Showing posts with label కవులు. Show all posts
Showing posts with label కవులు. Show all posts

Friday, June 8, 2018

అక్కమహాదేవి


అక్కమహాదేవి




సాహితీమిత్రులారా!


కన్నడ వచన సాహిత్యంలో పేరెన్నికగన్న బసవన్న, అల్లమప్రభువు,
దేవర దాసిమయ్య మొదలైన వారికి ఏమాత్రం తీసిపోని
అత్యుత్తమ శ్రేణికి చెందిన వచనాలను వ్రాసిన కవయిత్రి ఈ అక్కమహాదేవి.
శ్రీశైల మల్లికార్జునినే తన భర్తగా భావించిన ఈ భక్తురాలిని కౌశికుడనే రాజు బలవంతాన వివాహం చేసుకున్నాడు. కాని త్వరలోనే ఆ బంధాన్ని తెంచుకొని ఆమె శ్రీశైలానికి పయనమైంది. దారిలో కల్యాణపట్టణం వెళ్ళింది. ఆ రోజుల్లో వీరశైవ మతానికి కల్యాణపట్టణం ప్రధానకేంద్రం. అక్కడ అల్లమప్రభువునూ, బసవన్ననూ కలిసి
వారి ప్రశంసకు పాత్రురాలైంది. తర్వాత శ్రీశైలంచేరి అక్కడ కదళీవనంలో ఆరాధ్యదైవాన్ని చేరుకుంది.
చెన్నమల్లికార్జునా అనే మకుటంతో అక్కమహాదేవి రచించిన వచనాలు
ఆమె భక్కికి దర్పణాలు మాత్రమే కాక ఉత్తమ కవితాఖండికలుగాకూడా పేరు పొందాయి. వాటిలో ముఖ్యంగా కనిపించేది అక్క అంతరంగ ప్రదర్శనం, వైరాగ్యభావం, అంతరంగశుద్ధి, ఆత్మనివేదనం, పరిశుద్ధ భక్తి.

Wednesday, June 6, 2018

కృష్ణానందుడు


కృష్ణానందుడు



సాహితీమిత్రులారా!



సంస్కృత సాహిత్యంలో విద్వదౌషధం అని చేరు పొందిన మహాకావ్యం
శ్రీహర్షుని నైషధీయకావ్యం. దీనికి అనుపాన మధువుగా చేరు పొందిన
మహాకావ్యం సహృదయానందం. ఇది 15 సర్గలలో కూర్చబడింది.
దీన్ని కూర్చినవాడు కృష్షానందుడు. ఈయన కపింజల వంశానికి చెందినవాడు.
ఇతనికి సాంధి విగ్రహిక మహాపాత్ర అనే బిరుదు కూడావుంది. ఇతడు
హర్షనైషధీయచరిత్రకు వ్యాఖ్యానాన్ని వ్రాశాడని జనశ్రుతి. కానీ ఇది
ఇప్పటికి లభించలేదు. విశ్వనాథుని సాహిత్య దర్పణం లో
సహృదయానందం లోని -

సూచీముఖేన సకృ గేవ కృత ప్రణస్త్వం 
ముక్తా కలాప లగఠసి స్తనయోః ప్రియాయాః

లాంటి శ్లోకాలు ఉదాహరణగా కనబడ్డంవల్ల కృష్ణానందకవి సాహిత్య దర్పణకారుని కన్నా ప్రాచీనుడని స్పష్టంగా చెప్పవచ్చు. నైషధీయ చరిత్రను పఠించి భావించిన వాడవడం వల్ల ఇతడు శ్రీహర్షుని తర్వాతి వాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. నలచరితాన్ని మహాకావ్యంగా
తీర్చిదిద్ది సహృదయానందం అనే మారుపేరు పెట్టి కృష్ణానందుడు
ఒక నూతనత్వాన్ని పరిమళింపచేశాడు. శ్లేషాద్యలంకార సహితమైన
శిల్పంలో భాషాక్లిష్టమైన శ్రీహర్షుని కవితారచన ముందు కృష్ణానందుని
మార్గం శిరీషమృదులం. ప్రతిశ్లోకం సులభంగా సుందరాన్వయబంధం
కలిగి ఉంది. ద్రాక్షాపాకానికి, వైదర్భోక్తికి ఈ కావ్యం జన్మభూమి అన్నట్లు
తోస్తుంది. ఈ కావ్యం ఆరంభంలో కృష్ణానందుడు వాగ్దేవతను
ఇలా స్తుతించాడు.

య దింద్రియాణాం విషయత్వ మేతి లోకేషు యత్తత్త్వ మతీంద్రి చ,
కృత్స్నయంస్య ప్రతిపత్తి హేతు ర్వాగ్దేవతా సా మయి సన్నిధత్తామ్

ఈ కాంక్షకు అనుగుణంగానే అతీంద్రియానంద సంధాయకం అయిన
కవితాతత్త్వం కృష్ణానందునకు వశవర్తి అయింది. విసుగు పుట్టించని వర్ణనలు, సుందరమైన కల్పనలు, అప్రసక్తాలు కాని సంభాషణలు, కలిగి కావ్యమంతా సహృదయుని చేతిలో లీలాసరోజం వలె ఒప్పింది.

Wednesday, May 16, 2018

పుగళేంది


పుగళేంది




సాహితీమిత్రులారా!



పుగళేంది 13వ శతాబ్దికి చెందిన తమిళకవి.
ఈయన ఎం.జి.ఆర్. చెంగల్ పట్టు జిల్లాకు
చెందిన పొన్ విళైందకలత్తూర్ అనే గ్రామంలో
జన్మించాడు. ఇది చెన్నైకి దగ్గర్లో ఉంది.
ఈయన మహాభారతంలోని నలచరిత్రను
"నళవెణ్బా" కావ్యంగా వ్రాశారు. వెణ్బ అంటే 
ద్విపద. ఈ కావ్యంలో 424 ద్విపద పద్యాలున్నాయి.
నలమహారాజు కలిప్రభావంతో భార్యను విడిపోయి
నానాబాధలు పడి చివరికి కలుసుకోవడం ఇందులోని 
ఇతివృత్తం. మన భారతదేశంలో నలమహారాజు చరిత్ర
అన్ని భాషల్లోనూ వ్రాయబడింది. ఇది అంతప్రధానమైన
కథగా భారతంలో చెప్పబడింది. పుగళేందిని మాళవ దేశ
"చంద్రస్వర్గి" అనే రాజు ఆదరిస్తాడు. అందుకే ఈ రాజును 
నళవెణ్బా కావ్యంలో ఐదుచోట్ల ప్రస్తావించాడు.  అలాగే
పుగళేంది శ్రీలంకకు వెళ్లి అచటి పాండ్య దళపతి "ఆర్యశేఖర్"
అనే సేనాధిపతి నుంచి బహుమానాన్ని స్వీకరించాడు.
పుగళేంది "చెంజికలంబగం" అనే మరో గ్రంథాన్ని రచించాడు. 
కాని ఇది నేడు అలభ్యం. ఈ రెండు గ్రంథాలేగాక
"అల్లి అరపాణి మాలై పవళకొడిమాలై", "పులేంద్రవ్", 
"కలవుమాలై", "ఏణిఏర్ట్రం", "పంచపాండవర్ వనవాసం",
"రత్నసురుక్కం" మొదలైన వాటిని రచించినట్లు చెబుతారు.
వెణ్బాఛందస్సులో అనన్యప్రతిభ పాటవాలు చూపించినవాడు
పుగళేంది. వెణ్బా ఛందస్సు ఇతనికి ముందు పురాణ కావ్యాల్లో
తక్కువగా వాడటం జరిగింది. తరువాత చాలమంది పుగళేందిని
ఆదర్శంగా తీసుకొని ప్రయోగించారని తెలుస్తుంది.

Tuesday, March 13, 2018

డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?


డిండిమ కవిసార్వభౌముడు ఒకరుకాదా?




సాహితీమిత్రులారా!


ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండి
శ్రీనాథునిచే వాదంలో ఓడింపబడిన
"డిండిమ భట్టు" ఒకరుకాదని వారివంశ
వివరాల్లోకెళితే తెలుస్తుంది. 

విజయనగరరాజుల ఆస్థానం అలంకరించిన 
సంస్కృత కవులు డిండిమ కవులు.
వీరి చరిత్ర విభాగరత్నమాల అనే గ్రంథంలో
వివరింపబడింది. గంగాతీరంలో మందార 
గ్రామంలో నివసించే ఎనిమిదిమంది శైవ
బ్రాహ్మణులను ఒక చోళరాజు కాశీనుండి 
దక్షిణానికి తీసుకొచ్చాడని, వారికి ఉత్తర
ఆర్కాడు జిల్లాలోని మెట్టుపడిని(తల్పగిరి)
అగ్రహారాన్ని ఇచ్చారని, అఇక్కడే ఆ 
వంశంవారు క్రమంగా 70 కుటుంబాలుగా
వృద్ధిచెందారని ఆ గ్రంథంలో చెప్పబడింది.
ఆ వంశంలోని అరుణగిరినాథుడు అనే
పండితుని ప్రౌఢదేవరాయలు(1422-48)
ఒక ఆరామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు.
అప్పటి నుండి ఆ వంశం వారు విజయ
నగరరాజుల కొలువులో ఆస్థానపండితులుగా
కవులుగా ఉన్నారని ఈ గ్రంథం ద్వారా
తెలుస్తుంది.
మొదటి అరుణగిరినాథుడు మొదటి రాజనాధుని
కుమారుడు. ఇతని మాతామహుడైన అభిరాముడు
శ్రీకంఠాగమమున పండితుడై డిండిమ ప్రభువు
(డిండిమ - 1) అనే పేరుతో వ్యాప్తిచెందాడు.
అరుణగిరినాథుని యశస్సు డిండిమవాద్య ధ్వనిచే
ఘోషించబడుతున్నందువల్ల ఇతనికి డిండిమ 
కవిసార్వభౌముడు (డిండిమ - 2) అనే బిరుదు 
కలిగింది. ఇతడు ప్రౌఢదేవరాయల కొలువులో 
ఉండి ప్రతివాది భయంకరుడై విలసిల్లాడు.
శ్రీనాథుడు వాదంలో ఇతనిని ఓడించి, ఇతని
కంచు ఢక్కను పగులగొట్టించి, ఇతని 
కవిసార్వభౌమబిరుదాన్ని తాను గ్రహించాడు.
ఇతడు యోగానంద ప్రహసనం అనే ప్రహసనాన్ని
వ్రాశాడు. అరుణగిరినాథుని కుమారుడైన రెండవ
రాజనాథునికి కూడ డిండిమకవి సార్వభౌముడు
(డిండిమ - 3) అమే బిరుదు ఉంది. ఇతడు 
నాట్య, తత్త్వశాస్త్రాల్లోనూ, పలు భాషల్లోనూ
పండితుడై తండ్రికంటే కూడా ఎక్కువ కీర్తిని 
గడించాడు. ఇతడు విజయనగరరాజుల సేనాని
అయిన సాళ్వనరసింగుని ఆదరాన్ని సంపాదించి
సాళువాభ్యుదయం(1480) అనే 13 ఆశ్వాశాల 
కావ్యాన్ని, దండయాత్రలను, పరాక్రమాన్ని 
వర్ణించాడు.

రెండవ రాజనాథుని కుమారుడు రెండవ అరుణగిరినాథుడు.
ఇతడు వారేంద్ర అగ్రహార నివాసి. ఇతడు వీరనరసింహ, 
శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉండి, వారిచే పోషించబడిన
వాడు. ఇతనికి పలుభాషలలో పాండిత్యం ఉంది. 
ఇతడు వీరభద్రవిజయం అనే డిమ రూపకాన్ని రచించాడు.
ఇది రాజనాథదేవుని ఉత్సవ సందర్భంలో ప్రదర్శించబడింది.
ఇతనికి కవిరాజరాజు, డిండిమ కవిసార్వభౌముడు, కుమార
డిండిముడు(డిండిమ - 4) అనే బిరుదులున్నాయి.

కుమార డిండిముని తరువాత ఆ వంశంవారు గొప్ప పండితులై,
ఆ వంశగౌరవాన్ని నిలబెట్టారు. ఇతని కుమారుడు మూడవ
రాజనాథుడు భాగవతచంపువును, అచ్యుతరామాభ్యుదయం రచించి
పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

(ఆధారం - విజ్ఞాన సర్వస్వం - 6(భారతభారతి))

Friday, March 2, 2018

తమిళ సాహిత్యంలో అగస్త్యుడు


తమిళ సాహిత్యంలో అగస్త్యుడు




సాహితీమిత్రులారా!




అగస్త్యుని పేరు వినని హిందువు వుండడంటే
అతిశయోక్తి కదేమో. అయితే తమిళ సాహిత్యంలో
ఈ పేరుతో ఒకరికంటే ఎక్కువ కనిపిస్తారు.
వారిలో మొదటి సంగం కాలంలోని అగస్త్యుడు,
మధ్యసంగం కాలంలోని అగస్త్యుడు ముఖ్యులు.

      పాండ్యరాజుల పోషణలో తమిళ వాఙ్మయ
వికాసం మూడు సంగాల ద్వారా జరిగినట్లు తెలుస్తుంది.
వాటిలో తలైచ్ఛంగం(మొదటి సంగం) క్రీస్తుకుపూర్వమే
మధురలో ఆరంభం అయిందని భావిస్తున్నారు. దీనిలో
అగత్తియనార్(అగస్త్యుడు)తో పాటు 549 మంది కవులు
న్నారని, అందులో శివుడు, మురుగన్ కూడా సభ్యులనే 
గాథలు ప్రచారంలో ఉన్నాయి. అగస్త్యుని రచనగా ప్రసిద్ధి
పొందిన లక్షణగ్రంథం, అగత్తియంలో 12 వేల సూత్రాలు 
ఉండేవని ప్రతీతి. అయితే ఇప్పుడు కొన్నిమాత్రమే 
లభిస్తున్నాయి. 

        పరమశివుడు సంస్కృతంలో వ్యాకరణాన్ని పాణినికి,
తమిళ వ్యాకరణాన్ని అగస్త్యునికి ప్రసాదించాడనే ఐతిహ్యం ఉంది.
ఏదిఏమైనా, తమిళభాషకు వ్యాకరణాన్ని అందించింది నంగుకు
అగస్త్యుని తమిళ పితామహుడు అని తమిళులు ప్రస్తుతిస్తారు.
అంతేకాక తమిళాన్ని అగస్త్యం అని కూడ పేర్కొంటారు.
పాణిని అనుసరించి అస్త్యుడు వ్యాకరణం వ్రాశారని కొందరు 
అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే అతని లక్షణ గ్రంథంలో 
కర్మణ్యర్థం, సప్తవిభక్తులు, తద్బవరూపంలో సంస్కృత శబ్దాలు 
మొదలైనవి చోటు చేసుకున్నాయని పండితులు భావిస్తున్నారు.

        మధ్యసంగం కపాడపురంలో వెలసింది. అందులో 
59 మంది కవులు ఉఇండేవారని, వారిలో అగస్త్యుడు, 
తొల్కాప్పియనార్ మొదలైనవారు ప్రసిద్ధులని తెలుస్తున్నది.
అగస్త్యుని 12 మంది శిష్యులలో తొల్కాప్పియనార్ ఒకరు.
సంస్కృత లాక్షిణికుడు, కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుని
(1294- 1325) ఆస్థానకవి అయిన విద్యానాథుని(14వ శ.)
అసలు పేరు అగస్త్య పండితుడని కొందరు అభిప్రాపడుతున్నారు.
అయితే దీనికి సరైన ఆధారాలు లేవు. కాబట్టి వీరు ఇద్దరు ఒకరే 
అని భావించనవసరంలేదు - అనిమరి కొందరి అభిప్రాయం.