Saturday, April 30, 2016

"విప్పి చెప్పేవాడు విమర్శకుడు"


"విప్పి చెప్పేవాడు విమర్శకుడు"


సాహితీమిత్రులారా!
"కప్పిచెప్పేవాడు కవి - విప్పి చెప్పేవాడు విమర్శకుడు" -  అనేది నానుడి.

నన్నయ రాజరాజును సంబోధిస్తూ రాసిన పద్యం ఇది.

శ్రీరమణీప్రియ, ధర్మవి
శారద, వీరావతార. సౌజన్య గుణా
ధార భువనైక సుందర
వీర శ్రీరమ్య బుధ వివేక నిధానా (సభా-2-1)

నన్నయ సామాన్యంగా శ్లేషనుగాని, చమత్కారాన్నిగాని పాటించడు.
మరి ఈపద్యంలో నన్నయ వాడిన విశేషణాలు రాజరాజు గుణగణాలను
కీర్తించినవే కానీ ఓప్రతిభా విమర్శకుడు చేసిన విమర్శను చూడండి.

శ్రీరమణీప్రియ - శ్రీకృష్ణుడు,
ధర్మవిశారదుడు - ధర్మరాజు,
వీరావతారుడు - భీముడు,
సౌజన్యగుణాధారుడు - అర్జునుడు,
భువనైకసుందరుడు - నకులుడు,
బుధవివేకనిదానుడు - సహదేవుడు - అని వివరించాడు.
కవి భావనలోని విశేషాలను చమత్కారాలను విమర్శకులు చాతుర్యంగా
విపులీకరించగలరని దీన్ని బట్టి అర్థమౌతుంది.

ద్రౌపదికి పాండుపుత్రులు ఏమౌతారు?


ద్రౌపదికి పాండుపుత్రులు ఏమౌతారు?


సాహితీమిత్రులారా!
ద్రౌపదికి పాండుపుత్రులు ఏమౌతారు?  అంటే ఏమౌతారు?
భర్తలౌతారు కదా!  ఇంకేముంది. అంటే సరిపోదు.
బావ - మరుదులు అంటే ఎవరు బావ? ఎవరు మరిది?
అందరూ బావలౌతారా?
అందరూ మరదులౌతారా?
ఇందులో ఏముందో
ఈ శ్లోకంలో చూడండి....

ద్రౌపద్యా పాండు తనయా:
పతి దేవర భావుకా:
న దేవరో ధర్మరాజ:
సహదేవో న భావుక:

అంటే ద్రౌపదికి పాండుపుత్రులు
భర్త, మఱది, బావ లౌతారు.
అందరూ భర్తలౌతారు
కానీ ధర్మరాజు మఱిది కాలేడు.
సహదేవుడు బావకాలేడు.
ఇదీ విషయం.

Friday, April 29, 2016

గవేషణ


గవేషణ


సాహితీమిత్రులారా!

"దాశరథి"గా పేరుగాంచిన "దాశరథి కృష్ణమాచార్య" 1987 నవంబర్ 5న అస్తమించిన
తరువాత1988లో "చైతన్యసాహితీసమాఖ్య-హైదరాబాద్" వారు
"నేత్రపర్వం" పేరున దాశరథిగారికి కవితానీరాజనం అర్పించారు.
దానిలోని ఒక కవిత ఈ గవేషణ

గవాక్షంలో నుంచి గదిలోకి
గంతువేసింది దౌర్జన్యం
    కత్తిపోట్లకి తట్టుకోలేక
    నెత్తురుకక్కి మరణించింది సౌజన్యం
పట్టపగలు నట్టనడివీధిలో
పట్టుపడకుండా వెళ్ళిపోయింది దౌర్జన్యం
      సానుభూతిపరులు నిర్మించిన పాలరాతి
      సమాధిలో పవ్వళించింది సౌజన్యం
దానవులు విజృంభించిన ధరామండలంలో
మానవులకోసం జరుగుతోంది అన్వేషణ
      యెడారిలో పుడిసెడు నీళ్ళకోసం
      ఇసుకలో తైలధరకోసం గవేషణ

కలువకన్నె మొర


కలువకన్నె మొర


సాహితీమిత్రులారా!

వేంకటపార్వతీశ్వరకవులు వ్రాసిన కలువకన్నె మొరలో
ఈ భాగం చూడండి కలువ ఏవిధంగా మొర పెట్టుకొనుచున్నదో..

మంతనంబు లయ్యె మాటలు లేకుండ
మోహ ముద్రలయ్యె ముట్టకుండ
కలలఁగాంచుటయ్యె కనుమోడ్పు లేకుండ
నిందలేల నాకు చందమామ

మాటలు లేకుండానే మంతనాలైనాయట. ఒకరినొకరు తగలకుండానే
మోహముద్రలైనాయట. కనులు మూసుకోకుండానే కలలు
కనడం అయినదట. ఏమీ జరగకుండానే చెడ్డపేరు నాకెందుకు
ఓ చందమామ అంటూంది కలువకన్నె.
ఎంత అద్భుత భావన.

Thursday, April 28, 2016

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు......


ఎవ్వాని వాకిట నిభమద పంకంబు......


సాహితీమిత్రులారా!

ఈపద్యం ఆంధ్రమహాభారతం విరాటపర్వం(2-191)లో తిక్కనసోమయాజి రచించినది.
ద్రౌపది ధర్మరాజు గొప్పదనాన్ని చెబుతున్న సందర్భంలోనిది.

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు 
          రాజభూషణ రజోరాజినడఁగు
నెవ్వాని చారిత్ర మెల్లలోకములకు
           నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
నెవ్వాని కడగంట నివ్వటిల్లెడి చూడ్కి
           మానిత సంపదలీనుచుండు
నెవ్వాని గుణలత లేడు వారాసుల
           కడపటికొండనైఁ గలయఁబ్రాఁకు
నతఁడు భూరిప్రతాప మహాప్రదీప
దూరవిఘటిత గర్వంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుఁడు గేవల మర్త్యుండె ధర్మసుతుడు

పై పద్యాన్ని అనుకరిస్తూ ఉన్నట్లున్న పద్యం
తారాతోరణము అవతారికలో కరుణశ్రీ
వెలయించిన పద్యం ఇది తిలకించండి.

ఎవ్వాని గళములో నువ్వుకొన్నది నంద 
        నారామ మధర మందార వల్లి
ఎవ్వాని కలములో నివ్వటిల్లెను విశ్వ
        భారతీ మంజుల మంజీర రవము
ఎవ్వాని చెలిమిలో నివ్వాళు లెత్తెను
        పర్దాలు లేని సౌర్ద లక్ష్మి
ఎవ్వాని కలిమిలో పవ్వళించెను సుప్త
       గుప్తదాన వ్రత ప్రాప్తతృప్తి
అతడు నండూరి వంశపయ పయోధి
చంద్రముడు రామకృష్ణమాచార్యసుకవి
గద్యపద్యతారాతోరణాద్యనేక

కావ్యనిర్మణచాతురీ సవ్యసాచి

ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి.....


ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి.....


సాహితీమిత్రులారా!
తెలుగు కావ్యజగత్తులో సుప్రసిద్ధములై శతాబ్దాలుగా
సాహితీ రసికుల ఆస్వాదములై వస్తూన్న వాటిలో
"శశాంకవిజయం, రాధికా సాంత్వనం, బిల్హణీయం, వైజయంతీవిలాసం,
అహల్యా సంక్రదనం" మొదలైనవి. వీటిని ఎవరంటే వారు చదవకూడదని
వీటిపై బ్రిటిషువారి కాలంలో నిషేధం విధించబడునది. దాన్ని
తొలగించడానికి అనేకులు అనేకరకాలుగా శ్రమించారు.
అది గతం ఇప్పుడో వీటిని సదివే ఆసక్తిఉన్నా అర్థం చేసుకోగల సామర్థ్యం తగ్గి
వీటిని చూడటం తగ్గిందనవచ్చు.
ఏమైతేనేమి సాహితీనందనంలో అడపాదడపా వీటినేకాక అనేకానేక
విషయాలను ముచ్చటించుకుందాం.
అసలు విషయానికొస్తే శశాంకవిజయంలో తార చంద్రునికి తనపై మోహం
కలిగేలా తన గురువు గారైన బృహస్పతి తదితరుల రహస్యకార్యకలాపాపాల చిట్టా
ఈ విధంగా విప్పింది. చూడండి.

కన్నకూఁతు రటంచు నెన్నక భారతీ
        తరణిఁ గూడఁడె నీ పితామహుండు?
మేనత్త యను మేర మీఱి రాధికతోడ
         నెనయఁడే నిన్న నీయనుఁగు బావ?
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
         నెలతతోఁ బొందఁడె నీ గురుండు?
ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు
         సహపాఠి యౌ పాకశాసనుండు?
ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి
యమ్మ నేఁజెల్ల! న్యాయంబు లాడె దౌర!
కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన
దూరెదవు నన్నుఁ, జలహారి దోసకారి! (3-81)

Wednesday, April 27, 2016

దిగమ్రింగుము నీ పస కాన నయ్యెడున్


దిగమ్రింగుము నీ పస కాన నయ్యెడున్


సాహితీమిత్రులారా!

మహాకవిశ్రీనాథుడు పలనాటిసీమలో తినే తిండి తినలేక చెప్పిన పద్యం ఇది.

పుల్లసరోజనేత్ర! అల పూతన చన్నుల చేదుత్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితినటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ ఉడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లగ నొక్క ముద్ద దిగమ్రింగుము నీ పస కాన నయ్యెడున్.

ఓ పద్మాక్షా! శ్రీ కృష్ణా! పూతన స్తనాల విషాన్ని తాగాననీ, కార్చిచ్చు మింగాననీ
ఎందుకయ్యా నిక్కుతావు చింత చిగురుతో ఉడుకుడుకు బచ్చలి కూర
జొన్నన్నంతో ఒక ముద్ద మింగు - గొంతు దిగుతుందేమో చూస్తాను.
నీ పస తెలుస్తుంది అని చమత్కారంగా పలికాడు.

"రసానందము బ్రహ్మానందసహోదరము"


"రసానందము బ్రహ్మానందసహోదరము"


సాహితీమిత్రులారా !
రసో వై స: - అతడు రసస్వరూపుడు - అనగనది వేదకాలంనాటి సూక్తి.
రసానందము బ్రహ్మానందసహోదరము, లోకోత్తరచమత్కారభాజనము,
విగళితవేద్యాంతరము, అనిర్వచనీయము, వాచామగోచరము - అని అనేకవిధాలుగా
అలంకారికులు వివరించినారు. లౌకికసంతోషం వేరు, ఆనందం వేరు మానుషసంతోషానుభూతికంటె ఎన్నోలక్షలరెట్లు అనందానుభూతి గొప్పదని అలంకారికుల ప్రవచనం.
తైత్తిరీయోపనిషత్తు నందలి ఆనందవల్లిలో ఆనందమీమాంస కలదు. మానుషానందం అనగా యువకుడు, సాధువు, ద్రఢిష్ఠుడు, బలిష్ఠుడునైన మహారాజు అనుభవించు ఆనందం.
బ్రహ్మానందం అనగా ఆనందవల్లి గణితం ప్రకారం-
100 మానుషానందములు = 1మనుష్యగంధర్వానందం
100 మనుష్యగంధర్వానందములు = 1 దేవగంధర్వానందం
100 దేవగంధర్వానందములు = 1 పితృదేవతానందం
100 పితృదేవతానందములు = 1 ఆజానదేవతానందం
100 ఆజానదేవతానందములు = 1 కర్మదేవతానందం
100 కర్మదేవతానందములు = 1 దేవానందం
100 దేవానందములు = 1 ఇంద్రానందం
100 ఇంద్రానందములు = 1 బృహస్పత్యానందం
100 బృహస్పత్యానందములు = 1 ప్రజాపత్యానందం
100 ప్రజాపత్యానందములు = 1 బ్రహ్మానందం
పై చెప్పిన గణితం ప్రకారం
100000000000000000000 మానుషానందాలు = 1 బ్రహ్మానందం

మరి బ్రహ్మానందం అంటే బ్రహ్మానందమా మజాకా

Tuesday, April 26, 2016

కుప్పసములు ముర్మరములు కుచకుంభములున్కుప్పసములు ముర్మరములు కుచకుంభములున్


సాహితీమిత్రులారా!
హేమంత ఋతువును ప్రతికవి తనదైనశైలిలో కావ్యాల్లో వర్ణించారు.
కవికర్ణరసాయనంలో సంకుసాల నృసింహకవి వర్ణన ఈ పద్యంలో చూడండి.

చెప్ప నశక్యంబగు చలి
యుప్పతిలం బాల వృద్ధ యువజనములకుం
దప్పక శరణములయ్యెం
గుప్పసములు ముర్మురములు గుచకుంభములున్ (6-30)

కవి చలికాలంలో ప్రజలు పొందిన బాధను వారు ఆశ్రయించిన శరణములను చెప్పినాడు.
ఆ భయంకరమగు చలిలో బాలురకు చొక్కాలును, వృద్ధులకు కుంపట్లును,
యువజనుయకు వనితల కుచకుంభములును శరణములయ్యాయని
ఈ పద్యం భావం.

కురుక్షేత్రం - అంతరించిన తరాలు

కురుక్షేత్రం - అంతరించిన తరాలు


సాహితీమిత్రులారా!

మహాభారతకాలంనాటి మానవుల ఆయు: ప్రమాణం కంటే నేటి మానవ జీవన ప్రమాణం స్వల్పమైనది.
నాటి ప్రజల్లో కొందరైనా దాదాపు 200 సంవత్సరాలు జీవించినట్లు దాఖలాలున్నాయి. అంతేకాదు
ఆనాటివారికి రమారమి 80 లేక 90 సంవత్సరాలు పైబడే యౌవనం నిత్యకల్యాణం పచ్చతోరణంలా
ఉండినట్లు తెలుస్తోంది. భారతంలోని లెక్కలను బట్టి యుద్ధంనాటికి ధర్మరాజు వయసు 72 ఏండ్లుంటే మరి పితామహుడైన భీష్మునికి వయసెంత, భీష్ముని చిన్నాన్న బాహ్లికుని వయసెంత దాదాపు 150 - 200 సంవత్సరాల మధ్య ఉండి ఉండవచ్చుకదా!
ఈ కురుక్షేత్రయుద్ధంలో అక్షరాలా ఐదు తరాలు అంతరించాయి. గమనించండి.
1. ధృతరాష్ట్రుడు, తనసోదరులు ((భూరిశ్రవుడు, మొ....... సోమదత్తుని కొడుకులు)
2. ధృతరాష్ట్రుడుని పెదనాన్న భీష్ముడు,సోమదత్తుడు(భీష్ముని సోదరుడు)
3. ధృతరాష్ట్రుడుని తాత( భీష్ముని చిన్నాన్న బాహ్లికుడు)
4. ధృతరాష్ట్రుని కొడుకులు (కౌరవులు)
5. ధృతరాష్ట్రుని మనుమలు (లక్ష్మణుడు, అభిమన్యుడు,ఘటోత్కచుడు....)
తనసోదరులు, తండ్రి, తాత, కొడుకులు, మనుమలు

ఈ యుద్ధం 500 చదరపు మైళ్ళలో జరిగింది. కావున శాంతిమంత్రమే ప్రపంచసౌభాగ్యానికి బలమైన ఆయుధం.

Monday, April 25, 2016

రసమయి

రసమయి

సాహితీమిత్రులారా!
"కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి" గారి కలంనుండి జాలువారిన
ఉదయశ్రీ (అయిదవ భాగం)లోని "రసమయి" పేరున  గల
ఈ మూడు పద్యాలను ఆస్వాదించండి.

కలువలు పూచినట్లు! చిరుగాలులు చల్లగ వీచినట్లు! తీ
వలు తల లూచినట్లు! పసిపాపలు చేతులు సాచినట్లు! క్రొ
వ్వలపులు లేచినట్లు! చెలువల్ చెలువమ్ముగ చూచినట్లుగా
పలుకుట పూర్వపుణ్యపరిపాకముగాదె తలంచి చూడగన్

తెలతెలవారులీల! తొలిదిక్కున బాలమయూఖ మాలికల్
కలకలలాడులీల! కమలమ్ములజంట సరోవరమ్ములో
కిలకిల నవ్వులీల! గిలిగింతలతో సెలయేటి కాలువల్
జలజల పారులీల! కృతిసల్పుట భాగ్యము యోగ్య మెంతయున్

"ఛందోబద్ధకవిత్వ" మట్లు బిగువుం జందోయి కందోయికిన్
విందుల్సేయ "స్వతంత్రగీతిక" వలెన్ నెమ్మోముపై ముంగురుల్
చిందుల్ త్రొక్క "కథానికా" విధమునన్ చిర్నవ్వు చెక్కిళ్ళలో
స్పందింపన్ కనుముందు నిల్చు రసనిష్యందంబ! నీ వెవ్వరే?

తత్త్వవేత్తకు గంజాయి దమ్ముకాడనంగ


తత్త్వవేత్తకు గంజాయి దమ్ముకాడనంగసాహితీమిత్రులారా!

అవినీతి, అజ్ఞానం, దైష్ట్యం ప్రబలిన ఈ లోకంలో, కొన్ని మంచి పదాలకు
విపరీత విరుద్దార్థాలు వచ్చినవని, బాధపడుచు
కవి భగవంతునికి తన మొఱను ఈవిధంగా
విన్నవించుకొన్నాడు.


"అప్రయోజకుడు" నా, "అవివేకి"యన రెండు సంకేతములు చెల్లు సజ్జనునకు
"రండ" యన, "నపుంసకు"డన నాఖ్యలై ఎసగుచుండును విజితేంద్రియునకు,
"ఛాందసుం"డన, "వేదజఢు"డన నామముల్ జరగు సదాచార వర్తనునకు,
"స్నేహదూరుం"డన, "చెనటి"నా అభిధలై క్రాలుచుండును సత్యశీలునకును,
పరగ "పిసినిగొ"ట్టనగ, "పిశాచి" యనగ
ద్రవ్యశాలి కభిఖ్యలై ధరణియందు, 
"తత్త్వవేత్త"కు గంజాయి దమ్ము కాడ
నంగ నభిధేయమై యొప్పు నంగజారి

ఓ అంగజారి! (మన్మథుని దహించినవాడా!)
లోక వ్యవహారంలో కొన్ని మంచి పదాలకు మారిన అర్థాలు -
1. సత్పురుషులకు అప్రయోజకుడు(పనికిమాలినవాడు),
    అవివేకి(తెలివి లేనివాడు) అనియు,
2. ఇంద్రియ నిగ్రహం గలవానికి రండ (రమించువాడు) అని,
    నపుంసకుడు (మగతనంలేనివాడు) అని
3. మంచి ఆచార సంప్రదాయాలను అనుసరించేవారిని ఛాందసుడు(ఛాదస్తం గలవాడు),
    వేదజఢుడు (వేదాలను అభ్యసిస్తూ, అర్థం తెలియని మూర్ఖుడు) అని,
4. సత్యస్వభావం గలవాడిని, సూటిగానడిచే వానికి స్నేహదూరుడు(మైత్రినిపాటించనివాడు)
     అని, చెనటి (వ్యర్థుడు, దరిద్రుడు..) అని
5. అనవంతునికి, డబ్బెవ్వరికి దానం చేయక, దాస్తున్నందున,
    పిసిగొట్టు(పిసినివాడు) అని, పిశాచి(దయ్యం) అని
6. తదేకధ్యాసతో యదార్థ జ్ఞానాన్ని తెలుసు కొనుటకు ఆలోచించే తత్త్వవేత్తను
    గంజాయిదమ్ముకాడు (గందాయి అనే మత్తు పదార్థాన్ని సేవించటంతే
    మత్తేక్కి కళ్ళు మూసుకొన్నవాడు) అని
- ఇట్లా మారు పేర్లు పెట్టి పిలుస్తారు.

Sunday, April 24, 2016

కన్నొక్కటి లేదుగాని కంతుడవయ్యా!


కన్నొక్కటి లేదుగాని కంతుడవయ్యా!

సాహితీమిత్రులారా!
ఒకమారు కృష్ణదేవరాయల అల్లుడు తిరుమలరాయలు తనపై పద్యం చెప్పమని
తెనాలి రామకృష్ణుని అడిగాడట.
దానికి ఆయనపై ఈ పద్యం చెప్పాడట.

అన్నాతిఁ గూడ హరుడవుఅన్నాతిని గూడకున్న అసురగురుఁడ వీవన్నా! తిరుమలరాయా!కన్నొక్కటి లేదుగాని కంతుడవయ్యా!

ఓ తిరుమలరాయా రాణీగారితో కలిసి మీరు మూడు కన్నులున్న శివుడివి. 
ఆమెతో కలవక ఒంటరిగానైతే మీరు శుక్రాచార్యులు. 
కన్ను ఒకటే తక్కువగాని మీరు మన్మథులు- అని భావం

దీనికి మరో పాఠాంతరం కూడావుంది. చివరి పాదం ఈవిధంగా మారిస్తే
కన్నొక్కటి కలదుకాని కౌరవపతివే
దీన్ని తీసుకుంటే కన్ను ఒకటి ఉంది కాని 
అది లేకపోతే నీవు నిజంగా ధృతరాష్టుడవే - అని అర్థం మారుతుంది.

తామర యంటులోనిది కదా!


తామర యంటులోనిది కదా!


సాహితీమిత్రులారా!

ఈపద్యంలోని చమత్కారం గమనించండి.
రాముని గూర్చి అహల్యా గౌతముల కుమారుడైన శతానందుడు
విశ్వామిత్రునితో చెప్పిన సందర్భంలోనిదీ పద్యం.

తామర యంటులోనిది కదా! యది తంపరగాక మానునే?రాము గభీర నాభి కుహరంబున తామరపుట్టె నంటు కాదామరి? దాని జాతి యది యంతన వీడునె? ప్రాకెగాక! నెమ్మోమును, కన్నుదోయి, కరముల్, పదముల్, సరిగా నెగాదిగన్!


దీనిలో రాముని(విష్ణువు) నాభిలో తామర (చర్మవ్యాధి) పుట్టింది 
అది అల్లుకొని పోయింది రాముని మోము(ముఖం) తామర(పద్మం), 
కన్ను తామర(పద్మం),చేతులు తామర(పద్మం), పాదాలు తామర(పద్మం)
తామర అనే పదానికున్న "చర్మవ్యాధి" అర్థంతో 
కవి ఎంతటి చమత్కారం సృష్టించాడో చూడండి.

తామరతూడుకు - తామరవ్యాధికి వ్యాపించే లక్షణం సమాన ధర్మం.

Saturday, April 23, 2016

నిరుపహతి స్థలంబు


నిరుపహతి స్థలంబు


సాహితీమిత్రులారా!
కృష్ణదేవరాయలు ఒక కృతిని రచింపమని అడిగితే పెద్దన ఈ పద్యం చెప్పాడని ప్రసిద్ధి చెందినది.

నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే


అంటే కృతి రాయాలంటే సరైన స్థలం దానితోపాటు రమణీయమైన
ప్రియదూతిక తెచ్చి ఇచ్చే కర్పూరతాంబూలము, ఆత్మకు ఇంపైన భోజనము,
ఉయ్యెలమంచము, ఇది ఒప్పు ఇది తప్పు అని తెలియగల రసజ్ఞులు,
చెప్పినదాన్ని తెలుసుకొని రాయగల లేఖకులు, ఉత్తమమైన పాఠక మహాశయులు కావాలి
 ఇవేవీ లేకుండా కృతి రాయడం ఎలా - అని భావం.

Friday, April 22, 2016

ఆంధ్రకవితా పితామహ


ఆంధ్రకవితా పితామహ


సాహితీమిత్రులారా!

ఆంధ్రకవితా పితామహ అంటూనే చటుక్కున గుర్తుకు వచ్చే పేరు అల్లసాని పెద్దన.
ఇది ఈయనకే మొదట ఈయబడిందా ఇంకెవరికైనా ఈ బిరుదు ఉందా అనే పూర్వాపరాలలోకి వెళితే అర్థమౌతుంది. ఈ బిరుదు అంతకు పూర్వం ఇంకా కొందరికి ఉన్నట్లు తెలుస్తుంది. దీని మీద నిడుదవోలు వెంకట్రావుగారు పరిశోధన చేసి భారతిమాస పత్రికలో ప్రకటించి ఉన్నారు.
ఆ విషయాలను మరొకసారి తెలుసుకుందాం
క్రీ.శ. 1260 లో శివదేవయ్య
క్రీ.శ. 1400 లో కొఱవి సత్తెనారన (సత్యనారాయణ)
క్రీ.శ. 1530 లో అల్లసాని పెద్దన
క్రీ.శ. 1600 లో ఉప్పు గుండూరి వెంకట కవి
క్రీ.శ. 1680 లో ఎనమండ లక్ష్మీనృసింహకవి
వీరందరికి ఆంధ్రకవితా పితామహుడు అనే బిరుదు కలదు.
1833 - 97 లో నివసించిన మండపాక పార్వతీశ్వరకవికి
అభినవాంధ్రకవితాపితామహ అనే బిరుదు కలదు.

తెలుగు పద్యానికి కన్నడ మూలం


తెలుగు పద్యానికి కన్నడ మూలం


సాహితీమిత్రులారా!

"నిరుపహతి స్థలంబు" - అనే పద్యం నిన్న తెలుసుకున్నాము.
దీనికి మూలం కన్నడంలో సూక్తిసుధర్ణవము అనే సంకలన గ్రంథము.
ఇది క్రీ.శ. 1240 లో సంకలనం చేయబడిన గ్రంథం.
రాయలవారు పెద్దనను కృతిచేయమన్నపుడు ఈ కన్నడ పద్యం స్ఫురించి
తెలుగులో ఈ పద్యం చెప్పి ఉంటాడని పెద్దలభావన.
కన్నడ పద్యం -

నిరుపహతిస్థలం మృదుతరాసన మెళ్లుణిసింపుదంబులంనరపిద పుస్తకప్రతతి లేఖకవాచక సంగ్రహం నిరంతర గృహనిశ్చితస్థితి విచారక సంగతి సత్కళత్ర సాదరసయినుళ్ల సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియున్


దీనిలో చివరి పాదం భావం మారినా ఎత్తుగడ పదబంధము
తెలుగు పద్యమునకు కన్నడ మూలమని తెలిసి పోతున్నది.
చారిత్రకంగా చూస్తే పెద్దనకు ఇది 300 సంవత్సరాలకు పూర్వంలోనిది ఈ పద్యం.
దీన్ని బట్టి మన పెద్దనకు తెలుగేకాదు కన్నడం కూడా బాగా తెలుసని అర్థమవుతుంది.

Thursday, April 21, 2016

తిరుమల వర్ణన


తిరుమల వర్ణన

సాహితీమిత్రులారా!

తిరుమల కొండను ఒక కవి కొండ - అనే అంత్యప్రాసతో ఎంత కీర్తించారో చూడండి.

సీసపద్యం
శృంగార రాయని చెలువుమీఱిన కొండఫణిరాజు పేరిట పసిడి కొండపుష్పజాతులనెల్ల భూషింపఁగల కొండకల్పవృక్షములైదుఁ గల్గు కొండచిలుకలు కోవెలలో చెలఁగి కూసెడి కొండమృగరాజు కోట్లెల్ల మెలఁగు కొండఘోర పాపము వాపుకోనేఱుగల కొండతలఁచిన మోక్షంబు దగులు కొండఅమర వరులకు వైకుంఠమైన కొండఆళు వారికిఁ బ్రత్యక్షమైన కొండఅర్థిజూచిన బ్రహ్మాండమైన కొండయేనుగనుఁ గొంటి శ్రీవేంకటేశు కొండ

ఆంధ్రవిద్యార్థి


ఆంధ్రవిద్యార్థి


సాహితీమిత్రులారా!
ఆంధ్రవిద్యార్థిలో మూడవ పద్యం.

కాళిదాసకవీంద్ర కావ్యకళావీధి, పరుగులెత్తెడి రాచబాటనాకు
భట్టబాణుని ముద్దుపట్టి కాదంబరి, కథలు చెప్పెడి చెల్మికత్తెనాకు
భవభూతి స్నేహార్ధ్ర భావవైభవగీతి, కరుణరసాభిషేకమ్మునాకు
వాల్మీకికవిచక్రవర్తి భావస్పూర్తి, ఆటలాడెడిపూలతోటనాకు
భారతీదేవి మృలాంక భద్రపీఠి
ముద్దులొలికెడి రతనాలగద్దెనాకు
తెనుగుతోటల సంస్కృత వనలతాళి
నంటుత్రొక్కెడి "
యాంధ్రవిద్యార్థి" నేను

Wednesday, April 20, 2016

ఆంధ్రవిద్యార్థి


ఆంధ్రవిద్యార్థి


సాహితీమిత్రులారా!

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి

"ఆంధ్రవిద్యార్థి"లోని రెండవ పద్యం.


ఒకమాటు కనుమోడ్చుచుందు బమ్మెరవారి 

          మందారమకరంద మధురవృష్టి

ఒకమాటు మూర్కొనుచుందు తిమ్మనగారి 

          పారిజాతవినూత్న పరిమళమ్ము

ఒకమాటు చవిచూచుచుందు పెద్దనగారి 

          ద్రాక్షాగుళచ్ఛసుధాసుధార

ఒకమాటు విహరించుచుందు పింళివారి 

          వరకళాపూర్ణ సౌవర్ణ శిఖరి

ఒకట కవితా కుమారితో నూగుచుందు

గగన గంగా తరంగ శృంగారడోల

ఆంధ్రసాహిత్యనందనోద్యమసీమ

నర్థి విహరించు "నాంధ్రవిద్యార్థి" నేను


ఆంధ్రవిద్యార్థి


ఆంధ్రవిద్యార్థి

సాహితీమిత్రులారా!

కరుణశ్రీగారు ఉషశ్రీలో "ఆంధ్రవిద్యార్థి"  శీర్షికన వ్రాసిన పద్యాలు మూడు వాటిలో ఒకటి

సర్వభూమీపూజ్య గీర్వాణభాషామతల్లి గారాబంపు తల్లినాకుఅత్యంత సుకుమారి ఆంధ్రభాషాయోష అల్లారుముద్దులచెల్లినాకునవనవోన్వేష సుందరమూర్తి సాహితీలక్ష్మియే అర్థాంగలక్ష్మినాకుకమనీయ మృదుపదక్రమ కవితాబాల కలికి పల్కుల పసికందునాకుపాణినీయులు దేశికప్రభులునాకుసరసవాఙ్మయపురము కాపురము నాకువాణివాయించు మాణిక్యవీణలోనియర్థమెరిగిన "ఆంధ్రవిద్యార్థి" నేను

Tuesday, April 19, 2016

కవితా కుమారి

కవితా కుమారి


సాహితీమిత్రులారా!జంధ్యాల పాపయ్వశాస్త్రిగారు కరుణశ్రీ అనే కలంపేరుతో తన రచనలు సాగించి చరితార్థులైనారు.
వారి ఉషశ్రీలోని కవితాఖండిక
ఈ కవితాకుమారి చూడండి.

జడయల్లి జడకుచ్చులిడ "రాయప్రోలు" "త

                                  ల్లావజ్ఝల" కిరీటలక్ష్మినింప

"పింగళి " "కాటూరి" ముంగురుల్ సవరింప 

                                 "దేవులపల్లి" శ్రీతిలకముంప 

"విశ్వనాథ" వినుత్న విధుల కిన్నెరమీట, 

                                  "తుమ్మల" రాష్ట్రగానమ్మొనర్ప

"వేదుల" "నాయని" వింజామరలు వేయ 

                                  "బసవరాజు" "కొడాలి" పదములొత్త

"అడవి" "నండూరి" భరతనాట్యములు సలుప

"జాషువా " "ఏటుకూరి" హెచ్చరికలిడగ

నవ్యసాహిత్య సింహాసనమున నీకు,

ఆంధ్రకవితాకుమారి "దీర్ఘయురస్తు"


ఈ కవితలో రాయప్రోలు, తల్లావజ్ఝల, కాటూరి,
దేవులపల్లి, విశ్వనాథ, తుమ్మల, వేదుల, నాయని,
బసవరాజు, కొడాలి, అడవి, నండూరి, జాషువా,
ఏటుకూరి - ఇవన్నీ కవులపేర్లే వీరు కవితాకుమారిని
రకరకాలుగా అర్చించారు. అందుకే వారందరిచేతిలో
పెరిగిన కవితాకుమారికి దీర్ఘాయు అంటున్నాడు
పాపయ్యశాస్త్రిగారు. ఎంత చమత్కారంగా కూర్చాడు.

వేశ్య - విటుడు


వేశ్య - విటుడు


సాహితీమిత్రులారా!
కామం  పరవళ్లు త్రొక్కే వయసులో ఒక యువకవి వేశ్యాగృహానికి వెళ్ళాడు.
ఆ వేశ్య (ఏబదిలోపు) తన కూతురును, మనుమరాలిని చూపి మాముగ్గురిలో
ఎవరు కావాలి నీకు అనడానికి అతనితో చమత్కారంగా ఈ విధంగా అంది.

మొల్ల సుగంధి కూతురది ముంగిట నున్నది దాని చూడు, ము
త్ఫుల్ల సరోజనేత్ర వరపుత్రిక పుత్రిక దీని చూడు, మే
నెల్ల విధంబులన్ కతుల నేలిన దానను నన్ను చూడు, నీ
వల్లుడవయ్యెదో? మగడవయ్యెదొ? ముద్దుల మన్మడయ్యెదో?


(మొల్ల సువాసనతోకూడిన కుమార్తె ముందుంది చూడు,
వికసించిన సరోజములవంటి కన్నులుగల నాకూతురు
కూతురు నా మనుమరాలు దీన్ని చూడు,
అన్ని రకాల రతులను తెలిసినదాన్ని నన్ను చూడు.
మరి నాకు అల్లుడైతావా మగడైతావా ముద్దుల మనుమడైతావా
- అని భావం)

దానికి ఆ యువకవి ఈ విధంగా చమత్కారంగా చెప్పాడు.

మొల్ల సుగంధి కూతురది ముంగిట నున్నది దాని మాన, ము

త్ఫుల్ల సరోజనేత్ర వరపుత్రిక పుత్రిక దీని మాన, మే

నెల్ల విధంబులన్ కతుల నేలిన దానను నిన్ను మాన, నే

నల్లుడవయ్యెదన్! మగడవయ్యెదన్! ముద్దుల మన్మడయ్యెదన్!అల్లుడనౌతాను, మగణ్ణౌతాను, మనుమణ్ణౌతాను అని అన్నాడు. 
అంటే నేను ముగ్గరను వదలను అన్నట్టు సమాధానం చెప్పాడు.

Monday, April 18, 2016

నీవెలా నిద్రపోతున్నావోకదా!


నీవెలా నిద్రపోతున్నావోకదా!

సాహితీమిత్రులారా!
మనకు నిద్ర రావాలంటే అలికిడి లేకుండా ఏ చిన్న శబ్దం లేకుండా ఉంటేగాని నిద్రరాదు. 
కాదంటారా! అందుకు భిన్నంగా ఎవరూ ఉండరుకదా! 
మరి ఈ శ్లోకం చూడండి.

విచిత్రం చారిత్రం తవ ఖలు మురారే! మమ పున:
ననిద్రా యత్కించిత్ భవతి మశకస్యైవ నినదాత్
కథం నిద్రాసి త్వం? శయన భుజంగోఛ్వాస రభసై:
విధే ర్వేదోద్ఘోష్టై: ప్రబలతర ఘోషైశ్వ జలధే:

మురారీ! నీ చరిత్ర విచిత్రం చిన్నదోమ చెవిదగ్గర 
రొదచేసినంత మాత్రాన నాకు నిద్ర పట్టదు! 
నీకు ఒక ప్రక్క వేయితలల పాము బుసలు! 
మరోప్రక్క బ్రహ్మ వేదఘోష!  
ఇంకొక ప్రక్క సముద్రఘోష! 
ఈ మధ్యలో నీవు ఎట్లా నిద్రచోతున్నావో కదా!
అలవాటై పోయిందా?Sunday, April 17, 2016

పెద్దనగారి - సంధ్యారాగం


పెద్దనగారి -  సంధ్యారాగం

సాహితీమిత్రులారా!

"నాకంటే మనుష్య స్త్రీలే ఎక్కువ అదృష్టవంతులు. వారు తాము ప్రేమించిన పురుషుడు 
నిరాకరిస్తే చనిపోతారు. నేను మరణించలేను" -  అని దు: ఖిస్తూ ఉంది వరూధిని.
ఇంతలో ప్రొద్దుక్రుంకినది.
సంధ్యాకాంతులు కమ్మినవి.
ప్రపంచమంతా ఎర్రబారినది.
ఈ సందర్భంలో పెద్దనగారి సంధ్యారాగం ఈ పద్యంలో చూడండి.

ఉరుదరీకుహరసుస్తోమ శార్దూలముల్ ఝరవారి శోణితశంకఁద్రావ

వనకుంజమధ్యశాద్వలచరన్మృగపంక్తి దావపావకరీతిఁ దల్లడిల్లి

నాశ్రమాంతరభూరుహాగ్రముల్ మునికోటి బద్ధకాషాయవిభ్రాంతిఁ జూడ

ఘనసానుశృంగశృంగాటకంబులఁ గాంచి యమరులు హేమాద్రి యనుచు వ్రాలఁ

గాసెఁ బేశలరుచిఁ గింశుకప్రవాళ

ఘుసృణకిసలయకంకేళికుసుమగుచ్ఛ

బంధుజీవజపారాగబాంధవంబు

లన్నగంబున జరఠారుణాతపములు

                 (మనుచరిత్ర - 3-11)

ఈ పద్యానికి విశ్వనాథవారి భావం చూడండి.
పెద్దగుహా గర్భములందు సుప్త - నిదురపోయి, ఉత్థ - లేచిన, శార్దూలముల్ -
పెద్దపులులు, ఝరవారిన్ - సెలయేళ్ళలోని నీటిని, శోణితశంకన్ - నెత్తురన్న ఊహతో,
త్రావన్ - త్రాగగా, పెద్దపులులు పగలెల్ల నిద్రపోయి ఆ మగత సరిగా తీరకముందు
సంధ్యాకాలపు ఎర్రదనంచేత ఎర్రబడిన సెలయేటి నీళ్ళు నెత్తురనుకొని త్రాగినవట.
అడవిలో అగ్ని బయలుదేరిందని లేళ్ళగుంపు భయపడినది.
మునులు చెట్లకొమ్మలమీది ఎర్రదనము చూచి ప్రొద్దున ఎండవేసిన
తమకావిబట్టలి శిష్యులు విప్పలేదని అనుకొనిరి. వట్టి కొండచెరియలు
చూచి దేవతలు వారి నివాసభూమియైన  బంగారు పర్వతవనుకొని
పడమటి కొండమీద వాలిరి.
మన పూర్వులు సంధ్యారాగాన్ని ఎంత అందంగా వర్ణించారో దీన్నిబట్టి తెలుస్తుంది కదా!

Saturday, April 16, 2016

రామనామ మహిమ


రామనామ మహిమ

సాహితీమిత్రులారా!

రామనామ మహిమ ఈ శ్లోకంలో కవి ఎంత చమత్కారంగా వర్ణించాడో చూడండి.

రా శబ్ద ఉచ్ఛారణేదేవ ముఖాన్నిర్యన్తి పాతకా:
పున: ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవత్


"రా" - అనుటలో నోరు తెరచుటచే పాపాలు బయటకు పోతాయి. ఆ పాపాలు తిరిగి ప్రవేశించకుండా
"మ " -కవాటమువలె నోరు మూయించును!

Friday, April 15, 2016

శ్రీరామనవమి శుభాకాంక్షలుశ్రీరామనవమి శుభాకాంక్షలు

చాప చ్ఛాత్ర నిషంగ భంగ కుపితక్ష్మాభృద్ధను: పంచవ
క్త్రీ పంచాలికదృఙ్నియుక్త హుతభుగ్గ్రీవాద్వయీపంచక
వ్యాపాదభ్రమకారిపంక్తిగళగళ్యాఖండంనాఖండదో
ర్నైపుణ్యప్రదరౌఘ రాఘవపరబ్రహ్మన్! స్తుమస్త్వామనున్

చాప = ధనుస్సుయొక్క, ఛాత్ర = శిష్యుడగు పరశురామునియొక్క, 
నిషంగ = తూణీరమగు సముద్రముయొక్క, భంగ = భంజన పరాజయ బంధ 
రూపకాపకారములచేత, కుపిత = కృద్ధుడైన, క్ష్మాబృద్ధను: = ఈశ్వరునియొక్క, 
పంచవక్త్రీ = వదనపంచకమందలి, పంచ = అయిదయిన, అలిక = ఫాలభాగములయందలి, 
దృక్ = నేత్రములవలన, నియుక్త = నియోగింపబడిన, హుతభుక్ = అగ్నులయొక్క, 
గ్రీవాద్వయీ = కంఠద్వంద్వములయొక్క, పంచక = ఐదింటియొక్క, అనగా పదింటియొక్క, 
వ్యాపాద = ఖండనరూపవ్యాపారముయొక్క, భ్రమ = భ్రాంతిని, కారి = చేయుచున్న, పంక్తిగళ = రావణాసురునియొక్క, గళ్య = గళ(కంఠసమూహముయొక్క), ఖండన = ఛేదంచుటయందు, 
అఖండ = అప్రతిహతమగు, దో: = బాహువుయొక్క, నైపుణ్య = శరసంధానాది
కౌశలముతోకూడుకొన్న, ప్రదరౌఘ = బాణసమూహముగల, రాఘవపరబ్రహ్మన్ = 
రఘుకులసంభవుడవగు శ్రీకామచంద్రపరమేశ్వరా, త్వాం = నిన్ను,
స్తుమ: = స్తోత్రముచేయుచున్నారము.

రాముడు, తన విల్లువిఱిచియు, తన శిష్యునడైన పరశురాముని అవమానించియు, 
తన అంబులపొదియైన సముద్రమును బంధించియు, తనకు మహాపకారము 
చేసినాడన్న కోపమున ఈశ్వరుడు ప్రయోగించిన పంచఫాల నేత్రములలోని 
పంచాగ్నుల పదికంఠములో యన నొప్పు పంక్తికంఠములను శ్రీరాముడు అవలీలగా 
దురిమినాడని తాత్పర్యము.

శ్రీరాముడు శివుని విల్లును విరచిన బలశాలి అని, పరశురాముని మించిన 
పరాక్రమవంతుడని, సముద్రుని బంధించిన మహిమ కలవాడని భావం.

దుర్ముఖి నామసంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు

దుర్ముఖి నామసంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషుకు
దుర్ముఖి నామసంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు

Thursday, April 14, 2016

ముదితల్ నేర్వగరాని విద్యగలదే?


ముదితల్ నేర్వగరాని విద్యగలదే?


సాహితీమిత్రులారా!

"ముదితల్ నేర్వగరాని విద్యగలదే? ముద్దార నేర్పించినన్" - అని అంటూ ఉంటారు.
అంటే ముద్దుగా నేర్పిస్తే ఆడవాళ్ళు దేన్నయినా నేర్చకోగలరు - అని దీని భావం.
ఇది 1931 అక్టోబరు, గృహలక్ష్మి పత్రికలో ఈ సమస్యను ఆచంట సత్యవతమ్మగారు
ఈ విధంగా పూరించారు.

చదువుల్ సాములు శాస్త్రచర్చ, ధరణీ రాజ్ఞీత్వశిల్పంబులున్
కదనంబందున రక్తి, గాన కవితా విజ్ఞాన సారథ్యముల్
సుధలం జిమ్మెడి పాకశాస్త్ర విదితం బాబాల లాలిత్వమున్

ముదితల్ నేర్వగరాని విద్యగలదే? ముద్దార నేర్పించినన్

ఇది నిత్యసత్యమైన పూరణగా గుర్తించవచ్చు.

శ్లోకం - శోకం


శ్లోకం - శోకం

సాహితీమిత్రులారా!

శ్లోకానికి శోకానికి తేడా ఏమిటి అన్నది ఈ శ్లోకంలో కవి ఎంత చమత్కారంగా వివరించాడో చూడండి.

శ్లోకం సుశ్లోకతాంయాతి, శ్రోతరి జ్ఞాతరిస్థితే
శ్రోతరి అజ్ఞాతరి ప్రాప్తేలకారస్తత్ర లుప్యతే


శ్లోకం అనగా పోగడ్త అని అర్థం.

వినేవాడు తెలిసినవాడైనపుడు కవి చదివిన శ్లోకం అదింకా సుశ్లోకం అవుతుంది.

అట్లాకానివాడు లభించినపుడు మాత్రం శ్లోకంలో "ల" - కారం లోపిస్తుంది అంటాడు.

అంటే వినిపించిన వానికి వట్టిశోకం మిగులుతుందన్నమాట.

Wednesday, April 13, 2016

భృంగ పంచకం


భృంగ పంచకం 

నిన్నటి తరువాయి.........
సాహితీమిత్రులారా!

అలినీ తత్తరమేల నేడు నిదె నీ యాత్మేశుడౌ భృంగమున్
జలజాసక్త మకరంద పానవశతన్ సానందుడై యున్న వా
డులు కింతేనియు లేక నీ వరుగుమీ యొప్పారు నిప్పాట నీ
చెలువుండుం బరతెంచు వేకువను రాజీవంబు పుష్పించినన్

(ఆడు తుమ్మెదా నీ భర్త పద్మినీ మకరందపాన వివశుడై ఉన్నాడు.
ఆనందంలో మునిగి ఉన్నాడు. నీవు భయపడవద్దు. తెల్లవారి రాజీవం విచ్చుకోగానే,
నీ నాథుడు వస్తాడు. ప్రస్తుతానికి నెమ్మదిగా వెళ్ళిపో.)
మంత్రి భార్యకు జరిగింది అర్థమై వెళ్ళిపోయింది.
రాజు రాణితో మదనకేళిలో తేలి, అలసి నిద్రించాడు. రాణికూడా ఆ స్థితికే వెళ్ళింది. తెల్లవార వచ్చింది.
ఇక దాక్కున్న మంత్రి వెళ్ళిపోవటానికి అవకాశం వచ్చిందని చతురిక మంత్రికి అర్థమయ్యేలా
ఈ విధంగా అన్నది.

పతి నిద్రించిన వేళ రా దగునయో పద్మారి! యీ కేళికా
యతనంబందు రతిశ్రమ న్విభుడు నిద్రాసక్తుడై యుండె నీ
శత పత్రేక్షణ మోము వాంచినది నీసామర్ధ్యముం జూపదో
కతి వేగంబుగ నేగుమా తొలగి మాయాత్మల్ సుఖం బందగన్


ఈ పద్యభావాన్ని గ్రహించిన, మంత్రి జాగ్రత్తగా ఇవతలకు వచ్చి వేగంగా వెళ్ళిపోయాడు.
మరునాటి ఉదయం అవసరమైన రాచకార్యాలు ఉండటంవల్ల విశ్రాంతి తీసుకోకుండానే
హడావిడిగా మంత్రి కొలువుకూటానికి వెళ్ళాడు. మహారాజు పేరోలగంలో ఉన్నాడు. పైనున్న
తెరల చాటున నుంచి రాణి చూస్తూంది. కొలువుకు వచ్చే తొందరలో మంత్రి ముందురోజు రాత్రి
ప్రేమావేశంలో రాణి తన మెడలో వేసిన పచ్చల హారాన్ని తీసి దాచకుండా అలాగే వచ్చాడు.
దాన్ని రాజు చూస్తే గుర్తుపడతాడు. ప్రమాదం. రాణి కలతచెంది ఈ అపాయాన్ని ఎలాగైనా
తొలగించమని చెలికత్తెను కోరింది. చతుర అయిన చతురిక మారువేషంతో ఒక భట్టువలె వచ్చి,
ఆస్థానమంతా కలయజూచి ఈ పద్యం చదివింది.

అతుల సంభాంతరస్థిత బుధవళి కెల్ల జొహారు, వీరరా
హతులకు మేల్జొహారు, సతతోజ్జ్వల విక్రమ సార్వభౌమ సం
తతికి జొహారు, వైభవవితాన పురందరుడైన యట్టి భూ
పతికి జొహారు, మానపరిపాల జొహారు ప్రధాని శేఖరా!

అందరినీ స్తోత్రం చేసినట్లు కనిపించినా తనను ప్రత్యేకంగా మానపరిపాల అనటం మంత్రికి 
పట్టిచ్చినట్లుగా ఉంది. భట్టును చూసి చతురిక అని గ్రహించి, తనను చూసుకొని, 
తడుముకొని, పచ్చల హారాన్ని గురించి తెలుసుకొని, మెడలో నుంచి 
ఇతర హారాలతో దాన్నీ కలిపి బయటకు కనబడకుండా తీసి, కవిత్వానికి సంతోషించి 
ఇస్తున్నట్లుగా కుహనాభట్టుకు బహూకరించాడు. మిగతావారు, 
రాజు ఏవో బహుమతులిచ్చి పంపారు. 
ఈ ఐదు పద్యాలలో ఇమిడిన అందమైన కథ ఇది. 

Tuesday, April 12, 2016

భృంగ పంచకం


భృంగ పంచకం


సాహితీమిత్రులారా!
తెలుగులో భృంగ పంచకం పేరుతో ఐదు పద్యాలున్నాయి. ఇవి ఎవరు రాశారో తెలీదుగానీ, శ్రీనాథుడని కొందరి అభిప్రాయం. ఈ ఐదు పద్యాల చుట్టూ మాంచి కత కూడా అల్లిపెట్టారు మన పూర్వులు. కథలో కెళితే.....
పూర్వం ఒక మహారాజుకు సౌందర్యవతి అయిన భార్య ఉండేది. రాజులకు అనేక మంది భార్యలు ఉండటం సహజం వారిలో ఈవిడ చిన్నదిగా అనుకోవచ్చు. మహారాజు వల్ల పూర్తి చెందక మదనజ్వరంతో వేగిపోతోంది. ఆ రాజ్యంలో మంత్రి ముసలివాడు కావడంతో, అతని కుమారుని ఆపదవిలోకి నియమించాడు రాజు. కొత్తమంత్రి మంత్రాంగనిపుణుడేకాదు అసాధారణ సౌందర్యవంతుడు. రాణిగారి కన్ను ఇతనిపైబడింది. చాతుర్యధుర్యయైన చేటికచేత రాయబారాలు నడిపింది.  అతడేమి తక్కువవాడా! వచ్చిన అవకాశాన్ని వదులుకొనే అరసికుడా! వచ్చిన చిక్కల్లా ఆమెతో సంగమం ప్రమాదకరం కావున జాగ్రత్తగా వ్యవహరించాలి. "కామాతుకాణాం నభయం నలజ్జ" అనికదా! కామాతురత భయాన్ని దాటి పురికొల్పింది. చీకటి పడిన తరువాత రాణిదూతిక ఏర్పరచిన సంకేతాన్ని అనుసరించి, ఆమె భవనానికి చేరుకున్నాడు. మదనక్రీడా పారవశ్యంలో వారికి సమయం తెలియలేదు.
ఇంతలో మహారాజు నెమ్మదిగా తన భవనం నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. ఆరోజు సప్తమో? అష్టమో ?చంద్రుడుకూడా ఆలస్యంగా ఉదయించాడు. ఈ పరిస్థితి చూచిన చెలికత్తె తుమ్మెదపై పెట్టి అన్యాపదేశంగా మంత్రిని హెచ్చరించింది.

మాయురె భృంగమా! వికచమల్లికలన్ విడనాడి తమ్మిలో
నీయెడ పూవుదేనియల నింపు జనింపగ గ్రోలి సొక్కియున్
బోయెదనన్న భ్రాంతి నిను బొందదు రాజుదయించె నిప్పుడే
తోయజపత్రముల్ వరుసతో ముకుళించె జలింపకుండుమా!

(ఈ పద్యం పైకి కనిపించే భావం - ఓ తుమ్మెదా మంచి మల్లెలను విడచి తామరపువ్వులోని మకరందం మీదమోజుతో ఇక్కడ చేరావు. ఎంసేపటికీ విడిచిపెట్టి వెళ్ళిపోదామని అనుకోవడంలేదు. చంద్రుడు ఉదయించినాడు. తామరరేకులు ముడుచుకుంటున్నవి. ఇప్పుడు బయటికి పోలేవు. కదవిక లేకుండా జాగ్రత్తగా ఉండు.
దీనిలోని ధ్వని(ఆంతర్యం)- ఓ మంత్రిశేఖరా నీ భార్యను విడిచి, రాణితో క్రీడిస్తూ ఆలస్యం చేశావు. ప్రభువు వస్తున్నాడు. (రాజు - ప్రభువు, చంద్రుడు). అయినా భయపడక దాక్కో.)

లోపల ఉన్న ఇద్దరూ ఈ హెచ్చరికతో జాగ్రత్తపడ్డారు. ఈ పద్యం విన్న మహారాజుగారు చెలికత్తెను ప్రశ్నించగా. ఆమె తామరలను చూచి చెప్పానని చమత్కరించింది.
మంత్రి దాగినచోటు ఇరుకు, గాలి లేదు. బాధతో అటూ ఇటూ కదులుతున్నాడు. మహారాజు ఆ సంగతి కనిపెడితే ప్రమాదమని చెలికత్తె చతురిక మళ్ళీ ఇలా హెచ్చరించింది.

అలికులవర్య! పద్మముకులాంతమందు వసింప నేరమిన్
జలనము సెందె దేమి నవసారసమిత్రుడు రాకయుండునా
తొలగక యందె యుండు మిక తోయజవైరి తిరంబె రాత్రి యీ
కలవర మేల తుమ్మిదను గానక యూరట యురకుండుమా!

(తుమ్మెదా! ముకుళితమైన తామరలో ఉండలేక కదులుతున్నావెందుకు! ఈ చంద్రుడు స్థిరమా? సూర్యుడు రాకుండా ఉంటాడా? కలవరపడక ఊరటతో ఊరుకో.
మంత్రి పరంగా- ఓ మంత్రివరా! నీవు దాక్కొన్న ఇరుకు ప్రదేశంలో ఇబ్బందిగా ఉండవచ్చు స్థిరంగా ఉండు ఆయన వెళ్ళిన తరువాత ఒంటరి సమయం వస్తుంది. అప్పటిదాకా సద్దుచేయక జాగ్రత్తగా ఉండాలి.)

ఆ మాటలు విని మంత్రి ధైర్యంతో, ఓర్పుతోవేచి ఉన్నాడు. అతని ఇంటి దగ్గర ధర్మపత్ని ఇతని గురించి ఆందోళన చెంది, రహస్యంగా వాకబు చేసింది. భర్త వ్యవహారాలు ఆమెకు కొంత తెలుసు. రాణిగారి ఇంటికి వెళ్ళాడని తెలిసి, అక్కడ ఏమి ప్రమాదం వచ్చిందో అని ఆదుర్దాగా బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చి బయటపడి విచారణ చేస్తే గుట్టు రట్టవుతుందని చతురిక ఆమెకు ఇలా చెప్పింది.
...........ఇంకావుంది.

Monday, April 11, 2016

కీర్తి - చీకటి


కీర్తి - చీకటి

సాహితీమిత్రులారా!
ఒకనాడు మహాకవి శ్రీనాథుడు  అల్లాడ వేమవిభుని కీర్తిపై చెప్పిన పద్యం చూడండి

ఖండేందు మౌళిపైఁగలహంసపాళిపైఁ గర్పూరధూళిపైఁ గాలుద్రవ్వు
మిన్నేటి తెఱలపై మించు తామరలపై మహి మంచు నురులపై మల్లరించు
జంభారి గజముపైఁ జంద్రికారజముపైఁ జందనధ్వజముపైఁ జౌకళించు
ముత్యాలసరులపై, మొల్లక్రొవ్విరుపై, ముదికల్పతరువుపై మోహరించు
వెండిమల యెక్కి, శేషాహి వెన్నుదన్ని
తొడరి దుగ్దాబ్ది తరగలతోడ నడరి
నెఱతనంబాడి నీకీర్తి నిండె నహహ!
విజయ రఘురామ! యల్లాడ విభువేమ!


ఇటీవల మహాకవి దాశరథి కృష్ణమాచార్యులుగారు "అమృతాభిషేకం" అనే దానిలో 
"తామసి" శీర్షికలో రాసిన దానిలోది ఈ పద్యం.

ఇటుప్రాకి అటుప్రాకి ఇందుబింబాననా ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి
ఇటుదూకి అటుదూకి కుటిల నీలాలకా భ్రుకుటికా ధనువు నంబకముకూర్చి
ఇటుసాగి అటుసాగి ఇందీవరరేక్షణా పక్ష్మభాగాములపై వచ్చి వ్రాలి
ఇటువీగి అటువీగి మృగనేత్ర బంగారు చెక్కిలిపై అగర్ చుక్కనునిచి
వెండి కొండపయిన్ మబ్బువిధముదోచి
చంద్రకేదారమున లేడిచాయ తిరిగి
ఆదిశేషునిపై విష్ణువై శయనించి
చీకటులు కూర్చె నందమ్ము లోకమునకు

వీటిలో వాడిన విశేషణాలను గమనిస్తే కొన్ని కొన్ని దగ్గరగా ఉన్నట్లనిపిస్తాయి. కాని
ఏకవికి ఆకవియే సాటికదా!

Sunday, April 10, 2016

ఉద్ధతుల మధ్య పేదలుండతరమె?


ఉద్ధతుల మధ్య పేదలుండతరమె?

సాహితీమిత్రులారా!
ఒకప్పుడు రాయలవారు, తనకుమార్తె మోహనాంగితో చదరంగం ఆడుతూ ఉండగా
ఆమె బంటు రాయలవారి మంత్రికి, ఏనుగుకు మధ్యలో చిక్కింది.
మథనపడుతూ మోహనాంగి, " ఉద్ధతుల మధ్య పేదలకుండతరమె" అంటూ
సందర్భానుసారంగా ఉద్ధతులగు మంత్రి, మదపుటేనుగుల మధ్య, బక్కచిక్కిన
తన బంటును తలచుకొంటూ కూనిరాగాలుతీస్తూ గొణుగుకొంటోందట
రసజ్ఞుడగు రాజు దాన్ని పూర్తిగా చదవమన్నాడట. సిగ్గుతో తలవంచుకొని,
తాను సంకుసాల నృసింహకవి వద్ద నాలుగువేల వరహాలిచ్చి,
కొనిన పద్యమున్న తాళప్రతిని అందించినదట.

రాయలవారు ఆ పద్యాన్ని -

ఒత్తుకొనివచ్చు కటితటోద్వృత్తి చూచి
తరుణి తను మధ్య మెచటికో తొలగిపోయె,
ఉండెనేనియు కనబడకున్నె? అహహ!
ఉద్ధతుల మధ్య పేదల కుండ తరమె?

యౌవనంలో, ఒరిపిడి చేసుకుంటూ, మీదికి పెరిగి వస్తున్న పిరుదుల విజృంభణాన్ని చూచి, 
పాపమా యువతి యొక్క నడుము, ఎచ్చటికో లేచి పారిపోయిందట!  ఆహా!  
అక్కడ, నడుము గనక ఉంటే, కన్పడకుండా ఉంటుందా?
గర్వంతో మీదమీదకు వచ్చే ఉద్దండులగు, వారి మధ్యలో (వారి దగ్గర) 
నిరుపేదలు ఉండుటకు వీలగునా?- అని భావం.

Saturday, April 9, 2016

శరసంధాన బల క్షమాది........


శరసంధాన బల క్షమాది........


సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయలను అల్లసాని పెద్దన వర్ణించిన పద్యం.

శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
ర్భర షండత్వ - బిలప్రవేశ - చలన - బ్రహ్మఘ్నతల్ మానినన్
నర - సింహ - క్షితిమండ - లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

ఓ నరసింహరాయల కుమారుడైన కృష్ణదేవరాయా! రాజశ్రేష్ఠా!
నర - నరుడు, శరసంధాన - శరసంధానంలోను, సింహ - సింహము, బల - బలములోను, 
క్షితి - భూమి, క్షమ - ఓర్పులోను, ఈశ్వర - ఈశ్వరుడు, వివిధైశ్వర్యంబులుం- 
అనేక రకాలైన ఐశ్వర్యములోను, గొప్పవారే అయినను 
ఈనలుగురిలోను నాలుగు దోషాలున్నాయి. 1. నరునికి నపుంసకత్వం, 2. సింహం గుహలో దాగి ఉండుట(బిలప్రవేశ), 3. భూమి కంపించుట(చలన), 4. ఈశ్వరుడు బ్రహ్మహత్య(బ్రహ్మదేవుని తలనరుకుట) 
అనే దోషాలుండుటచే ఈ నరుడు, సింహం, భూమి, ఈశ్వరులు నీతో సరిపోలరు. అని వర్ణించాడు. 

భక్తి - కొబ్బరికాయ


భక్తి - కొబ్బరికాయ


సాహితీమిత్రులారా!
కొబ్బరికాయ అనేది పూజలో, భక్తిలో భాగంగా మారింది అంటే కాదనేదెవ్వరు.
దీనిపై మద్దుపల్లి వేంకటసుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఒక పద్యం కూర్చారు చూడండి.

అకలంకంబగు నారికేళఫల పుణ్యంబేమొ, పైబడ్డ సా
ధక సామాగ్రి వీడి, ఆత్మ భగవద్దత్తంబు గావించి, సా
ర్థకతా లబ్ధికి ఫక్కునన్ సెలవివారన్ నవ్వుచున్నంతలో,
సిక సన్న్యస్తముగా త్రినేత్రత భజించెన్ భక్తి సంసేవ్వయతన్

కొబ్బరికాయ భక్తులను ఆశ్రయించినది. బాహ్య ఆవరణమును వీడినది. ఆత్మ(లోపలికాయ)ను భగవదర్పణము చేసికొన్నది. తన జన్మ ధన్యమైనదని సెలవివార నవ్వుచున్నది (తెల్లని తెలుపు) అంతలో సిగను (శిఖను) తొలగించి నివేదనము చేయుదురు. (సన్యాసములో సిగ తీసివేయుదురు).అప్పుడది త్రినేత్రత (శివసాయుజ్యం)ను పొందినది. కొబ్బరికాయకు పైభాగమున మూడు కన్నులు ఉండును. ఇది శివసాయుజ్యం.

Friday, April 8, 2016


దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


శ్రీయుతులు విద్వాన్ వి.యమ్. భాస్కరరాజుగారి పద్యమాల - 

కవిత్వంలో - క్రియాశీలత

08-04-2016 దుర్ముఖి నామ ఉగాది సందర్భంగా 
శ్రీయుతులు విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి కలంనుండి జాలువారిన పద్యకవిత ఆస్వాదించండి


చిలుక పలుకులు, తుమ్మెద వలపు ధ్వనులు                           ధర వసంతరాగాలు కోయిలల కూజి                           తాలు - సంతోష వారాశి తన్వుచుండ                           కవుల కవితలు విలసిల్లు ఘనవిధాన


 మానవతఁబ్రోచి మమతల మల్లె లేచ కీడు లెల్ల కాల్రాచి సత్కీర్తి వెలుగ సర్వజనక్షేమ సంధాన పర్వమనగ అవని "దుర్ముఖి" వత్సర మవతరించె

  మనిషి, పశువుల భేదాలు వహిని గాంచ  ఎంత భేదమొ కన్పించు - వింత గొలుపు  తెలివి - మనిషి మనీషియై వెలుగవలయు "మానవత్వమె" వసుధైక మతము - నిజము

  తెలివి తేటల జీవించి విలువ పెంచి                                                             
మంచివాడనుపేర రాణించవలయు                                                             
నవ్య వత్సర శోభలు దివ్యమవగ                                                             
అమలినానంద సామ్రాజ్యమధివసించు
  జీవితమంతహాయి, జనసేవలఁజేసి తరించి, పృధ్విలో
 తా వసుధైక భావమున, ధార్మికచింతన ఉజ్వలింప, సత్
 పావనమూర్తియై ప్రజల భవ్యమహోన్నతి నాదుకొనుచు, సం
 భావనతోడ మెల్గవలె - భారతదేశ జనాళి నిచ్చలున్
అజ్ఞానమున్ గూల్చి, విజ్ఞానమున్ బేర్చి   పఠితల హృదయాలు పల్లవింప                                                            జిజ్ఞాస కవిగంచి, ప్రజ్ఞను వెలిగించి  పాఠక మనసులు పరవశింప                                                                          సంస్కారమేపార, సద్గోష్ఠి ఇంపార  మధురోహలిలసాగి సుధలునింప                                                                     సౌజన్యమార్గాన సత్యాగ్రహవిధాన కృపతోడ జనులు సత్కీర్తిఁగాంచ                                                     
మంచి కవితల సృష్టి రాణించి ప్రగతి                                                                                 
జగతి కళ్యాణ కాంక్ష ప్రశస్తి నిలువ                                                                                   
సమసమాజ నిర్మాణమే అమరునటుల                                                                           
ధర "క్రియాశీల కవితలు" వరలవలయు
                                     ----- విద్వాన్ వి.యమ్.భాస్కరరాజు, 
                                             రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగుపండిట్
                                              చరవాణి సంఖ్య 9959464757

Thursday, April 7, 2016

అందఱు నందఱే మఱియు ........


అందఱు నందఱే మఱియు ........

నిన్నటి తరువాయి...
సాహితీమిత్రులారా!
నిన్నటి సమస్య మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్ - అనే దానికి ముందుకాలంలో శ్రీనాథకవిసార్వభౌమునికి ఇచ్చిన సమస్య ఇది చూడండి.  కేవలం సర్వనామాలనే ఇచ్చి పూరించమనడం చాల క్లిష్టమైనది. ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని పరీక్షించడానికి  కుత్సితంగ "అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" - అనే సమస్యను ఇచ్చారు. దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందరే

భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు, ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు, కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు కుక్కలు, కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.


Wednesday, April 6, 2016

మీరును మీరు మీరు....


మీరును మీరు మీరు....


సాహితీమిత్రులారా!
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది. "మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య. ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది. దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు. దానికి అతడు పెద్దనతో  "రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో మా శిష్యుడు అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు. కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు. తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

Tuesday, April 5, 2016

కవితా కన్యకు.....


కవితా కన్యకు..... 

సాహితీమిత్రులారా!
కన్యనే కాదు కవితాకన్యను కూడా తగిన వానికే దానం చేయాలి అని నాచనసోమనాథుని చమత్కార పద్యం.
ఇది పొత్తపి వేంకటకమణ కవి తన లక్షణశిరోమణి(2-163)లో ఉదహరించబడినది.

కవితా కన్యక కెందును

గవి జనకుఁడు, బట్టుదాది గణుతింపంగా

నవరస సికుడె పెనిమిటి 

యవివేకియె, తోడఁబుట్టువనవేమ నృపా!


ఓ అనవేమనృపాలా!  కవితా బాలకు కవి తండ్రి, ఎత్తుకొని పదిచోట్ల తిప్పి ప్రకాశితం చేసే భట్టు దాది వంటివాడు.అనుభవించే సహృదయడు, శృంగారాది నవరసానుభవ యోగ్యుడు భర్త. అవివేకి తోడబుట్టువు వంటివాడు. కావున కవితాకన్యను నవరసరసికునికే ఇవ్వాలని కవి భావన.

Monday, April 4, 2016

చమత్కార పద్యం - గణేశప్రార్థన


చమత్కార పద్యం  -  గణేశప్రార్థన


సాహితీమిత్రులారా!
                            అల్లసాని పెద్దన మనుచరిత్రలో చేసిన గణేశ ప్రార్థన పద్యం ఇది.

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా

ల్యాంక విచేష్ట దొండము నవ్వలి చన్గబళింపఁబోయి యా 

వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా

ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్

ఇది ఆంధ్రకవితా పితామహుని సృష్టి. ఇందులో ఆంధ్రకవితకు పితామహుడు అంటే తాత కాదు పితామహుడు అంటే బ్రహ్మ అనిఅర్థం. అంటే ఆంధ్రకవితకు బ్రహ్మ అయిన వాని సృష్టి ఈ చమత్కార పద్యం. ఇంతకూ దీని భావం కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి మాటల్లో విందాం.

అంకము, జేరి - తొడనెక్కి, తల్లితీసి తొడనెక్కించుకోలేదు. ఇతడే ఎక్కినాడు.
శైలతనయాస్తన దుగ్ధములు - తల్లి అయిన పార్వతి చనుబాలు. ఆమె కొండకూతురు. 
                                            ఆమె యందు స్తన్యసమృద్ధి ఎంత ఉండునో తెలియదు.
బాల్యాంక విచేష్టన్ - బాల్యమునకు చిహ్నమైన విశేషమైన చేష్టతో, శైశవము కాదు బాల్యం 
                             అంటే మకురుపాలు తాగుచున్నాడేమో.
తొండమున నవ్వలి చన్గబళింపఁబోయి - పిల్లలు పాలు త్రాగుతూ విడిగా ఉన్న చేతితో తల్లి రెండవ ఱొమ్మును                                                                    స్పృశించుదురు, పుణుకుదురు. ఈ చేష్టసరియే ఈ విఘ్నేశ్వరుడు తల్లి                                                                యొక్క రెండవ చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు. తనకు చేయి                                                                  ఉన్నది కదా!  ఇది బాల్యాంక విచేష్టము కాదు. ఏనుగు మొగము కలిగి                                                                ఉన్నవాని లక్షణము.
అవ్వలి చన్ కబళింపఁబోయి -  కబళించుట అనగా తినుట, కబళము - ముద్ద,  
                                            చన్నును కబళింప బోవుటయేమి సరే!
ఆవంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి - వెదకినాడు కుచము కనిపించలేదు. హారముగా ఉన్న పాము                                                                              కనిపించింది. అహివల్లభుడే హారము. దానిని చూచినాడు.                                                                                   చూచినాడనగా తెలిసికొన్నాడని అర్థం. కాంచి అనకూడదు.                                                                                 అతడు అహివల్లభ హారముగా తెలిసికొనలేదు.
                                                                        అచట అహివల్లభ  హారము ఉండటంచేత అది
                                                                        మృణాళాంకురం అనుకున్నాడు.    
మృణాళాంకురం- తామర యొక్కతూటి మొక్క.
అహివల్లభుడు అనగా వాసుకి. సర్పములకు రాజు. అతడు శివునికి ఆభరణం. అతన్ని మృణాళాంకురంగా అనుకోవడం ఎలా ఆవాసుకి శరీరం మహాదీర్ఘము, మహాస్థూలము అయి ఉండాలి. 
ఇది అర్థనారీశ్వర మూర్తి యొక్క వర్ణన. ఇతడు గజాస్యుడు ఏనుగు మొగంవాడు.
అభీష్టసిద్ధికై ఇతనిని కొలుచుటలో అతనియందభీష్టములు సమకూర్చు లక్షణములు లేవు.
అలాంటి లక్షణాలు వర్ణింపబడలేదు. వ్యుత్పత్తి చేత గజ శబ్దం అర్థం మదంకలది - అని. యదార్థం గ్రహించలేనిది. ఇది లోకం స్వభావం. ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖం. ఈ లోకం వట్టి భ్రాంతిమయం.  తెలిసికూడా వట్టి భ్రాంతి. అర్థనారీశ్వరుడు అనగా లోకము యొక్క మహాతత్వం. పుంజీభూతమై అట్టి దేవతా రూపం కట్టినాడు. పార్వతి, దుర్గ,ప్రకృతి - పంచభూతముల సమాహారం. పరమేశ్వరుడు ఈ పంచభూతముల యందు అభివ్యాప్తమైన చైతన్యం. ముఖ్యప్రాణం. విజ్ఞానమయ బ్రహ్మ మొదలైనవి కావచ్చు.  వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టాడు. మదాన్ని మినహాయిస్తే వీడు పరమ చైతన్య స్వరూపం. అతనిని కూడా దేవతగా కన్పించి - మన మదం మనకు తగ్గరాదు - మన పనులు మనకు కావాలని అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము.
ఈ విధంగా సాగింది వివరణ విశ్వనాథవారి కావ్యపరీమళం (వ్యాససంపుటి) లో. 
Sunday, April 3, 2016

చమత్కార పద్యం -6

చమత్కార పద్యం -6


సాహితీమిత్రులారా!


మాట అంటే పదము, వాక్యం, వార్త, సూక్తి, లోకోక్తి, ప్రతిజ్ఞ, కథ, ప్రార్థన ఇలా అనేక అర్థాలున్నాయి. 

ఈ పద్యం చూడండి మాటను ఎంత గొప్పగా చూపించాడో.

మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్
మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్
మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్
మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగమున్


కాబట్టి మంచి మాటలు నేర్చి, అర్థం చేసికొని, చక్కగా వివరించడం కూడా అభ్యాసం చేయాలి. లేకుంటే అగౌరవం, హీనత్వం, గర్వభంగం మొదలైనవి ఎన్నో గలుగుతాయి. కావున ప్రతి మనిషి సమయానికి తగిన విధంగా మాట్లాడవలెనని కవి హెచ్చరికగా దీన్ని భావించవచ్చు. మాటమీద ఎంత చమత్కార పద్యం.

Saturday, April 2, 2016

చమత్కార పద్యం -5

చమత్కార పద్యం -5

నిన్నటి తరువాయి...
సాహితీమిత్రులారా!
కవయిత్రిమొల్ల పద్యానికి అనుసరిస్తూ సాహిణిమారనపై చెప్పిన చమత్కారపద్యం ఇది.

జడలలో మిన్నేఱుఁజంద్ర రేఖయుఁగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
వరవజ్ర కవచంబు వజ్రాయుధముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
కోల్పోవు తనయుండు క్రోఁతి టెక్కెముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
చెఱకు సింగిణి విల్లు సెలగోలయును గల్గు నాతఁడీతండు నేమౌదురొక్కొ
శంభుఁడాతండు శాశ్వతారంభుఁ డితఁడు
ఇంద్రుఁడాతండు భోగ దేవేంద్రుఁడితఁడు
పార్థుఁడాతండు సమర సమర్థుఁడితఁడు
మారుఁడాతండు సాహిణి మారుఁడితఁడు

మొదటి పాదంలో శివునితోను, రెండవ పాదంలో ఇంద్రునితోను, మూడవ పాదంలో పార్థునితోను, నాలుగవ పాదంలో మన్మథునితోను సాహిణిమారుని పోల్చాడు కవి.

జడలలో మిన్నేఱుఁజంద్ర రేఖయుఁగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
శంభుఁడాతండు శాశ్వతారంభుఁ డితఁడు
వరవజ్ర కవచంబు వజ్రాయుధముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
ఇంద్రుఁడాతండు భోగ దేవేంద్రుఁడితఁడు
కోల్పోవు తనయుండు క్రోఁతి టెక్కెముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
పార్థుఁడాతండు సమర సమర్థుఁడితఁడు
చెఱకు సింగిణి విల్లు సెలగోలయును గల్గు నాతఁడీతండు నేమౌదురొక్కొ
మారుఁడాతండు సాహిణి మారుఁడితఁడు

Friday, April 1, 2016

చమత్కార పద్యం - 5


చమత్కార పద్యం - 5

సాహితీమిత్రులారా!

                            కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల పేర్లు అనేక విధాలుగా చెప్పడం జరుగుతోంది. ఈ పేర్లలో కవయిత్రి మొల్ల పేరుకూడా వినబడుతూవుంది. కవయిత్రిమొల్ల మొదటిసారి రాయలవారిని దర్శించుకున్న సమయంలో ఆమె ప్రభువులను ప్రస్తుతిస్తూ ఇలా చెప్పారు.

అతఁడు గోపాలకుండితఁడు భూపాలకుం 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవపక్షుఁడితఁడు పండిత రక్షుఁ 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచకపోషి 

యెలమి నాతనికన్ననితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి 

యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
పల్లె కాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీలకితఁడు
సురల కాతండు తలప భూసురులకితఁడు
కృష్ణుఁడాతండు శ్రీ మహాకృష్ణుఁడితఁడు

అని కృష్ణుని, శ్రీకృష్ణదేవరాయలను పోల్చి, కృష్ణునికన్న రాయలే గొప్ప అని చమత్కరించి చెప్పినది. ఈ పద్యాన్ని విన్న తెనాలిరామకృష్ణుడు తన సహజ వికట స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఇలా చమత్కరించాడు.

అతఁడంబకు మగఁడు ఈతఁడమ్మకుమగఁ 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలముద్రిప్పు నితఁడు వాలముద్రిప్పు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్ముననేయు నితఁడు కొమ్మునఁడాయు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటనుజిచ్చు నితని కంటను బొచ్చు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు

దాతయాతండు గోనెల మోతయితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుఁడాతండు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు.

అని ఈశ్వరుని, నందీశ్వరుని పోల్చి, ఈశునికన్న నందీశుడే గొప్పని వికటంగా చమత్కరించాడు.