Showing posts with label చిలకమర్తి. Show all posts
Showing posts with label చిలకమర్తి. Show all posts

Thursday, January 26, 2017

అన్నిదానములలోకి గొప్పదేది?


అన్నిదానములలోకి గొప్పదేది?




సాహితీమిత్రులారా!


చిలకమర్తివారి ఈ పద్యం చూడండి-
దానాలలో ఏది ఎలాంటిదో చెబుతున్నది-

అన్నదానము గొప్పదనవచ్చునే గాని        
                      అన్నంబు జాములో నరిగి పోవు         
వస్త్రదానము గూడ భవ్యదానమె గాని        
                      వస్త్రమేడాదిలో పాతదగును        
గృహదానమొకటి యుత్కృష్ట దానమె గాని      
                       కొంప కొన్నేండ్లలో కూలిపోవు         
భూమిదానము మహా పుణ్యదానమె గాని                              
                        భూమి యన్యుల జేరి పోవవచ్చు           
అరిగిపోక , ఇంచుకయేని చిరిగిపోక           
కూలిపోవక యన్యుల పాలుగాక             
నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి          
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి            


పంపినవారు : 
అలంకారం విజయకుమార్.

Friday, June 24, 2016

నీ యందమృతము గలదు పకోడీ


నీ యందమృతము గలదు పకోడీ


సాహితీమిత్రులారా!

ఒకనాటి సాయంకాలం నాటకసమాజంలో
అందరూ కలిసి పకోడీలు
తింటూ ఉండగా చిలకమర్తి వారితో
టంగుటూరు ప్రకాశంపంతులుగారు
 "మీరు పకోడీమీద పద్యాలు చెప్పండి
పద్యానికి ఒక పకోడీ ఇస్తాను" అన్నాడట.
"కవులకు అక్షరలక్షలు ఇచ్చే కాలం గతించింది.
పద్యానికి పకోడీ ఇచ్చే దుర్దినాలొచ్చినై" అని,
వెంటనే
ఈ క్రింది పద్యాలు చెప్పారట
చిలకమర్తివారు.

వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటేగాని లేదట
కనుగొన నీ యందమృతము గలదు పకోడీ!

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యీ ఘుమ ఘుమ యా పొంకము లా
రాలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు నిజము పకోడీ!

కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధన తండున్
కోడి వలదా బదులు ప
కోడిం దినుఁడనుచుఁ జెప్పకూర్మి పకోడీ!

Wednesday, June 22, 2016

తెల్లవారను గడుసరి గొల్లవారు


తెల్లవారను గడుసరి గొల్లవారు



సాహితీమిత్రులారా!


అది భారతస్వాతంత్య్రసంగ్రామం జరుగుతున్నరోజులు.
అతివాదయుగమని చరిత్రకారులు చెప్పుకొనే రోజులు.
ఆ ఉద్యమంలో లాల్(లాలాలజపతిరాయ్), బాల్(బాలగంగాధర తిలక్),
పాల్ (బిపిన్ చంద్రపాల్), ఘోష్ (అరవిందఘోష్) ల ప్రభావంతో
ఉద్యమం జరుగచున్నరోజులు.
1907 సంవత్సరంలో  రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఆంగ్లోపన్యాసానికి
తెలుగు అనువాదం చేయటానికి చిలకమర్తి లక్ష్మీనరసిహంగారు పూనుకొన్నారు.
సభ పూర్తిఅయి ముగిసే సమయంలో చిలకమర్తివారు ఈ పద్యం చెప్పారు.

భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుతున్నారు మూతులు బిగియగట్టి

ఈ పద్యం కష్టమైన పదాలు లేకుండా సరళంగా ఉండటంమూలాన
నాటి దేశదుస్థితిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నందున
ప్రేక్షకులను ఏంతగానో ఆకట్టుకుంది.
మిన్నుమార్మోగేలా కరతాళ ధ్వనులు చెలరేగాయి.
సభకాగానే ఎందరో దగ్గరకు వచ్చి
ఆ పద్యాన్ని మళ్ళీమళ్ళీ చదివించుకొని కంఠస్థం చేశారు.
ఆ నాటి పత్రికలన్నీ ఈ పద్యాన్ని ప్రచురించాయి.
ఊళ్ళోగోడల మీది కెక్కింది ఈ పద్యం. అయితే
నాటిప్రభత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని
పోలీసువారు చర్యకు పూనుకొన్నారు.
ఆ సమయంలో భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు
తెల్లవారను - అంటే తెల్లవారఁగా అని అర్థం చెప్పి
ప్రభుత్వాన్ని శాంతింపచేశారు.
చూడండి
ఈ పద్యం ఎంత ప్రభంజనం సృష్టించిందో!
నేటికీ మరువని పద్యమైందికదా!