Saturday, January 30, 2021

గోచర(కథ)

 గోచర(కథ)



సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

గోచర (కథ) ఆస్వాదించండి- 



Thursday, January 28, 2021

ఫీనిక్స్(కథ)

 ఫీనిక్స్(కథ)


సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

ఫీనిక్స్ (కథ) ఆస్వాదించండి-



Tuesday, January 26, 2021

పెద్దనగారి గణేశుడు

 పెద్దనగారి గణేశుడు





సాహితీమిత్రులారా!



అల్లసాని పెద్దన మనుచరిత్రలో చేసిన 

గణేశ ప్రార్థన పద్యం ఇది-

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా 

వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా

ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్


ఇది ఆంధ్రకవితా పితామహుని సృష్టి. ఇందులో ఆంధ్రకవితకు పితామహుడు అంటే తాత కాదు పితామహుడు అంటే బ్రహ్మ అనిఅర్థం. అంటే ఆంధ్రకవితకు బ్రహ్మ అయిన వాని సృష్టి ఈ చమత్కార పద్యం. ఇంతకూ దీని భావం కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి మాటల్లో విందాం.


అంకము, జేరి - తొడనెక్కి, తల్లితీసి తొడనెక్కించుకోలేదు. ఇతడే ఎక్కినాడు.

శైలతనయాస్తన దుగ్ధములు - తల్లి అయిన పార్వతి చనుబాలు. ఆమె కొండకూతురు. 

ఆమె యందు స్తన్యసమృద్ధి ఎంత ఉండునో తెలియదు.

బాల్యాంక విచేష్టన్ - బాల్యమునకు చిహ్నమైన విశేషమైన చేష్టతో, శైశవము కాదు బాల్యం   అంటే మకురుపాలు తాగుచున్నాడేమో.

తొండమున నవ్వలి చన్గబళింపఁబోయి - పిల్లలు పాలు త్రాగుతూ విడిగా ఉన్న చేతితో తల్లి రెండవ ఱొమ్మును స్పృశించుదురు, పుణుకుదురు. ఈ చేష్టసరియే ఈ విఘ్నేశ్వరుడు తల్లి యొక్క రెండవ చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు. తనకు చేయి ఉన్నది కదా!  ఇది బాల్యాంక విచేష్టము కాదు. ఏనుగు మొగము కలిగి ఉన్నవాని లక్షణము.

అవ్వలి చన్ కబళింపఁబోయి -  కబళించుట అనగా తినుట, కబళము - ముద్ద,  

                                                       చన్నును కబళింప బోవుటయేమి సరే!

ఆవంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి - వెదకినాడు కుచము కనిపించలేదు. 

హారముగా ఉన్న పాము  కనిపించింది. అహివల్లభుడే హారము. దానిని చూచినాడు.                                                                                   చూచినాడనగా తెలిసికొన్నాడని అర్థం. కాంచి అనకూడదు.                                                                                 అతడు అహివల్లభ హారముగా తెలిసికొనలేదు.

అచట అహివల్లభ  హారము ఉండటంచేత అది

 మృణాళాంకురం అనుకున్నాడు.    

మృణాళాంకురం- తామర యొక్కతూటి మొక్క.

అహివల్లభుడు అనగా వాసుకి. సర్పములకు రాజు. అతడు శివునికి ఆభరణం. అతన్ని మృణాళాంకురంగా అనుకోవడం ఎలా ఆవాసుకి శరీరం మహాదీర్ఘము, మహాస్థూలము అయి ఉండాలి. 

ఇది అర్థనారీశ్వర మూర్తి యొక్క వర్ణన. ఇతడు గజాస్యుడు ఏనుగు మొగంవాడు.

అభీష్టసిద్ధికై ఇతనిని కొలుచుటలో అతనియందభీష్టములు సమకూర్చు లక్షణములు లేవు.

అలాంటి లక్షణాలు వర్ణింపబడలేదు. వ్యుత్పత్తి చేత గజ శబ్దం అర్థం మదంకలది - అని. యదార్థం గ్రహించలేనిది. ఇది లోకం స్వభావం. ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖం. ఈ లోకం వట్టి భ్రాంతిమయం.  తెలిసికూడా వట్టి భ్రాంతి. అర్థనారీశ్వరుడు అనగా లోకము యొక్క మహాతత్వం. పుంజీభూతమై అట్టి దేవతా రూపం కట్టినాడు. పార్వతి, దుర్గ,ప్రకృతి - పంచభూతముల సమాహారం. పరమేశ్వరుడు ఈ పంచభూతముల యందు అభివ్యాప్తమైన చైతన్యం. ముఖ్యప్రాణం. విజ్ఞానమయ బ్రహ్మ మొదలైనవి కావచ్చు.  వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టాడు. మదాన్ని మినహాయిస్తే వీడు పరమ చైతన్య స్వరూపం. అతనిని కూడా దేవతగా కన్పించి - మన మదం మనకు తగ్గరాదు - మన పనులు మనకు కావాలని అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము.

ఈ విధంగా సాగింది వివరణ విశ్వనాథవారి కావ్యపరీమళం (వ్యాససంపుటి) లో. 

Sunday, January 24, 2021

గర్భగుడి(కథ)

 గర్భగుడి(కథ)





సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

గర్భగుడి (కథ) ఆస్వాదించండి-



Friday, January 22, 2021

సత్యభామా కృష్ణుల సంవాదం

 సత్యభామా కృష్ణుల సంవాదం




సాహితీమిత్రులారా!



కాకపర్తి తిరుపతి పాత్రయ్య కృత

సత్యభామా కృష్ణుల సంవాదం లోని

సంవాదం ఇది చూడండి-

ఒకనాడు ఎంత రాత్రయినా సత్యభామాదేవి

ఇంటికి శ్రీకృష్ణమూర్తి రాలేదు. ఆమె విరహంలో

పడి దూతికను పంపింది. ఆయన వచ్చాడు.

అయితే ఆమె అన్యవధూ పరిభోగ చిహ్నాలను

కనుగొని రోషవహ్నిశిఖ వలె కన్నులు కెంపుల

నింపుతూ తలుపువేసుకుంది. భార్యాభర్తల మధ్య

సంవాదం నడిచింది.

ఇంకొకరికి సొమ్మయినాడని సత్యభామ ఇలా

ఎత్తిపొడిచింది-


తళుకు పసిడి గాజుల నొక్కుల గళంబు

       స్తన మృగనాభి పత్రమూనిన యురంబు

గంబురా విడియంపు కావిని కనుదోయి

       లాక్షారసమున ఫాలస్థలంబు

పలుమొన సోకున కళుకు లేజెక్కిళు

       లసదుగాటుక చిన్నె నలతి మోవి

రమణీయతర నఖాంకముల బాహుయుగము

       పలుచని జిగి కదంబమున మేను

ముద్రలెట్టుచు తనదు సొమ్ముగ  దలంచి

యెవతె నిను నమ్మి యున్నదో యిపుడు తగవు

మాలి నిన్నంట దగునె మా జోలి రాకు

యొకరి సొమ్మొకరు గనంగ నుచితమగునె


(బంగారుగాజుల నొక్కులు గొంతుపైన,

కస్తూరి గుర్తులు రొమ్ముపైన,

కర్పూరతాంబూలపు రంగులో ఎర్రని కళ్లు,

లత్తుక నుదుటిన, దంతక్షతాలు బుగ్గలమీద,

కాటుక చిన్నపెదవి మీద, రెండు చేతుల మీద

ఖక్షతాలు, పలుచని కాంతి మిశ్రమముతో శరీరం

తన సొమ్మని తలచి ఎవతె ఇలా ముద్రలన్నీ

చేసిందో నిను నమ్మి, ఇపుడు నీతో కట్లాట దేనికి

నిన్ను అంటవచ్చునా ఒకరి సొమ్ము మరొకరు

చూడవచ్చునా మాజోలికి రాక వెళ్ళు - అని భావం.)

Wednesday, January 20, 2021

వింత ప్రార్థన

 వింత ప్రార్థన




సాహితీమిత్రులారా!



రాజశేఖర సుధీ కృత "అలంకారమకరంద:" అనే 

అలంకారశాస్త్రం  ప్రారంభశ్లోకం ఇది

చూడండి.


కుంభౌ మే మూర్ధ్ని కస్మా దయి జనని కథం వక్షసి స్త స్త వేమౌ 

తాత: కిం తావకీనౌ స్పృశతి న తు కథం మామకీనౌ వద త్వమ్

ఇత్యేవం బాల లంబోదర మధుర గిరా స్మేర వక్త్రరవిందౌ

కల్యాణం వ: క్రియాస్తం నిరవధి కరుణా వారిధీ పార్వతీశౌ



గణపతి స్వామి ఏనుగు గలవాడు.

ఏనుగు తల పై భాగాము రెండు చిన్న కుండలు

బోర్లవేసిన ప్రాంతంవలె కనబడుతూ ఉంటుంది.

కలశములవంటి స్త్రీ వక్షస్ధలం ఉన్నట్లుగా భాసిస్తూ ఉంటుంది.

దీనిమూలంగా కవి గజాననునికి రెండు

సందేహాలున్నట్లు ఇందులో కల్పించాడు.


1వ సందేహం - కుంభములు తన తల్లికి వక్షస్థలముపై మొలవగా

                           తనకు తలపై మొలవడమెందుకు?

2వ సందేహం - తన తండ్రి తన తల్లి వక్షస్సీమ యందలి కుంభములను పరామర్శించి

                           ఆనందిచిన విధంగా తన తండ్రియగు శివుడు

                            తన కుంభస్థల పరామర్శతో ఆనందిచడెందలకు?

ఇవి తన తల్లిదండ్రులను అడుగగా వారు గజాననుని

అమాయకత్వానికి ముసిముసి నవ్వులు మొలకెత్త వారు

ఒకరినొకరు చూచుకొనుచున్న దయాసముద్రులగు

పార్వతీపరమేశ్వరులు 

మీకు శుభములను చేకూర్చదురుగాక! 

Monday, January 18, 2021

మూడు కోళ్లను అరెస్టు చేశాం సార్ !

 మూడు కోళ్లను అరెస్టు చేశాం సార్ !




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

మూడు కోళ్లను అరెస్టు చేశాం సార్ ! (కథ) 

ఆస్వాదించండి-



Friday, January 15, 2021

నా మనస్సు ఒకచోటుండదు

 నా మనస్సు ఒకచోటుండదు




సాహితీమిత్రులారా!



కాసుల పురుషోత్తమకవి అనగానే
మనకు ఆంధ్రనాయక శతకం
గుర్తురావడం పరిపాటి. కాని
ఆయన కూర్చిన వాటిలో
"హంసలదీవి వేణుగోపాల శతకం" కూడ
ప్రాచుర్యం పొందిందే. అందులోని
ఒక పద్యం ఇక్కడ-

ఒకవేళ చీకటింటికి దీప మిడినట్లు
                  తేటగా సర్వంబు దెలిసియుండు
నొకవేళ నీహార మెనసిన పద్మంబు
                  గతి బోల్పదగి మందమతిగనుండు
నొకవేళ ద్విరదమూరక త్రొక్కిన కొలంకు
                  పగిది నెంతయుఁ గల్కబారియుండు
నొకవేళ క్రొత్తవీటికి మీను బ్రాకిన
                  కరణి మహాశలఁ దిరుగుచుండు
గాని నిశ్చలపడదు నామానసంబు
భావజవిలాస! హంసల దీవివాస!
లలిత కృష్ణాబ్ది సంగమస్థల విహార!
పరమ కరుణాస్వభావ! గోపాలదేవ!

                                      (హంసలదీవి గోపాలశతకము-88)

స్వామీ నామనస్సు ఏనాడు నిశ్చలంగా ఉండదయ్యా
ఒకసారి చీకటింట్లో దీపం పెట్టినట్టుగా, అంతా సుస్పష్ట
మౌతుంది. ఒక సమయంలో మంచుతో కూడిన పద్మంలా
మందమతిగా ఉంటుంది. ఒక్కోసారి ఏనుగు త్రొక్కిన
సరస్సులా కలుషితమైపోతుంది. ఒక్కొక్కొప్పుడు క్రొత్తనీటికి
ఎదురు ప్రాకే చేపలా గొప్ప ఆశలతో తిరుగుతూ ఉంటుంది.
మన్మథాకారా కృష్ణా సముద్ర సంగమ స్థలమైన హంసలదీవిలో
విహరించువాడా దయాస్వభావా గోపాలదేవా - అని భావం
ఈ శతకంలో మకుటం మూడుపాదాలు గమనించగలరు.


Wednesday, January 13, 2021

మోడల్ (కథ)

 మోడల్ (కథ)




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

మోడల్ (కథ) ఆస్వాదించండి-



Tuesday, January 12, 2021

స్వామివివేకానందుని జన్మదినశుభాకాంక్షలు

 స్వామివివేకానందుని జన్మదినశుభాకాంక్షలు



సాహితీమిత్రులకు

శ్రేయోభిలాషులకు

స్వామివివేకానందుని జన్మదినశుభాకాంక్షలు


Sunday, January 10, 2021

ఎవరినైనా ఇలా తిట్టవచ్చా?

 ఎవరినైనా ఇలా తిట్టవచ్చా?





సాహితీమిత్రులారా!



కుమారధూర్జటి కృత
ఇందుమతీ పరిణయము లోని
ఈ పద్యాన్ని చూడండి

ఒక చెలికత్తె తమ రాజకుమార్తె
విరహవేదన చూడలేక కోపంతో
మన్మథుని శపిస్తున్న పద్యం ఇది-

నీ బాణంబులు రాల, నీ ధనువు ఖండీభూతమై పోవ, నీ
జాబిల్లిన్ ఫణియంటనీ బలము లాశావీధి పాలైచనన్
నీ బంట్రోతు తనంబు స్త్రీల యెడనేనిన్నెవ్వరున్ నవ్వరే
మా బాలామణి వేచబోకు మకటా మర్యాద గా దాత్మజా


నీ బాణాలు రాలిపోనూ,
నీ విల్లు ముక్కలైపోనూ,
నీ చంద్రుణ్ని పాముకాటేయ,
నీ బలగాలు దిక్కుపాలుగానూ,
నీ పౌరుషం ఆడవాళ్ల విషయంలోనేనా?
ఎవ్వరూ నిన్ను చూచి నవ్వరా!
మా బాలామణిని బాధించబోకు
ఓ మన్మథా! ఇది నీకు మర్యాద కాదు సుమా!
- అని భావం

ఇందులో కవి ఎంత చమత్కారంగా
మన్మథుని తిట్టిచాడో చూడండి-
మన్మథుని బాణాలు పూవులు
అవి రాలిపోతాయికదా
ఆమె అదే తిట్టింది.
మన్మథుని విల్లు చెఱకు కదా
అది ముక్కలుగా నరుకుతారు కదా
ఆమె అదే తిట్టింది.
చంద్రుణ్ణ్ని పాము మ్రింగుతుందికదా
ఆమె అదే తిట్టింది
అతని బలగాలు కోకిలా తుమ్మెదలేగా
అవి దిక్కుల పారిపోతాయికదా
ఆమె అదే తిట్టింది.

ఇందులో లోకంలో సహజంగా ఉండే వాటినే
తిట్లుగా పలికించాడు ఈ కుమారధూర్జటి.
ఎంత చమత్కారం

Friday, January 8, 2021

కూతురు (కథ)

 కూతురు (కథ)




సాహితీమిత్రులారా!

సింహప్రసాద్ గారి తెలుగు ఆడియో బుక్స్

                     నుండి

కూతురు కథ ఆస్వాదించండి-



Wednesday, January 6, 2021

పాలియ్యవచ్చిన భామిని ప్రాణాలు అపహరించినట్లు కాదయ్యా

 పాలియ్యవచ్చిన భామిని ప్రాణాలు అపహరించినట్లు కాదయ్యా






సాహితీమిత్రులారా!


కొందరి నోటివాక్కు అమోఘం.
శాపానుగ్రహదక్షులైన కవిపుంగవులు అనేకులు ఉన్నారు
వారిలో గోగుపాటి కూర్మనాథకవి ఒకరు.
ఒకమారు సింహాచల క్షేత్రం మీదకు మహమ్మదీయ సేనలు రాగా
గోగుపాటి కూర్మనాథకవి ఆక్రోశం చెందగా అప్రయత్నంగా
"వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!" అనే మకుటంతో
సీసాలు దొర్లుకుంటూ  కవిగారి నోటి వెంట ధారాపాతంగా వచ్చాయట.
ఆ భావతీవ్రతలో స్వామిని ఆయన బ్రతిమలాడాడు,
ఆక్షేపించాడు, ఎద్దేవా చేశాడు.
వాటిలో ఒకటి ........

పాశ్చత్యుల నమాజుపై బుద్ధి పుట్టెనో మౌనుల జపముపై మనము రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో విప్ర యజ్ఞములపై విసుగు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో దేవతా ప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో భక్తి నిత్యోత్సవ పరతమాని
వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ 
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరగద్రోలు
పారసీకాధిపుల పటాపంచలుగను
వైరి హరరంహ!  సింహాద్రి నారసింహ!

అభీర గృహముల అర కాగిన పామీగడల్ వడి దిగమ్రింగగలవు.
కాని యవనులపై వడి పారలేవు. కబళమున నోరు తెరతువు,
కళ్ళెమన్న మోము త్రిప్పు హయగ్రీవమూర్తి వహహ! - అని ఆక్షేపించాడు

పాలియ్యవచ్చిన భామిని ప్రాణాలు అపహరించినట్లు కాదయ్యా చేతనైతే
ఈ తురకలను నాశనం చేయమని వేడుకొన్నాడు.

మేము నిన్ను అగ్రహారాలను ఇవ్వమని అడగడంలేదు.
కరిహయాదుల మేము కాంక్షించలేదు.
జనులను దోచుకోకుండా చూడమనే మా ప్రార్థన - అని అంటూ
67 పద్యాలు పూర్తి చేసేసరికి కొన్ని లక్షల, కోట్ల గండుతుమ్మెదలు
కొండలోనుండి బయలుదేరి ప్రళయకాలంలో కారుమేఘాల్లా
కమ్ముకుని తురకల దండుపైకి మూగి, కండలు ఊడేట్లుగా కరచి,
నెత్తురు పీల్చి వారిని విశాఖపట్టణం దాకా బ్రతుకుజీవుడా! -  అని పారిపోయేలా
చేశాయట.
ఆ దృశ్యాన్ని చూచిన కూర్మనాథుడు ఇలా వర్ణించాడు.

కారుణ్య దృష్టిచే కని మమ్ము రక్షింప నీరజేక్షణ నీవు నేడు పంప
పారసీకుల దండుపై కొండలోనుండి గండుతుమ్మెదలు నుద్దండ లీల
కల్పాంతమున మిన్ను గప్పి భీరకమైన కారుమేఘంబులు గవిసినట్లు
తాకి బోరున రక్తధారలు దొరగగా కరచి నెత్తురు పీల్చి కండలెల్ల
నూడిపడ నుక్కు మూతులవాడి మెరసి
చించి చెండాడి వధియించె చిత్రముగను
నొక్కొకని చుట్టుముట్టి బల్మిక్కుటముగ
వైరి హరరంహ!  సింహాద్రి నారసింహ!

ఈవిధంగా
అనేకవిధాల నరసింహస్వామిని స్తుతిస్తూ ..................
మిగిలిన పద్యాలను పూర్తి చేశాడట.


Monday, January 4, 2021

ఇంటిలోని పోరు ఇంతింత కాదయా!

 ఇంటిలోని పోరు ఇంతింత కాదయా!





సాహితీమిత్రులారా!



ఇంట్లో కలహాలుంటే ఎవరికైనా ఎంత కష్టమో దాన్నే
మనప్రజాకవి వేమన
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా 
విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.

ఈ చమత్కారశ్లోకం చూడండి.

అత్తుం వాంఛతి వాహనం గణపతే ర్భూషా భుజంగం క్రుధా
తం వాహోపి షడాననస్య - గిరిజా వాహోపి నాగాననమ్
గౌరీ జహ్నుసుతా మసూయతి - కళానాథం లలాటానల:
నిర్విణ్ణ స్సహసా కుటుంబ కలహా దీశో పిబద్దుర్విషమ్!

శివుని మెడలోని పాము గణపతి
వాహనమైన ఎలుకను మ్రింగేయలని చూస్తోంది.
ఆ పామును ఆర్ముగము(కుమారస్వామి)
వాహనం నెమలి తినాలని చూస్తోంది.
పార్వతి వాహనమైన సింహం
వినాయకుని(నాగాననుని - ఏనుగు ముఖమువాని)
చంపాలని చూస్తోంది.
పార్వతి - తలపైఉన్న గంగను ఈర్ష్యగా చూస్తోంది.
తలపైని చంద్రుని నుదుటఉన్న అన్ని మసిచేయాలని చూస్తోంది -
ఇన్ని కుటుంబ అంత: కలహాలతో ఎవరినీ సర్దుబాటు చేయలేని శివుడు
ఆత్మహత్యకై విషం మ్రింగాడు - అని భావం.

అంటే దేవతల కోసమో
జగద్రక్షణకోసమో
విషం త్రాగలేదట
కుటుంబ అంత:కలహాలే కారణమట
ఎంత చమత్కారం.

Sunday, January 3, 2021

భగవంతుడు ఎక్కడ లేడు?

 భగవంతుడు ఎక్కడ లేడు?




సాహితీమిత్రులారా!



భగవంతుడు సర్వవ్యాపి కదా!

ఈ పద్యంలో

కాసుల పురుషోత్తమకవి 

భగవంతుడు లేడనికదా!

వారు ఆవిధంగా ప్రవర్తించింది మనకు 

ఏవిధంగా చెప్పాడో చూడండి-


అచట లేవని కదా! యరచేత జఱచె గ్రు

                        ద్ధత సభస్తంభంబు దానవేంద్రు

డచట లేవనికదా! యస్త్రరాజం బేసె

                        గురుసుతుం డుత్తోదరము నందు

నచటలేవనికదా! యతికోపి ననిచె పాం

                        డవులున్న వనికి గౌరవకులేంద్రు

డచటలేవనికదా! యాత్మీయసభను ద్రౌ

                        పదివల్వ లూడ్చె సర్పధ్వజుండు

లేక యచ్చోటులను గల్గలేదె ముందు

కలవు కేవల మిచ్చోట గల్గు టరుదె

చిత్రచిత్ర ప్రభావ!  దాక్షిణ్యభావ!

హతవిమతజీవ!  శ్రీకాకుళాంధ్రదేవ!

                                                        (ఆంధ్రనాయక శతకము -9)

బహు విచిత్రమైన మహిమకలవాడా!

దయాభావం కలవాడా!

శత్రుసంహరకుడా!

శ్రీకాకుళం అనే క్షేత్రంలో వెలసిన

ఆంధ్రనాయకుడను పేరుగల విష్ణుమూర్తీ !


స్తంభంలో ఉండవని హిరణ్యకశిపుడు

స్తంభాన్ని అరచేతితో కొట్టాడు.


ఉత్తర గర్భంలో ఉండవని బ్రహ్మాస్త్రాన్ని

అశ్వత్థామ ఉత్తర కడుపులోని శిశువుపై

ప్రయోగించాడు.


అడవిలో ఉండవని కోపిష్ఠియైన దూర్వాసుని

పాండవుల వద్దకు పంపాడు దుర్యోధనుడు.


సభలో ఉండవని ద్రౌపది వస్త్రాలను

లాగించాడు సుయోధనుడు.


మొదట అక్కడ  లేకపోయినా స్తంభాదుల్లో

నీవు సాక్షాత్కరించావు.

మరి ఈ శ్రీకాకుళం గుడిలో

మొదటినుండి వెలసి ఉన్నావు

ఇక్కడ కనిపించడంలో ఆశ్చర్యం

కానేకాదు -  అని భావం.

Friday, January 1, 2021

రేపల్లెలో రాధ - 1

 రేపల్లెలో రాధ - 1




సాహితీమిత్రులారా!

బలభద్రపాత్రుని రమణి గారి

నవల రేపల్లెలో రాధ 

ఇది ఆడియో నవల - 1వ భాగం 

గాత్రం రచయితగారిది

ఆస్వాదించండి -



ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు




                ఏ విధమైన రోగాలు ఆర్థిక ఇబ్బందులు లేని సంవత్సరంగా 2021

ఉండాలని కోరుతూ ఆనంద వత్సరం కావాలని ఆకాంక్షిస్తూ

సాహితీమిత్రులకు 

శ్రేయోభిలాషులకు

ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

2021