Showing posts with label చమత్కారం. Show all posts
Showing posts with label చమత్కారం. Show all posts

Tuesday, August 3, 2021

ఇలాంటి కుటుంబం ఉంటుందా!

 ఇలాంటి కుటుంబం ఉంటుందా!




సాహితీమిత్రులారా!



ఎంత చిత్రం!

మురారి కొయ్యబారాడా? కాదా!

పూరీ జగన్నాథుడు కొయ్యవిగ్రహమేగా!

ఎందుకట -

ఈ శ్లోకం చూడండి


ఏకా భార్యా ప్రకృతి రచలా చంచలా సా ద్వితీయా

ఏక పుత్రో సకల సృడభూత్ మన్మథో దుర్నివార:

శేషశ్శయ్యా శయన ముదధి: వాహనం పన్నగాశీ

స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి:


ఒక భార్య భూమి(ప్రకృతి) ఆమెకు చలనం లేదు.

రెండవ భార్య లక్ష్మి బహుచంచల.

ఒక కొడుకు బ్రహ్మ అడ్డమైన సృష్టి చేస్తాడు.

రెండవకొడుకు మన్మథుడు వానికి పట్టపగ్గాలుండవు.

పడుకునే శయ్య పాము. పడక సముద్రంమీద -

పాము పీకుతుందో?  సముద్రం ముంచుతుందో?

వాహనం గరుత్మంతుడు పాములను తినేవాడు

ఇలాంటి చరిత్రగల తన ఇంటిని

తలచుకొంటూ తలచుకొంటూ

మురారి కొయ్యబారి పోయాడు.

ఎంత చిత్రం!


Monday, July 26, 2021

నీకాలెంత కందిందో!

 నీకాలెంత కందిందో!


సాహితీమిత్రులారా!



తిమ్మన పారిజాతాపహరణంలో
సత్యభామ కృష్ణుని తన్ని సన్నివేశం
మనకు తెలిసిందే మరి అలాంటిదే
ఈ శ్లోకం చూడండి.

ప్రియురాలికి ఇష్టంలేని పనేదో చేటడంచే
కోపశీలఅయిన ఆమె ప్రణ కోపంతో పతిని తన్నింది.
అతడు ఆమెపై గల రాగాతిశయంతో
అనునయిస్తూ పలికినది ఈ శ్లోకం.

దాసే కృతాగసి భవే దుచిత: ప్రభూణాం
పాదప్రహార ఇతి సుందరి! నాస్మిదూయే
ఉద్యత్క ఠోరపులకాంకుర కంటకాగ్రై
ర్యత్ఖిద్యతే మృదు పదం వమ సా వ్యథా మే


సేవకుడు తప్పరుచేసినపుడు యజమాని కోపంతో
తన్నడం సరైనదే. నేను నీకు దాసుడును
నీ విషయంలో అపరాధం చేసినందుకు నన్ను
నీవు పాదప్రహారం చేసినందుకు బాధపడను.
కాని నీ పాదస్పర్శచేత నా శరీరం పుకించి నిక్కబొడిచిన
ముల్లులలాంటి రోమాల వల్ల కోమలమైన
నీ పాదానికి నొప్పికలిగిందేమోనని
నేను బాధపడుతున్నాను- అని శ్లోక భావం.

Sunday, July 18, 2021

మనమిద్దరం లోకనాథులమే

 మనమిద్దరం లోకనాథులమే




సాహితీమిత్రులారా!



ఈ చమత్కార శ్లోకం చూడండి-
సమాస చమత్కారం చెప్పే శ్లోకం ఇది-

అహం చత్వంచరాజేంద్ర! 
లోకనాథా వుభావపి
బహువ్రీహి రహం రాజన్! 
షష్ఠీతత్పురుషో భవాన్



ఓ రాజా! నీవు, నేను ఇద్దరం
కూడ లోకనాథులమే సుమా!
కాని ఒక్కటే చిన్న భేదం
బహువ్రీహి ప్రకారం నేను లోకనాథణ్ణి,
నీవేమో షష్ఠీతత్పురుష ప్రకారం లోకనాథుడవు
- అని భావం

బహువ్రీహి సమాసం అన్యపద ప్రధానం కావున
లోకః నాథః యస్యసః - లోకనాథః అని
అంటే లోకమే నాథుడు(రక్షకుడు)గా కలవాణ్ణి నేను.

లోకానికి నాథుడవు(ప్రభువు)నీవు -
దీనిలో షష్ఠీత్పురుష సమాసం ఉంది.

లోకంపై ఆధారపడి బ్రతికేవాణ్ణి నేను.
లోకాన్ని పాలించేవాడవు నీవు
- అని భావం.
సమాసంలో రెండర్థాలకూ
లోకనాథః - అనే రూపమే ఉంటుంది
కావున కవి ఈ విధంగా చమత్కరించాడు.