Saturday, February 29, 2020

అందరము పొందుగ బతకాలి


అందరము పొందుగ బతకాలి




సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కోరిక
చూడండి.
ఇది ఆయన గేయసంపుటిలోది
ఆస్వాదించండి-

ఈ జీవిక ఏనాడును ఏ నెరుగను తీరిక
వాడక కలచును నా మది వీడక ఒక కోరిక-

పుడమి నెల్ల లవలేశము విడువక తిరుగాలి
అడు గడుగున ఆగి ఆగి అరసి అరసి సాగాలి

ప్రతి మానవ గేహమునకు అతిథిని కావాలి
ప్రతి ఎదలో నా నెయ్యపు పాలు పోసి నింపాలి

వసుధను నా వీటిలోన వసుధలోన నా వీటిని
పొసగించి అందరము పొందుగ బతకాలి

Tuesday, February 25, 2020

గిరికుమారుని ప్రేమగీతాలు


గిరికుమారుని ప్రేమగీతాలు




సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణ గారి
గిరికుమారుని ప్రేమగీతాలు(1920- 1928) నుండి
కొన్నిగీతాలు ఆస్వాదించండి-

అస్మదీయ కంఠమున యందాడుచుండె
నొక యెదోగీతి బయటికి నుబికి రాదు
చొచ్చుకొని లోనికిం బోదు వ్రచ్చిపోయె
నా హృదయ మీ మహాప్రయత్నమ్ము నందు

విఫలిత పునఃపునః కృత వివిధయత్న
భావితప్రచండ బాధాతధావిదారి
తాస్మదీయ హృదంతరంబందుఁ దోఁచె
స్ఫురిత సంఫుల్ల నవజపాశోణసంధ్య

ఈ మహాసంధ్యలో శారదామయూరి 
రమ్యకింకిణి కిణికిణి రభసపాద
మంజుల విలాసనృత్య సామ్రాజ్యలక్ష్మి
యగుచుఁ గచ్ఛపీ మృదుగీతు లనుసరించు
                               2
ఈమనోహరవీణ వాయించలేక
చేతమున నెంతు నేశిక్షితుఁడ నంచు
నాలతాంగి విలోలనేత్రాంచలమునఁ
గదలుచున్నది దానిరాగాల మెరుపు

ఈవిపంచికమీఁద వాయించు కొర్కి 
ఎంతయున్నదో నైష్ఫల్య మంతవఱకు
తరుముకొనివచ్చె నాహృదంతరమదేలొ
గాఢనిద్రారతిని నన్ను గలతవెట్టు

అసలు మ్రోగునొ మ్రోగదో ఆవిపంచి
ఏల మ్రోగదు నా దురదృష్ట మనుము

Sunday, February 23, 2020

అసత్యమే మిగులుతుంది


అసత్యమే మిగులుతుంది




సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ 14-01-1955లో వ్రాసి
స్వతంత్ర పత్రికకు పంపాలని
పంపలేకపోయినట్లు వ్రాసుకొన్న
కవిత ఇది.
చలసాని ప్రసాద్ గారి సేకరణ.

ప్రజలకి ధర్మం కావాలి
కవికి రసం కావాలి
రసహీనులైన ప్రజకి అధర్మం బోధించే కవి జతపడితే
అప్పుడు పంచుకోవడానికి
అసత్యమే మిగులుతుంది

Thursday, February 20, 2020

కాఫీ


కాఫీ




సాహితీమిత్రులారా!
Related image
బ్రహ్మర్షి డా. ఉమర్ అలీషా కవికృత సంహిత
ఖండకావ్యాలు నుండి ఈ కాఫీ ఖండిక ఆస్వాదించండి-

ఆకటికి శంకరుఁడు నంగలార్చి విషము
ద్రావెనే గాని కాఫీని ద్రావలేదు
నిండు దాహార్తిమై యగస్త్యుండు జలధి
ద్రావెనే గాని కాఫీని ద్రావలేదు

అమరులమృతము ద్రావినారపుడు, ఇపుడు
ద్రావుచున్నాము కాఫీని తరచు మనము
అది జరామరణంబుల నాపుచుండు
నిది జరామరణంబుల నిచ్చుచుండు

సురల కమృతముఁబోసి యసురులకెల్ల
కాఫీ పోసెను మోహినీ కాంత యపుడు
అవని ఆకాఫియే యిప్పుడవతరించి
మనల బీడించుచున్నది దినదినంబు

మధువుకన్నను దియ్యనై మతిని దనుపు
సుధను మీరినదై చాల సొగసు గూర్చు
చక్కెరకు మించి యమృతంబు ధిక్కరించు
కాఫికన్నను వేఱె భక్ష్యంబు గలదె

గురువు చెప్పినగాని గుడికిఁ బోవనివాడు
           కాఫిదుకాణంబు కడకుఁ బోవు
పరదేశ విద్యని బడికిఁ బోవనివాడు
           పెసరట్లకైపోయి పీకులాడు
కోటిపోయినఁగాని కోర్టుకెక్కనివాఁడు
            పోటీకి టీత్రాగబోవుచుండు
మతమతాచారముల్ మఱచిపోయినవాడు
            మధురమౌ కొకొను మఱచిపోఁడు
అఖిల సంగపరిత్యాగి యైన కాఫి
మాట చెప్పినఁ ద్రావక మానలేఁడు
సూర్యునెఱుఁగనివారలఁజూడవచ్చు
కాఫి యెరుగనివారలఁ గాంచలేము

Tuesday, February 18, 2020

వేదంలా గోదావరి...........


వేదంలా గోదావరి...........




సాహితీమిత్రులారా!

ఆరుద్రగారి ''గేయాలూ - గాయాలూ''
నుండి ఈ కవిత
ఆస్వాదించండి-

వేదంలా గోదావరి ప్రవహిస్తోందే చెల్లీ
వెన్నెల వలె కృష్ణఁవేణి విహరిస్తోందే  తల్లీ

                           విశాలాంధ్ర నలుమూలల 
                           వైవాహిక వైభోగం 
                           జనుల కనుల వెలుగులలో 
                           జాజులు వారెడి రాగం

గెలవేసిన అరటిచెట్లు తీసుకురానా తల్లీ
ఎలమామిడి తోరణాలు కట్టనా చెల్లీ

                     గడపమీద చిగురు జల్ల
                     గరిపొడిచెను శోభ
                     ముంగిటముత్యాల  నవ్య
                     రంగవల్లి సుప్రభ

ఏరువాక పడవలాగ ఎద ఊగిసలాడునులే
జోడెద్దుల బండివలె గుండెలురికి సాగునులే

                      కల్యాణ తిలక రేఖగ
                      కస్తూరి బొట్టు దిద్దవే
                      తెలుగు వెలది బుగ్గమీద
                      దిష్టిచుక్క పెట్టవే

తలంబ్రాల తనిసినటుల ధరణి తోచునే చెల్లీ
వసంతాల తడిసినటుల సంజెమెరయునే తల్లీ

                     జనావళికి సంతతం 
                     సంతోషప్రాప్తి
                     విశాంధ్ర నిండా   
                     వైవాహిక దీప్తి

తుత్తురా మాదిరిగా  తుంగభద్ర నాదమే
సన్నాయికి మల్లే పెన్నానది గానమే

Sunday, February 16, 2020

ప్రేమమాట


ప్రేమమాట




సాహితీమిత్రులారా!

గణపతిశాస్త్రిగారు కూర్చిన రత్నోపహారము(ఖండికా గీతికా సంపుటి)
నుండి ఈ ప్రేమమాట కవిత ఆస్వాదించండి-

 ఎన్ని యుగముల మాట! ఏనాటి మాట
 ఈనాటిదా తరుణి ఈ ప్రేమమాట!
  కల వసంతాల  గోకిలలమై మన మిలను
  లలన కలకాల మెట కలవరించితిమొ!

ఆకసమె కౌగిలిడు అబ్ధితరగల
నింగితారల కనుల పొంగిపొరలే ప్రేమ
ఈనాడు చిందినది యీమృదులహృదయాల
ఎదలలో తుదువరకు ఇదె పొంగుమనలోన

జలవిలయ కాలాన అలల జోడై మనము
నీలాంబరాన తారల తురుముకొనగలము
ఎన్నియుగముల మాట ఏనాటిమాట!
ఈనాటిదా తరుణి యీ ప్రేమమాట!

Thursday, February 13, 2020

నా ప్రవృత్తి


నా ప్రవృత్తి




సాహితీమిత్రులారా!

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి
ప్రవృత్తిని గమనించండి ఆయన మాటల్లో-

ఒక మనోహరమైన యూహ హఠాత్తుగా 
           చింతనొందు మనస్సు చివర తగిలి
ఒక మంచుబిందువోలిక చల్లనైన భా
           వం బంతరాత్మ లోపలను దోచి
కనిపించుచున్న వస్తు నికాయముననొక్క
           సుందరాకృతి మనస్సుననుజొచ్చి
ఒక్కొక్కమాట యెందో వినంబడి గూఢ
           మొక యర్థమది యెంతయో ధ్వనించి
కూరుచీకటి వోలె నెడారివోలె
నైన నా జీవితంబున యందునొక్క
మెఱుపు మెఱిపించి కొన్ని నిమేషములుగ
నమృత ఖండంబు చేయు నాయాత్మసీమ

కడమట నాజీవితంపు చీకటులు త్రోవ
నా మెఱుగు వెల్గుపొరలు తారాడి యెప్పు
డపుడె ధర రాలిపడునన్న ప్రాణ కుసుమ
ములకు నులిపచ్చిగల తొడిమలను గూర్చు

Tuesday, February 11, 2020

నాట్యసుందరి


నాట్యసుందరి




సాహితీమిత్రులారా!

ఇది 1918వ సంవత్సరము ఆంధ్రపత్రిక నుండి -
దీనిని బసవరాజు అప్పారావుగారు కూర్చారు
చూడండి-

ఆడవె ఆడవె 
అన్నులమిన్నా,
    ఆడవె లే నడు
    మల్లాడన్
ఆడెడు నీనడుమందము గాంచిన
అల్లాడవె ప్రేమను లోకంబుల్?
              ఆడవె ఆడవె
              అన్నులమిన్నా
పాడవె పాడవె 
భామామణిరో,
పాటలాధరము 
బాగులు గుల్కఁగ
వలపుఁజిల్కు నీపాటలు విన్నన్
పరవశగాదే ప్రకృతి యెల్లన్?
             పాడవె పాడవె
             భామామణిరో!
చూడవె చూడవె 
సుందర వదనా
సోగకన్నులను 
సోలఁగ ప్రేమము
సొంపులొల్కు నిన్ జూచినంతనే
చుక్కలు సైతము సోలవె ప్రేమన్?
                               చూడవె చూడవె 
                               సుందరవదనా

Saturday, February 8, 2020

పస్తుండి చస్తే నయం


పస్తుండి చస్తే నయం




సాహితీమిత్రులారా!

అబ్బూరి వరదరాజేశ్వరరావు 
కవితా సంచిక నుండి
ఈ కవిత ఆస్వాదించండి-

కాదనం లేదనం కాలసర్ప భయం
రాదనం భావిలో రామరాజ్య ధ్వజం
ఏదెలా చచ్చినా యేడ్పుమాత్రం నిజం
సోదరుల్లార! పస్తుండి చస్తే నయం!

చేదనం జీవితం చేదుకున్నా విషం;
రోదనం వల్ల మీ జీవితమే వేస్టు; ఆ
మీద లోకాన్ని ప్రేమించడం రొస్టు; ఓ
సోదరిల్లార! పస్తుండి చస్తే నయం!

నిన్న స్వేచ్ఛావహం; నేడు కారాగృహం
అన్నలం తమ్ములం అంధులం అందరం 
తన్నిపోకండి సత్యం శవం సుందరం
కన్నుమూసింది మాకంటే ముందే సగం!

దేనికయినా సరే తెంచుకోకండి మీ
బానిసత్వాన్ని కాపాడు సంకెళ్ళు; మీ 
మేను జీర్ణించినా మేలివాకిళ్ళు మీ 
మౌన సందేశ కర్మాలయాలే సుమీ!

Thursday, February 6, 2020

శ్రీశ్రీ - రుబాయత్


శ్రీశ్రీ - రుబాయత్




సాహితీమిత్రులారా!

శ్రీశ్రీగారి ఖడ్గసృష్టి నుండి
రుబాయత్ లు
చూడండి-

Charlie Chaplin, Joseph Stalin
Walt Disney, Georges Hunnet
Greta Garbo, Pirandello
ఇటీవల మా insiration

Sigmund Freud, Haroled Lloyd,
Albert Einstein, Jacob Epstein
హరీన్ చట్టో, గిరాం మూర్తీ
ఇటీవల మా insiration

కథాకళీ, కూచిపూడీ,
జావానాట్యం, Russain Ballet,
Jazz, Rumba, Carioca
హుషారిస్తాయ్, నిషాచేస్తాయ్

Don Bradman Mohan Bagan
Walter Lindrum, Vines, Cochet
కొంచెం carrems కాస్త Pin-pong
ఒక cup కాఫీ ఒక పఫ్ ciggarette 
తమాంషుద్

Tuesday, February 4, 2020

కిన్నెర సానిపాటలు


కిన్నెర సానిపాటలు




సాహితీమిత్రులారా!

జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారి
రచనలలో కిన్నెరసాని పాటలు ఒకటి. ఇది గేయకవిత్వంలో
వ్రాయబడింది. ఇదొక కల్పన.
ఇందులో కిన్నెర మహాపతివ్రత.
అందరు తెలుగు పిల్లల్లాగే ఉద్విగ్న హృదయ. ఎక్కువ తెలుగు కుటుంబాల్లాగే ఇక్కడా అత్తాకోడల్ల పోరాటం ఆయింట వెలసింది. కొడుకు సుఖమెరుగని అత్తకు కోడలిపై నిందలారోపించడం పని అయిపోయింది. ఒకప్పుడు ఆమె చేసిన నింద భరించటం కష్టమైపోయింది. కిన్నె హృదయం శోకంతో ప్రళయసముద్రం అయిపోయింది. కిన్నెర భర్త ఏంచేస్తాడు అటితల్లిని ఇటు భార్యను కాదనలేకపోయాడు. భార్యను ఓదార్చుకోలేకనూ పోయాడు. ఆవేశహృదయంతో కిన్నెర అడవులవెంట పరుగెత్తింది. భర్తపోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె భర్త కౌగిట్లోనే కరిగి వాగై పోయింది. అతడు శోకించి శోకించి శిల అయినాడు.


వనములను దాటి ''వెన్నెల బయలు'' దాటి
తోగులను దాటి దుర్గమాద్రులను దాటి
పులుల యడుగుల నడుగులు కలుపుకొనుచు
''రాళ్లవాగు'' దాటి పథాంతరములు దాటి

అచట కిన్నెరసాని ---
                   నాయాత్మ యందు
నిప్పటికిని దాని సంగీతమే నినదించు-

కిన్నెర పుట్టుక

ఓహో కిన్నెరసానీ
ఓహో కిన్నెరసానీ
ఊహామాత్రము లోపల
నేల నిలువవే జవరాలా!

కరగిపోతి నిలువెల్లను
తరలించితి నాజీవము
మరగిపోయి నాగుండియ
నురిగిపోయెనే జవరాలా - ఓహో!

తనయెడ తప్పేయున్నది
అనుకోవే నాథునిదెస
వనితలు నీవలె కఠినులు
కనిపించరు వే యెందును - ఓహో!

ఇంత కోప మేమిటికే 
ఇంత పంత మేమిటికే
ఇంతులు జగమున పతులకు
నింతలు సేయుదురట వే - ఓహో!

ఇప్పుడేగదె నాకౌగిట
కప్పితి నీ శోకమూర్తి
అప్పుడే నిలువున నీరై
యెప్పుడు ప్రవహించితివే - ఓహో!

అంత పగే పూనితివో
అంత కోప మొందితివో
ఇంతీ నను శిక్షింపగ
నింకొక మార్గము లేదటె - ఓహో!

రాలపైత తొలినాళుల
కా లిడగా నోర్వలేవు
రాలను కొండల గుట్టల
నేలా ప్రవహించెదవో - ఓహో!

ఈ దురదృష్టుడ నేమని
రోదించెద నడవులందు
నీదే నీదే తప్పని 
వాదించిన వడవులెల్ల - ఓహో!

ఇదిగొ చేతులను చాచితి
నేడ్చుచుంటి కంఠమెత్తి
ముదితా వినిపించుకొనక
పోతివటే ప్రియురాలా - ఓహో!

నీకై యేడిచి యేడిచి
నాకంఠము సన్నవడియె
నాకన్నులు మందగించె
నాకాయము కొయ్యబారె - ఓహో!

ఈ యేడుపు రొదలోపల 
నా యొడలే నేనెరుగను
నాయీదేహ మిదేమో
ఱాయివోలె నగుచున్నది - ఓహో!

Sunday, February 2, 2020

గొంతు చీకటి


గొంతు చీకటి




సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి
కృష్ణశాస్త్రి పద్యాలు సంకలనం నుండి
ఈ గొంతు చీకటి కవిత ఆస్వాదించండి-

నాటి యామని వరువాత తోటలోన
పాటలో మేలుకొన్న స్వప్నములు, మూగె
పాటల పలాశములు, నా గవాక్ష వీథి
నా నయనముల నుండి, నాలోన నిండి!

ఎంత మెత్తని యడుగుల నేగుదెంచి
నావొ నాకయి నాకుటీరాజిరమున
''నేను రావచ్చునా'' యన్న నీ పిలుపు వి
నంబడదు నాటి యూహాంగణముల జొచ్చి!

పోయె నాకోయిలల కారు, పోయెను నవ
మల్లికల వేళ, శ్రావణ మ్మా శరత్తు;
మూలమూలల ఈ పర్ణశాల నేడు
హిమపదాంకములెే తలయెత్తి పిలుచు!