పైటచెంగు దిగజారి శివసూత్రం కనిపిస్తున్నది.
ముక్కున ముంగరలో హురమంజి ముత్యం పొదిగి ఉన్నది.
దాని కాంతి పెదవిమీద గంతులు వేస్తున్నది.
బంగారు బొమ్మవంటి ఆ మచ్చెకంటి
ఈ విధంగా సింహాద్రిని ఎక్కుతోందట.
కళ్ళకు ముందు చిత్రం గీసినట్లు
ఎంతగా వర్ణించాడో కదా!
ఆ మహాకవి.