Saturday, October 1, 2016

కవికి పొత్తేల కలముతో


కవికి పొత్తేల కలముతో


సాహితీమిత్రులారా!



M.S. రెడ్డిగా పేరు పొందిన మల్లెమాల సుందర రామ రెడ్డిగారు
"మల్లెమాల నిత్యసత్యాలు" పేరుతో  ఒక పుస్తకం వెలయించారు.
అందులో "కవి - కవిత"లను గురించిన
కొన్ని పద్యాలు ఇక్కడ చూద్దాం.

తెలుగు బాసలోని తీయందనాలను
కాచి వడియ గట్టి కవితలందు
పొదుగనట్టి కవికి పొత్తేల కలముతో
మహిత వినయశీల!  మల్లెమాల!!

వనిత, కవిత నిన్ను వలచి రావలె గాని
పట్టుబట్టి తరిమి పట్టుకొన
వ్రతము చెడును గాని ఫలము దక్కదు సుమా
మహిత వినయశీల!  మల్లెమాల!!

అక్షరముల కాళ్ళ కందియలను గట్టి
యెదను మీటి నింగి కెగురవేసి
సుకవి పిండు కొనును సుందర భావముల్
మహిత వినయశీల!  మల్లెమాల!!

కాలు కదపకుండ కవి విశ్వమంతయు
కనుల కరవుదీర గాంచగలడు
అట్టి దృష్టి అందరి కబ్బునా
మహిత వినయశీల!  మల్లెమాల!!

అందమైన కవిత ఆలోచనను బెంచు
అందమైన వనిత హాయి పెంచు
అందమందె కలదు ఆనంద మంతయు
మహిత వినయశీల!  మల్లెమాల!!

గుండె పొరల నడుమ గుసగుస లాడెడు
భావములను సుకవి బయటకీడ్చి
అక్షరముల లోన ఆవిష్కరించును
మహిత వినయశీల!  మల్లెమాల!!

కవి విధాత కేని కట్టు బానిస గాడు
వేయి రెక్కలున్న విహగ మతడు
అతని భావములకు ఆకాశమే హద్దు
మహిత వినయశీల!  మల్లెమాల!!

పద్యమునకు తెలుగు భాష వెయ్యేంఢ్లకు
పూర్వ మెపుడొ పురుడు బోసెనంట
అయిన ... దాని అంద మజరామరము సుమా
మహిత వినయశీల!  మల్లెమాల!!

ఒక్క మంచి కవిత ఉర్విలో ఎనలేని 
పేరు సంతరించి పెట్టు కవికి
కాన కవికి రాశి కాదు ప్రధానము
మహిత వినయశీల!  మల్లెమాల!!

పండితునకు గుర్తు కుండలములు గావు
సాధువునకు గుర్తు జడలు గావు
వేషధారణమున విజ్ఞత పెరుగునా
మహిత వినయశీల!  మల్లెమాల!!

కవికి దూరదృష్టి రవికన్న కడుమిన్న
అనెడు మాట వట్టి అతిశయోక్తి
కళ్ళ జబ్బు లేని కవులెందరున్నారు
మహిత వినయశీల!  మల్లెమాల!!

తేనె సోనలూరు తెలుగు పద్యమ్మును
పాత చింతకాయ పచ్చడనుట
తిక రుచిని గూర్చి తెగ వాగుటే సుమా
మహిత వినయశీల!  మల్లెమాల!!

No comments:

Post a Comment