Tuesday, February 28, 2017

ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా!


ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా!





సాహితీమిత్రులారా!


అంపశయ్యమీదున్న భీష్ముడు
ధర్మరాజుకు చేసిన హితోపదేశాలలో
ధననిరసన ఒకటి-
ఇవి శాంతిపర్యంలో 4-33నుండి
38 వరకు ఉన్నాయి.
అవి-

ధనము కలిమియు లే్మియుఁ ద్రాసునందు
నిలిపి యెత్తంగ ములుపూపె నిర్ధనత్వ
మెక్కుడు దాని దిక్కున నెట్టు లన్న
మినుము గుణదోషముల భంగి విస్తరింతు

(ధనము కలిగిఉండటాన్ని ధనం లేకపోవటాన్ని
రెండింటిని తెచ్చి తక్కెడలో రెండుప్రక్కల ఉంచి
పైకి ఎత్తగా ధనం లేకపోవడమే ఎక్కువ బరువు కలిగి
ఉండుటవలన దానివైపే ముల్లు సూపి నిర్ధనత్వఘనతనే
సూచించినది. అలా ఎందుకు సూచించినది అంటావా
సారవంతమైన దెప్పుడు బరువుగను నిస్సారమైనది తేలికగా
ఉండటం లోకంలో సహజమైన విషయమే కదా
గుణదోషాలు వివరిస్తాను, ఆలకించు...)

ధనముగలవాఁడు మృత్యు వ
దనమున నున్నట్లు భయము దన చిత్తమునన్
దనుకఁగ నుల్లల నుడుకును
విను శిఖిచోరాదిముఖ్యవిషయాపదకున్
(ధనముగలవాడు మరణదేవత నోటిలో ఉన్నట్లుగా

నిత్యమూ తన చిత్తమునందు భయం పీడించగా
 దుఃఖపడుతూ ఉంటాడు. అెంతమాత్రమేకాదు
 సంపాదించిన ధనమంతా ఏ అగ్ని ప్రమాదమువల్లనో
 బూడిద కావచ్చు లేదా దొంగలు దోచుకొనిపోవచ్చు.
ఇత్యాదిగా ఊహించుకొనే ముఖ్యసంఘటనల(విషయ)
 ఆపదకి ఆ మనిషి మనస్సు కుతకుత ఉడికి పోతూ ఉంటుంది)

కోపంబును లోభంబును
నేపారి మనంబు గలఁపనెప్పుడుఁజింతా
తాపంబునొందు సధనుం
డాపదగా కవ్విధము సుఖావహ మగునే

(ధనం వల్ల దుఃఖం కలగడానికి కారణాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి.
అవన్నీ ధనవంతుని చుట్టుముట్టి అతడిని సుఖం నుండి దూరం చేస్తాయి.
 అవేమంటే - తన వద్దనున్న ధనాన్ని ఆశించి యాచకులు తన వద్దకు
 వస్తారేమోనని భయంతో వారు తన దగ్గరకేరాకుండా
కోపాన్ని వహించి ఉంటాడు. అంతేకాక ఆర్జించిన ధనంతో
 సంతృప్తి పడకుండా ఇంకా ఇంకా సంపాదించాలని
 పేరాశ(లోభము)కలిగి ఉంటాడు. ఈ రెండు గుణాలూ
 ఎప్పుడూ జంటగానే కలిసిపోయే వచ్చి నిరంతరం
 మనస్సును కలచివేస్తూ ఉంటాయి. ఆ విధంగా ధనవంతుడు
 ఎల్లప్పుడూ దుఃఖాన్ని దిగులును పొందుతూ ఉంటాడు
ధనవంతుని ఆ దుఃఖస్థితి బాధాకరంగాక ఆనందదాయకమవుతుందా)

ఎచ్చోటనైన నధనుఁడు
విచ్చవిడి నుండు, లేదు వెఱపించుకయున్,
బొచ్చెపుఁ జందం బొల్లఁడు
మెచ్చరె సురలైనఁ బలుకు మృదువైయుండున్

(ధనంలోనివాడు ఎక్కడైనా భయంలేనివాడై
 స్వేచ్ఛగా ఉండగలడు,ధనం ఉండటం వలన కలిగే అనర్థాల
భయం ఏమాత్రం అతనికి ఉండదు. కాబట్టి అతడు
జీవితంలో కపటపూరిత విధనాన్ని ఇష్టపడడు. అంతే కాదు
 ఇతరుల్ని ఈసడించి పలికే నోటి దురుతనం నిర్ధనుడిలో
 ఉండదు. అతడి మాట ఎప్పుడూ చాల ప్రియంగా ఉంటుంది.
 ప్రియభాషిని దేవతలుసైతం మెచ్చుకుండ ఉండగలరా)

లోకము చందముఁగనుఁగొని
యీ కానఁగ నగు ధనాదు లెల్లనుఁగాల
వ్యాకులతఁ బొందఁగలయవి
గాకుండమి యెఱిఁగి విడుపు గడుఁజదు రెందున్

(లోకరీతిని బాగా తెలుసుకొని కంటికి స్పష్టంగా
 కనబడే ఈ ధనకనక వస్తువాహమాదులు అన్నీకూడ
 కాలప్రభావంచేత నాశనం చెందకుండా శాశ్వతంగా
 ఉండజాలవు అనే స్థతిని గ్రహించి ఆ ధనాదులను
 విడిచి పెట్టుట ఎప్పుడయినా ఎక్కడైనా ఎవరికైనా
 కడుంగడు నేర్పరితనం కాగలదు.)

ధనవత్త్వము దుఃఖకరం
బని కని తత్కాంక్ష విడుచునతని కధనతా
జనితాత్మాధీనత్వం
బనుపమసౌఖ్యంబు సేయు నక్షీణముగన్

(ధనం కలిగియుండటం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది
 అని తెలిసికొని అటువంటి ధనం మీద కోరికను విడిచిపెట్టినవాడికి
 కలిగే సఖం ఏమిటో చెబుతున్నాడు. ధనం లేకపోవడం
 వలన మనిషి తన మనస్సును అధీనంలో ఉంచుకోగలుగుతాడు.
 ఆ ప్రకారంగా కలిగిన అధీనతా గుణం అతడికి సాటిలేని ఆనందాన్ని-
 సుఖాన్ని అత్యధికంగా కలిగిస్తుంది)
అని చెప్పాడు.

ఇందంతా బాగుంది కాని ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా
ధనం లేకపోతే నిద్రపట్టనివారు ఎందరున్నారో
ధనం పోయిందంటే గుండె ఆగి పోయే వారులేరా?
మరి అలాంటిదాన్ని వదిలివేయగలమా?
అది ద్వాపరయుగం కాబట్టి ఆయన విన్నాడేమో కాని
 ఇప్పుడైతే వినరుగాక వినరు. మరి మీ అభిప్రాయమేమో చూడండి.

Monday, February 27, 2017

దూత ఎలా ఉండాలి?

దూత ఎలా ఉండాలి?




సాహితీమిత్రులారా!



రామాయణంలోని శ్లోకం ఇది
26-02-17న ముఖపుస్తకంలో
అంబాళం పార్థసారథిగారు
ఉంచిన వ్యాఖ్యతో చూడండి-
అనురక్తః శుచిర్దక్షః స్మృతిమాన్ దేశకాలవిత్
వపుష్మాన్ వీతభీర్వాగ్మీ దూతో రాజ్ఙః ప్రశస్యతే
                                                                                        -- రామాయణం.
రాజు అంటే గౌరవంతో కూడిన ప్రేమ గలవాడు, 
అవినీతికి దూరంగా ఉండే వాడు, సమర్థత గలవాడు, 
జ్ఙానవంతుడు, దేశకాల తత్వం తెలిసిన వాడు, 
శరీర సౌష్టవం కలవాడు, భయం లేనివాడు, 
ధీటైన మాటలు నేర్చినవాడు మంచి దూతగా 
రాజు చేత ప్రశంసించబడుతాడు.

ఒక రాజ్యం తరపున, రాజు తరపున ఇంకొక 
రాజ్యానికి నియమింపబడిన వార్తాహరుడిని, 
దూత అంటారు. ఈ రోజుల్లో రాజులు లేరు, 
రాజ్యాలు లేవు కాబట్టి, సంస్థలలో పనిచేసే 
ఉద్యోగులకు ఎలాంటి అర్హతలుండాలో, 
రామాయణం లోని శ్లోకంలో చక్కగా 
వివరింపబడ్డాయి.

దూత అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది 
శ్రీరామ దూతయైన ఆంజనేయస్వామి. 
మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి పక్షాన, 
రాక్షస చక్రవర్తి, రావణుడితో సంధి చేసుకోడానికి వెళ్తున్న 
దూత ఎలా ఉండాలి? ఈ శ్లోకంలో చెప్పిన అన్ని 
లక్షణాలు మూర్తీభవించిన హనుమంతుడి లాగా ఉండాలి
.
శ్రీరామదూతగా వెళ్లి సభలో రావణుడికి హితబోధ చేస్తూ, 
హనుమంతుడు పలికిన పలుకులు మహోన్నతమైనవి. 
ఆంజనేయస్వామి అసదృశమైన జ్ఙానం ఇక్కడ తెలిసిపోతుంది. 
చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం, ఉచితజ్ఙత పాటించి 
ఎదుటి వారితో మాట్లాడే విధానం, ఈ ఘట్టంలో కొనియాడబడే 
విధంగా ఉంటుంది.

వివిధ సంస్థలలో ఉద్యోగులుగా పని చేసే వారు, 
హనుమంతుడి లక్షణాలను ఆకళింపు చేసుకొనగలిగితే, 
ఆ సంస్థల గౌరవం ఇనుమడిస్తుంది. సంస్థల పుట్టు 
పూర్వోత్తరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం, పని చేస్తున్న 
సంస్థలపై మొక్కవోని గౌరవం, నిజాయితీ, స్వామి భక్తి, 
తయారు చేసిన వస్తువులను గుఱించి పూర్తి జ్ఙానము, 
ఆకర్షనీయమైన ఆకట్టుకునే రూపం, చక్కగా మాట్లాడే నిపుణత, 
ఈ లక్షణాలతో పనిచేసే ఉద్యోగులు, 
ఆ సంస్థలకు మూలస్తంభాల్లా, పెట్టని కోటలా ఉంటారు.

కవులు ఎన్నిరకాలు?


కవులు ఎన్నిరకాలు?




సాహితీమిత్రులారా!



విన్నకోట పెద్దన గారు
కావ్యాలంకార చూడామణిలో
కవులను ఏడు రకాలుగా విభజించారు
చూడండి-

వాచికార్థులు శిల్పక రౌచకులును
భూషణార్థియు మార్ధవ స్పురణకరుడు
నల వివేకియు ననగ సప్తాహ్వయముల
గవుల నెగడుదు రీహిత కావ్యములను
                                                   (కావ్యాలంకారచూడామణి-3-80)

సప్తవిధ కవుల స్వభావం-

1. వాచికుడు-
   పదాడంబరముగల కవిత చెప్పువాడు
2. ఆర్థికుడు -
   మితములైన పదములతోనే విపులమైన
   అర్థం స్పురింపచేయువాడు
3. శిల్పకుడు-
   బహువిధయమకాదులగు శబ్దాలంకారములను
   అభిమానించువాడు
4. రౌచికుడు-
   వెదకి వెదకి మృదుమృదు పదములతో
   కవనమల్లెడి నేర్పుకలవాడు
5. భూషణార్థి -
   అలంకారభూయిష్టమైన రచన చేయువాడు
6. మార్థవానుగతుడు-
   సరళమలయిన శబ్దములను విరళములగు
   అర్థములను చూపుచు వీనులకు ఇంపుగా
   రసప్రధానముగా కావ్యరచన చేయువాడు
7. వివేకి -
   బహుముఖ శాస్త్రజ్ఞాన సంపన్నుడును, శబ్దార్థగుణదోష
   వివేకపూర్ణుడును, రసవదుత్తమ కావ్యనిర్మాణ
   చాతురీధురీణుడైనవాడు.
   వీరిలో వివేకియే కర్వకవి మూర్దన్యుడు,
   మహాకవి విఖ్యాతుడు

Sunday, February 26, 2017

మన్మథుడు స్త్రీలకు విధేయుడా?


మన్మథుడు స్త్రీలకు విధేయుడా?




సాహితీమిత్రులారా!


భర్తృహరి శృంగారశతకంలోని
ఈ శ్లోకం చూడండి-

నూనమాజ్ఞాకరస్తస్యా
సుభ్రువో మకరధ్వజః
యతస్తన్నేత్ర సంచార
సూచితేషు ప్రవర్తతే

మన్మథుడు స్త్రీలకు అతి
విధేయుడైన సేవకుడు కాబోలు
ఎందుకంటే -
స్త్రీలు తామెవర్ని క్రీగంట చూస్తారో
అలాంటివారి చెంతకు ఈ మన్మథుడు
వెళ్తుంటాడు.లోక సహజరీతి ఏమంటే-
పనివాడు యజమాని/యజమానురాలి
పట్ల విధేయతతోపొమ్మన్న
చోటికి పోవడం సహజమే
ఆవిధంగా పురుషులు మరుని
బారిన పడి స్త్రీలకు వశులౌతారు
వేయి మాటలు ఎందుకు
మన్మథుడు స్త్రీలకు విధేయుడే కదా!

హోత్రి, ఉద్గాత్రి, అధ్వర్యు ............


హోత్రి, ఉద్గాత్రి, అధ్వర్యు ............



సాహితీమిత్రులారా!

యజుర్వేద కాలంలోని పురోహితులు
నాలుగువిభాగాలలో 16, 17 మంది
కనబడతారు వారి వివరాలు ఇక్కడ చూద్దాం-

యజ్ఞంలో నిర్వహించే బాధ్యతలు 4 రకాలు
వాటిని బట్టి పురోహితులూ నాలుగువిధాలు

1. మంత్రోచ్ఛారణ చేసేవారిని హోత్రి అంటాము
   ఈయనకు సహాయకులుగా మైత్రావరుణుడు, 
   అచావాకు, గ్రావస్తుతు ఉంటారు

2. ప్రత్యేక మంత్రోచ్ఛారణ విధిని నిర్వర్తించేవారు - ఉద్గాత్రి    
   అనబడతారు. ఈయనకుప్రస్తోత్రి, ప్రతిహర్త్రి, సుబ్రహ్మణ్య
   అనే వారు సహాయకులుగా ఉంటారు.

3. యజ్ఞంలో జరిగే కర్మకాండలను నిర్వర్తించేవారిని అధ్వర్యు
   అంటారు. వీరికి ప్రతిష్ఠాత్రి, నేష్ట్రి, ఉన్నేత్రి అనే వారు   
   సహాయకులుగా ఉంటారు.

4. మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షించే వారిని బ్రాహ్మణుడు అంటారు.
   వీరికి బ్రాహ్మణచ్ఛంసి, అగ్నీధ్ర, పోత్రి సహాయకులుగా ఉంటారు.

ఈ చెప్పిన 16 మందిని ఋత్విజులు అంటారు
వీరుగాక తక్కువ స్థాయిలో ఉన్నపురోహితులు
శమిత్రి, వైకర్త, సమసాధ్వర్యు అనే వారు
అధ్వర్యునకు సహాయకులు.
మొత్తం యజ్ఞాన్ని పర్యవేక్షించేవాడు 17వ ఋత్విజుడు
ఈయనను కౌశీతకులు అంటారు.
పర్యవేక్షకునికి 3 వేదాలు తెలిసి ఉండాలి
ఎటువంటి పొరపాట్లయినా సవరించగలిగి ఉండాలి

యజ్ఞం నిర్వహించటానికి ఆకాలంలో
ఎంత యంత్రాంగం ఉన్నదో
వీటిని బట్టి తెలుస్తుంది.

Saturday, February 25, 2017

నిగిడి బ్రహ్మాండమండలినిండ బెరిగి


నిగిడి బ్రహ్మాండమండలినిండ బెరిగి




సాహితీమిత్రులారా!



నిశ్శంక కొమ్మన 
శివలీలా విలాసంలోని
ఈ పద్యం చూడండి-
గంగావతరణంలో శివుడు ఎలా
పెరిగాడో వివరించే పద్యం ఇది-

తొలిదొలి శేఖరస్థలమున కలవడి 
                          మవ్వంబు మిగిలిన పువ్వులగుచు
నంతలోపలను గర్ణావతంసములకు 
                           బ్రకట వినూత్నవజ్రంబు లగుచు
దదనంతరంబకంఠ ప్రదేశమునకు 
                           దీపితహారమౌక్తికము లగుచు
మరి యాక్షణమ కటి మహితమేఖలకుని
                           మ్ముల రచించిన వెండిమువ్వలగుచు
నిట్లు నక్షత్రములు చిత్రమెసగ
క్రమమగ దప్పక నిజకపర్దములు దలప
నుగ్రమాహేశ్వరుండున్న యునికి తోన
నిగిడి బ్రహ్మాండమండలినిండ బెరిగి

శివుడు మేను పెంచు సందర్భములో
మొదట నక్షత్రాలు తలపువ్వులులాగ
పెరిగే కొద్దిచెవి ఆభరణంగా
తరువాత కంఠహారంగా
తరువాత కటిమేఖలగా
చివరగా కాలికి వెండిమువ్వలుగా
మారిపోయాయట.
ఇలాంటి వర్ణనే మంన మరోచోట
చదివిన దాఖాలాలున్నాయికదా!

అదేమిటంటే
వామనుడు బలి చక్రవర్తి దానం
స్వీకరించేప్పుడు త్రివిక్రముడుగా
మారే సందర్భంలో పోతన పద్యం
"రవిబింబంముపమింప" అనే పద్యం
అయితే ఇందులో నక్షత్రాలను పోల్చాడు
కాని భాగవతంలో సూర్యుని పోల్చాడు.

పూర్వకవిత్వం


పూర్వకవిత్వం




సాహితీమిత్రులారా!



పూర్వకవుల పద్యాలలోని మొదటి మూడు పాదాలు
తీసుకొని నాలుగవ పాదాన్ని సందర్భోచితంగా
చాతుర్యంతో కవి కలిపి పూర్తి చేయడాన్ని
పూర్వకవిత్వం అంటున్నారు.
ఇది మల్కిభరాముని కాలంలో
ప్రారంభమైందని కొందరి భావన
దీనికి ఉదాహరణ-

కరయుగములు చరణంబులు
ఉరము, లలాట స్థలంబు, నున్నత భుజముల్
సరి ధరణి మోపి మ్రొక్కిరి
మరిమరి నీ శత్రువులెల్ల మల్కిభరామా!

దీనిలో మొదటి మూడు పాదాలు పూర్వకవులవి
చివరి పాదం ఈ చెప్పిన కవిది.

Friday, February 24, 2017

బ్రహ్మవిద్య కూడ ఇంత ఆనందం కలిగించదు


బ్రహ్మవిద్య కూడ ఇంత ఆనందం కలిగించదు




సాహితీమిత్రులారా!



చంద్రాలోక కర్త జయదేవుడు 
కూర్చిన శ్లోకం ఇది చూడండి-

న బ్రహ్మవిద్యా నచ రాజ్యలక్ష్మీ
స్తథా యథేయం కవితా కవీనామ్
లోకోత్తరే పుంసి నివేశ్యమానా
పుత్రీవ హర్షం హృదయే కరోతి

పరబ్రహ్మని బోధించే వేదాంత విద్యకాని,
రాజ్యాధికారము కాని కవుల కవిత్వం వలె
పరమానందాన్ని కలిగించవు.
అసాధారణ లక్షణాలుకల పురుషునకు
భార్యగా అప్పగించబడిన తండ్రి మనసుకు
ఎటువంటి మహానందాన్ని కలిగిస్తుందో,
కవి యొక్క మంచి కృతి కూడ లోకోత్తర
పురుషునికి అంకితం ఇచ్చినపుడు
అటువంటి గొప్ప సంతోషం కృతికర్తకు,
సరస్వతికి కూడ కలుగుతుందని - శ్లోక భావం




మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు


మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
ఈ పర్వదిన సందర్భముగా
శివ సహస్ర నామస్తోత్రం  విని తరించండి


Thursday, February 23, 2017

ఇలాంటి స్త్రీలు ఇపుడున్నారా?


ఇలాంటి స్త్రీలు ఇపుడున్నారా?




సాహితీమిత్రులారా!



నెల్లూరును పరిపాలించిన మమసిద్ధికి,
కాటమరాజుకు పుల్లరి(పశువులను మేపగా
ఇచ్చే సుంకము) విషయంలో పోరు ఏర్పడింది.
మనుమసిద్ధి పక్షాన ఖడ్గతిక్కన యుద్ధం చేస్తూ
సైన్యం చిందర వందర కాగా రణరంగం వదలి
ఇంటికి వచ్చాడు. అప్పుడు అతని భార్య తిక్కనకు
స్నానానికి నీళ్ళుతోడి నులకమంచం అడ్డం పెట్టి,
పసుముద్దకూడ పెట్టిందట. అది చూచిన తిక్కన
ఇదేమిటని అడగ్గా ఈ పద్యం చెప్పిందట-

పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్
ముగురాడువారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్
అన్నదట.
శత్రువులకు వెన్నిచ్చి పారిపోతే
మగతనం ఉన్న వారు నవ్వరా
వగపెందుకు  ఇప్పటి వరకు
ఇద్దరమే ఆడవాళ్ళం ఉన్నాము.
(ఆమె వాళ్ళఅత్త)- ఇకముందు మనం ముగ్గురము
ఆడవాళ్ళవుతాము - అని హేళన భావంతో పలికింది.

ఆ వీరపత్ని పేరు మాంచాల

ఇపుడు ఇలాంటి స్త్రీలు లెవరైనా ఉన్నా
భర్తకు పౌరుషం తెప్పించి యుద్ధానికి పంపగలిగే
వీరపత్నులు. ఆలోచించాలి
ఆనాటి స్త్రీలకు నేటి స్త్రీలకు ప్రతి విషయంలోను.

శివునితో పోలినవాడని పోల్చవచ్చునా?


శివునితో పోలినవాడని పోల్చవచ్చునా?




సాహితీమిత్రులారా!



వేములవాడ భీమకవి పద్యాలలో
ఒక పద్యం ఇది చూడండి-
మైలమ భీముని పరాక్రమం
గురించి చెప్పన పద్యం-

అహితుల దాకి పోరునెడ నంబుధి కల్గిన నాటి రాము గో
గ్రహణము నాటి పార్థు గదఁ గౌరపు వేసిన నాటి భీము నా
గ్రహమెసగం బుర త్రయము గాల్చిన నాటిలలాటలోచనున్
మహితనుపమింపగా దగునె మైలమ భీముని భీమ విక్ర మున్


మైలమ భీముడు శత్రువులను ఎదిరించి పోరాడేప్పుడు,
రామాయణంలో సముద్రునిపై కోపించిన శ్రీరామునితో,
భారతంలో ఉత్తరగోగ్రహణమప్పుడు పరాక్రమించిన అర్జునితో,
గదాయుద్ధంలో దుర్యోధనుని పడవేసిన భీముని రౌద్రంతో,
త్రిపురాసురసంహారముచేసిన శివునితో పోలినవాడనవచ్చునా
కాదు - వారిని మించిన పరాక్రమం కలవాడీయన
కావున వారందరు ఇతనికి సమానులుకాదు - అని భావం

మైలమ భీముడు ఎంతటి గొప్పవాడో ఇందు
వాడిన ఉపమానాలను బట్టి తెలుస్తుంది.

Wednesday, February 22, 2017

ఇతరులకు బాధ కలిగించేవి కూడ భరించేదెవరు?


ఇతరులకు బాధ కలిగించేవి కూడ భరించేదెవరు?




సాహితీమిత్రులారా!


భర్తృహరి సుభాషితం చూడండి-

వహ్నిస్తస్య జలాయతే, జలనిధిః కుల్యాయతే, తత్క్షణా
న్మేరుఁ స్వల్పశిలాయతే, మృగపతిఁ సద్యఁ కురఙ్గాయతే
వ్యాలో మాల్యగుణాయతే, విషరసః పీయూషవర్షాయతే
యస్యాఙ్గే  భిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి

ఇతరులకు బాధ కలిగించేవి కూడ
సచ్ఛీలురైనవారు ఆనందగా భరిస్తారు.
వారికి అగ్ని చల్ల నీటిలా,
మహామేరు పర్వతం చిన్నరాయిలా,
క్రూరమృగమైన సింహం సాధుజంతువు జింకలా,
మహాసర్పం పూలహారంలా, విషము అమృతసమానంగా
అనిపిస్తుంది -  అని భావం

వారే గాలికి, తుఫాన్లకు ప్రతినిధులు


వారే గాలికి, తుఫాన్లకు ప్రతినిధులు




సాహితీమిత్రులారా!


దితి కశ్యపుల కుమారును ఇంద్రుడు చంపుతూండేవాడు.
దితి బాధపడి, ఇంద్రుణ్ని జయించే కుమారుణ్ని ప్రసాదించమని
ప్రార్థించింది. తరువాత దితి గర్భవతి కాగా-
తనను చంపే కొడుకు పుట్టనున్నాడని తెలిసి
ఇంద్రుడు సూక్ష్మరూపంలో ఆమెగర్భంలో ప్రవేశించి,
ఆ పిండాన్ని ఏడు ముక్కలుగా ఖండించాడు,
వాటిని తిరిగి ఒక్కోదాన్ని ఏడు ముక్కలుగా చేశాడు.
ఇలా ఆ పిండం మొత్తం 49 ముక్కలయింది.
దితి మేల్కొని, అలా చంపవద్దనీ,
ఈ బిడ్డలు నీకు మిత్రులే అవుతారనీ చెప్పి, ప్రార్థించింది.
ఆ పిండంనుండి ఏర్పడిన 49మంది బిడ్డలు ఎంతకూ
మరణించకపోవడంతో వారూ దేవతలే అని చెప్పి,
వాళ్ళకు మరుత్తులు(గాలి) అని పేరు పెట్టాడు.
వారే మరుద్గణం. వీరే గాలికి, తుఫాన్లకు ప్రతినిధులు.

Tuesday, February 21, 2017

ఏది అన్ని బాధలను సహించేస్తుంది?


ఏది అన్ని బాధలను సహించేస్తుంది?




సాహితీమిత్రులారా!



ఈ చమత్కార శ్లోకం చూడండి-

రత్నాకరే పరిహృతా వసతిః కిమన్యత్
అంగీకృతః కఠిన వేదన దుఃఖ భారః
వక్షోజ కుంభ పరిరంభణ లోలుపేన
కిం కిం నతేన విహితం బతమౌక్తికేన

ముత్యానికి వక్షోజాలను కౌగిలించుకోవాలనే
ప్రగాఢమైన కోరిక కలిగింది. వెంటనే
సముద్ర(రత్నాకర)నివాసాన్ని వదలుకొంది.
రంధ్రం చేయటంలోగల బాధ(దుఃఖము)ను ఓర్చుకొంది.
వక్షోజాలను నిరంతరం కౌలించుకోవాలనే కోరికే ఇన్ని
బాధలను సంహిపచేసింది - అని భావం.

అదే కదా కోరికలేకపోతే ఏంచేస్తాం
అన్నిటికి మూలం కోరికే కదా

దీని ఆసక్తితో దేనికైనా సిద్ధమా?


దీని ఆసక్తితో దేనికైనా సిద్ధమా?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-

మాంసలుబ్ధో యథా మత్స్యః లోహ శంకుం నపశ్యతి
సుఖలుబ్ధః తథా దేహీ యమబాధాం న పశ్యతి

చేప, ఎర(మాంసం)మీద ఉన్న ఆసక్తితో,
గాలము గొంతులో తగులుకొంటుందనే గమనించదు.
అలాగే సుఖాసక్తితో జీవుడు యమబాధలను కూడ
గమనించక పాపకార్యాలు చేస్తాడు - అని భావం.

సుఖాసక్తి ఎంత పని చేస్తుందో కదా!

Monday, February 20, 2017

ఇది లేకపోతే అన్నీ వృథానే


ఇది లేకపోతే అన్నీ వృథానే




సాహితీమిత్రులారా!



ఏదైతే అవసరమో అదిలేకుంటే
 ప్రయోజనం ఏమిటి?
అదే ఏదైతే అది అదే ఏది
ఏదైతే అది
ఈ శ్లోకం చూడండి-

నేత్రా యస్య బృహస్పతిః, ప్రహరణం వజ్రం, సురాః సైని కాః
స్వర్గో దుర్గ, మనుగ్రహః ఖలు హరే, రైరావణో వారణః
ఇత్యాశ్చర్యబలాన్వితో2పి బలభి ద్భగ్నః పరైః సఙ్గరే
తద్వ్యక్తం నను దైవ మేవ శరణం ధిగ్ ధిగ్ వృథా పౌరు షమ్
                                                                                  (భర్తృహరి సుభాషితములు - 81)


బృహస్పతివంటి దేవగురువు.
ఎదురులేని వజ్రాయుధం,
దేవతలే సేనాసమూహం,
స్వర్గమే కోట, ఐరావతమనే ఏనుగు,
అన్నిటినిమించి శ్రీహరి అనుగ్రహం
అన్నీ ఉన్నా దేవేంద్రుడు యుద్ధంలో
ఓడిపోయాడు అదీ శత్రువులైన దానవులచేతిలో
కారణం ప్రయత్నలోపం
దీన్ని బట్టి ఏంతెలుస్తుందంటే
ఎంతవారైనా ప్రయత్నించకుండా
ఫలితం ఉండదు. ప్రయత్నం చేస్తేనే
దైవానుగ్రహమైనా ఫలిస్తుంది - అని భావం.

కేళీచిహ్నములు కొన్ని బయలుపడకుండ


కేళీచిహ్నములు కొన్ని బయలుపడకుండ




సాహితీమిత్రులారా!



షట్చక్రవర్తి చరిత్రలోని ఈ పద్యం చూడండి-
మొదటిరేయి గడిచాక నాయికలో
కనబడుతున్న శృంగా చిహ్నాలను
వ్యంగ్యంగా చెలులు చెప్పడాన్ని
వర్ణించే పద్యం ఇది-

అర్థచంద్రునిమీఁద నమరి యున్నవితేఁటు
           లలివేణి యది విస్మయంబు గాదె
యఱమోడ్చి వాడిన వంబుజంబులు పగ
           లంగన యిదియె చోద్యంబు గాదె
బింబంబుపైఁగెంపు డంబుగా నుదయించెఁ
           దరుణిరోయిది విచిత్రంబుగాదె
కరికుంభములమీఁద గనుపట్టె నెలవంక
           తరలాక్షి యిది యద్భుతంబుగాదె
యనుచుఁజెలువలలోఁబ్రోడయైనయట్టి
భామ కనుగీటి తనతోటి పడఁతితోడ
నాయికను జూపి కేళిచిహ్నములు కొన్ని
బయలుపడకుండ ధ్వనియొప్పఁబలికె నపుడు
                                                              (షట్చక్రవర్తిచరిత్రము -5-156)


తుమ్మెదలవంటి జుట్టుకలదానా
తుమ్మెదలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి
అర్థచంద్రునిపై తుమ్మెదలు(తేటులు)
ఏర్పాటయి ఉన్నాయి ఇది వింతకాదా!

(చంద్రుడు ఆకాశంలో ఉంటాడు.
తుమ్మెదలు నేలపై ఉంటాయి.
చంద్రునిలో తుమ్మెదలుండడటం వింత-
అర్థ చంద్రుడు అంటే యువతి నుదురు.
తుమ్మెదలు అంటే ముంగురులు. జుట్టు
చిందరవందరై నుదురు మీద పడుతోంది
అని అర్థం.)


యువతీ పట్టపగలు - పద్మాలు
సగము ముడుచుకొని(అఱమోడ్చి)
వాడి ఉన్నాయి. ఇది వింత(చోద్యం) కాదా
(పద్మాలు పగలు వికసిస్తాయి.
అవి సగం ముడుచుకొని ఉండటం
వాడి ఉండటం వింతకాదా
ఇక్కడ పద్మాలు అంటే పద్మముల
వంటి యువతి కన్నులు.
రాత్రంతా మెలకువతో ఉండటం చేత
వాడి ఉన్నాయని భావం)


యువతీ దొండపండుమీద ఎరుపురంగు చాల
ఎక్కవగా(డంబుగాన్) కలిగింది ఇదివింతకాదా

(దొండపండుమీద ఉండవలసిన దానికంటె
ఎక్కువ ఎరుపు ఉంటే అది వింతేకదా
దొండపండు అంటే దొండపండులాంటి
పెదవి ప్రియుడు కొరకడంచేత రక్తం చిమ్మి
మరింత ఎర్రగా కనబడుతోంది.)

చంచలమైన కన్నులుగలదానా
ఏనుగు కంభస్థలాలపైన చంద్రవంక(నెల)
 కన్పడుతున్నది ఇది వింతకాదా -

(ఏనుగు కుంభస్థలాలపైన చంద్రరేఖ కన్పడటం విత.
ఏనుగు కుంభస్థలం అంటే యువతి వక్షోజాలు.
వాటిపై నెలవంక అంటే ప్రియుని గోళ్ళగుర్తులు)

 అంటూ చెలికత్తెలలో కాస్త ఆరితేరిన(ప్రోడ)
భామ ఒకతె కనుగీటి తన తోడి యువతితో
నాయికనుచూపి కొన్ని క్రీడాచిహ్నాలను
బయటపడకుండా వ్యంగ్యంగా
(ధ్వనియొప్పన్) అన్నది.

Sunday, February 19, 2017

షణ్ముఖుడు - కౌమారం


షణ్ముఖుడు - కౌమారం




సాహితీమిత్రులారా!




షట్ అంటే ఆరు, ఆరుముఖాలుకలవాడు
షణ్ముఖుడు, షడాననుడు - సుబ్రహ్మణ్యస్వామి.
ఆయన ఆరు ముఖాల ప్రత్యేకత-
ఆరు ముఖాలలో మొదటిది వెలుగునిస్తుంది.
రెండవముఖం వరాలను ఇస్తుంది.
మూడవ ముఖం యజ్ఞాలను రక్షిస్తుంది.
నాలుగవ ముఖం వేదాల అర్థాన్ని బోధిస్తుంది.
ఐదవ ముఖం దుష్టశక్తులను నాశనం చేస్తుంది.
ఆరవముఖం వల్లీదేవిమీద ప్రేమ కటాక్షాన్ని ప్రసారం చేసి,
ధర్మాన్ని ఆచరించాలని అందరికి ప్రబోధిస్తుంది.
అలాగే ఆరుముఖాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు
అనే అరిషడ్వర్గములను నాశనం చెస్తాయి.
కుమారస్వామిని ఆరాధించటాన్ని కౌమారం అంటారు.
ఇప్పుడు ఈ మతం హిందూ సనాతన ధర్మంలో కలిసిపోయింది.


పుత్రుడు ఎలాంటి పనిచేయరాదు?


పుత్రుడు ఎలాంటి పనిచేయరాదు?




సాహితీమిత్రులారా!



శుక్రనీతి సారములోని
ఈ శ్లోకం చూడండి -

తత్కర్మ నియతం కుర్యాద్యేన తుష్టో భవేత్ పితా
తన్నకుర్యాద్యేన పితామనాగపి వినీదతి
                                                                            (శుక్రనీతిసారము 2- 44)

ఏ పనిచేస్తే తండ్రి సంతుష్టుడవుతాడో
ఆ పనిని పుత్రుడు అవశ్యము చేయవలెను.
తండ్రికి ఏ కొంచెము దుఃఖము కలిగించేదైనా
ఆ పని పుత్రుడు చేయరాదు - అని భావం.

Friday, February 17, 2017

ఏవి శీఘ్రంగా నశిస్తాయి?


ఏవి శీఘ్రంగా నశిస్తాయి?




సాహితీమిత్రులారా!



ప్రపంచంలో అన్నీ నశిస్తాయి.
కాని కొన్ని శీఘ్రంగా నశిస్తాయట
అవి ఈ శ్లోకం చెబుతుంది చూడండి-

నదీతీరే చ యే వృక్షాః
పరగేహేషు కామినీ 
మంత్రిహీనశ్చ రాజానః
శీఘ్రం నశ్యన్త్య సంశయమ్

నది ఒడ్డున ఉన్న చెట్లు,
ఇతరుల ఇండ్లలో ఉండు స్త్రీ,
మంత్రిలేని రాజులు
శీఘ్రంగా నశిస్తారు
అనుమానమే లేదు - అని భావం

వారి స్వభావం వారు మానరు


వారి స్వభావం వారు మానరు




సాహితీమిత్రులారా!



కవిరాక్షసీయములో
దుష్టులనుగురించి చెప్పిన విషయం
ఈ శ్లోకంలో చూడండి-

అలకాశ్చఖలాశ్చైవ 
మూర్ధ్నిభీరుజ నైర్ధృతాః
ఉపర్యుపరిసత్కారే 
ప్యావిష్కుర్వంతి వక్రతాం

స్త్రీలు తమ తలలోని వెంట్రుకలను
ఎంత నూనె మొదలైన వాటిచేత ఉపచరించినా
అవి తమ వక్రతను కోల్పోవో
అలాగే దుష్టజనులు భయపడు వారిచే
నమస్కరింపబడినవారై,
ధనాదులచే ఆదరిపబడినవారైనను
తమ స్వభావమైన దౌర్యన్యాన్ని విడువరు -
అని భావం

Thursday, February 16, 2017

పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు?


పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు?




సాహితీమిత్రులారా!



మనువు చెప్పిన దాని ప్రకారం వివాహాలు 8 విధాలు
ఈ శ్లోకం చూడండి-

బ్రాహ్మోదైవ స్త ధైవార్షః ప్రజాపత్యస్తథా2సురః
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచాష్టమో థమః

వివాహము 8 విధములు
1. బ్రాహ్మము, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రజాపత్యం
5. అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం

బ్రాహ్మం - అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడైన
          వరుని ఆహ్వానించి దానం ఇవ్వడం
          శాంత-ఋష్టశృంగుల వివాహం ఉదాహరణ

దైవం - యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నవానికి దక్షిణగా
        కన్యను ఇచ్చి వివాహం చేయడం

ఆర్షం - వరుని నుండి గోవుల జంటను తీసుకొని కన్యను ఇవ్వడం
       ఇది ఋషులలో ఎక్కువగా ఉండటంవలన దీని ఆర్షం    
       అన్నారు.

ప్రాజాపత్యం - వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండని
             చెప్పి కన్యాదానం చేయడం
             సీతారాముల వివాహం ఉదాహరణ

ఆసురం - వరుని వద్ద డబ్బుని తీసుకొని కన్యను ఇవ్వడం
          కైకేయీ దశరథుల వివాహం ఉదాహరణ

గాంధర్వం - పరస్పరం అనురాగంతో చేసుకొనే వివాహం
            శకుంతలా దుష్యంతుల వివాహం ఉదాహరణ

రాక్షసం - యుద్ధం చేసి, కన్యను అపహరించి, ఎక్కడికో
          వెళ్ళి వివాహం చేసుకోవడం
          మండోదరి రావణుల వివాహం ఉదాహరణ

పైశాచం - కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకొన్నది

వీటిలో బ్రాహ్మం శ్రేష్ఠమైనది
ప్రాజాపత్యం ధర్మబద్ధమైనది
రాక్షసం, పైశాచం నిషిద్ధమైనవి గా
చెప్పబడుచున్నవి.

చందనం న వనే వనే


చందనం న వనే వనే




సాహితీమిత్రులారా!



ప్రతి దానిలో మంచిని వెదుకుట మనకలవాటు
అన్నిట మంచే ఉండునా ఉండదుకదా
ప్రజల్లో అంతా మంచివారే ఉన్నారా
రాజకీయనాయకుల్లో అంతా మంచివారే ఉన్నారా
లేరుకదా
ఇలాంటి భావననే చెప్పే ఈ శ్లోకం చూడండి-

శైలే శైలే న మాణిక్యం
మౌక్తికం చ గజే గజే
సాధవో నహి సర్వత్రా
చందనం న వనే వనే

ప్రతి పర్వతంలో మాణిక్యాలుండవు.
ప్రతి ఏనుగు తలలో ముత్యాలు పుట్టవు.
సాధువులు అన్ని చోట్లా ఉండరు.
ప్రతి అరణ్యములో గంధపు చెట్టు ఉండదు-
అని భావం

Wednesday, February 15, 2017

హేమంబు కూడబెట్టిన


హేమంబు కూడబెట్టిన




సాహితీమిత్రులారా!



వెన్నెకంటి జన్నమంత్రి
దేవకీనందన శతకంలోని
ఈ పద్యం చూడండి-

చీమల్ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించినన్
పాముల్ జేరినరీతి లోభిజన సంపన్నార్థరాసుల్ వృథా
భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులేలొల్లరో
సామాన్యంబు ధనాధినాధులకు కృష్ణా! దేవకీనందనా!
                                                                              (దేవకీనందన శతకము - 72ప.)

ఈ పద్యం మనం ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందికదా
అదేనయ్యా సుమతి శతకంలో చూడండి ఈ పద్యానికి
పై పద్యానికీ తేడా-

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశుల పాలజేయు భువిలో సుమతీ (43ప.)

ఇది కందపద్యం కావున చిన్నదిగాను క్లుప్తంగాను ఉంది
అలాగే మొదటిపద్యం శార్దూలవృత్తంలో ఉందికావున
కొంచెం విపులంగా పెద్దగా ఉంది భావం అంతా ఒకటేకదా


అస్త్రాలు - ప్రత్యస్త్రాలు


అస్త్రాలు - ప్రత్యస్త్రాలు




సాహితీమిత్రులారా!



ఏదాన్లోనైనా చర్యకు ప్రతిచర్య ఉంటేనే అది రక్తి కడుతుంది.
అలాగే యుద్ధంలో నాయకుడు ప్రతినాయకుడు ఉంటారుకదా
నాయకుడు వేసేది అస్త్రమైతే ప్రతినాయకుడు వేసేది ప్రత్యస్త్రం.
ప్రతినాయకు వేసేది అస్త్రమైతే నాయకుడు వేసేది ప్రత్యస్త్రం.
ఇక్కడ రామాయణంలో రామలక్ష్మణులకు రాక్షసులకు జరిగిన
యుద్ధంలో అస్త్ర ప్రత్యస్త్రాలను గురించి కొన్నిటిని చూద్దాం-

అస్త్రాలు                 ప్రత్యస్త్రాలు
లక్ష్మణుడు                           అతికాయుడు 
           
అగ్నిబాణం                        సూర్యబాణం
ఆగ్నేయాస్త్రం                     సూర్యాస్త్రం
ఐంద్రాస్త్రం                         ఐషీకాస్త్రం
వాయవ్యాస్త్రం                   యమాస్త్రం



లక్మణుడు                    ఇంద్రజిత్
వారుణాస్త్రం                 రౌద్రాస్త్రం
పౌరాస్త్రం                       ఆగ్నేయాస్త్రం
మహేశ్వరాస్త్రం            అసురాస్త్రం


శ్రీరాముడు                          రావణుడు
ఆగ్నేయాస్త్రం                     రౌద్రాస్త్రం
గంధర్వాస్త్రం                     సౌరాస్త్రం
గంధర్వాస్త్రం                     గంధర్వాస్త్రం
దైవాస్త్రం                             దైవాస్త్రం 
గారుడాస్త్రం                        రాక్షసాస్త్రం
మహాశక్త్యాయుధం            మహాశూలం


ఇలా ఒకరిని మించి ఒకరు ఆయుధప్రయోగాలు చేశారు.
 

Monday, February 13, 2017

వాని జీవితం వ్యర్థం


వాని జీవితం వ్యర్థం




సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి -
మానవునికి స్వాతంత్య్రం
ఎంత ముఖ్యమో చెబుతుంది

వానిజన్మంబు సఫల మెవ్వాడు పీల్చు
ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ
పరుల మోచేతి గంజికై ప్రాకులాడు
వాని కంటెను మృతుడను వాడెవండు

ఏ మనిషి స్వతంత్రంగా, ఎవరిపై ఆధారపడకుండా,
ఎవరికీ భయపడకుండా ప్రాణవాయువును పీల్చగలుగుతాడో,
అలాంటి స్వేచ్ఛాజీవి జన్మమే సార్థకమైనది. ఒకరి మోచేతి కింది
గంజికి అంటే ఒకరి దయాదాక్షిణ్యాలమీద గడిపే బ్రతుకు
కోసం ప్రాకులాడు వాడు చచ్చిన వానితో సమానం ప్రాణాలుండి
కూడ మృతప్రాయుడైన - జీవచ్ఛవం వంటివాడు అటువంటివాని
జీవితము వ్యర్థం- అని తాత్పర్యం


చిల్లులు బడఁ గుట్టెనయ్య


చిల్లులు బడఁ గుట్టెనయ్య




సాహితీమిత్రులారా!



పూర్వం ఏ ఇంటిలో పట్టినా
నల్లులు విపరీతంగా ఉండేవి.
ఇక దోమల సంగతి చెప్పక్కరలేదు.
సీతారామయ్య అనే ఐయన ఇంటికి
వెళ్ళిన కవిగారు వాటితో పడిన బాధను
పద్యంలో ఇలా చెప్పారు చూడండి-

నల్లులు లేవని వస్తిమి,
కొల్లలుగా చేరఁడేసి గోడలవెంటన్
నల్లులకు తోడు దోమలు
చిల్లులుబడఁ గుట్టెనయ్య సీతారామా!


ఎంత కసిగా కుట్టాయో పాపం
దాంతో ఏకంగా పద్యం తన్నుకొచ్చింది.

Sunday, February 12, 2017

వీటికి కొంత సమయం పడుతుంది


వీటికి కొంత సమయం పడుతుంది




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం చూడండి-
ఏవైనా ఎందుకు ఆలస్యమౌతాయో
తెలుస్తుంది.

నా ధర్మశ్చరితే లోకే
సద్యః ఫలతి గౌరివ,
శనై రావ ర్తమానస్తు
కర్తు ర్మూలాని కృతాంతయా

మనం చేసే పుణ్యపాపాలకు ఫలితం
అనుభవించటానికి కొంత సమయం పట్టవచ్చు
వెంటనే ఫలితానికి రాకపోవచ్చు
ఆవు గడ్డిమేయగానే పాలివ్వలేదు కదా
పాపపుణ్యాల ఫలితమూ అంతే
అయితే పాపం వల్ల కలిగే ఫలితం
వినాశకరంగానే ఉంటుంది- అని భావం

నీయభిషేకమునకు నీ రబ్బు టెట్లు?


నీయభిషేకమునకు నీ రబ్బు టెట్లు?




సాహితీమిత్రులారా!



కర్నూలు మండలం ముడివేముల వాస్తవ్యుడు
ఉప్పల సింహాద్రినరసింహకవి చెప్పిన చాటువులు-

ఒకమారు పెద్ద కఱవు సంభవించగా కాకర్ల గ్రామంలోని
రామలింగేశ్వరస్వామిపై చెప్పినవాటిలో
ఒక పద్యం ఇక్కడ-

భువి నదీనదములు ప్రవహింపకున్న నీ
            యభిషేకమునకు నీ రబ్బు టెట్లు?
చెఱువుకుంటలు నిండి వరి పండకున్న నీ
            సతతపూజా తిలాక్షతల కెట్లు?
పాదపంబులు లతల్ భాసిల్లకున్న నీ
            పూజనవిధికిని పూవులెట్లు?
పశువులు శుష్కించి పాలుపిండక యున్న
            నీ దీపంబున కెట్టు నేతిబొట్టు?
తెలిసి తెలిసియు నపకీర్తి దెచ్చుకొంటి
వింత పనిచేట నీపోఁటి కింకనైన
వాన కురిపించి రక్షించు మానవులను
రమ్యధవళాంగ! కాకర్ల రామలింగ!

దీనిలో కవిగారు ఎంత చమత్కారంగా శివుని ప్రార్థించారు

భూమిమీద నదీనదాలు ప్రవహిస్తేనేకదా శివునికి అభిషేకము.
చెరువులుకుంటలు నిండి వరిపండకపోతే శివపూజకు లేవట
అక్షతలు. చెట్లు తీగలు లేకుంటే శివపూజకు పూలేలేవు.
పశువులు చిక్కిపోయి పాలు ఇవ్వకపోతే దీపానికి నెయ్యి ఎక్కడ
కాబట్టి ఓ రామలింగేశ్వరా నీకు అంతా తెలుసు తెలిసితెలిసి
చెడ్డపేరు తెచ్చుకుంటున్నావు ఇది నీవంటి వారికి తగదు
ఇకనైనా వానకురిపించవయ్యా
రమ్యమైన తెల్లని శరీరంగల ఓ కాకర్ల రామలింగా!
అని ప్రార్థిస్తున్నాడు కవి


Saturday, February 11, 2017

ఎవరియందు విశ్వాసముంచుకోవాలి?


ఎవరియందు విశ్వాసముంచుకోవాలి?




సాహితీమిత్రులారా!



ఎవరియందు విశ్వాసముంచుకోవాలి
మిత్రునిపైనా అమిత్రుని(శత్రువు)పైనా
అనే విషయం ఈ శ్లోకం చెబుతున్నది చూడండి-

న విశ్వసేత్ కుమిత్రే చ మిత్రేచాపి న విశ్వసేత్
కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్
                                                                                            (చాణక్య నీతి దర్పణం)

చెడ్డ స్నేహితుని యందు విశ్వాసముంచరాదు
మంచి మిత్రుని యందు విశ్వాసముంచరాదు
ఎందుకంటే ఎప్పుడైనా కోపం వచ్చినపుడు
ఆ మిత్రుడు తన రహస్యాలన్నిటిని వెల్లడి చేస్తాడు.

కాబట్టి ఎవ్వరిని నమ్మరాదు.

అధర్వణ వేదం  19-15-6లో
ఇదే విషయాన్ని చెబుతున్నది-

అభయం మిత్రా దభయ మమిత్రాత్ -
అంటే మిత్రుని మొదట అభయం కోరు
ఎందుకంటే మిత్రునిగా ఉన్నపుడు
రహస్యాలు తెలుసుకొని కోపం వచ్చినపుడు
అవన్నీ వెల్లడిస్తాడు- అని భావం

రామాయణకాలం నాటి అగ్రరాజ్యాలు - వీరులు


రామాయణకాలం నాటి అగ్రరాజ్యాలు - వీరులు




సాహితీమిత్రులారా!


రామాయణకాలంలో
5 అగ్రరాజ్యాలుండేవి. అవి-
1. అయోధ్య, 2. కిష్కింధ, 3. లంక, 
4. మిధిలా, 5. కేకయ రాజ్యాలు 

ఈ రాజ్యాల వీరులు-

1. అయోధ్య - రామలక్ష్మణభరతశత్రుఘ్నులు


2. కిష్కింధ - వాలి సుగ్రీవ అంగద 
                        హనుమంత జాంబవంతులు


3. లంక - రావణకుంభకర్ణ ఇంద్రజిత్ 
                  - అకంపన లు


4. మిథిలా - జనకమహారాజు


5. కేకయ - కేకయ రాజు, యుధాజిత్తులు

Friday, February 10, 2017

రంభయైన ఏకులె వడకున్


రంభయైన ఏకులె వడకున్




సాహితీమిత్రులారా!




శ్రీనాథుడు రాజాస్థానాల్లో తిరుగుతూ,
భోగవిలాసాలను అనుభవిస్తూ
రసిక జీవనం గడిపిన వాడు.
ఆయన ఒకసారి పలనాడు ప్రాంతం వెళ్ళాడు.
అక్కడి ప్రజల ఆహార, ఆచార వ్యవహారాలు మోటుగా
ఉండటాన్ని చూచి పరిహాసంగా చెప్పిన పద్యం ఇది -


రసికుఁడు పోవడు పలనా
డెసఁగంగా రంభయైన ఏకులె వడకున్
వసుధేశుఁడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్

పలనాటిలో రంభ అంతటి అందగత్తె కూడ
ఏకులు వడుకుతుంది.
అక్కడి దొరలు కూడ నాగలు పట్టి పొలం దున్నుతారు.
మన్మథునంతవారుకూడ జొన్నంన్నమే తింటారు. -
అని పద్య భావం.

కొన్ని సంవత్సరాల క్రింటి వరకు
పలనాటిలో వరి ధాన్యం పండేదికాదు.
జొన్నలు అక్కడి ప్రధానమైన ఆహారంగా
ఉండేది.


రవిసూనున్ బరిమార్చి


రవిసూనున్ బరిమార్చి




సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రునికి ముత్తాత
అయిన అయ్యలరాజు తిప్పయ్య
కృత రఘువీరా జానకీనాయక శతకంలోని
ఈ పద్యం చూడండి-

రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినా డందునో
రవిసూనున్ గృప నేలి యింద్రసుతు బోరం ద్రుంచినా డందునో
యివి నీయందును రెండునుం గలవు నీకేదిష్టమో చక్కగా
రవివంశాగ్రణి తెల్పగదవయ్య రఘువీరా జానకీనాయకా

సూర్యుని కుమారుని చంపి ఇంద్రకుమారుని
రక్షించినాడని అందునా
రవికుమారుని కృపతో నేలి
ఇంద్రకుమారుని యుద్ధంలో చంపినాడందునా
నీకేది ఇష్టమో చెప్పవయ్య ఓ రువంశ వీరుడా!
జానకీనాయకా! ఓ రామా! అని అడుగుతున్నాడు

ఇందులో రెండింటియందు రవికుమారుడు,
ఇంద్రకుమారుడు అని అనడంతో కొంత పురాణ
ఇతిహాస పరిజ్ఞానం అవసం ఏర్పడుతున్నది.

రామాయణంలో వాలి ఇంద్రుని కుమారుడు,
సుగ్రీవుడు సూర్యునికుమారుడు
ఇక్కడ ఇంద్రునికుమారుని చంపాడు.

భారతంలో అర్జునుడు ఇంద్రునికుమారుడు,
కర్ణుడు సూర్యునికుమారుడు ఇక్కడ
సూర్యకుమారుడైన కర్ణుని చంపించాడు

రెండూ నువ్వే చేశావుకదా
వీటిలో నీకేది ఇష్టమో చెప్పవయ్యా
ఓ శ్రీరామచంద్రా అంటున్నాడు కవి.
ఎలా చెప్పగలడు మరి

ఇలాగే తిక్కన ఒక ప్రశ్నవేశాడు
హరిహరనాథునికి -
ఓ ప్రభూ, నీకు అస్థిమాల ఇష్టమా,!
కౌస్తుభం ఇష్టమా!, కాలకూటం రుచిగా ఉంటుందా?
యశోదాదేవి చనుబాలు రుచిగా ఉంటాయా?
సెలవియ్యవయ్యా -
అని అంటే ఏది కాదంటాడు ఆయన.

Wednesday, February 8, 2017

అస్త్ర ప్రకారాలు - యుద్ధాల రకాలు


అస్త్ర ప్రకారాలు - యుద్ధాల రకాలు




సాహితీమిత్రులారా!



అస్త్ర ప్రకారాలు
దేని తరువాత ఏ అస్త్రం అనేది
వసిష్ఠ ధనుర్వేద సంహితలో చెప్పబడింది

బ్రహ్మాస్త్రం ప్రథమం ప్రోక్తం ద్వితీయం బ్రహ్మదండకమ్
బ్రహ్మశిరస్తృతీయంచ తుర్యం పాశుపతం మతమ్
వాయవ్యం పంచమం ప్రోక్తమాగ్నేయం షష్ఠకం స్మృతమ్
నరసింహం సప్తకఞ్చ తేషాం భేదాహ్యనంతకాః
                                                                                         (వసిష్ఠ ధనుర్వేద సంహిత 2-79,80)

అస్త్రాలు 7 రకాలు వాటి భేదాయు అనంతకాలు.
1. బ్రహ్మాస్త్రం, 2. బ్రహ్మదండకం, 3. బ్రహ్మశిరం,
4. పాశుపతం, 5. వాయవ్యం, 6. ఆగ్నేయం, 
7. నరసింహం

యుద్ధాల రకాలు -
ఇవి చాలా ఉన్నాయి. వసిష్ఠ ధనుర్వేద సంహితలో
ఈ విధంగా చెప్పారు.

ధనుశ్చక్రకశ్చ కుంతశ్చ ఖడ్గశ్చ క్షురికా గదా
సప్తమం బాహు యుద్ధం స్యాత్ ఏవం యుద్ధాని సప్తధా
                                                                                                               (1-8)

ధనుర్యుద్ధం, చక్రయుద్ధం, కుంతయుద్ధం,
ఖడ్గయుద్ధం, క్షురికాయుద్ధం, గదాయుద్ధం,
బాహుయుద్ధం - అని ఏడు విధాలు యుద్ధాలు.
ఇవికాక ఇంకా అనేక రకాల యుద్ధాలు
రామాయణంలో జరిగాయి.


వారు వీరౌతుంటారు


వారు వీరౌతుంటారు




సాహితీమిత్రులారా!

మనకు సాహిత్యంలో ఒకరు చెప్పిన పద్యాన్ని
మరోకరు చెప్పినట్లుగా కొన్ని పద్యాలిన్నాయి
వాటిలో పోతన చెప్పినట్లున్న మంచెన పద్యం.
మనవారు అతికినట్లు కతలు అల్లడంలో ఘనులు.
కేయూరబాహు చరిత్ర(1-13)లోని ఈ పద్యం చూడండి-

బాలరసాలసాలపుష్ప నవపల్లవకోమల కావ్యకన్యకన్
గూళుల కిచ్చి యప్పడుపుగూడు భుజించుకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయలి లేనివాడు గౌ
ద్ధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై

ఈ మంచెన పోతనకు సుమారు 200 ఏండ్లకు పూర్వంవాడు

దీనికి చాటుకవుల కథనం -
పోతన శ్రీనాథుడు బావబావమరుదులని ప్రతీతి.
శ్రీనాథుడు రాజాశ్రయం వల్ల భోగ జీవితం గడుపుతూండగా
పోతన వ్యవసాయం చేస్తూ కవిత్వం వ్రాసేవాడు. ఆ సందర్భంగా
శ్రీనాథుడు పోతనను గేలి చేశాడని దానికి సమాధానంగా ఈ పద్యం చెప్పాడని కధనం-

బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్
గూళులకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై

(కావ్య కన్యక మామిడి చెట్టులేతచిగురాకులవలె కోమలమైనది.
అటువంటి దాన్ని అధములైన రాజులకిచ్చి వారిచ్చిన డబ్బుతో
పొట్టపోసుకోవడం కంటే కవులు నాగలి పట్టి పొలం దున్నితే ఏమి
అడవులలో కందమూలములు తవ్వుకొని జీవిస్తే మాత్రమేమి
భార్యాపుత్రుల పోషించటానికి కూతురువంటి కావ్యాన్ని
అమ్ముకోవటం కంటె స్వతంత్ర జీవనమే మంచిదని భావం)


రెండు పద్యాలకు పాఠాంతరాలు
తప్ప పెద్దతేడా కనబడదు కదా

Tuesday, February 7, 2017

విశ్వామిత్రుడు రామునికి ఏ విద్యలు నేర్పాడు


విశ్వామిత్రుడు రామునికి ఏ విద్యలు నేర్పాడు




సాహితీమిత్రులారా!


రామాయణకాలంలో వశిష్ఠుని చేతిలో
ఓడిపోయిన విశ్వామిత్రుడు లోకోత్తర వీరుడు.
విశ్వామిత్రుడు తపస్సుతో శంకరుని సంతోష పెట్టి
సాంగోపాంగంగా ఉపనిషద్విద్యను సరహస్యమైన
ధనుర్విద్యను అభ్యసించాడు. దేవ, మహర్షి,
దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుష,
ఉరగుల వద్ద ఏయే అస్త్రాలున్నాయో వాటికన్న
ఎక్కువగా శంకరుని నుండి విశ్వామిత్రుడు పొందాడు.

రామాయణం బాలకాండలో విశ్వామిత్రుని నుండి
రాముడు పొందిన అస్త్రాల వివరాలున్నాయి
బాలకాండ 56.6 నుండి 56.12 శ్లోకాలలో
వివరించాడు వాల్మీకి. అవి-

వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా
ఏషికం చాపి చిక్షేప కుపితో గాధి నందనః (56.6)

మానవం మోహనం  చైవ గాంధర్వం స్వాపనం తథా
జృంభనం మాదనం చైవ సంతాపన విలాపనే (56.7)

శోషణం దారణం చైవ వజ్రమస్త్రం  సుదుర్జయమ్
బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ (56.8)

పినాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీ ఉభే
దండాస్త్ర మథ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ (56.9)

ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ
వాయవ్యం మథనం చైవ అస్త్రం హయ శిరస్తథా (56.10)


శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తథా 
వైద్యాధరం  మహాస్త్రం చ కాలాస్త్ర మథ దారుణమ్(56.11)

త్రిశూలమస్త్రం ఘోరంచ కపాల మథ కంకణమ్
ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన (56.12)


విశ్వామిత్రుని వద్ద వారుణం, రౌద్రం, ఐంద్రం,
పాశుపతం, ఐషీకం, మానవం, మోహనం, గాంధర్వం,
స్వాపనం, జృంభనం, మాదనం, సంతాపనం,
విలాపనం, శోషణం, దారణం, సుదుర్జయం, వజ్రం,
బ్రహ్మపాశం, కాలపాశం, వరుణపాశం, పైనాకం,
దయితం, శుష్కాశనం, అర్ధ్రాశని, దండం, పైశాచం,
క్రౌంచం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, వాయవ్యం,
మధనం, హయశీర్షం, కంకాళం, ముసలశక్తి, వైద్యాధరం,
మహాస్త్రం, కాలాస్త్రం, త్రిశూలం, భీకరకపాళం,
కంకణం, బల అతిబల జృంభకాస్త్రాలు, బ్రహ్మస్త్రం మొదలైన
మహా మహిమోపేతాలైన ప్రభావోత్పాదకాలైన శత్రు మర్మ భేదకాలైన
అస్త్రాలున్నాయి. వీటన్నిటినిమించి నూతనాస్త్ర నిర్మాణాలలో
సమర్థుడు విశ్వామిత్రుడు ఇటువంటి రణకోవిదుడు
మరొకడు లేడు ఆనాడు. ఇలాంటి అపూర్వ ఆయుధాలు
ఆకాలంలో ఏకాలంలో, ఏ వీరునికి, ఏ రాజ్యాధినేతకు
ఈ నాడు అగ్రరాజ్యాని పిలువబడే వాటిలోనూ లేవు
అనడంలో ఏమాత్రం సంశయం అవసరంలేదు.
ఇవ్నీ నాడు రామునికి విశ్వామిత్రుడు ఇచ్చాడు.



భాగవతంలోని శిక్షలు


భాగవతంలోని శిక్షలు




సాహితీమిత్రులారా!

భాగవతంలో అనేక శిక్షలు కనిపిస్తాయి.
ఇక్కడ కొన్ని విషయాలు గమనిద్దాం-

ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదునికి
తండ్రి అయిన హిరణ్యకశిపుడు
విధించిన శిక్షలు ఈ పద్యంలో
గమనించవచ్చు-

తనకుమారునికి ఎన్ని శిక్షలి విధించినా
నారాయణ స్మరణ మానడంలేదని తలపోసిన
సందర్భములోనిది ఈ పద్యం -

ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులందు  ద్రొ
బ్బించితి శస్త్రాజి పొడిపించితి మీఁదనిభేంద్ర పక్తిఁద్రొ
క్కించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందుఁ ద్రో
యించితి పెక్కు పాట్లనలయించితి జావఁడిదేమి చిత్రమో
                 (ఆంధ్రమహాభాగవతము - 7 -201)
అని భయంతో ఆక్రోశంతో ఆక్రోశించాడు
సముద్రాలలో త్రోయించాడు,
గదలతో కొట్టించాడు,
కొండల మీదినుంచి త్రోయించాడు,
ఆయుధాలతో పొడిపించాడు,
ఏనుగులతో త్రొక్కించాడు,
నిప్పుల్లో త్రోయించాడు, కొట్టినాడు,
తిట్టినాడు, అవమానించాడు,
పలువిధాలుగా బాధించాడు-
అయినా చావలేదే ఇదేమి చిత్రమో - అని భావం
ఇందులో పలురకాల శిక్షలు మనకు కనిపిస్తున్నాయి..

Monday, February 6, 2017

లక్మిదేవి ఎందుకలా ప్రవర్తిస్తుందంటే?


లక్మిదేవి ఎందుకలా ప్రవర్తిస్తుందంటే?




సాహితీమిత్రులారా!


లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో
ఈ శ్లోకం చూడండి-

క్షీరసాగరా త్పారిజాత పల్ల లేభ్యో, రాగమిందు
శకలా దేశాంతవక్రతా, ముచ్ఛైశ్రవైశ్చంచలతాం
కాల కూటన్మోహనశక్తిం, మదిరయా మదం,
కౌస్తుభమణి రతి నైష్ఠుర్యం, ఇత్యే తాని సహవాస
పరిచయవశా ద్విరహ వినోద చిహ్నాని
గృహీత్యేవోద్గతా

పూర్వం అమృతమధనం కోసం దేవతలూ - దానవులూ
కలిసి పాలసముద్రం చిలికినపుడు, దాన్నుండి
కల్పవృక్షం - కామధేనువు - పాంచజన్యం - పారిజాతం-
ఉచ్ఛైశ్రవం - ఐరావతం - కౌస్తుభమణి - కాలకూటం -
చంద్రుడు - లక్ష్మీదేవి - ఇవన్నీ కూడ ఉద్భవించాయి.

ఈ ప్రకారంగా ఇవ్నీ లక్ష్మీదేవికి సోదరసోదరీమణులు కదా
వీటి పోలికలు కొన్నయినా ఉంటాయికదా
ముఖ్యంగా లక్ష్మీదేవికి వారి పోలికలు కొన్ని వచ్చాయి-
అవి చంద్రుని నుంచి వక్రత్వం
ఉచ్ఛైశ్రవం నుంచి చాంచల్యం
విషం నుంచి మైకం,
అమృతం నుండి మదం,
కౌస్తుభం నుండి కాఠిన్యం
వచ్చాయి అందువల్ల లక్ష్మీదేవి
స్వభావం ఎప్పుడు ఎలా ప్రదర్శించబడుతుందో
మానవులకు అంతు చిక్కకుండా పోయింది.

రామాయణములో ఉపయోగించిన ఆయుధాలు - 1


రామాయణములో ఉపయోగించిన ఆయుధాలు - 1




సాహితీమిత్రులారా!


ఇప్పుడు మనం రకరకాల
ఆయుధాల పేర్లు వింటున్నాము
కాని రామాయణకాలంలో
ఉపయోగించిన ఆయుధాలపేర్లు
వాటి వివరాలు కొన్ని తెలుసుకుందాము-

వశిష్ఠధనుర్వేదం(1-65)లో
విభిన్న ఆయుధాలు
వాటి కార్యాలు
ఈ విధంగా వివరించింది -

ఆరాముఖేన చర్మఛేదనం
క్షురప్రేణ బాణకర్తనం
వా బహుకర్తనం
సూచీముఖేన కవచభేధనమ్
భల్లేన హృదయభేధనం
వత్సదంతే గుణచర్వణం
ద్విభల్లేణ బాణావరోధనమ్
కర్ణికేవ లోహమయ బాణానాం ఛేదనమ్
కాకతుండేన వేద్యానాం వేధః కుర్యాత్ 


ఆరాముఖం -
చర్మఛేదనము చేసేది

క్షురప్రం -
శత్రువుల బాణాలను, చేతులను ఖండించేది

గోపుచ్ఛం - 
సాధారణంగా వాడే ఆయుధం

అర్థచంద్రం -
శత్రువుల శిరస్సులను, మెడలను, ధనుస్సులను ఛేదించేది

సూచీముఖం - 
శత్రువుల కవచాలను ఛేదించేది

భల్లం -
శత్రువుల గుండెలను చీల్చేది

వత్సదంతం - 
శత్రువుల ధనుస్సుల అల్లెత్రాళ్ళను త్రెంచేది

కర్ణిక -
లోహంతో చేయబడిన బాణాలను చీల్చే ఆయుధం

కాక తుండం - 
మిక్కిలి కఠినమైన వస్తువులను ఛేదించే ఆయుధం




ఇలాంటి ఆయుధాలన్నీ రామాయణంలో వాడబడ్డాయి.