Monday, December 31, 2018

అమెరి”గల్పిక”(కథ)


అమెరి”గల్పిక”(కథ)
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...................

కళాకారుడికి కావల్సింది
సుబ్బారావు కీమధ్య కళాపోషణ ఎక్కువైంది.

స్థానిక తెలుగుసమితిలో సాంస్కృతిక కార్యదర్శిత్వపు శాలువా కప్పుకొని ఆ సంవత్సరం ఉగాది ఉత్సవాన్ని ఉర్రూత లూపించేశాడు ఆ ఉత్సాహంలో. ఒక లైట్‌ మ్యూజిక్‌ బాండు, ఒక హాస్య నాటిక (స్త్రీ పాత్ర లేనిది), ఒక కూచిపూడి ప్రదర్శన .. ఇవన్నీ ఆ ఉత్సవ వేదిక మీద సుబ్బారావు కళారాధన తత్పరతకి అద్దం పట్టాయి.

అమెరికా తెలుగువారు రెండేళ్ళ కోసారి తాము జరుపుకునే మహా జాతరకి మహా మహా తారల్ని, కళామతల్లి ముద్దుబిడ్డల్ని ఆంధ్రదేశం నించి టెంపరవర్రీగా దిగుమతి చేసుకుని తమకున్న కళాభక్తిని ఋజువు చేసుకుంటూ రావటం తమ రెరిగినదే. (ఇక్కడ తమలాంటి తెలివైన పాఠకుడు లీగల్‌ పాయింట్‌ తియ్యొచ్చు, అమెరికా తెలుగువారు రెండు గ్రూపులై, ఈ రెండు గ్రూపులూ ఆల్టర్నేట్‌ సంవత్సరాల్లో రెండేళ్ళకోసారి జాతర్లు జరిపించటం వల్ల ఈ జాతర ప్రతి సంవత్సరమూ జరుగుతోందీ అని. నాకు ఆపాదించబడిన శక్తి వల్ల ఈ పాయింటుని కొట్టి వెయ్యడమైనది. ఋజువులు కావల్సిన వారు “నిరంకుశాః కవయః” అన్న ముక్క మననం చేసుకోవలెను). సుబ్బారావుకి ఎట్లాగైనా ఆ తారల్ని తమ స్థానిక తెలుగు కళావేదిక మీద ప్రకాశింప చెయ్యాలన్నది ఇప్పుడు జీవితాదర్శం అయి కూర్చుంది. పాపం చాలా ప్రయత్నించాడు కానీ ఆ తారల వేలంపాటలో తూగలేక పోయాడు. తీరా వేలం ముగిసే సరికి సుబ్బారావు వంతుకి మిగిలిందల్లా ఒక జానపద కళాకారుల బృందం.

తమ వూరికెవరూ తారలు రావట్లేదూ అని సుబ్బారావు వాళ్ళ సమితి ప్రెసిడెంటు పెదివి విరిచాడు. జానపద కళాకారులా అన్చెప్పి సెక్రట్రీ కొట్టిపారేశాడు. సుబ్బారావుకి రోషం పొడుచుకొచ్చింది. వీళ్ళు మాత్రం కళాకారులు కారూ? వీళ్ళది మాత్రం కళ కాదూ? వీళ్ళేం హైద్రాబాదులో కూర్చుని, హాయిగా గవర్మెంటు ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం పూట ఉబుసుపోక జానపద గేయాలు నేర్చుకున్న గుంపు కాదు. అసలు సిసలైన పదహారణాల తెలుగు జానపదులు. కళ వీళ్ళకి హాబీ కాదు, అది వాళ్ళ రక్తంలోనే ఉంది. అసలింకా మాట్లాడితే వీళ్ళే నిజమైన కళాకారులు అని నొక్కి వక్కాణించాడు. దాంతో విమర్శించడానికి తెరుచుకున్న కమిటీ సభ్యుల నోళ్ళు మూత బడ్డై.

చూస్తూ చూస్తూ ప్రోగ్రామ్‌ పెట్టుకున్న రోజు రానే వచ్చింది. సుబ్బారావు వానేసుకెళ్ళి ఏర్‌ పోర్ట్‌లో కళాకారుల బృందాన్ని రిసీవ్‌ చేసుకున్నాడు. వాళ్ళ అమెరికా ట్రిప్పులో అదే చివరి మజిలీ. అక్కణ్ణించి ఇక మాతృభూమికి తిరుగు ప్రయాణమే. అందరూ పెట్టే బేడాతో దిగారు.

ఇంటికొచ్చి భోజనాలు చేసి కొంచెం బడలిక తీరాక ఆ బృందం సుబ్బారావుని ఒక చిన్న కోరిక కోరింది ఆ వూళ్ళో వున్న వింతలూ విశేషాలూ చూపించమని. తప్పేదేముంది, అందర్నీ వేనెక్కించుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళాడు. కొన్ని మ్యూజియములూ బిల్డింగులూ అవీ చూశాక చివరిగా పబ్లిక్‌ పార్కుకి తీసుకెళ్ళాడు.
కొన్ని వందల ఎకరాలు మహా వృక్షాలతోనూ, ఇంద్ర ధనుసుని తలపించే పూల మొక్కల మడులతోనూ, పట్టు తివాచీల్లాంటి పచ్చిక బయళ్ళతోనూ నవ నవలాడి పోతోంది ఆ పార్కు. సుబ్బారావు ఆ బృందంతో మీరందరూ అరగంటసేపు హాయిగా తిరిగి రండి, నేనిక్కడే వుంటా నన్చెప్పి ఫౌంటెన్‌ గట్టుమీద సెటిలయ్యాడు. వాళ్ళు పార్కులో కెళ్ళారు.

అరగంట గడిచేప్పటికి అందరూ తిరిగొచ్చేశారు, తప్పెట వాయించే గట్టయ్య తప్ప. ఏడీ గట్టయ్య, ఎక్కడ మాయమైపోయాడు అని వాళ్ళు తర్జన భర్జనలు పడుతుండగానే ఇంకో పది నిమిషాలు గడిచిపోయాయి. ఇక సుబ్బారావుకి టెన్షన్‌ పెరిగిపోతోంది. ఏడీ మనిషి .. ఎక్కడన్నా దారి తెలీక తప్పి పోయాడా .. ఓ పక్కన ప్రోగ్రాంకి టైమవుతోంది .. ఛ ఛ తను కూడా వెళ్ళి ఉండాల్సింది .. ఎలాగిప్పుడు అని అతను ఖంగారు పడుతుంటే, ఎవరో అన్నారు, అదిగో వచ్చేస్తన్నాడు గట్టయ్య అని.

సుబ్బారావు అటు చూశాడు. వరసగా ఉన్న గులాబి పొదల వెనకనించి వస్తున్నాడు గట్టయ్య. అతని భుజమ్మీద గుడ్డలో కట్టిన పెద్ద మూట ఉంది. మూట పెద్దగానే ఉంది కానీ మరీ బరువున్నట్టులేదు, సునాయాసంగానే నడుస్తున్నాడు. ఆ మూటేవిటో అర్థం కాలేదు సుబ్బారావుకి. చూస్తుండగానే గట్టయ్య వచ్చి వాళ్ళని చేరుకున్నాడు.

అందర్నీ చూసి, “ఓహో, మీరంతా వచ్చేసినారే! . నేనే ఎనకాల బడ్డా నన్న మాట. సరే పదండి,” అన్నాడు.

సుబ్బారావుకి ఆ మూటేవిటో అడగాలని ఉంది, కానీ సభ్యత కాదని ఊరుకున్నాడు. అందరూ వేనెక్కారు. గట్టయ్య తన మూటని పెన్నిధిలాగా వొళ్ళోనే పెట్టుక్కూచున్నాడు. సుబ్బారావు వేన్‌ స్టార్ట్‌ చేశాడు, కానీ ఆ మూటేవిటో తెలుసుకుంటే తప్ప మనసు నిలిచేట్టు లేదు. ఇహ ఉండ బట్టలేక అడిగేశాడు గట్టయ్యని.
“మూటా! ఏం లేదు బావూ, మనూర్లో చూశా, రెండేళ్ళుగా వానలు సరింగా పళ్ళా. పొలాలే నీళ్ళు దొరక్క ఎండిపోతా వున్నై. ఇహ బంజర్ల సంగజ్జెప్పే దేవుంది? ఈ దేశంలో ఇన్ని వూళ్ళలో సూత్తన్నానా, తస్సదియ్య ఇక్కడ బయళ్ళు సూత్తే కళ్ళు సల్లగా ఉంది. ఇక ఇక్కణ్ణించి మనూరెల్లి పోతాంగా, అందికని, పసరాలకి పెట్టుకుందారని కసింత పచ్చగడ్డి కోసుకొచ్చుకున్నా బావూ. పిచ్చి ముండలు ఇంత పచ్చనాకు తిని ఎన్నాళ్ళయిందో. ఒక్క పూటన్నా కడుపునిండా తింటై నోర్లేని జీవాలు.”

ఇది విని కళారాధకుడు సుబ్బారావు వేన్‌ గేరు మార్చటం మర్చి పోయి అలాగే చూస్తుండి పోయాడు. అతని కళ్ళ ముందు తారలు నాట్యం చేస్తున్నై.

కూపస్థ మండూకం
యూనివర్సిటీలో పచ్చడి, ఐ మీన్‌ పీ హెచ్‌ డీ చేసే రోజుల్లో సుబ్బారావుకి బ్రిజ్మోహన్‌ మిశ్రా అనే సీనియర్తో పరిచయమైంది. అప్పుడప్పుడూ సుబ్బారావు బ్రిజ్‌ ఆఫీసులో చేరి కష్టమూ సుఖమూ చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఇలాగే ఏదో మాటల్లో ఉండగా బ్రిజ్‌ అకస్మాత్తుగా, “ఇవ్వాళ్ళ విశేషమేవిటో తెలుసా?” అన్నాడు.
సుబ్బారావు అయోమయంగా చూస్తూ, “తెలీదే, ఏవిటివ్వాళ్ళ?” అనడిగాడు.
“ఇవ్వాళ్ళ హోలికా పూర్ణిమ, అంటే హోలీ పండుగ!”
“వ్హాట్‌ ఫెస్టివల్‌” అంటూ వచ్చాడు బ్రిజ్‌ ఆఫీస్‌ మేటు జాన్‌ మోర్‌.
“అమెరికా పక్షివి నీకేం తెలుస్తుందిలే మిగతా ప్రపంచం గురించి. మీ అమెరికన్‌ లంతా ఇంతే, కూపస్థ మండూకాలు. మీ బావిలో కూర్చోని అదే ప్రపంచం అనుకుంటూ ఉంటారు,” అని ఓ విసురు విసిరాడు బ్రిజ్‌ మోహన్‌.
జాన్‌ దానికి నవ్వి, “నాకు తెలీదని ఒప్పుకుంటా. పోనీ తెలిసేట్టు నువ్వు చెప్పరాదా?” అన్నాడు.
ఇక బ్రిజ్‌ చెప్పుకొచ్చాడు హోలీ పండుగ వెనకాల ఉన్న కథ, దాని మహత్యమేవిటీ, ఎంత ఆర్భాటంగా ఆనందంగా భారతీయులు ఈ పండుగ జరుపుకుంటారూ అన్నీనూ. చెప్పొద్దూ, బ్రిజ్‌ మంచి వక్త. అందులోనూ కథల్ని రసవత్తరంగా చెప్పటంలో దిట్ట. ఆ కథ పూర్తయ్యే సరికి సుబ్బారావు దృష్టిలో బ్రిజ్‌ మోహన్‌ చాలా ఎత్తుకి ఎదిగి పోయాడు.

అప్పణ్ణించీ వీలైనప్పుడల్లా సుబ్బారావు బ్రిజ్‌ మోహన్‌ దగ్గర చేరి అవీ ఇవీ అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. అదే ఆఫీస్‌ కాబట్టి జాన్‌ కూడా చేరేవాడు ఆ కబుర్లల్లో. ఇరవై ఐదేళ్ళు మాతృదేశంలో ఉండి కూడా వంట పట్టించుకోని భారతీయ సంస్కృతిని గురించి సుబ్బారావు ఈ పరాయిదేశంలో బ్రిజ్మోహన్‌ శిష్యరికంలో ఐదారు నెలల్లోనే చాలా నేర్చుకున్నాడు.

ఆ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా చాలా ఆర్భాటం చేశారు యూనివర్సిటీలో భారతీయ విద్యార్థి బృందం. అందులో బ్రిజ్మోహన్‌ తో కలిసి సుబ్బారావు కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. బ్రిజ్‌ ప్రోద్బలంతో జాన్‌ కూడా వచ్చాడు ఆ ఫంక్షన్‌ కి. ఊరికే రావటమే కాదు, బ్రిజ్‌ దగ్గర్నించి ఒక కుర్తా పైజమా అరువుతీసుకుని వేసుకుని మరీ వచ్చాడు. బియ్యంగింజలు కలిపిన కుంకుమ నీళ్ళతో నుదుట తిలకం పెట్టించుకుని లక్ష్మీ పూజలో కూడా పాల్గొన్నాడు. కారం కారం అని వొగుర్చుకుంటూనే భోజన పదార్ధాలన్నీ ఒకటికి రెండుసార్లు వడ్డించుకుని తిన్నాడు.

ఇన్నాళ్ళూ ఇండియా అంటే ఏవిటో, భారతీయ సంస్కృతి అంటే ఏవిటో బొత్తిగా తెలీని ఈ అమెరికన్‌ అజ్ఞానిని ఇంతగా మార్చేసిన బ్రిజ్మోహన్‌ ని చూసి, అతడు తన స్నేహితుడైనందుకు సుబ్బారావు చాలా గర్వించాడు.

కొన్నాళ్ళు పోయాక ఒకరోజు సుబ్బారావు ఎప్పట్లాగే బ్రిజ్‌ ఆఫీసుకి వెళ్ళాడు బాతాఖానీ వేసేందుకు. జాన్‌ కూడా ఉన్నాడు అక్కడే. కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాక, వెళ్ళటానికి లేస్తూ జాన్‌ అన్నాడు, “ఆ మర్చేపోయా. థాంక్స్‌గివింగ్‌ వస్తోంది గదా. ఈసారి మీరిద్దరూ నాతో రావాలి థాంక్స్‌ గివింగ్‌ డిన్నర్‌కి. మా పేరెంట్స్‌ ఇంటికి వెళ్దాం. ఆ రాత్రికి అక్కడే ఉండి శుక్రవారం తీరిగ్గా తిరిగి రావచ్చు. మీరు కూడా వస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది.”

సుబ్బారావు వెంటనే ఒప్పుకున్నాడు గానీ బ్రిజ్‌ మాట్లాడలేదు. జాన్‌ వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రిజ్‌ సుబ్బారావుతో నిష్ఠూరంగా అన్నాడు, “అదేంటి గురూ, అట్లా ఒప్పేసుకున్నావ్‌? ఒకపూట భోజనం కోసం మొహం వాచినట్టు వాడితోపాటు మనం అంతదూరం వెళ్ళాలా? అదీ కాక మరుసట్రోజు బ్లాక్‌ ఫ్రైడే! పొద్దున్నే మాల్‌ కి వెళ్ళకపోతే సేల్‌ లో ఉన్న ఐటమ్సన్నీ ఖాళీ! అంతగా వాడితో పూసుకోవాలంటే నువ్వెళ్ళు. నేన్రాను!”

కొన్నేళ్ళుగా అమెరికాలో ఉండీ థాంక్స్‌ గివింగ్‌ మరుసట్రోజు బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ గురించి తెలుసుకున్నాడు తప్ప, అమెరికన్‌ జీవితంలో థాంక్స్‌ గివింగ్‌ కి ఉన్న ప్రాముఖ్యతని, దాని భావాన్ని కనీసం అర్థం చేసుకోడానికి ప్రయత్నం కూడా చెయ్యని తన స్నేహితుడికేసి బిత్తరపోయి చూస్తుండిపోయాడు సుబ్బారావు.

అంతే. కొన్ని కప్పలు బావిలోనే ఉన్నా దొరికిన అవకాశాలు వదులుకోకుండా అన్నీ తెలుసుకుంటాయ్‌. మరికొన్ని బావి విడిచి వచ్చినా, ఆ వదిలిన బావినే తమచుట్టూ కట్టేసుకుని దాంట్లోనే ఉండిపోతాయ్‌.
-----------------------------------------------------------
రచన: ఎస్‌. నారాయణస్వామి, 
ఈమాట సౌజన్యంతో

Sunday, December 30, 2018

పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..


పువ్వులు.. పువ్వులు.. పువ్వులు ..సాహితీమిత్రులారా!

గుంటూరు శేషేంద్ర శర్మగారి కవితను ఆస్వాదించండి-

నవ్వుల జల్లులు కురిశాయి నా మీద
పుష్పవాణి పలికింది
బిడ్డా! పువ్వుల్ని తెలియని వారే అందరూ లోకంలో
పూరేకుల రంగులు చూసి పరవశులౌతారా
మూర్చపోతారు పరాగ పరీమళాలకు వశీకృతులై
దేవుడ్ని పూజిస్తారు వాటి గొంతులు కోసి
దండలల్లి ధరించుకుంటారు వాటి గొంతులు కోసి
అజ్ఞానులు – సమగ్ర పుష్పజ్ఞానం కావాలంటే
దర్శన శక్తి కావాలి మానవ నేత్రాలకు
అది సిద్ధిస్తుంది చిత్తాన్ని ఏకాగ్రం చేసి
తపస్సు చేసినప్పుడే –
అట్టి నేత్రాలు పుష్పాన్ని చూస్తే పుష్పపు
లోతుల్లోకి పోతాయి చూపులు
ఆశ్చర్య జనకములు ఆ లోతులు!
పుష్పం ఫలాన్ని కంటుంది
ఫలం గర్భంలో బీజం ఉంటుంది.
బీజంలో వృక్షం ఉంటుంది – ఇలా
ఇదొక అవిచ్చిన్న సృష్టి వలయం
పుష్పం లేకపోతే సృష్టి లేదు –
పుష్పాలన్నీ తల్లులే’
సృష్టిలో అన్ని ప్రాణుల్లో నూటికి యాభై
పుష్పవతులౌతాయి
ఆ ప్రాణుల్లో మనుష్య జాతి ఒకటి –
పుష్పవతులైన మానవీయ జాతి వారందరూ
మాతృదేవతలే
భార్య కూడా భర్తకు మాతృదేవతయే ఇది
కీలక రహస్యం – ఇది కీలక సత్యం
ఈ సత్యాన్ని ఉల్లంఘించిన వాడు
పాప పుణ్యాలనేవి ఉంటే
పాపగ్రస్తుడే అవుతాడు
జాగ్రత్త!
-------------------------------------------------------
రచన: గుంటూరు శేషేంద్ర శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 29, 2018

మారిన కాలం, మారని మనుష్యులు


మారిన కాలం, మారని మనుష్యులు
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.............
“పెళ్ళి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ?” అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో.
వాళ్ళ రెండో అమ్మాయికి ఇటీవలే పెళ్ళి చేసి బాధ్యత తీరిందన్న సంతోషంలో వున్నారిద్దరూ.ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ చేసినా అప్పుల పాలవలేదు.

“ఇంక నువ్వు ఉద్యోగం మానేసి రెస్టు తీసుకో సుమతీ” అన్నాడు రాజశేఖరం.
“ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే బోరు కొట్టదూ?” నవ్వింది సుమతి.
“ఇన్నాళ్ళు కష్టపడ్డది చాల్లే! మా అమ్మా నాన్నలిద్దరూ డెభ్భై లో పడ్డారు.పాపం, పదేళ్ళుగా మా తమ్ముడి దగ్గరే వుంటున్నారు. వాళ్ళని తెచ్చి మనతో వుంచుకుందాం. నువు వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్నావంటే, నీకటు రెస్టు గా వుంటుంది, వాళ్ళని చూసుకోవటంలో ఇబ్బందీ వుండదు. ”

“అదేదో మీరే చేసి, ఆ రెస్టేదో మీరే తీసుకుంటూ వాళ్ళ సేవలేవో మీరే చేసుకోవచ్చుగా?” అని ఎప్పుడూ అడగదు ఆమె. కానీ, అతని డబుల్‌ స్టాండర్స్డ్‌ నీ, దాన్ని సమర్ధించే వ్యవస్థనీ అర్ధం చేసుకోకుండా వుండలేదు. అందుకే ఎటూ కాని ఒక నవ్వు నవ్వి లేచి వెళ్ళిపోయింది. ఎనభై ఏళ్ళు పై పడి ఎక్కడో ఒంటరిగా కాలం గడుపుతున్న తల్లి గుర్తొచ్చింది.

సరిగ్గా ఆరు నెలల క్రితం తను ఇలాంటిదే ప్రస్తావన తెచ్చింది.
“మా అమ్మ పెద్దదయిపోతుంది.ఒంటరిగా కష్టపడుతుంది. ఆమెని తెచ్చి మనతో వుంచుకుందామా?” అని.
“మనతోనా? ఎలా కుదురుతుంది? నువ్వు ఆఫీసుకెళ్తే ఆవిడ ఒంటరిగా గడపాల్సి రాదూ? ”
నవ్వొచ్చింది సుమతికి.
“ఇక్కడయితే కేవలం ఎనిమిది గంటలు ఒంటరిగా వుండాలి. అక్కడ ఇరవై నాలుగు గంటలూ ఒంటరిగానే వుంది.”
“మనకి పిల్లల చదువులూ, డబ్బు ఇబ్బందులు”
“అమ్మ మనమీదేమీ ఆర్ధికంగా ఆధారపడి లేదు. తన పెన్షన్‌ తనకొస్తుంది.”
సుమతిలో సహనం తగ్గిపోతుంది.
“మా అమ్మా నాన్నా ఏమంటారో”
యాభై ఏళ్ళు దాటి, పాతికేళ్ళుగా తనతో కాపురం చేస్తున్న భర్తని మొదటిసారి చూసినట్టు చూసింది సుమతి.
“ఇందులో వాళ్ళనటానికేముంది?”
“వాళ్ళకీ మనతో వుండాలని వుండదా?”
“మా అమ్మ మనతో వుంటే, అత్తయ్యా, మావయ్యా మనింటికి రావొద్దనా అర్ధం? చాలాసార్లడిగాను మనింటికి రమ్మని.వాళ్ళే మీ తమ్ముడి దగ్గరుంటామన్నారు. అయినా ముగ్గురినీ మనం చక్కగా చూసుకొవచ్చు. రాధిక ఎలాగూ పెళ్ళయి వెళ్ళి పోతుంది. ఇంకా ఇల్లు సరిపోదనుకుంటే, ఇంకో పెద్ద ఇల్లు తీసుకుందాం.” ఉత్సాహంగా అంది సుమతి.

“అదంతా జరిగే పని కాదులే. మీ అమ్మగారు మన ఇంట్లో వుంటే చూసే వాళ్ళేమనుకుంటారు? ఆవిడకీ మా అమ్మకీ గొడవలొస్తే ఎలా? నాకంతగా ఇష్టం లేదు.ఆలోచించుకో.”

అలా అన్నాడే కానీ, వారం రోజుల వరకూ ముభావంగానే వున్నాడు. తను మళ్ళీ ఆ ప్రసక్తి తీసుకురాదన్న నమ్మకం కలిగాక కానీ మామూలు మనిషి కాలేదు.

“తోబుట్టువులు లేని ఆడపిల్లని చేసుకుంటే, ఆ పిల్ల తల్లితండ్రులని దూరంగా వుంచటం కష్టం.” అత్తగారి మాటలు గుర్తొచ్చి మనసు బాధగా మూలిగి ముడుచుకుపోయింది.

“ఏమిటీ? హైద్రాబాదు ట్రాన్స్‌ఫరా? ఎందుకు చేసారు? “, నోరావలించాడు రాజశేఖరం.
“నేనే అడిగి చేయించుకున్నాను.” శాంతంగా అంది సుమతి.
“నన్నడక్కుండా ఎందుకు చేయించుకున్నావు?”
చెప్పినా అతనికి అర్ధం కాదనుకుందేమో, మాట్లాడకుండా వుండి పోయింది.
“ఇప్పుడెలా? నాకు ట్రాన్స్ఫర్‌ కుదరదు. ఇక్కడొకళ్ళం, అక్కడొకళ్ళం. మా అమ్మా నాన్నని పిలుద్దామంటే, అమ్మ ఆరోగ్యం బాగా లేదు. నాకు వంటకెలా?”

అతని వంక ఒక అసహ్యమయిన చూపు చూడాలన్న కోరిక బలవంతంగా ఆపుకుంది. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసినా తన విలువ అంతే. తనకంటె ఎక్కువ కాలం కాపురం చేసిన తన అత్తగారికున్న విలువా అంతే.ఇంట్లో ఆడది లేకపోతే, వంట ఎలా అన్నదీ ముఖ్యం అందరికీ.

ఆ మధ్య తన కొలీగ్‌ సుందర్‌ తో సంభాషణ గుర్తొచ్చింది ఆమెకి.

“మీ ఆవిడ డెలివెరీ టైం దగ్గరికొస్తుంది కదా?ఎవరయినా సాయానికి వస్తారా లేక ఆవిడే పుట్టింటికి వెళ్తారా?” లంచ్‌ లో అడిగింది సుందర్ని.

“ఇక్కడే వుంటుందండీ.వంటకి మా పక్కింటావిడ సాయం చేస్తారు.”

కారియర్‌ నిండా నిండు చూలాలయిన భార్య వండి పెట్టిన భోజనం కమ్మగా తింటూ అన్నాడు సుందర్‌
“నీ తిండి గొడవెందుకిప్పుడు?” మనసులో తిట్టుకొని, పైకి వీలయినంత వ్యంగ్యంగా, “మీ భోజనం సమస్యే పాపం. కాని, డెలివరీ ఆవిడకి కాబట్టి, మానసికంగా,శారీరకంగా ఆవిడకి సహాయం అవసరం.దానిగురించి అడిగాను.”

అతనివంక ఒక అసహ్యమయిన చూపు చూసి లేచి వెళ్ళిపోయింది.

హైద్రాబాదు చేరి తల్లితో హాయిగా వుంది సుమతి. తను ఇంట్లో లేని సమయంలో ఆవిడని చూసుకోవటానికి ఒక పనిపిల్లని పెట్టుకుంది.

“అల్లుడుగారిని ఒంటరిగా వదిలి నువ్వెందుకే ఇక్కడ?” అంటూ తల్లి చేసే సణుగుడు పట్టించుకోకుండా వుండటం అలవాటు చేసుకుంది.

పెళ్ళయిన ఇన్ని సంవత్సరాల తరువాత భార్యలో ఇంత పట్టుదల మొదటిసారి చూసాడు రాజశేఖరం. ఇన్ని రోజులు భార్య లేకుండా గడపటం కొంచం ఒంటరిగా, చాలా ఇబ్బందిగా వుంది. ఆ రోజు పోస్టులో తన పేర వచ్చిన ఉత్తరం చూసి ఆశ్చర్య పోయాడు.

మీకు,
బాగా వున్నారని తలుస్తాను. నేను క్షేమం. చాలా సంవత్సరాల తరువాత ఇలా ఉత్తరం రాసుకోవటం బాగుంది. ఈ ఎలక్ట్రానిక్‌ యుగంలో మనని ఓల్డు ఫాషన్డ్‌ అనుకుంటారేమో.

పోతే, నా మొండి పట్టుదల చూసి మీరు ఏమనుకుంటున్నారో!నేను చేసే పనులకి సంజాయిషీ ఇవ్వటం అలవాటు లేదు నాకు. మా అమ్మకి ముప్ఫై అయిదవయేట, పెళ్ళయిన పదిహేను సంవత్సరాలకి, ఇక పిల్లలు పుట్టరన్న నిరాశలో నేను పుట్టాను. ఆ సంతోషం ఎక్కువ కాలం లేకుండానే మా నాన్నగారు పోయారు.నన్ను ఒంటరిగా పెంచలేనన్న భయంతో మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళింట్లో వాళ్ళ అన్నయ్యలకింద ఒణికిపోతూ కాలం గడిపింది.మన పెళ్ళప్పటికే మా మావయ్యలు వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్ళి పోయారు, అమ్మని ఏదయినా వృధ్ధుల శరణాలయంలో చేర్పించమని సలహా ఇచ్చి. వాళ్ళదేం తప్పు లేదు. పెచ్చు పెరిగిపోతున్న కన్‌స్యూమరిజం కాలం లో విధవరాలయిన చెల్లెలిని, ఆమె కూతురిని ఇరవై ఏళ్ళు ఆదరించటమే అరుదు.మన పెళ్ళయింతరువాత దాదాపు పదిహేను ఏళ్ళు ఆమె ఒంటరిగా ఇంట్లో కాలం గడిపింది.ఇక ఒంటరితనం భరించలేక, పదేళ్ళ కింద హోం లో చేరి రోజులు లెక్క పెడుతుంది. కనీసం ఈ చివరిరోజులలో నయినా అమ్మని నా దగ్గరుంచుకోని ఆవిడకి మనశ్శాంతిని ఇవ్వాలనుకున్నాను.

మిమ్మల్ని కని పెంచి పెద్దచేసినందుకు మీ అమ్మా నాన్నల్ని మీ దగ్గరుంచుకొని, వాళ్ళ బాగోగులని చూడాలని, వాళ్ళ ఋణం తీర్చుకోవాలని మీరు ఆశ పడ్డారు.అందుకు నా వంతు సాయం నేను చేయాలని కోరుకున్నారు. ఆలాంటప్పుడు నా ఆశ ఎందుకు పేరాశ అవుతుందో నాకు అర్ధం కావటంలేదు.

ఆవిడ చెప్పించిన చదువు,దాని ద్వారా తెచ్చుకున్న ఉద్యోగం, సమ్పాదించిన డబ్బులు వాడుకున్నారేగాని, మన దగ్గరుంచుకుందాం అంటే ఇష్టపడలేదెందుకని?

మన ఇంట్లోనే కాదు.ఎక్కడయినా ఇంతే.చెల్లెళ్ళ పెళ్ళిళ్ళూ, తమ్ముళ్ళ చదువులూ వంటి బాధ్యతలు వున్న మగవాడు తన పెళ్ళి మానుకోనక్కరలేదు.తనతో సహకరించే భార్యని వెతుక్కోవచ్చు.కానీ అదే పరిస్థితిలోవున్న ఆడ కూతురు తన పెళ్ళి మానుకుంటుంది.ఎందుకంటే, తనతో సహకరించే భర్త దొరుకుతాడన్న నమ్మకం లేక.

అదృష్టవశాత్తు, ఆర్ధికంగా, శారీరకంగా మనం మీ అమ్మా నాన్నలనీ,మా అమ్మనీ కూడా భరించగలిగే స్థితిలో వున్నాం.అలా లేని పరిస్థితిలో ఏం చేసే వాళ్ళమో, నా ఊహకందని విషయం.

ఇంట్లో బయటా, మీ పనుల్లో,బాధ్యతల్లో నేను మనస్ఫూర్తిగా సహకరించాను అని మీకు గుర్తుచేయటం నాకు ఇష్టం లేదు. నా మనసు అర్ధమయి మీరు రిటైరయాక ఇక్కడికి వచ్చినా సరే, లేదా అందరం కలిసి వుండటానికి మరే ఏర్పాటయినా నానుంచి ఎటువంటి సమస్యలూ వుండవు.
ఇప్పటికీ,
మీ,
సుమతి
-----------------------------------------------------------
రచన: శారద, 
ఈమాట సౌజన్యంతో

Friday, December 28, 2018

శివధనుర్భంగపుసన్నివేశం


శివధనుర్భంగపుసన్నివేశంసాహితీమిత్రులారా!

శ్రీమద్రామాయణకల్పవృక్ష మహాకావ్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉపకాండలకి పెట్టిన పేర్లు సముచితాలు. ఉదాహరణకి బాలకాండలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఏమిటి అని ఎవరైనా అడిగితే మనకి వెంటనే స్ఫురించేవి పుత్రకామేష్టీ శ్రీరామజననమూ విశ్వామిత్రాగమనమూ అహల్యాశాపవిమోచనమూ శివధనుర్భంగమూ సీతారామకల్యాణమూను. ఇందులో అహల్యాశాపవిమోచనమూ శివధనుర్భంగమూ విశ్వామిత్రాగమనం పైన ఆధారపడ్డవే కాబట్టి ఈ జాబితాలో దానిని మినహాయించవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టిన పేర్లు సరిగ్గా ఇక మిగిలిన ఘట్టాలకు సంబంధించినవే. మరొక విషయం ఏమంటే ఉపకాండలని ఆయన ఖండాలని పిలిచారు. ౢకప్తత కోసం ఆ పేర్లలోని ఆ ఆ సమాసాలలో ముఖ్యమైన పదాలని మాత్రమే తీసుకున్నారు. అంటే పుత్రకామేష్టిలో ఇష్టి అన్నది ముఖ్యమైన పదం కాబట్టి ఇష్టిఖండము అని పేరు పెట్టారు. అలాగే తరువాతవి అవతారఖండమూ అహల్యాఖండమూ ధనుష్ఖండమూ కల్యాణఖండమూను.

ఈ ధనుష్ఖండంలోనే అహల్యాతనయుడైన శతానందుడు రామలక్ష్మణులకి విశ్వామిత్రచరిత్రని చెబుతాడు. నాకు బాలకాండలో ఈ విశ్వామిత్రచరిత్ర చెప్పే సర్గలు ఎందుకో కానీ భలే ఇష్టం. అందువల్ల నాలుగు నెలల క్రితం కల్పవృక్షం సంపుటాలు ఆరూ కొనగానే నేను ముందు చదివినది ఈ విశ్వామిత్రచరిత్రే (బాల-ధనుస్సు ౫౬-౨౫౯). అందులో వాల్మీకిమహర్షి చెప్పిన మూలకథకి అనుగుణంగా వ్రాసినది కాక, కొన్ని చోట్ల చిన్నవే ఐనా విశ్వనాథవారు చాలా అందమైన కల్పనలు చేసారు.
* * *

ఈ శివధనుర్భంగానికి సంబంధించి వాల్మీకిమహర్షి కృతమైన శ్రీమద్రామాయణంలో రెండు శ్లోకాలు ఉన్నాయి.

శ్రీరామచంద్రుడు వింటినారి సారించాక ఎక్కుపెట్టాడనీ, అలా ఎక్కుపెట్టడంద్వారా ఆ ధనుస్సుని మధ్యలో విరిచాడనీ—

ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్।
తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః।। (బాల-౬౭-౧౭)

అప్పుడు పిడుగుపాటులాంటి గొప్ప నాదం ఆవిర్భవించిందనీ, పర్వతం బ్రద్దలైందా అన్నట్టుగా భూమి కంపించిందనీ—

తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిఃస్వనః।
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః।। (బాల-౬౭-౧౮)

* * *

ఇక విశ్వనాథవారి పద్యాలు. ఈ ఐదూ సందర్భానికి తగిన అక్షరరమ్యత నిండుగా తొణికిసలాడే పద్యాలు.

నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథు షండమండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్. (బాల-ధనుస్సు-౩౦౧)

నిష్ఠా ఆవర్షత్ అమోఘ మేఘ పటలీ నిర్గచ్ఛత్ ఉద్యోదిత స్ఫేష్ఠ ఇరమ్మద మాలికా యుగపత్ ఉజ్జృంభత్ మహా ఘోర బంహిష్ఠ స్ఫూర్జథు షండ మండిత రవ అహీన క్రియా ప్రౌఢి ద్రాఘిష్ఠంబై ఒక రావము అంతటన్ ఎసంగెన్ ఛిన్న చాపంబునన్

నిష్ఠా నిలకడగా ఆగకుండా. స్ఫేష్ఠ మిక్కిలి. ఇరమ్మద మెరుపులోని జ్యోతి. యుగపత్ కలిసియుండే. బంహిష్ఠ శక్తివంతమైన. స్ఫూర్జథు ఉరుము. షండ గుంపు. ద్రాఘిష్ఠ మిక్కిలి దీర్ఘమైన.

నిలకడగా కురియడం ద్వారా సఫలాలైన మేఘసమూహాల నుండి బయల్వెడలుతూ ప్రకాశించే బోలెడు మెరుపుల్లోని జ్వాలామాలలతో కలిసి అతిశయించే మహాభయంకరమైన శక్తివంతమైన ఉరుముల గుంపుచే అలంకరింపబడినట్టుగా గొప్ప ధ్వని లేకుండా ఉండనట్టిదీ [శివధనుర్భంగం అనే] క్రియ యొక్క శ్రేష్ఠత్వం వలన చాలా దీర్ఘమైనట్టిదీ ఐన ఒక మహానాదం విరిగిన వింటినుండి అంతటా వ్యాపించింది.

ఈ పద్యంలో మేఘపటలీనిర్గచ్ఛత్ అనడం ద్వారా అంతర్లీనంగా నీలమేఘశ్యాముడైన రాముని చేతినుండి విరిగిన “ధనుష్ఖండము” వెలువడిందనీ, మేఘం మెరుపులూ ఉరుములూ వెలువరించినట్లుగా ఆ విరిగిన విల్లు బోలెడు కాంతినీ బ్రహ్మాండమైన ధ్వనినీ నలుదిక్కులలో వెదజల్లిందనీ చెప్పబడింది.

హేరంబోన్నత శూర్పకర్ణ వివరహ్రీకారియై షణ్ముఖ
స్ఫార ద్వాదశ నేత్రగోళ వివృతిప్రాకారమై శైలక
న్యారాజ న్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై యాశ్చల
ద్గీరుగ్రప్రమథంబుగా ధనువు మ్రోఁగెన్ శైవలోకంబులన్. (బాల-ధనుస్సు-౩౦౨)

హేరంబ ఉన్నత శూర్ప కర్ణ వివర హ్రీకారియై షణ్ముఖ స్ఫార ద్వాదశ నేత్ర గోళ వివృతి ప్రాకారమై శైల కన్యా రాజత్ నవ ఫాల మండల విభుగ్న క్రీడమై ఆశ్చలత్ గీః ఉగ్ర ప్రమథంబుగాన్ ధనువు మ్రోఁగెన్ శైవ లోకంబులన్

శూర్ప చేట. వివర కన్నము. హ్రీ సిగ్గు. స్ఫార గొప్ప. వివృతి పూర్తిగా తెరుచుకోవడం. ప్రాకార చుట్టుగోడ. విభుగ్న వంగిన వంకరగా ఉన్న. ఆశ్చలత్ కంపించే(?). గీః వాక్కు.

వినాయకుడి గొప్ప చేటల్లాంటి చెవిరంధ్రాలకి సిగ్గు కలిగించేదిగా, కుమారస్వామికి పూర్తిగా తెరుచుకున్న పన్నెండు కనుగ్రుడ్లకీ చుట్టుగోడ అయ్యి, పార్వతీదేవియొక్క ప్రకాశించే నుదుటిపై చిట్లింపు అనే విలాసమయ్యి, కంపించిన మాటలు కలిగినవారిగా భయంకరమైన ప్రమథగణాలని చేసినదై శైవలోకాలలో ధనుస్సు మ్రోగింది.

చేటలంత పెద్ద చెవులకి కూడా ధ్వని అధికమైనదే అనీ, పన్నెండు కళ్లున్నా కాంతిని పూర్తిగా గ్రహించలేవనీ, అమ్మవారి దృష్టిని కూడా ఆకర్షించిందనీ, ఉగ్రంగా ఉండే ప్రమథగణాలకి సైతం మాటలు తడబడ్డాయనీ అర్థం. శివుడే ఆ వెలుగు (వెలుంగర్చింతు విశ్వేశ్వరా) కాబట్టి పైగా శివకేశవాద్వైతం చూపించారు కాబట్టి శివుడి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు.

నృత్యన్మంజుల తారహార కబరీనిష్యంది ముక్తామణి
ప్రత్యగ్ర ప్రసవాక్షి సంకలన దీవ్య త్కంధరాభేద సా
హిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్యప్రశస్తాచ్ఛదృ
గ్గీత్యాకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గలోకంబులన్. (బాల-ధనుస్సు-౩౦౩)

నృత్యత్ మంజుల తార హార కబరీ నిష్యంది ముక్తా మణి ప్రత్యగ్ర ప్రసవ అక్షి సంకలన దీవ్యత్ కంధర అభేద సాహిత్య ప్రౌఢ నవాప్సరోనటన సౌహిత్య ప్రశస్త ఆచ్ఛత్ ఋక్ గీతి ఆకార మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ స్వర్గ లోకంబులన్

తార ముత్యం. కబరీ జడ. నిష్యంది జారుతున్న. ముక్తామణి ముత్యం. ప్రత్యగ్ర క్రొత్త. ప్రసవ పువ్వు. దీవ్యత్ ఆడుతున్న. కంధర తల, మెడ. సాహిత్య సహితత్వం. సౌహిత్య మనోజ్ఞత్వం. ఆచ్ఛత్ కప్పుతున్న. ఋక్ పొగడ్త.

నర్తిస్తున్న అందమైన ముత్యాలజడనుండి జారుతున్న ముత్యాలనీ మొగ్గలనీ కంటితో ఏరే ఆటాడే మెడకు తగినట్లుగా గొప్ప [దొడ్డ చిన్న అందరూ§] అప్సరసల నటనలోని అందం యొక్క గొప్పతనాన్ని కప్పే గానంలాగ మనోజ్ఞమై ధనుస్సు స్వర్గలోకాలలో మ్రోగింది.

అప్సరసలు నర్తిస్తున్నారు. ఆ నర్తనం చాలా అందంగా ఉంది. వాళ్లు నర్తిస్తూ ఉంటే జడలు కూడా నర్తిస్తున్నాయి. ఆ జడలు కదలడం వల్ల వాటికి పెట్టుకున్న ముత్యాలూ, ననలూ రాలిపడుతున్నాయి. ఆ రాలుతున్నవాటిని చూపులతోనే ఏరుతున్నారా అన్నట్టుగా కదులుతున్నాయి వాళ్ల తలలు. ఆ తలలు ఎలా కదులుతున్నాయో వాటికి అభేదంగా సాహిత్యంగా (సహితము–సాహిత్యము)... అంటే ఆ తలల కదలికలు ఎలా ఉన్నాయో అచ్చంగా అలాగే వాటికి తగినట్టుగానే వారి ఆంగికం కూడా ఉందట. అటువంటి ఆ నాట్యం లోని గొప్పతనాన్ని దాస్తోందా అన్నట్లుంది పొగడ్త. ఆ పొగడ్తని గానం చేస్తే ఆ ఋగ్గానం కూడా అందంగా ఉందట. అంత అందంగానూ స్వర్గలోకంలో శివధనుర్నాదం వినవచ్చిందీ, అంటే స్వర్గలోకంలో వారికి ఆ ధ్వని వినసొంపుగా ఉంది అని అర్థం.

దర్పస్వీకృతహాస విశ్లథనరుంధద్దుష్టవాగ్ధోరణీ
సర్పద్వీరచమూ పథశ్లథనమై స్రంసత్కటీ శాటికా
కూర్పాస ప్రకటోగ్ర సాధ్వస వధూగుర్విణ్య భద్రాధ్వమై
దర్పాడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయలోకంబులన్. (బాల-ధనుస్సు-౩౦౪)

దర్ప స్వీకృత హాస విశ్లథన రుంధత్ దుష్ట వాక్ ధోరణీ సర్పత్ వీర చమూ పథ శ్లథనమై స్రంసత్ కటీ శాటికా కూర్పాస ప్రకట ఉగ్ర సాధ్వస వధూ గుర్విణీ అభద్ర అధ్వమై దర్ప ఆడంబరమై ధనుస్సు మొఱసెన్ దైతేయ లోకంబులన్

శ్లథన వీడిపోవడం సడలిపోవడం. రుంధత్ అడ్డుపడే. సర్పత్ గమించే. స్రంసత్ పడే. శాటికా లుంగీ లాంటి గుడ్డ. కూర్పాస కవచం. సాధ్వస భయం. గుర్విణీ చూలాలు. అధ్వ మార్గం. మొఱయు మ్రోఁగు.

దర్పంవలన కలిగిన సంతోషం వీడిపోకుండా అడ్డుపడే చెడు మాటల పద్ధతిగల కదిలే వీరసైన్యానికి మార్గం నిర్వీర్యంచేసేలా, [అట్టి రాక్షసుల] జారిన కటివస్త్రాలూ కవచాల ద్వారా స్పష్టమయ్యే భీతివలన రాక్షసస్త్రీలకి భద్రం చేకూర్చనట్టిదై, [దైత్యుల దర్పాలను తీసేయడంలో] దర్పంతోకూడిన వైభవం కలదై ఆ ధనుస్సు దైత్యలోకాలలో మ్రోగిందట.

రాక్షసుల లక్షణం చెప్తున్నారు. వాళ్లు దర్పం వలన సంతోషపడతారట. అలాంటి సంతోషం పోకుండా చెడ్డ మాటలు మాట్లాడుకుంటారట. అలాంటి రాక్షసుల సైన్యానికి మార్గం సడలించేది. రెండర్థాలు. ఒకటి, వారి పట్టు తీసేయడం, నిర్వీర్యం చేయడం. రెండు, భూలోకంలో వారి ఆయుస్సు తీసేసి [త్వరగా] మోక్షాన్ని ఇవ్వడం. ఈ ధనుస్సు వల్ల ఆ రాక్షసుల వస్త్రాలూ కవచాలూ జారిపోతున్నాయట. అది స్పష్టంగా తెలియడం వల్ల రాక్షసస్త్రీలకి భయం కలుగుతోందట. కడుపుతో ఉన్న రాక్షసస్త్రీలకి అభద్రమైన మార్గమట.

స్ఫీతాష్టాపదవిద్యుదుజ్జ్వల పయ౱పీయుషధారాధునీ
నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సం
ధాతీర్థంకర (తీర్థాకృతి) మాగధోల్బణము నానా మేదినీరాట్సభా
గీతిస్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్. (బాల-ధనుస్సు-౩౦౫)

స్ఫీత అష్టాపద విద్యుత్ ఉజ్జ్వల పయః పీయుష ధారా ధునీ నీత ఆస్వాద్యతర ప్రగల్భ వచన స్నిగ్ధ ఆనన అంభోజ సంధా తీర్థంకర (తీర్థాకృతి) మాగధ ఉల్బణము నానా మేదినీ రాట్ సభా గీతి స్వాదు మనోజ్ఞమై ధనువు మ్రోఁగెన్ రాజలోకంబులన్

స్ఫీత విశాలమైన. అష్టాపద కైలాసం. నీత తేబడిన. స్నిగ్ధ స్నేహముగల. సంధా కలయిక. మాగధ స్తోత్రము చేసేవాడు. ఉల్బణము మిక్కిలి, అతిశయము. స్వాదు తీపి.

అసలే విశాలమైన కైలాసం. అక్కడ మెరుపులా ప్రకాశించే కైలాసజలం. ఆ అమృతపుధార వల్ల ఏర్పడ్డ నది నుండి తేబడిన నీరు. ఆ నీటికి ఉన్న రుచి కన్నా మిక్కిలి రుచికరమైన ప్రగల్భవాక్యం. ఆ వాక్యం చెప్పే ఆప్తుని ముఖకమలం. ఆ కమలాన్ని బాగా ధరించిన తీర్థం వంటి మాగధుల అతిశయం. అలా ఉందట ఈ ధ్వని. అంతే కాదు, నానా రాజసభలలోనూ పాడే గీతాల తీయనిదనంలాగ మనోజ్ఞంగా ఉందట. అంటే రాజులందరికీ ఇది సంతోషకరమైన తీయని వార్త అని అర్థం.

* * *

అసలు ఈ నాలుగు లోకాలే ఎందుకు ఎంచుకోవాలి?

విరిచినది శివుని చాపం. తన ప్రభువు చేసిన ఘనకార్యాన్ని చూసి సంతోషించాడు శివుడు. శివుడు కాక కైలాసంలో ఉన్న చిన్నా పెద్దా అందరూ ఎలా స్పందించారో చెప్పారు ఒక పద్యంలో.

శ్రీరామావతారం కోసం ప్రార్థించినవారు దేవతలు. కాబట్టి అవతార ప్రయోజనం నెరవేరడం ప్రారంభమయ్యిందీ అని ఆ సురలకే తెలియజేయడం. స్వయంగా వైకుంఠవాసుడే విరిచాడు కాబట్టి వైకుంఠలోకంలో ఎలా మ్రోగిందో చెప్పనవసరంలేదు. బ్రహ్మగారి సత్యలోకమూ స్వర్గాలలో ఒకటి కాబట్టి ప్రత్యేకంగా చెప్పలేదు.

దైత్యలోకంలో వినబడిందీ అని చెప్పడం ద్వారా వారికి హెచ్చరిక అందిందీ అని.

రాజలోకాలలో వినబడిన మ్రోత ఇక రాక్షసుల అరాచకాలకి అంతమనీ, రామరాజ్యం రాబోతోందీ అని సూచన.

* * *

విశ్వనాథవారు మూలకథకు చేసిన ఒక మార్పు ధనుష్ఖండంలోనే విష్ణుచాపాన్ని కూడా తీసుకురావడం, తద్ద్వారా ఆయన తెలివిగా ఇవే పద్యాలని చిన్న చిన్న మార్పులతో మళ్లీ వాడుకోవడం జరిగింది.

--------
§ప్రౌఢ అంటే దొడ్డ, నవ అంటే చిన్న అన్న అర్థంలో
---------------------------------------------------------
వాగ్విలాసము సౌజన్యంతో

Thursday, December 27, 2018

నిమ్మకాయలు


నిమ్మకాయలు
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి...................
మార్కెట్టు దగ్గిర కారాపి, చుట్టూ ఎవరూ లేకుండా చూసుకుని, జాగ్రత్తగా దిగాడు శేఖర్‌. తలుపు చప్పుడవ్వకుండా నెమ్మదిగా వేసి, లేత ఎండలో మెరిసిపోతున్న కారు మిలమిలలలో తన ప్రతిబింబం చూసుకుని అప్రయత్నంగా చిరునవ్వు నవ్వాడు. ఒక్క రేణువు కూడా ధూళీ, దుమ్మూ లేని కారుని మరొకసారి ఆప్యాయంగా ఆపాదమస్తకమూ చూసుకుని, తృప్తిగా మార్కెట్టులోకి దారి తీశాడు. లోపలకి వెళ్ళబోయేముందర వెనక్కు తిరిగి, మరొక్క సారి దూరంగా తళుకులీనుతున్న కారుని తనివితీరా చూసుకుని లోపలకి అడుగు పెట్టాడు. కారుని దూరంగా పార్కు చెయ్యడమే మంచిదయింది. అంత దూరంలో ఎవరూ పార్కు చెయ్యరు. ఎవరి అశ్రధ్ధ వల్లనో
కారు తలుపులు కొట్టుకుంటాయని గానీ, ఎవరి నిర్లక్ష్యం మూలానో గ్రోసరీ బండి కారుని గీరుకుపోతుందని గానీ భయం లేకుండా లోపల తన పని పూర్తిచేసుకుని రావచ్చు. ఎంత సేపు? పది నిముషాలు కూడా పట్టదు.

కొంచెం సంకోచంగానే లోపలకు వెళ్ళాడు శేఖర్‌. కానీ ఈ సంకోచానికి కారణం కారు గురించిన బెంగ కాదు. తను చేస్తున్న పని తనకే కొంచెం ఎబ్బెట్టుగా, విడ్డూరంగా అనిపించడం వల్ల కలిగే సిగ్గు. అమ్మ మాట తీసెయ్యలేక ఇలా వచ్చాడుగానీ …

ఎటు వెళ్ళాలా అని పరధ్యానంగా దిక్కులు చూస్తున్న అతని కాళ్ళని ఎవరో బలంగా ఢీకొన్నారు. కాళ్ళు తొట్రుపడి, పడబోయి, ఎలాగో నిలదొక్కుకున్నాడు శేఖర్‌. ఇదేమీ పట్టించుకోకుండా ఒక మూడేళ్ళ కుర్రాడు శేఖర్‌ కాళ్ళ సందులోంచి దూరి ఏవో బొమ్మలున్న వైపు పరిగెట్టి వెళ్ళిపోయాడు, “మామీ! లుక్‌ లుక్‌” అని అరుచుకుంటూ. ఇంతలో వెనకబడిన ఆ కుర్రాడి తల్లి రొప్పుకుంటూ వచ్చి క్షమార్పణలు చెప్పుకుంది. “ఇట్సాల్రైట్‌ ఇట్సాల్రైట్‌” అని లాంచనంగా కాక మనఃపూర్వకంగానే బదులిచ్చాడు శేఖర్‌.

ఒక్కసారి తన చిన్నప్పటి రోజులు కళ్ళ ముందు నిలిచాయి.

మూడు నాలుగేళ్ళ వయసప్పుడు ప్రపంచం ఎంత అద్భుతంగా అనిపించేదో! అన్నీ వింతలే. అన్నీ సంబరాలే. పక్షి కూత విన్నా, పూవు విచ్చుకున్నా, వాన చినుకు పడినా, ఆకు రాలినా, గాలి వీచినా, బురద చిమ్మినా, అన్నీ కొత్తే, అన్నీ కుతూహలమే. కూస్తున్న పక్షుల పాటలు వీనులకు విందులు, విచ్చుకున్న పూవులు కనులకు పండుగలు. వానకు తడిసిన వాసనలు మనసుకు ఉక్కిరిబిక్కిరులు, రాలి పడిన ఆకులు ఒంటికి గగుర్పాటులు. వీచే గాలి పెట్టే గిలిగింతలూ, బురదలో  ఆడే తన కేరింతలూ. బ్రతుకంతా పులకరింతలే అయిన ఆ పరమానందాన్ని పంచుకునే తోడొక్కటే కరువయ్యింది.

రోజల్లా “అదేమిటీ?”, “ఇదెందుకూ?”, “దీన్నెలా?” అనే తన ప్రశ్నలతో ఇల్లు మారుమ్రోగిపోయేది. అమ్మనడిగితే నాన్ననడగమనీ, నాన్ననడిగితే తర్వాత చూద్దామనీ దాటింపులే తప్ప తన సందేహాలకు సమాధానాలు మాత్రం దొరికేవి కావు. పోనీ తాతా బామ్మలనడుగుదామనుకుంటే, తన ప్రశ్న వినగానే తాత ముసిముసినవ్వులతో, “విన్నావా వీడి మాటలు? నా మనవడంటే ఏమనుకున్నవు?” అని మీసాలు మెలేశేవాడు. బామ్మ కళ్ళింతింత చేసుకుని, “చంటి వాడి బుర్రలో ఎన్ని ఆలోచనలో! మా బంగారు తండ్రే!” అని బుగ్గలు పుణికేది. తన ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయేవి.

తీరా తీరా జీవితం గురించిన తన జిజ్ఞాసా, ప్రపంచం గురించిన తన జ్ఞానతృష్ణా, ఇంట్లో వారికి ఒక వేధింపుగా తోచాయి. ఈ బెడద వదిలించుకునే మార్గమేమిటని వాళ్ళు అన్వేషించారు. చివరకు “మూడేళ్ళు నిండినా ఇంకా చదువూ, సంధ్యా లేకుండా ఇంట్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడం” మూలానే ఇలా తయారవుతున్నాడని తీర్మానించారు. తత్ఫలితంగా తనను స్కూల్లో వేశారు. అప్పటినించీ తన సమయమంతా అక్షరాలు దిద్దడానికీ, అంకెలు వల్లెవేయడానికీ, అదీ ఇదీ కాకపోతే నర్సరీ రైమ్స్‌ ఒప్పచెప్పడానికీ సరిపోయేది. స్కూల్లో చేరాకే ప్రశ్నలు వేయడం తప్పని తెలుసుకున్నాడు. చెప్పినట్లు చేయడం, చెప్పిన మాట వినడం నేర్చుకున్నాడు.

చిన్ననాటి ముచ్చట్లలోంచి బయట పడి, రకరకాల కూరగాయలు కుప్పలు కుప్పలుగా పొసివున్న వేపుకి నడిచాడు శేఖర్‌. “లెమన్స్‌” అని రాసిఉన్న అట్ట ముక్క కింద సూర్యుడికి ప్రతిబింబాలలా పసిమి చాయలో వెలిగిపోతున్న రాశినీ, పక్కనే “లైమ్స్‌” అనే అట్ట కింద ఉన్న ఆకుపచ్చ గుట్టలనీ చూస్తూ మళ్ళీ తికమకలో పడిపోయాడు.

నిమ్మకాయలని ఇంగ్లీషులో “లెమన్స్‌” అంటారనే గట్టి నమ్మకం. కానీ, ఇండియాలో దొరికే నిమ్మకాయల్లాంటివి కావాలంటే, ఈ “లైమ్స్‌” అన్నవే అలా ఉన్నాయి మరి. ఇప్పుడింతకీ తను “లెమన్స్‌” కొనాలా, “లైమ్స్‌” కొనాలా? ఇక్కడి పసుపచ్చ నిమ్మకాయలను చూసి ఒక తెలుగావిడ (పెద్దావిడే) “ఇవి నిమ్మకాయలేమిటి? దబ్బకాయలుగానీ,” అనడం గుర్తొచ్చింది. దబ్బకాయలేమిటో శేఖరుకి సరిగ్గా తెలియదు. అసలు తన జన్మలో ఎప్పుడైనా దబ్బకాయలని చూశాడో లేదో కూడా తెలియదు. ఈ రెండిట్లో తను ఏవి కొనాలి? ఏదైతేనేం,రెండూ పుల్లగానే ఉంటాయిగదా అనుకోవాలా? “ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు” అని ఏదో ఒక పద్యంలో భాగం మనసులో మెరిసి మాయమైంది. ఎప్పటిదో ఈ జ్ఞాపకం? అసలిది ఏ పద్యంలోది చెప్మా? సుమతీ శతకంలోదా? వేమన పద్యాల్లో ఒకటా?

చిన్నప్పుడు, కొన్నాళ్ళు స్కూలు చదువయ్యాక, తాతయ్య తనకు శలవల్లో పద్యాలు నేర్పించడం మొదలుపెట్టాడు. పాపం ఆయనకి పద్యాలంటే చాలా ఇష్టం. తిరుపతి వేంకట కవుల పద్యాలంటే చెవి కోసుకునేవాడు. వాటిని అర్ధం చేసుకునే స్థాయికి తను ఎదగలేదుగానీ, అందుకు పునాదిగా ముందు తనకు శతకాలు నేర్పించడం మొదలు పెట్టాడు తాతయ్య. అదెప్పుడు? తను హైస్కూలు చదువుకొచ్చినప్పుడు. అయితే ఆ ప్రయత్నం తొందరగానే ముగిసిపోయింది. పబ్లిక్‌ పరీక్షలొస్తున్నాయి, వాటికి ప్రిపేర్‌ అవ్వాలి, తర్వాత ఎంట్రెన్స్‌ పరీక్షలొస్తాయి, వాటికి ప్రిపేర్‌ అవ్వాలి, పనికిమాలిన ఈ పాండిత్యం ఎందుకు? కూడు పెడుతుందా ఏమైనా? అని తాతయ్య దగ్గిర చేరి పద్యాలు వినే వేళల్లో ట్యూషన్‌ పెట్టించారు. పరీక్షా పత్రాలలో రాని విషయం దేనికీ తన బుర్రలో స్థానం లేదని తీర్మానించారు. అప్పటినించీ స్కూలు పుస్తకాలు తప్ప ఇంకేవీ తన చేతుల్లో కనిపించడానికీ, స్కూలు పాఠాలు తప్ప ఇంకేవీ తన నోట్లోంచి వినిపించడానికీ వీల్లేకపోయింది.

తన తల్లితండ్రుల ముందు జాగ్రత్తకి తగిన ఫలితమే కనిపించింది. ఇంజనీరింగులో సీటొచ్చింది. ఆ వయసులో తనకసలు ఏ సబ్జెక్టులో ఆసక్తి ఉందో, దేంట్లో లేదో తెలుసుకునే మానసిక పరిపక్వత కూడా లేదు. అప్పుడప్పుడు ఒక క్లాసు కంటే ఇంకొకటి బాగుందనీ, ఇది నచ్చిందనీ, భావాలు మొలకెత్తినా, అవి చిగురించకుండానే వాడిపోయేవి. తన ఇష్టాలేమిటో తనకే తెలియకుండా బ్రతికేవాడు. ఇంజనీరింగులో చేర్పించాక ఇదీ బాగానే ఉందనిపించింది. క్లాసులో చెప్పే లెక్కలూ, ప్రాబ్లెమ్సూ ఆసక్తికరంగానే అనిపించాయి. ఎప్పుడో చచ్చిపోయిందనుకున్న జిజ్ఞాసను మళ్ళీ రేకెత్తించాయి. ఈ ఫీల్డులో తన భవిష్యత్తు ఊహించుకుంటే తనకే సరదా వేసేది.

కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు. తీరా డిగ్రీ చేతికొచ్చాక చూస్తే ఉద్యోగాలెక్కడా కనిపించలేదు. కొత్త్తొక వింత, పాతొక రోత అన్నట్టు, అందరూ ఇప్పుడు కంప్యూటింగ్‌ ఫీల్డు లోకి పోతున్నారు. “మంచి అవకాశాలన్నీ ఇందులోనే ఉన్నాయిరా. ఈ ఫీల్డులో చేరడమే మంచిది,” అని నాన్నగారు తనని ఒక డిప్లోమా క్లాసులో చేర్పించారు. ఇన్నాళ్ళూ కష్టపడి సాధించిన చదువంతా వృధా అనేసరికి తనకి చాలా బాధ వేసింది. అయినా ఏం లాభం? ఆయనచెప్పిందాంట్లో కూడా సత్యం ఉన్నది కదా? ఎన్ని డిగ్రీలున్నా ఉద్యోగం కోసమే కదా? అంతే. ఇంజనీరు శేఖర్‌ అవతారం చాలించి, ప్రోగ్రామర్‌ శేఖరుగా పునర్జన్మనెత్తాడు.

అయినా “ఏమిటిది? ఎందుకిలా గతంలో పడి కొట్టుకుంటున్నాను?” అని తన మీద తనే చిరాకు పడ్డాడు శేఖర్‌. వచ్చిన పనేదో తొందరగా చేసుకు వెళ్ళాలి గానీ గబ గబా నాలుగు లైమ్స్‌ కొని బయటపడ్డాడు శేఖర్‌. ప్లాస్టిక్‌ సంచీని జాగ్రత్తగా సీటు కింద పెట్టి కారులో కూర్చునేటప్పటికి మళ్ళీ మనసు ఉత్సాహంతో ఉప్పొంగింది. ఇలాంటి కారు కొనుక్కుని తిరుగుతూంటాడని తను కలలోనైనా అనుకున్నాడా? తనసలు తన భవిష్యత్తు గురించి ఎలాంటి ఊహాగానాలూ చెయ్యలేదు. ఏదో మరీ అసంతృప్తి కలిగించని ఉద్యోగం, నెలకొక నాలుగైదు వేలు జీతం ఉంటే చాలనుకున్నాడు. జీవితం సాఫీగా నడిచేందుకు ఆమాత్రం చాలదా?

కానీ అమ్మా నాన్నల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ప్రతి అల్లాటప్పా గాడూ కాంట్రాక్టు ప్రోగ్రామరుగా అమెరికా చెక్కేస్తూంటే, చక్కటి తెలివితేటలూ, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న తమ కొడుకెందుకు తీసిపోవాలి? పైగా ఎంత కష్ట పడినా దానికి తగిన గుర్తింపు లేకపోతే ఏం లాభం? చేసే పనులు ఒకటేనైనా, వాటికి వచ్చే ప్రతిఫలాలలో ఇంత తేడా ఉన్నప్పుడు ఈ దేశాన్నే పట్టుకు వేళ్ళాడడంలో అర్ధం లేదు. అమ్మా నాన్నల బోధనలతో తన ఆలోచనలలో పొరబాటేమిటో తెలిసివచ్చింది శేఖర్కి. వాళ్ళ
ప్రేరేపణే కాకుండా వాళ్ళ ప్రయత్నాల మూలాన కూడా తను అమెరికా వచ్చి చేరాడు. వచ్చిన ఆరు నెలలకే బ్రహ్మాండమైన కారు కొనేశాడు. కారు కొన్నానని అమ్మా నాన్నలకు ఫోను చేసి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. అమ్మ, “ఒరేయ్‌ ఆ కొత్త కారుని ముందు గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. కొట్టాక అప్పుడు డ్రైవ్‌ చెయ్యడం మొదలుపెట్టు,” అని చెప్పింది. అంతవరకూ ఎంతో సంతోషంగా మాట్లాదుతున్న తను ఈ మాటలు వినగానే గతుక్కుమన్నాడు.

“గుడికా?” అని నీరసంగా వినిపించిన తన స్వరానికి అమ్మ కొంచెం దబాయింపుగా,

“అవున్రా. ఏం? అమెరికా వెళ్ళగానే మన ఆచారాలన్నిటినీ మరిపోయావేమిటి?” అని కసిరింది.

“ఆఁ ఊఁ , కాదు, కానీ  ఈ ఊళ్ళో మన గుళ్ళేమీ లేవు.”

“అదేమిటిరా? గుళ్ళేని ఊరేమిటి? అక్కడన్నీ మన దేశంలాగే ఉంటాయని అందరూ చెప్తూంటే! నీకు సరిగ్గా తెలీదు కాబోలు. ఎవర్నైనా అడుగు.”

సరే. అడిగాడు. ఆ ఊళ్ళో గుడి లేదుగానీ, అక్కడకి రెండు వందల మైళ్ళ దూరంలో ఉండే కొంచెం పెద్ద ఊళ్ళో ఒక గుడి ఉందని తెలిసింది. ఆ మాటే మళ్ళీ అమ్మకి ఫోను చేసి చెప్పాడు.

“ఇంకేం? అక్కడికే వెళ్ళి కొబ్బరికాయ కొట్టించి పూజ చేయించుకో,” అంది అమ్మ.

“ఇక్కడ కొబ్బరికాయలు దొరకవమ్మా,” అని నసిగాడు.

“ఫరవాలేదు. నాలుగు నిమ్మకాయలు కొంటే సరి,” అని అమ్మ సులభమార్గం సూచించింది.

“నిమ్మకాయలా? ఎందుకూ?”

“అదేరా. గుళ్ళో పూజ చేయించాక నాలుగు నిమ్మకాయలూ, ఒక్కొక్కటీ తలో టైరు కింద పెట్టి, వాటి మీదుగా డ్రైవు చేసి, ఆ తర్వాత నువ్వెక్కడికి తిరిగినా నీకు శుభం,” అన్నదమ్మ.

“మరవి చితికిపోవూ?” అనడిగాడు అమాయికంగా.

“ఓరి భడవా! చితికిపోవాలనే కదా ఉద్దేశం. చక్కగా నాలుగూ చితికిపోతే, అప్పుడు నీకేమీ ప్రమాదం జరగకుండా రక్షగా ఉంటుంది.”

ఇదేమిటో చాలా తిరకాసు వ్యవహారం గానే అనిపించింది తనకి. కానీ “ఆచారం”, “సాంప్రదాయం” అనేది దేన్నీ ఆచరించడమే తప్ప ప్రశ్నించే అలవాటు ఎప్పుడో పోయింది కాబట్టి, అమ్మ చెప్పిన మాట తూ చా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇవ్వాళ్టి ప్రయాణం.

నెమ్మదిగా కారు స్టార్టు చేసి హైవే వైపు బయల్దేరాడు శేఖర్‌. అమెరికా వచ్చిన ఆరు నెెలలకే ఎంత బాగా స్థిరపడిపోయాడో అని అమ్మా నాన్నలు అందరికీ డాబులు కొడుతున్నారు గానీ, తనకు మాత్రం ఇంకా ఏమిటో అంతా కొత్త కొత్త గానే అనిపిస్తోంది. అసలు తను తను కానట్టూ, ఎవరో కొత్త మనిషిగా మారినట్టూ, ఉక్కిరిబిక్కిరిగా కూడా అనిపిస్తోంది.

ఇక్కడ గుడి లేదంటేనే అమ్మ నమ్మలేదుకానీ, ఇంకా ఇక్కడ ఎన్ని లేవో తెలిస్తే ఏమంటుంది? అప్రయత్నంగానే మనసు ఇండియాలో ఉన్నవీ, ఇక్కడ లేనివీ జాబితా వేయసాగింది.

సాయంకాలం షికారు వెళ్ళినప్పుడు సరదాగా నమిలేందుకు మిరపకాయ బజ్జీలమ్మే బళ్ళూ, మండుటెండలో చల్లగా సేద తీర్చే కొబ్బరి నీళ్ళూ, నోట్లో వేసుకున్నంత మాత్రమే కరిగిపోతున్నట్టున్న లేత కొబ్బరీ, రోడ్డు మీదకు వెళ్తే చుట్టు జనసందోహం, రెప రెప లాడే చీరలూ, పిల్లల అరుపులూ, బళ్ళ వాళ్ళ కేకలూ, బస్సుల రొదలూ, అంగళ్ళ ముందరో, రోడ్డు పక్కనో, నడివీధిలోనో జరిగే చిన్నవీ పెద్దవీ కొట్లాటలూ, ఊరేగింపులూ, బాజా భజంత్రీలూ, భజన సందోహాలూ, ఏం తోచక కిటికీ దగ్గిర
నుంచున్నా ఏదో ఒక విశేషం కనబడుతూనే ఉంటుంది. వీధిలో ఒకరింట్లో పెళ్ళంటే వీధిలో ఉన్నవారికందరికీ వినోదమే ఆ అలంకారాలూ, లైట్లూ, సరదాగా చూస్తూ ఎన్ని గంటలైనా గడిపేయవచ్చు.

ఇక్కడ రోడ్డు మీద మనుషులే కనిపించరు. అందరూ కార్ల బందీఖానాల్లోంచే లీలగా కనిపించి మాయమౌతూంటారు. పక్కింటికి కూడా ఫోను చేయందే వెళ్ళకూడదు. పైజమా లాల్చీతో బయట తిరగకూడదు. అక్కడ స్వేచ్చగా తిరిగేందుకూ, తోచినట్టు చేసేందుకూ ధైర్యంగా ఉండేది. నన్నడిగే వాళ్ళెవ్వరనే ధీమా ఉండేది. ఇక్కడ ఏం చేస్తే ఏం ముంచుకొస్తుందో అనే భయం, ఏమంటే ఏం తప్పవుతుందోననే బెదురూ ఉన్నాయి. అక్కడ నలుగురిలో కలిసిపోయి ఆ సంఘంలో ఒక భాగంలా ఉండేవాడు. ఇక్కడ తెల్ల కాగితం మీద నల్లటి మచ్చలా తన ఉనికి తనకే కొట్టొచ్చినట్టు ఉంటూ ఎంత ప్రయత్నించినా అందరిలో కలవలేకపోతున్నాడు. అక్కడ జీవితం ప్రతి క్షణమూ, నవ్య చైతన్యంతో సాగిపోతూంటుంది. జరుగుతున్న దానితో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, కేవలం ప్రేక్షకుడిలా కూర్చుండిపోయినా కాలక్షేపానికి లోటు ఉండదు. ఇక్కడ ఎవరికి వారు స్వంతంగా ఏర్పరుచుకునే జీవితం తప్ప ఇంకేమీ ఉండదు. తనలా ప్రేక్షకుడిలా ఉండి జీవితాన్ని ఒడ్డున నిలబడి చూసి ఆనందించాలంటే కుదరదు. అసలు జీవితమే లేకుండా పోతుంది.

ఇదంతా అమ్మా నాన్నలకు అర్ధం అయ్యేలా చెప్పాలని తనెంత ప్రయత్నించినా విఫలుడే అయ్యాడు. “కొత్త కాబట్టి అలా ఉంటుంది. కొన్నాళ్ళు పోతే అంతా అలవాటయ్యి చక్కగా ఉంటుంది,” అని తన మాటలను కొట్టిపారేశారు వాళ్ళు. నిజమే కాబోలని తను కూడా కొత్తలో ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ, ఇక్కడి తెలుగు వాళ్ళతో, ఇండియన్సుతో పరిచయమౌతున్న కొద్దీ, ఆ నమ్మకం సమసిపోయింది. ఇరవై, ముఫ్ఫై ఏళ్ళ నుంచీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకు గూడా ఇలాంటి ఒంటరితనమే ఇంకా అనుభవమౌతోందంటే దాన్నెలా అర్ధం చేసుకోవాలో తెలియటంలేదు. ఎప్పుడూ “మన” వాళ్ళతోనే జట్టుగా ఉంటూ, వారానికోసారో రెండు సార్లో కలుసుకునే ఆ కొద్ది గంటల కాలం కోసం ఎదురుతెన్నులు చూస్తూ బ్రతకాలంటే మనసంతా నిస్పృహతో నిండిపోతోంది. ఇలాంటి జీవితం కోసమేనా తను ఎదురుచూడాల్సింది? చుట్టూ ఉన్న అందరిలోంచీ వెలి చేసుకుని బ్రతికేందుకే అయితే ఇక్కడకి రావడంలో అర్ధమేమిటి? అసలు తనకెప్పుడూ అమెరికా రావాలనే తపన లేదు. అందుకే ఇలా అనిపిస్తోందేమో?

అమ్మా, నాన్నా ఇదంతా ఇంటి మీద బెంగ ప్రభావమనీ, కొన్నాళ్ళు పోతే అదే పోతుందనీ నచ్చచెప్పడమే కాక, తను ఒంటరిగా ఉండడం మూలాన లేని పోని పిచ్చి ఆలోచనలొస్తున్నాయని కూడా తీర్మానించారు. ఈ రెండు సమస్యలకీ వాళ్ళు చూపించిన పరిష్కారం పెళ్ళిచేసుకోవడం.

అప్పుడే పెళ్ళా? అని తను ఆశ్చర్యబోతే, “అప్పుడే ఏమిటి? చదువైయింది, ఉద్యోగంలో స్థిరపడ్డావు. ఇంక పెళ్ళికి ఆలస్యం ఎందుకు? ఇప్పటికే బోలెడు సంబంధాలు వస్తున్నయ్‌. అది కూడా కానిచ్చేస్తే ఇక మా బాధ్యతలన్నీ తీరిపోతాయ్‌” అన్నారు.

తన పెళ్ళి వాళ్ళ బాధ్యతా తన బాధ్యతా? ఇక్కడికి వచ్చాక, ఇక్కడి పధ్ధతులని కొంచెం ఆకళింపు చేసుకున్నాక, ఇలాంటి ఆలోచనలు కొత్తగా వస్తున్నాయి. అనవసరపు సిగ్గూ, బిదియాలు లేకుండా, మగవాణ్ణి చూడగానే ఎవరో శతృవులా కాకుండా మామూలు మనిషిలాగా చూచి స్నేహంగా మాట్లాడే అమెరికన్‌ అమ్మాయిలను చూస్తే కొంచెం కంగారూ, ఆశ్చర్యం కలిగినా, ఆకర్షణ కూడా లేకపోలేదు. నలుగురితో పరిచయాలు పెంచుకుని నచ్చినవారినెంచుకుని పెళ్ళాడటం బాగానే ఉంటుందనిపిస్తోంది. కానీ, ఎంత ఆకర్షణ కలిగినా, ఇంతవరకూ ఒక్క అమెరికన్‌ అమ్మాయిని కూడా తనంతట తాను పలకరించే ధైర్యం చెయ్యలేకపోయాడు. ఆఫీసులో వాళ్ళతో కూడా అవసరమొచ్చినపుడు మాట్లాడేందుకు ముందర నాలుగు సార్లు రిహార్సల్స్‌ వేసుకుని గానీ మాట్లాడలేకపోతున్నాడు. ఇక వాళ్ళను కాఫీకి రమ్మని గానీ, సినిమాకి వెళ్దామని గానీ అడగగల్గడం కలలో కూడా ఊహించలేని సంగతి. ఎన్నాళ్ళిక్కడ ఉన్నా తనలో ఆ తెగువ వస్తుందనే నమ్మకం లేదు. ఇంక వాళ్ళతో పెళ్ళేమిటి?

ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగమ్మాయిలు కూడా కొందరు తగలకపోలేదు. వాళ్ళు అసలు అర్ధం కాలేదు తనకు. చూపులకు ఇండియన్స్‌ లా, చేతలకు అమెరికన్స్‌ లా ఉండే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియక తికమకపడిపోయాడు. సూ అనే అమ్మాయితో (పూర్తి పేరు సుజాత) తన పరిచయం స్నేహం దాకా కూడా వెళ్ళింది. ఒక్కోసారి తనమీద జాలితో ఆ అమ్మాయి తనతో స్నేహం చేస్తోందా అనే అనుమానం వచ్చినా, కాదనే ధైర్యం కూడా వెంటనే వచ్చేది.

తన తల్లితండ్రులు తన పెళ్ళి మాట ఎత్తినప్పుడు సూని కానీ, అలాంటి ఇంకో అమ్మాయిని కానీ చేసుకుంటే ఎలా ఉంటుందో అనే ఆలోచన రాకపోలేదు. వాళ్ళలో తనకున్నలాంటి సందేహాలూ, సంకోచాలూ ఏమీ ఉన్నట్టు లేవు. ఇక్కడి వాళ్ళతో బాగా కలిసిపోతారు, మళ్ళీ తెలుగు వాళ్ళతోనూ బాగానే ఉంటారు. అలాంటి పెళ్ళి చేసుకుంటే తనకికూడా ఇక్కడి సంఘంలో స్థానం లభిస్తుందేమో? కానీ ఆ అమ్మాయిల మనసులో తనకు స్థానం లభిస్తుందా? అదసలు తనెలా సంపాదించుకోవాలో? ఇండియాలోలా ఈ అమ్మాయిలు అమ్మా, నాన్నా ఎవరిని చూపిస్తే వారికే తలాడించి పెళ్ళికి ఒప్పేసుకుంటారని తనకు నమ్మకం లేదు. వీళ్ళు కూడా తెలుగు తల్లి తండ్రుల
చేతుల్లోనే పెరిగిన వాళ్ళూ, ఆ తల్లి తండ్రులు కూడా తెలుగు పధ్ధతులనే పాటిస్తున్న వాళ్ళూ మరైతే వీళ్ళకింత స్వేచ్చా, స్వతంత్రాలోచనా ఎలా అబ్బాయబ్బా? ప్రతీదీ తరచి తరచి చూసీ, ప్రశ్నలు వేసీ, దాని అంతేమిటో తేల్చనిదే వదలరు వీళ్ళు.

తన కారుని గుడికి తీసుకు వెళ్తున్నానని చెప్తే సూ ఏమంది? నిమ్మకాయల మాట వినగానే తమాషాగా నవ్వి, “ఓ! అయితే బలి ఇస్తున్నావన్నమాట!” అంది. (ఇంగ్లీషులోనే అన్నది కానీ, సూ అన్న మాటలను తను ఎప్పటికప్పుడు తెలుగులోకి తర్జుమా చేసుకుంటూనే ఉంటూంటాడు).

“బలేమిటి?” అన్నాడు తను విస్తుబోయి.

సూ పకపకా నవ్వేసి, “అయితే నీకా  నిమ్మకాయలెందుకో తెలియదా?” అని నిలదీసింది.

“రక్ష అని మా అమ్మ చెప్పింది,” అన్నాడు తను అనుమానంగానే.

“అదేలే. దేన్నించి రక్షా అని.”

“నాకు తెలియదు.” కష్టమైనా నిజం ఒప్పుకోక తప్పలేదు తనకు.

సూ సాలోచనగా చూసింది. “నీకు పూరీ జగన్నాధుని రథం గురించి తెలుసా?”

“అంటే? ఏం తెలియాలి?”

“దాన్ని ప్రతి సంవత్సరం రథోత్సవానికి బయటికి తీస్తారు. ఒక నరబలి జరిగేంతవరకూ అది కదలదని నమ్మకం. అందరూ పట్టుకుని దాన్ని కదిలించేందుకు తాళ్ళతో లాగుతూంటారు. బరువైన రథం కదా! చాలా శ్రమ పడితే గానీ కదలదు. ఆ తొక్కిసలాటలో ఎవరో ఒకరు దాని చక్రాల కింద పడి నలిగిపోతారు. ఇక రథయాత్ర నిర్విఘ్నంగా సాగిపోతుందని అందరూ సంతోషిస్తారు.”

“నాకేం అర్ధం కావడం లేదు.”

మళ్ళీ నవ్వింది సూ. “విడమర్చి చెప్పాలా? ఎవరో ఒకరు చక్రాల కింద పడేంతవరకూ ఎవరు పడతారో అని అందరికీ ఆందోళనగా ఉంటుంది. ఒకరు పడగానే బలి జరిగిపోయింది కాబట్టి ఇక మిగతా వాళ్ళందరికి భయం లేదని నిశ్చింత పొందుతారు. మీ అమ్మ చెప్పిన నిమ్మకాయలకు అర్ధం అదే. ఎటొచ్చీ మనుషులకు బదులు నిమ్మకాయలను పెట్టి శాస్త్రార్ధం బలి జరిపించేస్తున్నారు.”

చురుగ్గా చూశాడు తను. “నేనమ్మను.”

ఆమె అమెరికన్‌ స్టైల్లో భుజాలెగరేసింది. “ఎందుకు నమ్మవు? బుధ్ధుడు చేసిన సంస్కరణలలో ఈ బలులాపించడం ముఖ్యమైనది. అప్పటినించే ఈ నిమ్మకాయలూ, కొబ్బరికాయలూ వాడే ఆచారం వచ్చిందనుకుంటా.”

అప్పటికే కోపంతో కుతకుతలాడుతున్న తను ఇంక ఆ లెక్చర్‌ వినలేక వెంటనే వచ్చేశాడు. అలాంటమ్మాయితోనా తన పెళ్ళి? ఇండియన్స్‌ అంటే వీళ్ళ మనసులలో కూడా అమెరికన్స్‌ మనసులలోలాగే ఒక తేలిక భావం ఉంటుంది. అందుకే ఇండియా పేరెత్తగానే వీళ్ళకు నరబలులూ, స్త్రీ దహనాలూ తప్ప ఇంకేవీ గుర్తుకు రావు! వీళ్ళతో తనకు సంబంధ బాంధవ్యాలేర్పడుతాయనుకోవడం కేవలం హాస్యాస్పదం. బుధ్ధిగా అమ్మా వాళ్ళు చెప్పిన సంబంధాల్లోనే తనకు నచ్చినదేదో చేసుకోవడమే నయం. కనీసం
ఇద్దరి విలువలూ ఒకటే అవుతాయి.

అప్పుడే గుడి వచ్చేసిందని గమనించి కారాపాడు శేఖర్‌ లోపలికి వెళ్ళి డబ్బులిచ్చేసి, “వాహన పూజ” అని బోర్డు పెట్టి ఉన్న చోటుకి కారుని తీసుకెళ్ళాడు. అక్కడ పూజారి సరంజామా అంతటితోటి సిధ్ధంగా ఉన్నాడు. ఏవో మంత్రాలు చదివి, కారుకు హారతిచ్చి, నిమ్మకాయలు నాలుగూ తలొక టైరు కిందా పెట్టాడు.

పూజారి సంకేతం అందుకుని కార్లోకి వెళ్ళి కూర్చున్నాడు శేఖర్‌. మళ్ళీ మనసుప్పొంగింది. అప్పటివరకు జరిగిన తన జీవితమంతా ఒకసారి కళ్ళకు కట్టినట్టనిపించింది. తన జీవితంలోని వివిధ దశలకి ప్రతిబింబాలలాగా వేర్వేరు వయసుల్లో తనక్కడ నిల్చునట్టు అనిపించింది. మూడేళ్ళప్పుడు అంతులేని కుతూహలంతో ప్రపంచాన్ని తిలకిస్తున్న బాలుడూ, స్కూల్లో, కాలేజీలో సైన్సు అద్భుతాలకి పులకించుతున్న విద్యార్ధీ, తలితండ్రుల మాట విని ఎరగని దేశానికి ప్రయాణమైన విధేయుడైన కుమారుడూ,
జీవితంలో తోడుకోసం వెతుక్కుంటున్న యువకుడూ, నలుగురూ కారుకు నాలుగు వైపులా నుంచున్నట్టు అనిపించింది. వాళ్ళకి వీడ్కోలు ఇస్తున్నట్టు చెయ్యూపి, నాలుగు నిమ్మకాయలనూ నలిపివేస్తూ, ఉత్సాహంగా కొత్త జీవితం వైపుకి సాగిపోయాడు శేఖర్‌.
-----------------------------------------------------------
రచన: మాచిరాజు సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, December 26, 2018

పోతన కవిత్వ పటుత్వము


పోతన కవిత్వ పటుత్వముసాహితీంిత్రులారా!

“ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు.

సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి పాటైనా గానీ నేర్చుకొని ఉండడు. కాబట్టి అతని కవిత్వంలో వ్యాకరణ దోషాలూ, తప్పుడు సంధులూ కనబడతాయి. రఱ ల పరిజ్ఞానం అసలే లేదు. అందుచేతనే అప్పకవిలాంటి లాక్షణికులు పోతరాజును ప్రామాణిక కవిగా అంగీకరించలేదు.

… కాబట్టే పోతన్న ఆంధ్ర జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయణాలలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని పద్యాలను పఠించగలరు.
మరే మెరుగూ లేకపోయినా రచనలో శబ్దాడంబరమైనా ఉంచాలని పోతన్న అంత్యానుప్రాస కోసం ప్రాకులాడి నిఘంటువులన్నీ గాలించాడని కొందరనుకున్నారు.

ఇక పోతన రామభక్తుడన్నారు సహృదయులు. కాబట్టి అతని కవిత్వం భక్తిప్రేరితమూ, భక్తిపూరితమూ. ’భక్తిఆవేశంవల్ల ఒళ్లు మరచి ఏదో అన్నాడు, ఏదో వ్రాశాడు; ఆ భక్తి సంబంధమైన గొడవ మినహాయిస్తే ఇంక పోతనలో కవిత్వమేమి కనబడుతుంది?; అన్నారు మరికొందరు విద్యాధికులూ విమర్శక ప్రముఖులూనూ.

అయ్యో! పోతనామాత్యా! నీవు ‘దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్’ అని అర్థించినదంతా వ్యర్థమేనా? ‘కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ’ నేడుస్తున్నట్లు కనిపించిన సరస్వతి దృశ్యమంతా నిఘంటువుల నిషాయేనా? ‘ఇమ్మనుజేశ్వరాధముల’ కివ్వనని చెప్పుతూ ‘సత్కవుల్ హాలికులైననేమి? గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులైననేమి?’ అని సత్కవిగా సగర్వంగా చెప్పినదంతా వట్టి బాకా ఊదుడేనా?

అభిప్రాయ గుళికలవల్ల కలిగిన అనర్థమిది. ఆనాటి సహృదయులు ఆ కవులలోని గుణాలన్నీ చూచినవారే. అందులో మరీ స్ఫుటంగా ఉన్న ఏ గుణాన్నో ఒకదాన్ని గుళికా రూపంలో ప్రకటిస్తారు. తక్కిన కవితా విశేషాలు లేవని వారెప్పుడూ అనలేదు. అయినా ఆ గుళికా ప్రభావం విపరీతంగా పరిణమించింది.

వారు పేర్కొన్న గుణమొక్కటే ఆ కవిలో ఉన్నట్టూ, తక్కిన గుణాలు ఏవిగూడా లేనట్టూ ఇటీవలి పాఠకలోకం అర్థం చేసుకుంది. రసపోషణగాని, కవితా శిల్పంగాని, భావ నిరూపణంగాని, విషయచిత్రణం గాని ఆ కవిలో ఉంటాయని అనుకోరు. చూద్దామని శ్రద్ధగూడ తీసుకోరు.

పోతన్న అంత తేలికగా త్రోసివేయదగినవాడు కాడు. ఎందరో మహానుభావుల కన్న మిన్న. అమర్త్యకాంత అయిన ఆంధ్ర కవితా పితామహుని వరూధిని మర్త్యకాంతగా పుట్టకపోయానే అని విచారిస్తుంది. చూడండి-

ఎంత తపంబు చేసి జనియించినవారొక మర్త్యభామినుల్
కాంతు డవజ్ఞ చేసినను కాయము వాయుదు; రే నమర్త్యనై
చింతల వంతలం జిదికి సిగ్గరితిన్; మృతి లేని నాదు చె
ల్వింతయు శూన్యగేహమున కెత్తిన దీపికయయ్యె నక్కటా!

ఈ విధంగా వరూధిని గణితంలో ఒక లెక్కచేసినట్టు, లాయర్ వాదించినట్టు చింతిస్తుంది. ఇక పోతనగారి గోపిక అలా కాదు. యమునా తీరంలో ఒక వెదురుమొక్కగా పుట్టకపోయానే అని విచారిస్తుంది.

నా మోసంబున కెద్దిమేర వినవే నా పూర్వజన్మంబులన్
లేమా నోములు నోచుచో నకట కాళిందీతటిన్ వేణువై
భూమిన్ పుట్టెదనంచు గోరగదే బోధిల్లి; యట్లైన నీ
బామం దిప్పుడు మాధవాధరసుధాపానంబు గల్గుంగదే!

ఇది స్త్రీభావ సహజంగా, రసముట్టిపడేటట్టుగా ఉన్నది.

వామనావతార ఘట్టంలో పోతన చూపిన ‘కవిత్వపటుత్వము’ అసాధారణం. ఆ ఘట్టాన్ని అంత సమర్థతతో చిత్రించగల కవులు ఒకరిద్దరు మించి ఉండరు. బలిచక్రవర్తి దానాన్ని గ్రహించి వామనుడు త్రివిక్రముడై బ్రహ్మాండం నిండిపోతాడు. వటు డింతింతై మరింతై పెరిగి పోతూండటం పోతన్న హృదయానికి ప్రత్యక్షంగా కనిపిస్తూంది. ఆ విధంగానే పాఠకునికి గూడా కనబడాలి గదా! ఆ బ్రహ్మాండత్వం పాఠకునికి ప్రస్ఫుటం కావాలి గదా! అలా జరిగినప్పుడే గదా ఆ రసం పలికినట్టవుతుంది!

ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై.

అని వర్ణించాడు. ఆకాశవీధి, మేఘమండలం, కాంతిరాశి, చంద్రుడు, ధ్రవుడు, మహర్వాటి, సత్యపదం అని ఆ రూపాన్ని పెచాడు. కానీ మహాద్భుతాకారమెంత పెద్దదో కంటికి కట్టినట్టయిందా? తృప్తి లేదు. కాబట్టే –

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

అని వర్ణించి కృతార్థుడయ్యాడు. ఆ మహాద్భుతరూపాన్ని ప్రత్యక్షంగా చూపించి పాఠకులను చరితార్థులను చేశాడు పోతన్న. నడిమింటి నున్న సూర్యబింబాన్ని చూడమన్నాడు. అది యెంత యెత్తున ఉందో, ఎంత పైకిపోతే దాన్ని తాకగలమో ఊహారూపంగా ప్రతి పాఠకుడికీ తెలుసును. దృష్టిని ఆ బింబం మీదనే ఉంచి పోతన్న వామనుడిని పెంచాడు. వామనుడికది గొడుగులా గుందన్నాడు. ఇంకా పెంచాడు. ఇప్పు డా బింబం తలలో పెట్టుకున్న రత్నంలా గుందన్నాడు. ఇంకా పెంచాడు. చెవి పోగులాగుంది. ఇంకా – కంఠాభరణంలాగ; ఇంకా – భుజకీర్తిలాగ; ఇంకా – కాలి అందెలాగ; ఇంకా పెంచాడు – ఆ బింబం పాదపీఠంలా గుందన్నాడు. ఎంత పెద్ద ఆకారాన్ని ఎంత స్ఫుటంగా చిత్రించాడో చూడండి. పోతన్న శిల్పనైపుణ్యం ఏమనగలం? మన మహాకవులెందరీ మహాకార్య మింత అందంగా నిర్వర్తించగలరు? అనకూడదు గాని భగవద్గీతలోని విశ్వరూప సందర్శన ఘట్టంలో నైనా ఇంతటి స్ఫుటత్వం ఉందేమో చూడండి-

ద్యావా పృథివ్యో రిద మంతరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
దృష్ట్వాద్భుతం రూప ముగ్రం త వేదం
లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్.

ప్రహ్లాదచరిత్రలో నృసింహావతార వర్ణన ఎందరు కవు లా రీతిని వర్ణించి సాధకులకు సాక్షాత్కారం కలిగించగలరో యోచించినట్లయితే పోతన కవిత్వ పటుత్వం నిస్సందేహంగా తేటపడుతుంది.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన చూపిన మహాకవి లక్షణాలు అమోఘములు. గజేంద్రుడి ప్రార్థనలో జ్ఞాన భక్తి వైరాగ్య ప్రపత్తులను ఏ విధంగా సోపానాలుగా ఉపయోగించాడో చూడవలసినదే. విష్ణుమూర్తి భక్తవాత్సల్యం ప్రకటించటానికి పోతన వేసుకున్న పథకం కేవల భక్తిప్రేరకమే కాదు, అత్యుత్తమ కవితా భరితం కూడా. నిరాటంకంగా లక్ష్మీదేవితో కాలం గడుపుదామని నిశ్చయించుకున్న విష్ణుమూర్తితో మనలను ఆ వైకుంఠపురంలో, నగరిలో, ఆ మూల సౌధం దాపల, మందారవనంలో, సెలయేటి ప్రక్కనున్న కలువతిన్నె దగ్గరకు పోతన్న తీసుకెళ్లాడు. అక్కడ మంచి రసవంతమైన పట్టులో గజేంద్రుడి మొర వినిపించాడు. క్షణంలో రమావినోదితనం ఎగిరిపోయింది. ఆపన్న ప్రసన్నత మూర్తీభవించింది. ఆ పైటచెంగు పట్టుకునే విష్ణువు సంరంభంతో బయలుదేరాడు. ఆ సంరంభం ఒక మహా ప్రవాహంలాగా కవి హృదయంలో పరుగెడుతూ వుంది. ఆ ప్రవాహ వేగంలోకి మనల నీడ్చాడు పోతన మూడు పద్యాలలో. సిరికి చెప్పకుండా, శంఖ చక్రాలు తీసుకోకుండా విష్ణువు వెళ్తున్నాడు. చేతిలో పైట చెంగు చేతిలోనే ఉంది. లక్ష్మి పాపం ఏమో తెలియక శాటీముక్త కుచంబుతో తాటంకా చలనంబుతో వెంటపడ్డది. కలువతిన్నె నుంచి తిరుగు ప్రయాణం ఆరంభమయింది. ఆ మందారవనంలో మరెవ్వరూ లేరు కాబట్టి వెంటన్ సిరి మాత్రమే. తరువాత ఆ మూల సౌధంలో కొస్తారు. అక్కడున్న అవరోథ వ్రాతం వెంట పడుతుంది. చావడిలో పక్షీంద్రుడు మొదలైనవారు. నగరి వెలుపలికి వచ్చేసరికి వైకుంఠంలోని ఆబాల గోపాలం వెంటబడ్డారు. వారిలోనే మనమూ ఉన్నట్టు పోతనకవి చేశాడు. చూడండా క్రమం-

తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతము; దావి వె
న్కను పక్షీంద్రుడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖచ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్.

పద్యారంభంలో ‘వెంట’ ‘వెన్క’ ‘పొంత’ అన్న మాటల నుపయోగించిన పోతన్న పోనుపోను సంరంభాతిశయం వల్ల వాటి నుపయోగించటం మానుకున్నాడు. తానూహించిన సంరంభభావాన్ని పాఠకుల హృదయాల్లో ఇంత చక్కగా ప్రతిఫలించినట్టు చేసిన పోతనలో కవితావిశేషం లేదా?

ఇంతేకాదు. అతిసున్నితమైన మానసికావస్థలను చిత్రించటంలో కూడా పోతన్న ఏ కవికీ తీసిపోడు. పాత్ర హృదయం తనదిగా చేసుకొని దానికి సరిపోయినట్టు భావాలను ప్రకటించగలగటం పోతన్న కలవడినట్టు ఎందరికో అలవడలేదు.

రుక్మిణి తన బ్రాహ్మణుడిని కృష్ణుని దగ్గరకు పంపించింది. ఇంకా రాలేదు. ఇక్కడ వివాహ ప్రయత్నాలు సాగిపోతున్నాయి. కూర్చుని అనుకుంటూంది-

ఘను డా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేయునో యీశ్వరుం
డనుకూలింప దలంచునో తలపడో ఆర్యామహాదేవియున్
నను రక్షింప నెరుంగునో యెరుగదో నా భాగ్య మెట్లున్నదో!

ఈ పద్యంలో పోతన రుక్మిణీ హృదయంలో ప్రవేశించాడు. అనిన మాటలు కొన్ని; అనకుండా ఉన్న ఊహలు కొన్ని. అతిమనోహరమైన పద్యం. ‘భూసురుడేగెనో’ అన్నదేగాని ‘లేదో’ అనలేదు. ఆ ఘనుడి విషయంలో వెళ్లకపోవటమన్న ఊహ కూడా రుక్మిణి సహించలేదు. మార్గాయాసం వల్ల కొంచెమాలస్యమై యుంటుందని సమర్థించుకొని, “వెళ్లే ఉంటాడు. కృష్ణుడితో చెప్పేఉంటాడు.” అనుకొన్నది. విని కృష్ణుడిది తప్పుగా భావించి ఉంటాడా? అని ప్రశ్నించుకుంది. అతనలాగ తలచేవాడు కాడే అనుకొని ‘విచ్చేయునో’ అన్నదేగాని ‘విచ్చేయడో’ అనలేదు. ఆ ఊహే తనకు దుర్భరం. ‘లేదు’ అన్న పదం తన నోట పలకదు. తానూ, భూసురుడు, కృష్ణుడు అయిపోయారు. ఇక మిగిలినది దేవతలు. వారిలో ఇష్టదైవతం ఆర్యామహాదేవి. నలుగురితో పాటు తనకూ ఈశ్వరుడే దేవుడు. ఆర్యాదేవంతటి దగ్గరి దైవం కాడు. కొంచెం దూరం. వీళ్లను గురించి సందేహముంది. ‘ఈశ్వరుడు అనుకూలించటానికి తలుస్తాడో తలపడో’ అన్నది – అంత పరిచయం లేదు కాబట్టి. ఆర్యామహాదేవి విషయంలో తలుస్తుందో లేదో అన్న సందేహం రుక్మిణికి లేదు; తప్పకుండా తలుస్తుంది. తనకు నమ్మకమే. కాని ఆమెకు తన్ను రక్షించే ఉపాయం తెలుసునో తెలియదో! ఉన్న సందేహమంతా అదే. ఉపాయం తెలిస్తే తప్పక రక్షిస్తుందన్న మాటే. ఇంత వ్యత్యాసముంది కాబట్టే పోతన్న ఈ రెండు సందేహాలను ఈ విధంగా ప్రకటించాడు. విషయ విశ్వాసాన్నింత చక్కగా ప్రదర్శించగల సమర్థులు మన కవుల్లో ఎందరున్నారు?

ఇన్ని విషయాల నింత రసవంతంగా చిత్రించ గలిగినవాడు కాబట్టే పోతన్న ఆంధ్ర జనసామాన్యానికి అభిమాన కవి కాగలిగాడు. భారత రామాయణాలలోని ఒక్క పద్యమైనా నోటికి రానివారు చాల మంది భాగవతంలోని పద్యాలను పఠించగలరు. ఇటువంటి పోతనలో కవిత్వ విశిష్టత లేదనీ, ఇతను వ్యాకరణం రాని సహజ పండితుడనీ, అంత్యప్రాసకోసం నిఘంటువులకు ప్రాకులాడే వాడనీ భావించడం కూడనిపని. ఇంకా సందేహముంటే ఏదైనా ఒక్క ఘట్టం సంస్కృత భాగవతంతో సరిపోల్చి చూస్తే పోతన కవిత్వపటుత్వం కరతలామలకం కాకతప్పదు.
---------------------------------------------------------
రచన - శ్రీ తాపీ ధర్మారావు
(పరిశోధన, 1954
పొద్దు.నెట్ సౌజన్యంతో

Tuesday, December 25, 2018

గుర్రాల మావయ్య


గుర్రాల మావయ్య
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి............

సరిగ్గా యాభై ఏళ్ల నాటి మాట-

నేను, మా అన్నయ్య బాపట్లలో డిగ్రీ రెండో సంవత్సరం వెలిగిస్తున్న రోజులు. అవటానికి అన్నయ్య నాకంటే రెండేళ్లు పెద్దేకాని, వాడెక్కడో ఒక ఢింకా కొట్టడం వల్ల, నన్నో ఏడాది ముందు హైస్కూల్లో వేయడం వల్ల స్కూల్ ఫైనల్లో యిద్దరం కలిసిపోయాం. వాడు అంగుష్ఠమాత్రం లొజ్జు కావడంతో యిద్దరం ఒకే ఎత్తులో వుండేవాళ్లం. చాలా చిన్నప్పుడు, మేం నాలుగైదేళ్ల వయసులో ఉండగా మా యిద్దరితో అమ్మ పుట్టింటికి బాపట్ల వెళ్తోందిట. ఆ ప్రయాణంలో మా నాయనమ్మ కూడా వుందిట. పిల్లలిద్దరూ సరిసమంగా వుండటం చూసి, రైల్లో వాళ్లెవరో ‘కవల పిల్లలా?’ అని అడిగారట. మా అమ్మ కాదని చెప్పేలోగా అత్తగారు అందుకుని, ‘లేదమ్మా వీడు పెద్దాడు వాడు చిన్నాడు. కాకపోతే యిద్దరికీ ఆర్నెల్లే వార’ అందిట. మా అమ్మకి చచ్చేంత సిగ్గు, చిరాకు ముంచుకొచ్చాయిట. మేం పెద్దయ్యాక కూడా యీ విషయం చెప్పి నాయనమ్మని సాధించేది అమ్మ. ‘పిల్లలకి దిష్టి తగుల్తుందని అలా చెప్పా. దానికింత రాద్ధాంతమేంట’నేది మా గ్రాండ్మా. ‘అయితే మాత్రం ఆర్నెల్ల తేడాతో పిల్లలేమిటండీ? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. రైల్లో వాళ్లంతా నన్ను విడ్డూరంగా చూస్తుంటే సిగ్గుతో చచ్చాను’ – అంటూ ఆనాటి దృశ్యాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చేది మా అమ్మ.

అలాంటి పూర్వగాథ వున్న మా అన్నదమ్ములిద్దరం బాపట్ల – పర్చూరు మధ్య తరచు తిరిగేవాళ్లం. పర్చూరు దగ్గర్లో వర్జీనియా పొగాకు పండే భూములుండేవి. సీజన్‌లో కౌలు డబ్బుల కోసం తిరగక తప్పేది కాదు. అట్నించి వచ్చేటప్పుడు తప్పకుండా వెదుళ్లపల్లిలో ఆగేవాళ్లం. మా యోగయ్య మావయ్య కరణీకం చేస్తూ అక్కడ వుండేవాడు. మా అత్తయ్య వుత్తమా ఇల్లాలు. యోగి మావయ్య వ్యవహారంలో దిట్టేగాని వయసులో పెద్దేమీ కాదు. వెదుళ్లపల్లి బ్రేక్ జర్నీలో మాకో గొప్ప ఆకర్షణ వుండేది. దాని తాలూకు కథా కమామీషూ చెప్పాలనే యాభై ఏళనాటి జ్ఞాపకాన్ని దాఖలు చేసుకుంటున్నా. అవధరించండి-

బస్ దిగి పదడుగులు వేస్తే మావయ్యగారిల్లు. మేం సామాన్యంగా మధ్యాన్నం మూడు గంటలవేళ బస్సు దిగేవాళ్లం. మమ్మల్ని చూడగానే మావయ్య నిలువెల్లా వెలిగిపోయేవాడు. రెండు ప్రశ్నలతో యోగ క్షేమాలన్నీ రాబట్టేసి, యిక క్షణం వృథా కాకుండా పనిలోకి దిగేవాడు. మా ఇద్దర్నీ వెయ్యి మాటల సాటిగా ఒక్క చిరునవ్వుతో పలకరించి, నీళ్ల కూజాని చూపిస్తూ అత్తయ్య లోపలికి కదిలేది. బరువైన ఓ సత్తు టిఫిను, ఖాళీ స్టీలు టిఫిను కాసేపట్లో మా చెరో చేతికి యిచ్చేది. ఇంతలో మావయ్య గాంధీ బొమ్మ చేసంచిని మడిచి, ఆ మడతలోనే కాసిని చిన్నపెద్ద నోట్లు పెట్టుకుని బయలుదేరేవాడు. ‘ఇదిగో వాటి సంగతి చూస్తావుగా, మేం సరుకుల్తో సహా వస్తాం’ అంటూ మావయ్య కదిల్తే, మేమిద్దరం అటూయిటూ నడిచేవాళ్లం.

అపుడపుడే సముద్రపు గాలి తిరిగి ప్రాణానికి హాయిగా అనిపించేది. అంతలోనే యెదురైన ఓ పెద్దమనిషి ఆశ్చర్యంగా చూస్తూ, ‘అయ్యా! సాక్షాత్తూ ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి ఆనాడు యాగరక్షణకు సీతారాముల్ని వెంటపెట్టుకు వెళ్తున్నట్టుంది… ఆహా!’ అని యింకేదో అనబోతుంటే అడ్డుకుని, ‘కాని, మహానుభావా! మీ గ్రామకంఠాన్ని వొడ్డెక్కించడం మాత్రం నా చేతుల్లో లేదు. అన్నట్టు యాగరక్షణకు తీసికెళ్లింది రామలక్ష్మణుల్ని. లేనిపోని పొగడ్తలకి దిగితే యిలాగే అపశ్రుతులు దొర్లుతాయ్.’ అంటూ నడక వేగం పెంచాడు.

‘అయ్యా! తమరలా తక్కువ చేసుకుంటే నే పోయినంత ఒట్టు!’ అంటూ వెనక్కి తిరిగి మరీ నడక సాగించాడు.

‘అయినా తప్పదు. వున్నమాట చెప్పా’ అంటూనే మావయ్య యింకో ఆసామీని ఆపాడు.

‘ఏం సాంబయ్యా, మీ వాళ్లు తాసీళ్లు కట్టనేలేదు. ఏం చేద్దాం? ఇహ జప్తులే మరి…’

‘అట్లా అనకండి బాబూ… ఎక్కడా అసలు మగ్గం కదలందే! ఏం చేస్తాం?’

‘మనోళ్లంతా పడుగులు పక్కనపెట్టి అచ్చంగా పేకలు పట్టుకు తిరుగుతున్నారుగా!’

‘శివ… శివ… శివా!’

పర్ణశాలలా వున్న ఓ యింటిముందు ఆగాం. లోపల్నించి ఓ అమ్మాయి ఛెంగున వచ్చింది. ‘నాగమణీ, నాలుగు కర్వేప రెబ్బలు… తెలుసుగా?’ అని మావయ్య అనగానే, ‘తెలుసండీ. ముదురు పచ్చగా వుండాలండీ, స్వభావం మంచిదై వుండాలండీ.’ వినయంగా పూరించింది నాగమణి. మావయ్య భేష్ అంటూ, ‘సిపాయి లాంటి మొగుడొస్తాడు. నువ్ చెప్పినట్టు వినుకుంటాడు.’ దీవించాడు.

చిన్న సందు మొగలో చప్పుడు చేస్తూ పిండిమర. ‘ఒరే పెద్దాడా, నీ చేతిలో టిఫిను అక్కడ యివ్వు.’

‘ఖాసిం! మిషన్ తుడు. ఓ చారెడు పప్పు మరపట్టి పిండి వదిలెయ్. నష్టం లేదు మనకు.’

‘ఇక్కడిచ్చి వెళ్లండి, నాకు తెల్సుగా… నే చూసుకుంటా.’ అన్నాడు పిండి తల దులుపుకుంటూ.

మళ్లీ మెయిన్ రోడ్డెక్కామో లేదో, ఊర్థ్వపుండ్రాలతో ఆచారిగారు యెదురుపడ్డారు. ‘కరణంగారు ఎందుకో మెట్టుదిగి దయచేశారు. ఆలయానికొచ్చి స్వామివారికి తమ దర్శనమెప్పుడిస్తారో…’

‘దీనికేం! అతి వినయం ఏదో లక్షణం అన్నట్టు… పాపం స్వామివారికి నిత్యం బెల్లం ముక్క నైవేద్యమేగా? నులిపురుగు పడుతుంది జాగ్రత్త!’

‘క్రిష్ణ… క్రిష్ణ… ఎంతమాట!’

‘దేవుడిక్కాదు నులిపురుగు పడేది, మీ పిల్లలకి…’

‘మా కరణం గారికి నిలువెల్లా చమత్కారమే. ఇలవేలుపు కృష్ణస్వామి పోలికొచ్చింది. ఆహా!’ అంటూ నొసలు విప్పార్చాడు. తిరునామం ఎగపాకింది.

‘నీ ముందు నేనెంత? నీకో దణ్ణం!’ అంటూ చప్పుడయ్యేలా రెండు చేతులూ కలిపాడు మావయ్య.

ఇలా ప్రతిసారీ యీ సంచారంలో మావయ్యని పలకరించేవారుండేవారు. ఒక్కోసారి ఒక్కో అనుభవం మాకు ఎదురయ్యేది. అన్నీ గుర్తుండిపోయాయి.

ఈ క్రమంలో మావయ్య ఎక్కడికి వెళ్తాడో మాకు తెలుసు. నూనె గానుగ!

‘ఒరే చిన్నాడా, నీ చేతిలో టిఫినక్కడ యివ్వు.’

అక్కడున్న ఆడమనిషి అందుకుంది. ‘రావుడూ, వీశెడు… ఈ పట్టులోదే. మళ్ళీ వస్తాం. రెండు జల్లెళ్లలో వడగట్టి పోస్తావుగా… మర్చిపోకు.’

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మరోవైపు కదిలాడు.

చిన్న పూరింటి ముందు ఆగాం. ‘దణ్ణాలు దొరా!’ అంటూ ఓ పెద్దావిడ వచ్చింది.

‘రాగమ్మా, పిల్లలొచ్చారు… సరుక్కోసం వచ్చా.’

‘అయ్యో! మీకంటేనా? మీరే ఏరుకోండి, మీరే ఎంచుకోండి…’ అంటూ లోపలకు వెళ్లింది.

“ఈ రాఘవమ్మ యిప్పుడంటే ఇలా శబరిలా అయిపోయింది గాని కాలం నాడు సత్యభామరోయ్!” అని మావయ్య అంటుంటే లోపల్నించి పెద్ద జాడీతో వస్తున్న రాగమ్మ చిరునవ్వింది. ‘చూస్కోండి సామీ, అన్నీ గుర్రాలే…’ అంటూ గుప్పెళ్ళతో తీసింది. జీడిపప్పులు! నోరూరేలా!

“చూశారా, యిలా బొద్దుగా తెల్లగా పాల నురగల్లో పుట్టినట్టుండాలి. మీ కుడిచేతి బొటనవేలు వంచండి. రెండు కణుపులు కలిసినట్టుంటే వాటిని గుర్రాలంటారు. వాటికి అద్భుతమైన రంగు రుచి వాసన వుంటాయి. ఇహ తర్వాతవన్నీ నాసిరకాలే. గాడిదలు, ఒంటెలు, చంద్రవంకలు, జీడిపిక్కలు… అంతే!”

రాగమ్మ గుర్రాల్లోంచి మళ్లీ మేలు జాతివి తీసి పక్కన పెడుతోంది.

“రాగమ్మ జీడితోటల్లోకి పళ్లు ఏరడానికి వెళ్తుంది. ముఠా మేస్త్రీ. జీడిగింజలు తోటవాళ్లకిస్తే, పళ్లు ఏరిన వాళ్లకిచ్చేస్తారు. అప్పుడప్పుడూ రాగమ్మకి తెలియకుండానే జీడిగింజలు కూడా వచ్చేస్తుంటాయ్…” మావయ్య మాటల్ని వినీ విననట్టుండిపోయింది.

“రాగమ్మ అసాధ్యురాలు. పత్తి వొలవడానికి చేలోకి దిగితే, ఎక్కేప్పుడు మల్లె చెండంత పత్తి కొప్పులో పెట్టుకుని గట్టెక్కేది. మేస్త్రీ కదా, అందరికీ నేర్పింది. పత్తి వొలుపులు అయ్యేసరికి రాగమ్మ క్వింటాల్ పత్తి తూకం వేసేది…” మావయ్య మాటకి అడ్డంపడి, ‘చిన్న బిడ్డలకి యివన్నీ దేనికిలే సామీ…’ అంటూ గుర్రాల పొట్లం అందించింది రాగమ్మ. మావయ్య యిచ్చిన నోట్లని కళ్లకద్దుకుని తీసుకుంది.

తిరుగు ముఖం పట్టాం. గానుగ దగ్గర నూనె టిఫిను బరువుగా ఎదురొచ్చింది. ఖాసిం ఎదురొచ్చాడు. నాగమణి కర్వేప రెబ్బలతో పాటు యీ బరువులు కూడా తీసుకుని మాతో నడిచింది.

ఆ ఇల్లాలికిదేమైనా కొత్త కనకనా? అప్పటికే పొయ్యి రాజేసి వుంచింది. కావల్సిన పాత్ర సామానంతా సిద్ధంగా ఉంది. మేం కాళ్లు చేతులు కడుక్కుని వచ్చేసరికి, వంటింట్లో పొయ్యి మీద నూనె భాండీ నిండుగా కనిపించింది. నాకు, మా అన్నయ్యకు తెలిసిన కథే – ఇప్పుడు తెచ్చిన గుర్రాలు వచ్చేసారికి. ఇప్పటికి పాత సరుకు నీళ్లలో తగుమాత్రం నాని సిద్ధంగా వున్నాయి. అప్పుడప్పుడే చల్లారుతున్న శనగపిండిని బేసిన్‌లోకి కావల్సిన మేర తీసింది అత్తయ్య. అప్పటికే నానిన జీడిపప్పు కురిడీల్ని బద్దలు చేసి వుంచింది. శుద్ధంగా కడిగిన కర్వేపాకులు సహా శనగపిండిలో కలిశాయి. తగినన్ని నీళ్లు కలుపుతూ పకోడీ మిశ్రమానికి పదును తెస్తోంది అత్తయ్య. మావయ్య సలహా సహకారాలను పెద్దగా పట్టించుకోకుండానే ఉప్పుకారాలు జోడించింది.

“ఒరేయ్, రేప్పొద్దున మీకు పెళ్లిళ్లవుతాయ్. పెళ్లాలొస్తారు. వాళ్లని ఏమే ఏమే అని పిలవకండి. అరిష్టం. హేమే హేమే అని పిలుచుకోండి. గృహం శోభన గృహం అవుతుంది. నేనలాగే పిలుస్తా…” అని, యింకేదో అధిక ప్రసంగం మావయ్య చెయ్యబోగా అత్తయ్య కళ్లతోనే ఆపింది.

“ఇప్పుడీ పకోడీ పాకంలో ఒక్క గంటెడు కాగే కాగే నూనెను వేసి కలుపుతుంది మీ అత్తయ్య!” అంటూ పెద్ద గరిటెడు నూనె భాండీలోంచి తీసి వేశాడు. “ఈ నూనె వృథా ఎంతమాత్రం కాదు. ఈ నూనె వార తర్వాత తక్కువే పీలుస్తాయ్ పకోడీలు. రుచి మాత్రం అధికం…”

అత్తయ్య నీళ్లలో చెయ్యి ముంచి, విదిల్చి, వేళ్ల మీదుగా రెండు నీటిచుక్కల్ని భాండీలో రాల్పింది. ఒక్కసారిగా వంటిల్లు చిటపటలాడింది.

మావయ్య, మండే పొయ్యి, పక్కన సమిధల్లా పొందిగ్గా సర్వీ కట్టెలు, చుట్టూ రకరకాల దినుసులు ద్రవ్యాలు, వాటి మధ్య పీట మీద కూచున్న అత్తయ్య సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణలా కనిపించేది.

అత్తయ్య ఒక్కసారి జుట్టు ముడి, కొంగు ముడి బిగించుకుని, చిల్లుల గరిటెను సరిచూసుకుని సర్వసిద్ధమైపోయేది. చేతి గాజులు పైకి తీసుకుని, తడిచేత్తో పకోడీ పిండి తీసి వొడుపుగా, గోడవారగా భాండీలోకి వదిలేది. మావయ్య ఒక్కసారి ముక్కుపుటాలెగరేసి, చతికిలబడి కూర్చున్నవాడల్లా గొంతుకు లేచి, వుత్సాహంగా వుడుకుతూ వేగుతూ సతమతమవుతున్న పకోడీలను చూస్తూ మురిసిపోయేవాడు. అత్తయ్య జల్లెడ గరిటతో విడివిడిగా కలివిడిగా పకోడీలను పలకరించేది. వాటి దిశలు మారుస్తూ పరామర్శించేది.

అప్పటికే అక్కడ సిద్ధం చేసిన పింగాణి సాసర్లను మా చేతుల్లో పెట్టేవాడు మావయ్య. తానొకటి ధరించేవాడు. అత్తయ్య చిల్లుల గరిటతో పకోడీలను దూసి పళ్లెంలో పోస్తుంటే మావయ్య తన్మయత్వంలో వూగిపోయేవాడు.

“ఒరేయ్! కొంచం ఆగండి. నోళ్లు కాల్తాయ్. కాస్త చల్లారనివ్వండి…” మావయ్య హెచ్చరించేవాడు గాని ప్రతిసారీ నాలిక్కాల్చుకునేది ఆయనే. అత్తయ్య చిన్న ముక్క నోట్లో వేసుకుని సంతృప్తిగా చూసేది. ఇక మేం విజృంభించేవాళ్లం.

“చూశారా, భాండీలో చిన్నచితక పూసల్లేకుండా చూడాలి. వాయకీ వాయకీ మధ్య కాస్త నూనె కాగటానికి వ్యవధివ్వాలి…” మావయ్యకి యిలాంటప్పుడు కొంచెం అతిధోరణి వచ్చేది. పాపం!

ముత్యం మూడు వాయల తర్వాత యీ పకోడి యజ్ఞం ముగిసేది. మా ముగ్గురి ముఖాల్లో తృప్తిని పసికట్టి అత్తయ్య ఆనందించేది.

అప్పటిదాకా మూసి వుంచిన కరణంగారి వీధి తలుపులు తెరుచుకునేవి. బయట అరుగుల మీద మావయ్య కోసం ఎవరెవరో కూచుని వుండేవారు. ఆరోజు – ‘చలమయ్యతో చెప్పరా, రేపు పొలం కొలత పెట్టుకోమని. గొలుసు, క్రాస్టాఫు కచ్చేరి సావిడిలో వుందో, ఇంట్లో వుందో చూడండి. ఆ మూడెకరాల హద్దులూ తేలాలంటే యాభై ఎకరాలన్నా కొలవాలి. సరిహద్దు ఆసాములకి చెప్పండి…” అంటూ వెట్టి, మోతాదులకు ఆజ్ఞాపించాడు.

పకోడి తొలి వాయకే చీకటిపడింది. మేమిద్దరం వచ్చిన పని అయినట్టు బయల్దేరడానికి సిద్ధమయాం. మావయ్య అటువెళ్లే బస్సును గుమ్మంలో ఆపడానికి రోడ్డెక్కాడు. అత్తయ్య గుమ్మందాటి వచ్చింది. చేతిలో చేసంచీ వుంది. మా చేతికిస్తూ, “రెండు మొగలి పొత్తులున్నాయ్, అమ్మకి. అడుగున తోట వంకాయలున్నాయ్. అవి అన్నయ్యకి. కొతిమీర కారంతో బాగుంటాయని చెప్పండి…” ఆ నవ్వులో ఎంత ఆప్యాయత! వెదుళ్లపల్లి తీపి జ్ఞాపకాలలో యీ రెండు మాటలే మా అత్తయ్యవి. దయాపేక్షలకు మాటలక్కర్లేదని అర్థమైంది. బస్సు ఎక్కించి నవ్వుతూ వీడ్కోలు యిచ్చేవారు. ఆ ఆపేక్షలన్నీ యిప్పుడు కొండెక్కాయ్.

వెదుళ్లపల్లిలో యిప్పటికీ ఖాసిం పిండిమర వుంది. నూనె గానుగ కరెంటు మీద తిరుగుతూనే వుంది. జీడితోటల్లో పుష్కలంగా జీడిపప్పు పండుతూనే వుంది. ఎటొచ్చీ అన్నింటినీ సమీకరించి పకోడీలు వేయించే మావయ్యే కరవు. గుర్రాల మావయ్య మా జ్ఞాపకాలలో గొప్ప హీరో.

ఫలశ్రుతి: మా గుర్రాల మావయ్య గురించి చదివిన వారికి, విన్నవారికి శ్రేష్ఠమైన జీడిపప్పు పుడుతూనే వుంటుంది. తిన్నవారికి హాయిగా అరుగుతూనే వుంటుంది.

కొన్ని వివరణలు:

గ్రామకంఠం: గ్రామాన్ని ఆనుకుని వున్న వ్యవసాయ భూమి. దీన్ని సర్కారు వాళ్లు అవసరం వస్తే ఇంటి స్థలాలకు కేటాయించే వీలుంది. దీనికి పరిహారం చెల్లిస్తారుగాని తక్కువగా వుంటుంది. అందుకని గ్రామకంఠం మార్చి పంటభూమిగా చెప్పి దాచిపెడతారు.
గొలుసు: భూమి కొలిచేందుకు వాడే పరికరం. వంద లింకులు = ఒక గొలుసు.
క్రాస్‌స్టాఫ్: సూటిగా లేదా తిన్నగా రేఖని నిర్ధారించడానికి, కచ్చితమైన లంబరేఖని తేల్చడానికి యీ క్రాస్‌స్టాఫ్ వుపయోగపడుతుంది. చిన్న కొయ్య దిమ్మకి ప్లస్(+) ఆకారంలో సన్నని గాడి పెడతారు. దాన్ని సన్నని ఇనుపచువ్వకి బిగిస్తారు. మనిషి నిలబడితే సరిగ్గా కళ్లకి సూటిగా వుండే ఎత్తులో అమర్చి, వంకరటింకరలు లేకుండా గొలుసు లాగి కొలత సాగిస్తారు. సరిహద్దులు తేలుస్తారు.
కచ్చేరి సావిడి: పాతరోజుల్లో గ్రామాధికారుల (కరణం, మునసబు) కార్యాలయాన్ని కచ్చేరి సావిడి లేదా గ్రామ కచ్చేరి లేదా కచ్చేరి ఆఫీసు అని పిలిచేవారు.
-----------------------------------------------------------
రచన: శ్రీరమణ, 
ఈమాట సౌజన్యంతో

Monday, December 24, 2018

సింహం చెట్టు


సింహం చెట్టు
సాహితీమిత్రులారా!

ఈ కథను ఆస్వాదించండి.............
జైభారత్ సర్కస్ వూళ్లోకి వస్తోందని ఆనోటా యీనోటా విన్నాం. పిచ్చి ఆనందం! పిచ్చి వుత్సాహం! ఒక రోజు పొద్దున చద్దన్నాల రేవు కాగానే మొత్తం ముఠా ముఠా నిజానిజాలు తేల్చుకోడానికి వూరిమీద పడ్డాం. బాపట్ల మా తాతగారి వూరు. ఆ రోజుల్లో సంవత్సరానికి నాలుగు నెలలు బడిసెలవులుండేవి కదా! ఒక్క రోజు వృధా కాకుండా ఎక్కడెక్కడినించో అందరం వచ్చి వాలేవాళ్లం. కుడి ఎడమలుగా ఒకే సైజు మనవళ్ళం ఆరుగురం వుండేవాళ్లం. తాతగారి వూరు మాకు కొట్టిన పిండి. చెరిగిన చేట. ఇంకో నలుగురు పిల్లల్ని పోగేసుకుని బయలుదేరాం. మున్సిపల్ గ్రౌండ్స్‌లో రంగుల డేరా విచ్చుకుంటూ కనిపించింది. మా ఆనందానికి అవధులు లేవ్. డేరా దగ్గరికి చేరేసరికి మాది పదిమంది గుంపయింది. అక్కడ నేలలో పెద్దపెద్ద ఇనప శీలలు దిగ్గొడుతూ మోకులు బిగిస్తూ చాలామంది కనిపించారు. ‘ఒరే వీడేరా బఫూను, వీడు రింగుమాష్టరు, వీడు…’ అని కేకలేస్తూ కనిపించిన మమ్మల్ని తరిమేశారు. దాన్ని మేం చిన్నతనంగా ఏమాత్రం భావించలేదు. డేరా బయట ఒంటెల్ని చూశాం. పెద్ద వలలో వున్న కోతుల్ని పలకరించాం. ఎలుగుబంటి మీద మా వాడెవడో చిన్న రాయి విసిరాడు. అక్కణ్ణించి తరిమివేయబడ్డాం. దులిపేసుకుని బోనులో వున్న సింహాన్ని చూశాం. పులి, నీటిగుర్రం కూడా వున్నాయనీ అవింకా రాలేదనీ స్పష్టమైన సమాచారం సేకరించాం. రెక్కలు తెగిన పక్షిలా అక్కడో జీపు ఆగివుంది. ‘ఇదేరా జంపింగ్ జీప్!’ అని నలుగురొకేసారి అరిచేసరికి, అక్కడ నిద్ర పోతున్న పిల్లలు లేచి ఏడుపు లంకించుకున్నారు. ఈసారి ఆడవాళ్లు మళయాళంలో మమ్మల్ని కసురుకున్నారు.

ఓ పక్కన వంటలైపోతున్నాయ్. అంటించాల్సిన మైదా వుడుకుతోంది. మరో మూల గడ్డిమంట మీద డప్పులు వేడి పెడుతున్నారు. మా శీనుగాడు గుర్రం తోకలోంచి వెంట్రుక పీకే ప్రయత్నం చేశాడు. గుర్రం ఒక్కసారి తుళ్లిపడి భయంతో సకిలించింది. అంతే! మున్సిపల్ గ్రౌండ్స్ హద్దులు దాటేదాకా తరిమారు. బతుకు జీవుడా అని బయటపడ్డాం. ఇహ మాకు అవే కబుర్లు. ఎవడి అనుభవాలు వాడు తవ్వుతున్నాడు. బావిలో సైకిలు, మోటారు సైకిలు తొక్కే ఫీట్ వుందో లేదో తెలుసుకోలేకపోయాం. రాత్రిపూట డేరా లైటు ఆకాశంలోపడి తిరుగుతుందో లేదో కూడా తెలియలేదు. రెండు రాత్రిళ్లు మాకు అవే కలలు. పాపం! ఓ పిల్లాడు వుయ్యాల మీంచి వుయ్యాలకి మారుతూ గురి తప్పాడు. గ్యాలరీలోకొచ్చి నామీద పడ్డాడు. పెద్ద కేకతో లేచాను. ఇల్లంతా లేచింది. తలో మాటా అన్నారు. కాళ్లు కడిగించి, నీళ్లు తాగించి మళ్లీ పడుకోపెట్టారు.

మూడో రోజుకల్లా సర్కస్ ఆట మొదలైపోయింది. ఆ రోజు పొద్దుటే వూళ్లోకి వూరేగింపు వచ్చింది. ఒక ఏనుగు, దాని పక్కన గున్న ఏనుగు, నాలుగు ఒంటెలు, నాలుగు గుర్రాలు వూరేగింపులో పాల్గొన్నాయ్. డప్పులు, బ్యాండ్ మేళం దుమ్ము లేపుతున్నాయ్. ఇద్దరు మనుషులు వెదురు గడలమీద కరెంటు స్తంభం ఎత్తున పొడుగాటి చారల పైజమాలతో నడుస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జీప్ నిండా కోతులు కొలువు తీరి వున్నాయ్. నిదానంగా కోతుల జీపు వూరేగింపులో నడుస్తోంది. మైకుల్లో మధ్యమధ్య జైభారత్ సర్కస్ గురించి, వింతలూ విడ్డూరాల గురించి అరుస్తూ చెబుతున్నారు. గులాములు కొట్టుకుని బఫూన్ టోపీలు పెట్టుకున్న ఇద్దరు గడపోటు వేసుకుంటూ ఒంటె మీంచి గుర్రం మీదికి, అట్నించి ఏనుగు మీదికి జంప్‌లు చేస్తూ సందడి చేస్తున్నారు. వూరేగింపు బాపట్ల మెయిన్ రోడ్లన్నీ చుడుతోంది.

ఆ రోజునించే సర్కస్ మొదలు. రోజుకి రెండాటలు! మాకు గంగవెర్రులెత్తుతున్నాయ్. కుర్చీ, గ్యాలరీ రెండు తరగతులున్నాయ్. కుర్చీ టిక్కెట్ రూపాయ్, గ్యాలరీ అర్ధ రూపాయ్. పిల్లల హడావిడి చూసి, మా తాతగారు సర్కస్ టెంట్ల మీద బడిపెట్టారు. “మీకు తెలియదు, సర్కస్ డేరాకో నీతి నియమం వుంది. ఏది ఏమైనా, మిన్నొచ్చి మీదపడ్డా సర్కస్ ఒక్క రోజు కూడా ఆగడానికి లేదు. పొన్నూరులో సర్కస్ పది రోజులు ఆడుతుంది. అప్పుడే మన బాపట్లలో టెంట్ వేయడం మొదలవుతుంది. అవీయివీ ఒక్కొక్కటే రావడంతో ఇక్కడ ఆటలు మొదలవుతాయ్. పొన్నూరులో చివరి అయిదు రోజులు కొన్ని ఫీట్లుండవ్. అన్నీ పూర్తిగా రావడానికి అయిదు రోజులు టైమ్ పడుతుంది. మన బాపట్లలో పది రోజులు కాగానే డేరా ఒకటి చీరాలకు వెళ్తుంది. అందుకని సర్కస్‌కెప్పుడూ వారం గడిచాక వెళ్లాలి. ఆ కంపెనీవాడిదగ్గర రెండు డేరాలు సిద్ధంగా వుంటాయ్, తెలిసిందా?” అనగానే మా ప్రాణం లేచొచ్చింది. ఆ బడికి అంత త్వరగా గంట కొడతారని మేమెవ్వరం అనుకోలేదు.

ఇదిలా వుండగా, సర్కస్ జీపు మా వాకిట్లో వచ్చి ఆగింది. ఇద్దరు దిగి లోపలికి వచ్చారు. మా తాతగారి వాకిట్లో కనిపిస్తూ అయిదు కొబ్బరి చెట్లున్నాయ్. ‘ఒంటెల తిండికోసం కొబ్బరి మట్టలు ఇస్తారా, కొట్టుకు పోతాం?’ అని అడిగారు. వాటికిగాను ఆరు కుర్చీ టిక్కెట్ పాస్‌లు యిస్తామన్నారు. మా తాతగారు నాలుగు కుర్చీ, ఆరు గ్యాలరీ పాస్‌లయితేనే చెట్లెక్కమన్నారు. సరేనని చెట్లెక్కి మొవ్వాకు తప్ప మరో మట్ట లేకుండా చేశారు. మొత్తం ఒంటెల వీపుల మీద కట్టుకుని కదిలారు. అన్నప్రకారం పాస్‌లు ఎప్పుడైనా చెల్లే విధంగా యిచ్చారు. మా మనసులు కుదుటపడ్డాయ్. ఇక వెళ్లడం తరువాయి.

మేం రోజులు లెక్కపెట్టుకుంటూ ఎలాగో నాలుగురోజులు గడిపాం. ఆఖరికి నీటిగుర్రం కూడా పాత డేరా నించి వచ్చేసిందని తెలిశాక తాతగారు మమ్మల్ని వదిలారు. అసలు స్పెషల్ పాస్ వాళ్ళకక్కడ చాలా గౌరవం వుంటుందనుకున్నాం గాని అదేం లేదు. మున్సిపల్ వుద్యోగులు, కరెంటువాళ్లు, పోలీసులు, ఇంకా బోలెడుమంది ఫ్రీ పాస్‌లతో వస్తారట. అందుకని పాస్‌ల వాళ్లని అస్సలు ఖాతరు చెయ్యరు. ఏదైతేనేంగానీ మా కొబ్బరి మట్టల ముఠా సర్కస్‌ని యమాగా ఆనందించింది. ఆట వదిలాక రెండో ఆట కోసం డేరా మీద తిప్పే లైటుని పూర్తిగా గమనించాక ఇంటిదారి పట్టాం. దారి పొడుగునా సర్కస్ ముచ్చట్లు తనివితీరా చెప్పుకున్నాం. మా ముఠాలో ఒకరిద్దరికి సర్కస్ ఫీట్ల మీద కొన్ని డౌట్స్ వున్నాయ్. అందుకని మళ్లీ ఓసారి రావాలని అనుకున్నాం గాని కొబ్బరి మట్టలు ఎప్పటికి పెరిగేను? సర్కస్ మాట ఎట్లావున్నా, డేరాకెళ్లి ఏనుగు లద్దె తొక్కిరావాలని మాత్రం గట్టిగా అనుకున్నాం. దానివల్ల ఎంత బలమొస్తుందో చంద్రం చూసినట్టే చెప్పాడు.

ఉన్నట్టుండి సర్కస్ సింహం చచ్చిపోయిందనే వార్త బాపట్లంతా నిండిపోయింది. ఏ నోట విన్నా ఇదే మాట. ఆదుర్దాగా వెళ్లాం. నిజమే. సింహాన్ని లారీ మీదికి ఎక్కిస్తున్నారు. మున్సిపల్ గ్రౌండ్స్ జనంతో కిక్కిరిసిపోయింది. నిలబడే చోటు కూడా లేదు. మేం ఎలాగో బయటపడ్డాం.

మధ్యాన్నానికి సింహం శవయాత్ర మొదలైంది. లారీలో ఏటవాలుగా బల్ల బిగించి దాని మీద సింహాన్ని పడుకోపెట్టారు. పూలదండ వేశారు. సర్కస్‌లో వున్న ఆడ మగ పిల్లాజెల్లా లారీ వెంట నడిచారు. నీరసంగా బ్యాండ్ మేళం మోగుతోంది. పాపం, నిన్నగాక మొన్ననే కదా చూశాం! ప్రతి షోలో దానివంతు వచ్చినప్పుడు బోను చక్రాల మీద రింగులోకొస్తుంది. రింగ్ మాస్టర్ తలుపు తీసి బోనులోంచి సింహాన్ని దింపుతాడు. రింగ్‌మాస్టర్ తన మెడలో హంటర్‌ని తీసి ఝుళిపిస్తాడు. సింహం వులిక్కిపడుతుంది. పిల్లిలా అయిపోతుంది. రింగ్‌మాస్టర్ మెరిసే దుస్తుల్లో నల్ల కళ్లద్దాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాడు. సింహాన్ని రింగులో రెండుమూడుసార్లు నడిపించి ప్రేక్షకులకి ప్రదర్శిస్తాడు. తర్వాత సింహం ముందుకాళ్లు తన అరిచేతుల్లో పెట్టుకుని వెనక కాళ్లమీద నడిపిస్తాడు. మాస్టర్ జూలు మీద చెయ్యి వెయ్యగానే సింహం నోరంతా తెరిచి గర్జించేది. అప్పుడు టెంట్‌లో లైట్లారిపోతాయ్. సింహం మీద స్పాట్‌లైట్ పడుతుంది. తగినట్టు బ్యాండు మోగుతుంది. అంతా అయాక సింహాన్ని వొళ్లంతా నిమిరి ఓ కుందేలుని దాని నోటికి అందిస్తాడు. దాన్ని కరుచుకుని సింహం బుద్ధిగా బోనులోకెళ్లిపోయేది. ఇహ డేరా అయిదు నిముషాలు చప్పట్లతో యీలల్తో దద్దరిల్లిపోతుంది. ఇప్పుడా సింహం శవమై వూరేగుతోంది. దారుణం!

కొట్టాయం నించి సర్కస్ యజమాని నంబియార్ వచ్చి వాలాడు. అడ్డపంచె మీద సిల్కు చొక్కా, దాని మీద జారిజారిపోతున్న సిల్కు వుత్తరీయం, వేళ్లనిండా వుంగరాలు, సగం మొహాన్ని మింగేస్తున్న నల్లద్దాలతో లారీ వెనక నడుస్తున్నాదు. హంటర్ మెడలో వేసుకుని లారీలో సింహం పక్కన నిలబడి రింగ్‌మాస్టర్ తలవంచి అందరికీ అభివాదం చేస్తున్నాడు.

వూరివారు కూడా వూరేగింపు వెనక నడుస్తూ సింహం మాటలే మాట్లాడుకుంటున్నారు.

‘ప్చ్… ఎంతటి సింహమైనా ఆ కొర్రగింజంతా వున్నంత వరకే. అది కాస్తా పోయాక ఒఠి తోలుబొమ్మే!’

‘ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో… పాపం, ఆఖరి కళ్లం యిక్కడ రాసిపెట్టుంది…’

‘వేరే సర్కస్ కంపెనీ దగ్గర పదేళ్లనాడు కొన్నార్ట. వీటికి ట్రయినింగులు అందరూ యివ్వలేరుట. ఇచ్చిన వాటినే కొంటార్ట. ఏంటో, అదో ప్రపంచం!’

‘చూశారా, క్షణభంగురం! ఫస్ట్ షోలో కూడా నోరంతా తెరిచి గర్జించిందిట. రెండో ఆటకి బోను తెరిచేసరికి చచ్చిపడివుందిట. అనాయాస మరణం! అదృష్టం…’

దారి పొడుగునా షాపుల షట్టర్లు మూసేశారు. కొందరు లారీ ముందు కొబ్బరికాయలు కొట్టారు.

గడియార స్తంభం సెంటర్లో గానుగ వీరాస్వామి ఇద్దరి సాయంతో లారీ ఎక్కాడు. గులాం కొట్టుకుని సింహం పక్కన నిలబడ్డాడు. వెంటనే జిందాబాద్‌లు, వర్ధిల్లాలి నినాదాలు చెలరేగాయ్. వీరాస్వామి మున్సిపల్ వార్డు మెంబరు. సముద్రానికి వెళ్లే దారిలో రోడ్డు పక్క పోరంబోకులో సింహాన్ని గుంటపెట్టడానికి పర్మిషన్ యిప్పించింది ఈయనే కావడం వల్ల యీ జిందాబాదుళ్లు. చాలామందికి జరగనంత వైభవంగా సర్కస్ సింహం అంతిమ యాత్ర సాగింది.

టౌనుకు దూరంగా రోడ్డువార అనుకున్న చోట గొయ్యి సిద్ధంగా వుంది. వూరేగింపు అక్కడికి చేరింది. అందరూ కలిసి వుపాయంగా సింహాన్ని గోతిలోకి దింపారు. శ్రద్ధగా పడుకోబెట్టారు. సర్కస్‌వాళ్లు గోతి చుట్టూ నిలబడి ప్రభువు ప్రార్థన చేశారు. మళయాళంలో ఏమో మాటలన్నారు.

రింగ్‌మాస్టర్ మెడలో హంటర్ తీసి, పెద్ద ధ్వనితో ఝుళిపిస్తూ తను షోలో అరిచే అరుపు అరిచాడు. ఒక్కసారి… రెండుసార్లు… మూడుసార్లు… ఇక హంటర్ కిందపడేసి బావురుమన్నాడు. చేతుల్లో మొహం కప్పుకుని నా రాజు చచ్చిపోయాడంటూ గోలగోలగా ఏడ్చాడు. అంతా రింగ్‌మాస్టర్‌ని ఓదార్చారు. యజమాని నంబియార్‌తో మొదటి పిడికెడు మట్టి వేయించారు.

ఆ రోజు సర్కస్ డేరా ఆటలు లేక నిలిచిపోయింది. మొదటిసారి సర్కస్ డేరా ఆగింది!

సింహం పని చివరిదాకా చూసి, మేం ఇంటికి చేరాం. తాతగారు మాకోసం బయట గేట్లో కాపు కాస్తున్నారు. “నాకేం చెప్పద్దు. పదండి…” అంటూ బావి గట్టుకు తోలుకుపోయి లాగుచొక్కాలమీదే నీళ్లు తోడించి పోయించారు. ఏవిఁటో పరమ చాదస్తం!

తర్వాత ఏ సెలవలకు వచ్చినా సింహాన్ని గుర్తుచేసుకుంటూ ఆ వైపు వెళ్లొస్తుండేవాళ్లం. వూరివాళ్లక్కూడా అది బాగా గుర్తే. కొన్నాళ్లకి ఆ దిబ్బ మీద ఏదో అడవి మొక్క పడి మొలిచింది. మొక్క మానుకట్టింది. అది మొక్కగా వున్నపుడు దాని ఆకుల్ని, చిగుళ్లని మేకలు కూడా ముట్టుకునేవి కావుట! ‘భయం. అడుగున సింహం వుంది కదా!’ అనుకునేవారు. కొంచం పెరిగి పెద్దయాక దానికో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు దాన్నందరూ ‘సింహం చెట్టు’ అని పిలుస్తారు.
-----------------------------------------------------------
రచన: శ్రీరమణ, 
ఈమాట సౌజన్యంతో

Sunday, December 23, 2018

జీవితానందం ఎక్కడున్నది?


జీవితానందం ఎక్కడున్నది?
సాహితీమిత్రులారా!

స్వగతం అనే శీర్షికలోని ఈ అంశం చూడండి...........

జీవితానందం ఎక్కడున్నది? ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మాత్రం వీలయినంత లేనితనంలో ఉందనిపిస్తుంది. ప్రతి పుస్తకం, ప్రతి కలం అతి బరువుగా తోస్తుంది. మరి పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, కాగితాలు అనే మాటలు బహువచనాలుగా ఇంకా ఇంకా బెంబేలెత్తిస్తున్నాయి. ఒకప్పటి నా కల మహా అయితే రెండు జతల బట్టలు ఒక లుంగీ. నిజానికి ఒక చొక్కా లుంగీ మీదే జీవితాన్ని లాగించేయవచ్చు. ఇవాళ బీరువా నిండా దరిద్రం నింపుకున్నంతగా జతలు జతలు నింపుకున్నానెందుకో? ఎందువెనుక పరిగెత్తుకుంటూ పడి ఇన్నిన్ని పుస్తకాల చెత్త కొన్నానో నాకు అర్థం అవ్వడంలేదు. గంటల తరబడి నెట్‌కు అతుక్కుపోయి ఎక్కడెక్కడి పుస్తకాల కోసం ఎక్కడెక్కడికి పరిగెత్తి కొన్నానో! ఎంతెంత డబ్బు అప్పులు చేసి కొన్నానో! చిన్న బొమ్మ నచ్చి, పుస్తకం కవర్ నచ్చి, పేజీలు రెపరెపలాడిస్తే సూటిగా తగిలిన వాక్యం నచ్చి… కట్టలుకట్టలుగా కొన్న పుస్తకాలు, బుర్రకంతా ఎక్కించుకున్న ఎంగిలి తెలివితేటల్ని దేవి దేవి కక్కెయ్యబుద్ధిగా ఉన్నది. కట్ట కట్టి అవే పుస్తకాలను ఇప్పుడు ఎక్కడికయినా కంటికి కానరానంత దూరం పంపించేద్దామని, కాకపోతే కొరివి పెట్టి నిప్పులో రగిలెయ్య కోరుతుంది మనసు. అపుడు ఒక దాని కోసం ఆరాటపడ్డం దేనికని? అది దొరికాక ఇపుడు దాన్ని వదిలించుకుందామని ఏవిటీ? ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు, ఎందుకు వలచేవొ ఎందుకు వగచేవొ ఎందుకు రగిలేవొ ఏమై మిగిలేవో’ అని ఈ ఇంత మాయ ఎప్పుడూ ఎందుకు కమ్మేసుకుంటుంది?

వీలయినంత ఖాళీగా ఉంటే ఎంత బావుంటుంది. ఇల్లు కాని, వళ్ళు కాని, మనసు కానీ… నేను ప్రతిసారీ కొత్తగా ఉంటే ఎంత బావుంటుంది? తెలిసిన ప్రతి ఒక్కరిని తెలీక కొత్తగా చూస్తుంటే ఎంత బావుంటుంది? అసలు ఎవరినీ చూడక తలదించుకుని రస్తా కొలుచుకుంటూ అలా వెళ్ళవలసిన చోటికి ఖాళీగా వెళ్ళిపోయి ఖాళీగా మరలి తిరిగి మధ్యలో తప్పనిసరిగా ఎవరైనా పలకరిస్తే, పలకరించిన ప్రతి మనిషిని ప్రతిసారి కొత్త ఏంజల్‌ని అప్పుడే కలిసినట్లు! మిమ్మలనే ఇంతకాలంగా వెతుకుతూ వస్తున్నా! ఎక్కడున్నారు ఇన్నాళ్ళు? అని చూపులతో ప్రతిసారి ప్రతి పాతమనిషిని కొత్తగా పరిచయం చేసుకుని మరిచిపోయి మళ్ళీ పరిచయం చేసుకుని మళ్ళీ మరిచిపోయి మళ్ళీ ఖాళీగా అచ్చం అప్పుడే పుట్టిన కొత్త శిశువులా…

జీవితానందం ఎక్కడున్నది? ఎప్పుడూ ఏ క్షణం అయినా బొమ్మల్లో ఉందనిపిస్తుంది. ఎంత బావుంటుంది బొమ్మ తాలుకు శ్రమ! తొందర తొందర అస్సలు బావోదు. తొందర రతికి మల్లే. గీసిన గీతలపై మరో గీత తాకీ తాకనంత సుతారంగా పరుచుకుంటూ. బొమ్మని తనలా పదే పదే చూసుకుంటూ, రంగుపై మరో రంగు మచ్చ అద్ది దాని రిఫ్లెక్షన్ కంటిపాపలో నింపుకుని తెగ ఆనందపడిపోయి. బొమ్మ పూర్తయ్యాకా ఎంత మహాశాంతిగా ఉంటుందో! ఇక చాలు ఇప్పటికిప్పుడు చచ్చిపోయి మళ్ళీ మరో బొమ్మ గీయడానికి లేవకుండా ప్రశాంతపు నిద్ర. ఎంత బావుంటుంది కదా! అలా లేదనుకో ఏమవుతుంది? బొమ్మలపై బొమ్మలుగా రచన సాగుతూనే ఉంటుంది. ఎవరో రావాలని, నన్నూ నా బొమ్మలనూ చూడాలని, ఆపై నన్నూ బొమ్మలనూ తన చెరో భుజానికి హత్తుకోవాలని ఉంటుంది. ‘మళ్ళీ బొమ్మ ఎపుడు గీస్తావు? నీ బొమ్మ చూడ్డం కోసం కాదు, నిన్ను హత్తుకోడానికైనా నాకో కారణం కావా’లని ఎవరైనా పిచ్చ ప్రేమగా అడగాలని ఉంటుంది. ఎంత కాలం అద్దం నాతో ఈ మాట అంటుంది? వట్టి గాజు తళకు లోకమా ప్రపంచంలో రక్త మాంసమంతా ఏవయ్యింది? ప్రతిసారి ఇంతేనా? సరేలే! ఇట్స్ ఒకే! ఐ విల్ లవ్ మి ఎనఫ్ ఫర్ ది బోత్ ఆఫ్ అజ్. అని చెప్పుకుంటూ అలానే ఉండి పోవాలా? ఇట్స్ నాట్ ఓకేబ్బా!

ఒకసారి మదరాసులో బాపుగారి ఇంట్లో ఆయన కలిసీ కలవగానే కొత్త బొమ్మలు ఏఁవేశారు? ఏవి చూపించండి? అని అడిగారు. అవి చూసి మురిసి ‘ఓయ్ వెంకట్రావ్ ఇలా రావయ్యా అన్వర్ బొమ్మలు చూడు ఎంత బావున్నాయో!’ అని ఆయనకు చూపించి ఆపై ‘ఏవండి, ఈ దగ్గరే మా గురువుగారు గోపులుగారి ఇల్లు. ఆయన్ని వెళ్ళి కలవండి ఈ బొమ్మలు చూపించండి చాలా సంతోషపడతా’రని అన్నారు. నాకు బాగా గుర్తున్నది, అది నాకు జ్ణానోదయం కలిగిన క్షణం. ఏవిటి ఈ చూపించడాలు? వారు మెచ్చుకోడాలు! ఆపై ఏం జరుగుతుంది? ఫలానా వారు మెచ్చుకున్న చిత్రకారుడిగా ఒక మూర్ఛబిళ్ళ ధరించి ఊరేగడం. ఛీ! నా మీద నాకు ఎంత అసహ్యం కలిగిందో, ఈ అడుక్కుతిని తిరిగే బ్రతుక్కు విముక్తి లేదా? ఏం పొందుదామని నా బొమ్మని ఇంటింటికీ మనిషి మనిషి దగ్గరకీ కోతిలా తిప్పి చూపించి? కుంచెని గారడీకర్రలా ధరించి విన్యాసాల పిల్లిమొగ్గలు వేయిస్తే? థూ! ఏం అసహ్యం ఈ జన్మ! ఎంత కంపరంగా అనిపించిందో ఆ వేళ నుండి నాపై నాకు. నా మట్టుకు నాకు ఎంత బావుంటుంది బొమ్మలు చూడ్డం! ఎంత బావుంటుంది వెండ్లిగ్ బొమ్మలు చూడ్డం. టొప్పి బొమ్మలు చూడ్డం, బట్టాగ్లియా బొమ్మలు చూడ్డం, విక్టర్ ఆంబ్రూస్ బొమ్మలు చూడ్డం, మనెల్లి బొమ్మలు చూడ్డం, బ్రయన్ హేడల్ బొమ్మలు, ఆస్టిన్ బ్రిగ్స్ బొమ్మలు, పింటర్ బొమ్మలు, తోమర్ హనుకా బొమ్మలు, జాన్ క్యూనో బొమ్మలు, నా ఈ వందలాది ప్రియతముల బొమ్మలు చూడ్డం, మళ్ళీ మళ్ళీ పదే పదే చూడ్డం, ఆ మంత్రజాలంలో మునకలెయ్యడం. మైమరచిపోడం… అలా నాకులాగే విపరీతంగా బొమ్మల్ని ప్రేమించే వారెవరైనా నేనెవరో తెలీక నా బొమ్మ తెలిసి లేదా నేనూ నా బొమ్మ తెలిసీ నన్ను మరింత ప్రేమించి నా పనిని ముద్దించి మురిపం చూపి నా కోసం నా బొమ్మ కోసం ద్వారం దగ్గర నిల్చి వెళ్ళబోతూ ‘మళ్ళీ బొమ్మ ఎపుడు గీస్తావు? నీ బొమ్మ చూడ్డం కోసం కాదు, నిన్ను హత్తుకోడానికి రావాలి కదా మళ్ళీ మళ్ళీ’ అనే ఒక అద్దం కాని కోసం…

జీవితానందం ఎక్కడున్నదో తెలుసా? అంతటిని వదలడంలో ఉన్నది, దేనిని పోందకపోవడంలో ఉన్నది. అందడం పొందడం అనే స్పృహ అసలు లేకపోవడంలో ఉన్నది. దేని లెక్కలోను లేకపోవడంలో ఉన్నది. చూసిందంతా ఒక కలలా దిగ్గున మళ్ళీ మళ్ళీ లేచి కూచోడంలో ఉన్నది. పొందడం ఏనాడూ ఆనందం కాదు. అది ఏనాటికయినా వెళ్ళిపోయేదేననే కొత్త ఆలోచన ఇచ్చే భయం. ఖోనేవాలేహీ పానేవాలే హోతేహై సూత్రాన్ని కూడా కాదని దేనిని ఎవరిని ఆశించకపోవడంలో ఉన్నది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒక ఊహ ఉదయిస్తుంది. ప్రతి ఉదయం ఆ ఊహ తను ఒక పిట్ట రూపు ధరించి నా మంచం కోడుపై వాలి ఇలా పాడుతుంది: టుడేస్ సాడ్‌నెస్ హాజ్ బీన్ కాన్సల్‌డ్!
---------------------------------------------------------
రచన: అన్వర్, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 22, 2018

పద్యం అంటే సుముఖత ఎందుకు?


పద్యం అంటే సుముఖత ఎందుకు?
సాహితీమిత్రులారా!

పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!

సాధారణంగా పద్యాభిమానులందరూ పద్య ప్రత్యేకత గురించి ప్రస్తావించే అంశాలు కొన్ని ఉన్నాయి.

ఒకటి, “ధార, ఊపు, లయ, పదాల పొందిక”. వీటిలో పదాల పొందిక వచన కవితకైనా ఉండాల్సిన లక్షణమే. పద్యానికున్న ప్రత్యేకత కాదు. ఇక మిగిలినవి ధార, ఊపు, లయ. ఇవి మూడూ పద్యం తాలూకు నడకకు సంబంధించిన లక్షణాలు. కాబట్టి పద్యానికుండే విలక్షణమైన నడక దానికుండే ఒకానొక విశిష్టత అని భావించ వచ్చు. అయితే, ఈ ప్రత్యేక లక్షణానికున్న ప్రయోజనం ఏమిటి, అది ఈ కాలానికికూడా వర్తిస్తుందా అని ప్రశ్నించుకోవడం అవసరం. ఎందుకంటే, “పద్యానికున్న ధార, ఊపు, లయ మూలంగా నాకు అదంటే ఇష్టం. మీరు దాన్ని ఆస్వాదించలేకపోతే అది మీ ఖర్మం” అని ఊరుకుంటే, పద్య విముఖులకూ ద్వేషులకూ సరైన సమాధానం చెప్పినట్టు అవ్వదు. ఆ వాదం తర్కానికి లొంగదు. పద్యానికున్న ప్రత్యేకమైన నడక ఒక అవ్యక్తమైన శబ్దసౌందర్యాన్ని కలిగి ఉంటుందన్నది వాస్తవం. కానీ, కవిత్వానికి శబ్దంకన్నా అర్థం, అర్థం కన్నా భావం ప్రధానమైనదనే ఆధునికులు ఈ శబ్దసౌందర్యాన్ని పట్టించుకోనక్కరలేదంటారు. పైగా శబ్దాలంకారాలకన్నా, అర్థాలంకారాలే ఉత్తమమైనవని చాటిచెప్పిన ఆలంకారికుల మాటలను వెదికి తెచ్చి, ఆ శబ్దసౌందర్యాన్ని గర్హిస్తారు కూడా! దీనికి సమాధానం?

పద్యప్రియులు ధీమాగా చెప్పుకునే మరో మాట, “సామాన్య ప్రజల్లో ఇంకా పద్యానికి ఆదరణ ఉంది”. ఏ ధైర్యంతో, ఆధారంతో ఈ మాట అంటారో నాకైతే తెలీదు. ఇప్పుడు వస్తున్న పత్రికలన్నీ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నవని వీరు ఒప్పుకుంటారనే అనుకుంటాను. అలాంటి పత్రికలు పద్యాన్ని చిన్నచూపు చూస్తున్నాయని వీళ్ళే వాపోతారు. ప్రజాదరణ ఉన్న ప్రక్రియను పత్రికలు (అందునా సర్క్యులేషనే ప్రధానమైన ఈ రోజుల్లో) నిరాదరించడమా! ఆశ్చర్యంగా లేదూ! కాబట్టి సామాన్య ప్రజల్లో పద్యానికి ఆదరణ ఉందన్న విషయం అంత నమ్మశక్యంగా లేదు. ఏ కొద్దిమంది సామాన్య ప్రజల్లోనో ఆదరణ ఉంది అనుకున్నా, దాని వెనుకనున్న కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. మా ఆఫీసులో ఒక తమిళ మిత్రుడున్నాడు. అతనికి తెలుగు తెలీదు. తెలుగు ఛందస్సుగూర్చి అసలే తెలీదు. ఐతే తమిళంలో కూడా వాళ్ళకి ఛందస్సు ఉంది. దానిగూర్చి చూచాయగా తెలుసు, దానికి బోలెడన్ని నియమాలుంటాయనీ, అందులో పద్యాలు రాయడం చాలా కష్టం అనిన్నీ. నేను తెలుగులో పద్యాలు రాస్తానని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏవో ఒకటి రెండు వినిపించమన్నాడు. నీకు తెలుగు తెలీదు కదా అంటే, ఇంగ్లీషులో దాని అర్థం చెప్పు చాలన్నాడు. తెలుగు పద్యాలని వినలేదు. అర్థం తెలుసుకుని, ఒహో ఇంత చక్కని భావాన్ని అంత కష్టమైన పద్యాలలో రాయగలిగావా అని మెచ్చుకున్నాడు, ఆనందించాడు. పద్యమంటే కాస్తో కూస్తో అభిమానమున్న సామాన్య తెలుగు ప్రజలు కూడా, చాలమంది ఈ కోవకి చెందిన వాళ్ళే. మా పల్లెటూళ్ళో మరొక వ్యక్తి ఉన్నాడు. కృష్ణరాయబారం పద్యాలు గొంతెత్తి పరవశించి పాడతాడు. “ఎల్లి రణంబె గూర్చెదవొ” అంటే అర్థమేమిటో తెలుసా అని అడిగాను. “ఏవుంది. ఎళ్ళి, అంటే వెళ్ళి, యుద్ధం చేస్తావా అని” అని టక్కున జవాబిచ్చాడు. పద్యమంటే అభిమానమున్న సామాన్య తెలుగు ప్రజలలో వీరు మరో రకం. సరే పద్యాన్ని ఒక పురావస్తు విశేషంగా, సాలార్జంగు మ్యూజియంలోని గడియారాన్ని చూసినంత ఆసక్తితో చూసేవారూ, లేదా మోడువోయిన మన ప్రాచీనసంప్రదాయ వృక్షానికి ఇంకా అతుక్కు వేళ్ళాడుతున్న ఒక పండుటాకులా ఆదరించే వారూ చాలా మందే ఉన్నారు. పద్యం రాయడం వచ్చిన వాళ్ళ గురించి కానీ, సాహిత్యంతో పరిచయమున్న వాళ్ళగురించి కానీ ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. నేను వాళ్ళను “సామాన్య ప్రజ”ల కోవలోకి చేర్చను. ఇంతకీ చెప్పొచ్చే విషయమేమిటంటే, నాకున్న ఎరికలో, పద్యమంటే ఆసక్తి ఆదరణ ఉన్న సామాన్య ప్రజలలో కవిత్వ వాహికగా దానికి గుర్తింపులేదు.

పద్య కవిత్వానికి ఆదరణ తగ్గిందనేది కాదనలేని నిజం. అసలు కవిత్వానికే ఆదరణ తగ్గిన ఈ రోజుల్లో పద్య కవిత్వానికి ఆదరణ తగ్గడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఐతే, పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి గల కారణాలు సహేతుకంగా పరిశీలిస్తే, పద్యానికీ, పద్యకవిత్వానికీ ఉన్న ప్రత్యేకత కొంత తెలుసుకోవచ్చు. పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి ప్రధానంగా నాలుగు కారణాలు నాకు కనిపిస్తున్నాయి.

ఒకటి, శ్రవ్యప్రధానంగా ఉండిన కవిత్వం, కాలప్రభావాన, పాఠ్యప్రధానంగా మారడం. ఆంధ్రసారస్వతపు తొలినాళ్ళనుండీ మొన్న మొన్నటి బ్రిటిష్ పాలనా కాలం వరకూ, కవిత్వ ప్రచారం ఎక్కువగా “ముఖే ముఖే” అన్న రీతిలోనే సాగిందన్నది చారిత్రక సత్యం. బ్రిటిషువారి వద్దనుండి అచ్చుయంత్రం దిగుమతి అయిన తరువాతే ప్రచురణమార్గంలో కవిత్వ ప్రచారం మొదలయ్యింది. పద్య విముఖత సరిగ్గా అప్పుడే మొదలయ్యింది. పద్యం గొంతెత్తి హాయిగా పాడుకోవలసింది. నేటి ఆధునిక వచన కవిత మౌనంగా మనసులో చదువుకోవలసింది. పద్యానికి ఉండే ప్రత్యేకమైన నడకవల్ల, వినసొంపుగా ఉండడమే కాకుండా సుళువుగా జ్ఞాపకం పెట్టుకోడానికి వీలు కలుగుతుంది. ఈ రెండు ప్రత్యేకతలూ పద్య ప్రాచుర్యానికి ఎంతో దోహదపడ్డాయి. ఎప్పుడైతే కవిత్వం పాఠ్యప్రధానమైందో, ఈ గుణాలు తమ ఆవశ్యకతని కోల్పోయాయి. అందువల్ల పద్యం తాలూకు అవసరం తగ్గిపోయింది.
ఇక రెండవ కారణం-సమకాలీన సామాజిక స్పృహ ఉన్నప్పుడే అది కవిత్వం అనీ, అది ఉంటే చాలు కవిత్వమే అనీ ఒక విచిత్ర సిద్ధాంతం బయలుదేరి సాహిత్యప్రపంచమంతటా వ్యాపించడం. “కష్టజీవికి అటూ, ఇటూ ఉన్నవాడు కవి” అన్న ఒక గొప్ప కవి చేసిన ఉక్తివైచిత్రిని పట్టుకొని వేదోక్తిగా భావించిన మామూలు కవులూ, ఇతరులూ సృష్టించిన పరిస్థితి ఇది. ఎప్పుడైతే ఈ వాదం ప్రబలిపోయిందో ప్రాచీన కవిత్వమంతా (ఒక వేమన, మరొక బద్దెన రాసింది తప్పించి) కవిత్వం కాకుండా పోయింది. ఆ కవిత్వమంతా ప్రధానంగా పద్య కవిత్వమాయె, అంచేత ఆ దెబ్బ పద్యానికి కూడా తగిలింది. ఈ వాదం వల్లనే వచ్చిన మరో ప్రమాదం, కవిత్వానికి వస్తువే సర్వస్వం అన్న అర్థంలేని సిద్ధాంతం. పద్యానికి ఒక నిర్దిష్టమైన రూపముంది. వచన కవితకి ఇది అవసరం లేదు (అని ఈ సైద్ధాంతికుల నమ్మకం). ఇది కూడా పద్య విముఖతకి రాచబాట వేసింది.

పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి మూడవ కారణం వ్యావహారిక భాషావాదం. కవిత్వమంతా సామాన్య ప్రజలు మాట్లాడుకొనే భాషలోనే ఉండాలి, నిరక్షరకుక్షికి సైతం అర్థం కావాలి అన్న వాదం. నిజానికి ఈ వ్యావహారికభాషా వాదం మొదలయ్యింది కవిత్వేతర సాహిత్య ప్రక్రియల (కథ, వ్యాసం మొదలైనవి) గురించి. ఎప్పుడు వచ్చిందోకానీ, చాపకింద నీరులా వచ్చి అది కవిత్వాన్ని కూడా ఆక్రమించింది. కవిత్వేతర ప్రక్రియలకు సంబంధించి ఇది కొంతవరకు సమంజసమైన వాదమే. వచ్చిన చిక్కల్లా దాన్ని కవిత్వానికి కూడా వర్తింపచెయ్యడమే! పోనీ ఆ రాసే పద్యాలేవో వ్యావహారిక భాషలోనే రాస్తే పోలే అని కొందరంటారు. పద్యానికి అవసరమైన ధార, నడక కావాలంటే, సంధులు సమాసాలూ అవసరం. వ్యావహారిక భాష కొంత ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అసలు సంధులూ సమాసాల ముఖ్యోద్దేశం, వాక్యాలకు ఒక పారే గుణాన్ని కల్పించడమే. అందువల్ల అవి పద్యానికి ఎంతైనా అవసరం. వ్యావహారిక భాషలో అవి అంతగా ఉండవాయె! మరి వ్యావహారిక భాషలో పద్యం రాయడం ఎలా కుదురుతుంది? కుదిరితే దానికున్న సహజసౌందర్యం ఎక్కడనుండి వస్తుంది? కరుణశ్రీ, జాషువా మొదలైన ఆధునిక పద్య కవులు కూడా, పూర్తి వ్యావహారిక భాషలో పద్యాలు రాయలేదు. వారి పద్యాలలో విరివిగా సంధులూ సమాసాలూ కనబడతాయి. అలాగే పర్యాయపదాలు కూడా. అంచేత పూర్తి వ్యావహారిక భాషలో (అవసరమైతే వ్యాకరణాన్ని కూడా కాలదన్ని) పద్యాలు రాయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు.

ఇక నాల్గవ కారణం కావ్య ప్రక్రియకి ఆదరణ తగ్గి కవితలకీ, మినీ కవితలకీ ఆదరణ పెరగడం. బహుశా జీవనగమనంలో పెరిగిన వేగం కారణంగా కావ్యాన్ని రాయడానికి కానీ చదవడానికి కానీ తీరిక దొరక్క ఆ ప్రక్రియకి ఆదరణ తగ్గింది. కావ్యానికి కథాగమనం, పాత్ర పోషణ, వివిధ వర్ణనలు, రస పోషణ వంటివి చాలా అవసరం. దీనికి పద్యాలు అనువైనవి. కవితలకి, మినీ కవితలకి ఇంత అవసరంలేదు. కావలసిందల్లా ఒక భావాన్ని సూటిగా పాఠకుడి గుండెల్లో నాటుకునేలా చెయ్యడం. వచనం చెఅసినంతగా ఈ పని పద్యం చెయ్యలేదు. కాబట్టి సహజంగా పద్య కవిత్వానికి ఆదరణ తగ్గింది.

పైన చెప్పిన కారణాలలో ఒకటీ నాలుగూ కాలానుగుణంగా వచ్చిన సహజ పరిణామాలు. వీటిని కాదనలేం, అనకూడదు కూడా. వచ్చిన చిక్కల్లా రెండు, మూడు కారణాల వల్లనే. ఇవి సృష్టించిన గందరగోళ పరిస్థితి నుండి సాహిత్యం, అందునా కవిత్వం, ఎప్పుడు బయట పడుతుందో అప్పుడు మళ్ళీ పద్యమంటే సుముఖత ఏర్పడడానికి అవకాశం వస్తుంది. మరి పద్య కవులు ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదా అంటే, ఉంది. వస్తువుతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషా కాదా అన్న తేడా లేకుండా, చక్కని చిక్కని కవిత్వాన్ని, పద్య రూపంలో, దాని సహజసౌందర్యం చెడకుండా అందించగలిగితే, రావలసిన మార్పుకి దోహదం చేసిన వాళ్ళవుతారు. పద్య కవులమనుకొనేవారు తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త – పద్యానికీ, పద్య కవిత్వానికి ఉన్న తేడా తెలిసికొని, తాము రాస్తున్నది ఏ కోవకి చెందుతుందో నిగ్గుతేల్చుకోవడం.
-----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, December 21, 2018

పై గదిలో ప్రేమికుడు


పై గదిలో ప్రేమికుడు
సాహితీమిత్రులారా!

ఈ అనువాద కథను ఆస్వాదించండి....................

శ్రీదేవి చిర్రెత్తిపోవడం మూడంచెల్లో జరిగింది. తను రాసుకుంటున్న పాటలో లీనమై వుండడం వల్ల ఆమెకి ఆ చప్పుడు ముందు లీలగా వినిపించింది. విని కొంచెం చిరాకు లాంటిది కలిగింది. కొంచెం సేపటి తర్వాత తన ఏకాగ్రతకి భంగం కలిగేసరికి కోపం మొదలైంది. ఇంకొంచెం సేపటి తర్వాత ఆ చప్పుడు తాను రాస్తూ పాడుకొంటున్న పాటని వెక్కిరిస్తున్నట్టనిపించి అవమానంలోకి దారి తీసింది.

పై గదిలో వుండే వెధవన్నర వెధవకి తాను వయోలీన్ మీద వాయిస్తున్న పాట నచ్చక అలా బూట్లతో తప్పుడు తాళం వేస్తూ గొడవ పెడుతున్నాడన్నమాట. కోపంతో పళ్ళు పట పటా కొరికి లేచింది శ్రీదేవి. వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేది లేదు. ఆవేశంతో ఆమె చెంపలు ఎర్రబడ్డాయి, కళ్ళు నిప్పులు కక్కాయి. తన గదిలోంచి బయటికి వచ్చి మెట్లెక్కింది. ఆ క్షణంలో ఆమెని చూసిన వారెవ్వరైనా, ఆ పై గదిలో వున్న అమాయకుడి మీద జాలి పడక మానరు. తన మీదికి రాబోతున్న సుడిగాలి గురించి తెలియదు పాపం, అని నిట్టూర్చక మానరు! శ్రీదేవి తలుపు గట్టిగా తట్టింది.

“యస్! కమిన్,” లోపల్నుండి కొంచెం ప్రసన్నంగా మగ గొంతు వినిపించింది. గొంతు ఎంత బాగుండీ ఏం లాభం, మనిషి సంగీతాన్ని అవమానించే మూర్ఖుడికి!

శ్రీదేవి లోపలికి అడుగేసింది. లోపల ఒక చిన్న గది, ఒక పెయింటరు తన కోసం తయారు చేసుకున్న స్టూడియోలా వుంది. గది శుభ్రంగానే వున్నా నిరాడంబరంగా వుంది. గది మధ్యలో బొమ్మలేసుకోవడానికి కాన్వాస్ బిగించిన ఈసెల్ వుంది. ఈసెల్ పైనుంచి సిగరెట్టు పొగ తేలుతోంది. ఈసెల్ కింది నించి జీన్స్ పేంట్ కాళ్ళు కనిపిస్తున్నాయి. బూట్లు తొడుక్కున్న ఆ కాళ్ళు నిరంతరంగా నేల మీద రకరకాలుగా తాళం వేస్తూనే వున్నాయి.

“ఒక్క క్షణం ఇటు చూస్తారా?” శ్రీదేవి మర్యాదగానే అడిగింది.

“వొద్దండీ! ఇప్పుడు నాకే మోడల్స్ తోనూ పని లేదు.” ఈసెల్ వెనకనించి ఆ మూర్ఖుడి గొంతు వినొచ్చింది. “మీ అడ్రసు అక్కడ ఆ కాగితం మీద రాసి పెట్టి వెళ్ళండి, అవసరం అయితే నేనే కబురు చేస్తాను.”

“నేను మోడల్‌ని కాను!” శ్రీదేవి కఠినంగా అంది.

ఆ మాటతో ఆ గొంతు తాలూకు మొహం ఈసెల్ వెనకనించి బయటికొచ్చింది. నోట్లో వున్న సిగరెట్టుని యాష్ ట్రేలో పెట్టి కుర్చీలోంచి లేచాడు.

“అలాగా? ముందిలా కూర్చొండి. ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు?” మర్యాదగా అన్నాడు.

దేవుడు ఎంత అపాత్ర దానం చేస్తాడో కొన్నిసార్లు! ఆ దౌర్భాగ్యుడి గొంతే కాదు, మొహం కూడా బాగానే వుంది. అన్నిటికంటే అడ్డదిడ్డంగా వున్న ఆ వొత్తైన జుట్టు, అనుకుంది శ్రీదేవి. కోపంగా వున్నా నిజాలు ఒప్పుకుంటూంది మరి!

“మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి. మీకు నా పాట నచ్చినట్టు లేదు.” కోపాన్నీ, మర్యాదనీ, వెటకారాన్ని సమపాళ్ళలో మేళవించి అంది. ఆమె వెటకారం అతనికేమీ అర్థమయినట్టు లేదు. అయోమయంగా చూశాడు. ఇహ ఇతనితో సూటిగా చెప్పాల్సిందే!

“నేను కింద పోర్షన్లో అద్దెకుంటాను. బహుశ నా పాటా, నా వయోలీన్ నచ్చక కాబోలు బూట్లతో తాళం వేస్తూ గొడవ చేస్తున్నారు!”

“అదేం లేదే! మీ పాట బాగానే వుంది.” ఇంకా అయోమయంగానే అన్నాడు.

“మరయితే ఆ బూట్లతో నేల మీద చప్పుడు చేస్తారెందుకు? చాలా చిరాగ్గా వుంది!”

శ్రీదేవి కోపంగా అని వెళ్ళడానికి వెనుదిరిగింది. మళ్ళీ ఆగి, “పైగా మీరలా బూట్లతో తడుతూ వుంటే నా నెత్తిన కప్పు కూలుతుందేమోననే భయం కూడా! వస్తా!” అంటూ వెళ్ళబోయింది. అప్పటికి ఆ అందగాడు తేరుకున్నాడు.

“ఆగండాగండి! అప్పుడే వెళ్ళకండి.”

ఆగి అతని వైపు చూసింది. స్నేహంగా, అందంగా చిరునవ్వు నవ్వుతున్నాడు. “మీరెందుకో కోపంగా వున్నారు. నిజానికి నాకు సంగీతమంటే చాలా ఇష్టం. కానీ, మీరు పాడే పాట ఏదో నాకు తెలియలేదు. ఊరికే వాయిస్తున్నారనుకొన్నాను. ఏదో ఆలోచనలో యధాలాపంగా బూట్లతో నేలను తడుతున్నాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు.”

“ఒక కొత్త పాటకి వరస కడుతున్నాను. ఇంకా సరిగ్గా రావటం లేదు,” ముక్తసరిగా అన్నా, ఆమె గొంతులో కోపం తగ్గింది.

“అమ్మో! మీరు పాటలకి వరసలు కడతారా?”

“ఒకటి రెండు పాటలు రాసి వరసలు కట్టాను!”

“యెంత అదృష్టవంతులో! నాకు అసలు అలా కళల్లో ప్రవేశం వున్నవాళ్ళంటే చాలా గౌరవం.”

“మీరు కూడా కళాకారుడిలానే వున్నారే. ఏదో పెయింట్ చేస్తున్నట్టున్నారు?”

చిరునవ్వుతోనే తల అడ్డంగా తిప్పాడతను. “నా బొంద! ఈ పెయింటింగు మానేసి గోడలకి సున్నం వేసుకోడానికి పనికొస్తానేమో నేను! ” అతని మాటల్లో నిరాశేమీ లేదు.

“ఏదీ, నన్ను చూడనీండి!” ఈసెల్ వైపు నడిచింది.

“నా మాట విని మీరటు వెళ్ళొద్దు. ఆ పెయింటింగు చూస్తే జడుసుకుంటారేమో!”

అతని మాటలు పట్టించుకోకుండా ఈసెల్ మీదున్న బొమ్మని చూసింది. నిజాయితీగా చెప్పాలంటే ఆ బొమ్మ ఘోరంగా వుంది. ఒక చిన్న పాప ఇంకొక చిన్న పిల్లి కూనని పట్టుకుని వుందా చిత్రంలో. ఆమెకేమనాలో తోచలేదు.

“నేను చెప్పలే మీరు జడుసుకుంటారని? దాని పేరేమిటో తెలుసా? పిల్లి-పిల్ల! పేరు బాగుంది కదూ? వినగానే చూసే వాళ్ళకి బొమ్మలో సంగతేంటో తెలిసిపోతుంది. అన్నట్టు, ఆ కుడి వైపున వున్నది పిల్లి కూన! మళ్ళీ మీరు పొరపడతారేమో, వద్దని చెప్తున్నా, అంతే!”

శ్రీదేవికి బొమ్మల మీద వుండే అభిప్రాయాలు ఆ బొమ్మ గీసిన వాళ్ళపై తన అభిప్రాయాల మీద ఆధారపడి వుంటాయి. అందులో ఆ అందగాడు తన సంగీతాన్ని కూడా మెచ్చుకున్నాడాయె!

“చాలా అద్భుతంగా వుందీ బొమ్మ!”

సంతోషం కంటే ఆశ్చర్యం ఎక్కువ కనిపించిందతని మొహంలో. “నిజంగానా? హమ్మయ్య, ప్రపంచంలో ఒక్కరికైనా నా బొమ్మ నచ్చింది. ఇహ నేను హాయిగా చచ్చి పోతాను. అయితే ముందు కిందికొచ్చి మీ పాట మొత్తం విన్నాకనే అనుకోండి!”

“వొద్దులేండి! చిరాకుతో నేల మీద బూట్లతో తప్పు తాళం వేస్తారు.”

“అసలు నేనిక ఈ జన్మలో నేలమీద బూట్లతో తాళం వేయదల్చుకోలేదు,” అన్నాడు గంభీరంగా. అందంగా నవ్వింది శ్రీదేవి.

కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.

అదే అపార్ట్‌మెంట్లో ఇంకో పోర్షన్లో వుండే మోహన్‌కి ఎంత విభిన్నంగా వుందీతని ధోరణి, అనుకుందామె. మోహన్ ఒక్క చిత్రాన్ని కూడా అమ్ముకోలేని విఫల కళాకారుడు. అప్పుడప్పుడూ శ్రీదేవి గదిలోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి, తన నిరాశా, నిస్పృహలని గుమ్మరించి వెళ్తూంటాడు. అయితే మోహన్ అభిప్రాయం ప్రకారం, తానొక అద్భుతమైన కళాకారుడు. పాడు నికృష్ట ప్రపంచం అతన్నీ, అతని కళనీ అర్థం చేసుకోలేక వ్యర్థం చేస్తుంది. ప్రజలకసలు ఏ మాత్రం కళా హృదయం లేదని మోహన్ గాఢ నమ్మిక. అందుకు నేరుగా వ్యతిరేకంగా వుంది జీవి అభిప్రాయం. శ్రీదేవికి అతని స్పోర్టివ్ నెస్సూ, నిజాయితీ చాలా నచ్చేయి.

నిజానికి శ్రీదేవికి కొంచెం అహంకారం ఎక్కువ. ప్రాణాలు పోయే పరిస్థితిలో కూడా ఆమెకి తన బాధలు ఇతరులతో పంచుకోవడం ఇష్టం వుండదు. అందుకే ఆమెకి ఊరికే తన సానుభూతి కోసం ఏడ్చే మగవాళ్ళంటే మంట. కానీ ఇవాళ మొదటిసారి ఆమె జీవితో తన కష్టాల గురించి కొంచెం చెప్పుకుంది. బహుశా ఆ వొత్తైన జుట్టు వల్లో ఏమో, అతను చాలా నమ్మ దగ్గ వ్యక్తిలా అనిపించాడు. తాను రాసి వరస కట్టే పాటలని ఎవరూ కొనకపోవడంతో నానాటికీ దిగజారుతున్న తన ఆర్ధిక పరిస్థితీ, డబ్బు కోసం ఇబ్బంది పెట్టే ఆమె విద్యార్థులూ, అన్నిటి గురించీ చెప్పుకుంది.

“నువ్వప్పుడే రెండు మూడు పాటలు రాసేవు కదా? ఇంకా నీ కొత్త పాటలకోసం ఎవరూ అడగటం లేదా?” అనునయంగా అడిగాడు జీవి. అంతలోనే, వాళ్ళు మీరులోంచి నువ్వులోకి మారిపోయారు.

“లేదు. ఆ మూడు పాటలే అమ్ముడయాయి, అంతే! కొత్త పాటల కోసం ఏ మ్యూజిక్ కంపెనీ కానీ, సినిమా వాళ్ళు కానీ అడగటమే లేదు.”

“ఎందుకని?”

“ఎందుకంటే నేను రాసిన మూడు పాటలూ ఒకాయన పాడతానని హక్కులు కొనుక్కున్నాడు, కానీ వాటిని ఎక్కడా పాడటం లేదు. అప్పుడు నా పాటల గురిచి జనాలకి ఎలా తెలుస్తుంది? ఎంత మంది మ్యూజిక్ కంపెనీ వాళ్ళు అలా ఆశ పెట్టి మోసం చేస్తారో తెలుసా? ”

“అలా నిన్ను మోసం చేసిన వాళ్ళందరి పేర్లూ ఇటు పారేయ్. రేప్పొద్దున్న అందర్నీ వరసబెట్టి కాల్చి పారేస్తాను.”

గలగలా నవ్విందామె. “అదేం వొద్దులే. ఇలాగే రాస్తూ పాడుతూ వుంటాను. ఎవరైనా ఒక మంచి గాయకుడో, మ్యూజిక కంపెనీనో నా పాటలొకటి రెండు కొనుక్కుని బయట ఎక్కడేనా పాడి వాటిని పాప్యులర్ చేస్తే చాలు. ఇహ నాకడ్డే వుండదు.”

“అలా అయితే చాలా సంతోషం. అంత వరకూ నీకెప్పుడు దిగులుగా అనిపించినా పైన నా గదిలోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళు, సరేనా? లేదా అదిగో ఆ మూలనుంది చూడు పెద్ద కర్ర, దానితో నీ సీలింగు మీద నాలుగు బాదు. వచ్చి నీ గోడు వింటా, సరేనా?” స్నేహపూర్వకంగా అన్నాడు.

“ఆ మాటనేముందు బాగా ఆలోచించుకో! మళ్ళీ బాధ పడతావేమో!” అల్లరిగా అంది శ్రీదేవి.

“అదెప్పటికీ కాదు. బూట్ల చప్పుడయ్యే గది తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే వుంటాయి.”

“బూట్ల చప్పుడా? ఎక్కడ? ఎప్పుడు? నేను వినలేదే!”

“ఆ చెయ్యి ఇటిస్తావా కొంచెం? ఒకసారి కళ్ళకద్దుకుంటాను.”

ఒక రోజు తన విద్యార్థులతో మరీ విసుగెత్తి జీవితో కబుర్లు చెప్పుకోవడానికి పైకెళ్ళింది శ్రీదేవి.

అక్కడ ఈసెల్ ముందు గంభీరంగా నిలబడి వున్నాడు మోహన్. చేతులు కట్టుకుని జీవి వేసిన బొమ్మ వైపు సుదీర్ఘంగా చూస్తున్నాడు. అతన్ని చూస్తేనే చిరాకు శ్రీదేవికి. అందరికంటే తనేదో మేధావిననుకునే అతని అహంభావం, మిగతా వాళ్ళందర్నీ చిన్న చూపు చూసే అతని అతి తెలివీ, ఏది చూసినా చిరాకే ఆమెకి.

“బాగున్నావా అమ్మాయ్?”

“ఎవర్రా నీకు అమ్మాయ్? శ్రీదేవీ, అని మర్యాదగా పిలవలేవూ? చవట!” మనసులో తిట్టుకుంటూ పైకి మర్యాదగా నవ్వింది.

“రా, రా శ్రీదేవీ! మోహన్ గారు నన్నూ, నా బొమ్మనీ చీల్చి చెండాడుతున్నారు. రాకపోయి వుంటే నా మర్డరు మిస్సయివుండేవారు.” జీవి ధోరణిలో మార్పేమీ లేదు.

“అలా ఉడుక్కోకోయ్ జీవీ! నేను కేవలం ఈ బొమ్మలో వున్న లోపాలు ఎత్తి చూపుతున్నానంతే. నా మాటలు నిన్ను నొప్పిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను,” దర్పంగా అన్నాడు మోహన్.

“అయ్యయ్యో! మీరు చెప్పేది నా మంచికేనని నాకు బాగా తెలుసండి. మీరు కానివ్వండి.”

అలానే కానిచ్చేడు మోహన్. “ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ బొమ్మలో అసలు జీవం లేదు. ఆ పిల్లిలో కానీ, ఈ పిల్లలో కానీ, ఎక్కడైనా జీవకళ వుందా చెప్పు?” మాట్లాడుతూనే ఒకడుగు వెనక్కి వేశాడు. చేతుల్ని ఫ్రేములా వుంచి దాన్లోంచి ఆ చిత్రాన్ని చూస్తూ,

“ఆ పిల్లి! ఊ… ఆ పిల్లీ – ఆ… ఏం చెప్పమంటావు ఆ పిల్లి గురించి? దాన్లో అసలు…”

“నాకా పిల్లి చాలా నచ్చింది! భలే ముద్దుగా వుందా బుజ్జి కూన.” వున్నట్టుండి అంది శ్రీదేవి.

ఎప్పుడూ ఆమె ముక్కు మీద వుండే కోపం మెల్లిగా కళ్ళల్లోకి ఎక్కుతోంది. మోహన్ చెత్త వ్యాఖ్యల్ని అంత సరదాగా నవ్వుతూ తీసుకుంటున్న జీవిని చూసినా ఆమెకి కోపంగా వుంది.

“ఏమైతే యేం? మీరిద్దరూ అది పిల్లి అని గుర్తుపట్టటమే నాకన్నిటికన్నా నచ్చింది,” ఎప్పట్లానే తనదైన చిరునవ్వుతో అన్నాడు జీవి.

“నాకు తెల్సు జీవీ! నా విమర్శతో నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నట్టున్నావు! నీ బొమ్మ మరీ అంత చెత్తగా ఏం లేదు లేవోయ్! ఇంకొంచెం కష్టపడితే ఎప్పటికైనా నువ్వూ మంచి బొమ్మలు వేయగలవు!”

శ్రీదేవి కళ్ళల్లోకి ఒక ప్రమాదకరమైన మెరుపు వచ్చింది. ఇహ వీడ్ని వదిలేది లేదనుకుంది. చాలా మెత్తగా నవ్వుతూ, “అవును జీవీ! మోహన్ గారు ఎంతో కష్టపడి ఇంత పైకొచ్చారు. ఆయన బొమ్మలు నువ్వు చూసే వుంటావు!”

“నేనా? మోహన్ గారి బొమ్మలా? చూడలేదే!”

“చూడకపోవటమేమిటి? పత్రికల్లో అన్నీ ఆయన వేసిన బొమ్మలే కదా!” శ్రీదేవి ఇంకా మెత్తగా నవ్వుతూనే వుంది.

మోహన్ వంక ఆరాధనగా చూశాడు జీవి. అయితే ఎందుకో మరి మోహన్ మొహం ఎర్రబడి వుంది, ఇబ్బందిగా. దాన్ని ఆయనకి సహజంగా వుండే వినయంగా అర్థం చేసుకున్నాడు జీవి.

“పత్రికల్లో ప్రకటనల పేజీలుంటాయి చూడు. ఆ బొమ్మలన్నీ ఆయనవే. ఆ బూట్ల కంపెనీ ప్రకటనలో బూట్లూ, ఫర్నీచర్ కొట్టు ప్రకటనలో సోఫా సెట్టూ ఎవరు వేశారనుకున్నావు? మోహన్ గారే! స్టిల్ లైఫ్ బొమ్మలు భలే వేస్తారులే!” చురకత్తిలాటి నవ్వుతో నిర్దాక్షిణ్యంగా చెప్తోంది శ్రీదేవి.

మోహన్ మొహం మాడి పోయింది. ఒకలాటి భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది గదిలో. జీవి ఉత్కంఠతతో చుస్తున్నాడు, ఈ వాగ్యుధ్ధంలో గెలుపెవరిదా, అని!

ఆఖరికి మోహన్ తేరుకున్నాడు. కోపం గొంతు నిండా పొంగి పొర్లుతూండగా, “అమ్మాయ్! నేను డబ్బు కోసం వేసే కొన్ని మామూలు చిత్రాలే చూసినట్టున్నావు. నేను అవే కాక కళాత్మకమైన బొమ్మలు బోలెడు వేశాను.”

“అవునా? అవెవరు కొన్నారబ్బా? ఆ… గుర్తొచ్చింది! ఎనిమిది నెలల కింద ఒక బొమ్మ వంద రూపాయలిచ్చి ఎవరో కొన్నట్టున్నారు, కదూ! అంతకు ముందర, దాదాపు సంవత్సరం క్రితం ఒక చిత్రం ఇంకెవరో…”

ఆమె మాట మధ్యలోనే మోహన్ కోపంగా లేచి వెళ్ళిపోయాడు. జీవికి అతన్ని చూస్తే జాలేసింది.

“ఆ మనిషిని మరీ అంతగా చావగొట్టాలా! పెద్దాయన, ఏదో ఆన్నాడే అనుకో!”

ఉన్నట్టుండి ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి జేబులోంచి రుమాలు తీసి ఇచ్చాడు. “ఏమయింది? ఊరికే నవ్వులాటకన్నాను, అంతదానికే ఇంతలా ఏడవాలా..”

“ఛీ! నా అంత నీచురాలు ఎవరైనా వుంటారా?”

“అంతదానికేనా? చాల్లే!”

“మనందరవీ ఒక్క లాటి కష్టాలే కదా? నేను నా పాటలు ఎవరూ కొనక ఎలా బాధ పడుతున్నానో, అతనూ తన బొమ్మలు అమ్ముడవక అలాగే బాధ పడుతున్నాడు కదా? అతన్ని అవమానించే హక్కు నాకెక్కడిది?”

వెక్కిళ్ళు పెడుతూంది శ్రీదేవి. కొంచెం సేపటికి తేరుకుంది. మొహం తుడుచుకొని జీవి వైపు చూసి సన్నగా నవ్వింది.

“సారీ! ఊరికే వచ్చి నీ మూడ్ పాడు చేశాను కదూ! నాకంటే అసహ్యమైన జంతువుంటుందా?”

“వుంది! ఇదిగో, నా బొమ్మలో ఈ పిల్లి! ఇందాక మోహన్ కూడా అదే మాటన్నారు కదా? అది సరే, నాకొక విషయం అర్థం కావడం లేదు.”

“ఏమిటి?”

“నేనింకా మోహన్ గారు చేయి తిరిగిన కళాకారులనీ, జనమంతా ఆయన గీసిన చిత్రాలు కొనడానికి బారులు తీరి నిలబడ్డారనీ అనుకున్నాను. అందుకే ఆయన ఇక్కడికొచ్చి నా బొమ్మని చెడామడా తిడుతూంటే, అంతటి మేధావి నా బొమ్మ గురించి అభిప్రాయం చెప్పటమే నా అదృష్టమని మురిసిపోయాను కూడా! మరి నువ్వేమో…”

“అదేం లేదు, పాపం. అతనూ మన గూటి పక్షే. ఒక్కరూ తన చిత్రాలు కొనక, ఇలా ప్రకటనల కోసం బొమ్మలు గీసి డబ్బు సంపాదిస్తూంటాడు. నేనేమో అలాటి ఆయనని పట్టుకొని… నా పాపానికి నిష్కృతి లేదు,” మళ్ళీ గొల్లుమంది శ్రీదేవి.

“మళ్ళీ మొదలు పెట్టొద్దు, ప్లీజ్!”

శ్రీదేవి లేచింది. “వెళ్ళి క్షమాపణలైనా చెప్తాను. అతనంటే నాకేమాత్రం ఇష్టం వుండదనుకో. అయినా నేను చేసింది తప్పేగా? తప్పదు మరి! వస్తా.” బయటికెళ్ళింది.

సి.జీవి లేచి సిగరెట్టు ముట్టించాడు. కిటికీలోంచి బయటికి చూస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు.

జీవితంలో వీలైనంతవరకూ క్షమాపణలు చెప్పకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఎప్పుడైనా విధిలేక చెప్పాల్సి వస్తే, అందుకు అర్హులైన వారికే చెప్పాలి. ఏదో పొరపాటు చేశాం కదా అని ఎవరికి పడితే వారికి చెప్పకూడదు! అందులో మోహన్ లాటి వారికి అసలే చెప్పకూడదు. అలాటి వారికి క్షమాపణ చెప్తే, పెద్ద మనసుతో హుందాగా క్షమించేయకుండా, చిన్న పొరపాటుని పదే పదే ఎత్తి చూపి, పుండు మీద కారం జల్లినట్టు మాట్లాడి, ‘ఇతనికి క్షమాపణ చెప్పటం కాకుండా, చెంప పగలగొట్టాల్సిందేమో,’ అని అనుకునే పరిస్థితికి మనల్ని దిగజారుస్తారు.

ఇప్పుడూ అదే జరిగింది. ఈ పొరపాటు వల్ల ఇహ ముందు తనేం మాట్లాడినా, ఏం చేసినా శ్రీదేవి నోరెత్తకుండా పడుండాల్సిందే తప్ప, నోరెత్తకూడదని అన్యాపదేశంగా ఆమెకి సూచించి పంపేశాడు. మళ్ళీ ఎప్పట్లాగే జీవి గదికి పోవడాలూ, అడగకున్నా సలహాలు ఇచ్చేయడాలూ యథేఛ్ఛగా సాగుతున్నాయి. జీవి పధ్ధతి మాత్రం ఏమీ మారలేదు. ఎప్పట్లాగే, చిరునవ్వుతో అతను మోహన్ తన బొమ్మలమీద చేసే వ్యాఖ్యానాలని స్వీకరిస్తున్నాడు. అతనితో ఏకీభవిస్తున్నాడు కూడా. అతని స్థితప్రఙ్ఞత చూస్తున్నకొద్దీ శ్రీదేవికి అతను ఇంకా నచ్చుతున్నాడు.

ఈ మధ్య మోహన్ ఉపన్యాసాల్లో దర్పం పెరిగింది. ఎందుకంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత అతని చిత్రాలు అమ్ముడవుతున్నాయి. రెండు వారాల్లో మూడు బొమ్మలు అమ్ముడు పోయేసరికి అతని ఏజెంటు కూడ ఆశ్చర్యం పట్టలేకపోయాడు. సూర్యరశ్మికి కమలాలు విచ్చుకున్నట్టు, ఈ శుభ పరిణామాలతో అతనిలోని విమర్శకుడు విచ్చుకున్నాడు. ఈ మధ్యనే ఒక డబ్బున్న మారాజు తన బొమ్మని రెండువేలకి కొన్నాడని తెలియగానే, మోహన్‌కి డబ్బున్న వాళ్ళ మీద ఇదివరకున్న అభిప్రాయాలు సమూలంగా తుడిచిపెట్టుకు పోయాయి.

“నాకైతే ఇది డబ్బున్న వాళ్ళల్లో కళల గురించి సరైన అవగాహన పెరుగుతున్న శుభోదయానికి నాందిలా అనిపిస్తుంది,” అని ప్రకటించాడు, శ్రీదేవి, జీవిల ముందర, గంభీరంగా!

జీవి కూడా మొత్తానికి పిల్లి-పిల్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక పెద్ద గాలరీలో ఇచ్చాడు, దీంతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండని. మోహన్ రికమెండేష లెటర్ రాసిచ్చాడు కదా! అందుకని వాళ్ళూ తీసుకున్నారు. తన బొమ్మలు బాగనే అమ్ముడవుతూండడంతో మోహన్ ప్రకటనలకి వేసే బొమ్మలు తగ్గించుకున్నాడు. దాంతో తీరిక చిక్కి జీవి గదిలో ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వసాగాడు.

“నీ బొమ్మని కూడ ఎవరైనా కొంటే కానీ ఆయన నోటికి తాళం పడదు.” వాపోయింది జీవి దగ్గర శ్రీదేవి.

“నా పనైతే నేను చేశానుగా! ఆ సంగతొదిలేయ్. అది సరే కానీ, నువ్వు ఆ మధ్య రాసిన పాటేమైంది?”

“అదా! అమీన్-సయానీ అనే మ్యూజిక్ కంపెనీ తీసుకుందిలే!” నిర్లిప్తంగా అంది శ్రీదేవి.

“మరి అలా మొహం వేలాడేసుకున్నావెందుకు? ఇహ చూడు నీ పాట ఢంకా బజాయించేస్తుంది.”

“కానీ కిందటిసారి సయానీని కలిసినప్పుడు ఏమంత ఉత్సాహంగా లేడు.”

“ఆ సయానీదంతా ఆంజనేయుడి తంతు. తన గొప్ప తనకే తెలిసి చావదు! కొంచెం టైమివ్వు ఆయనకి!”

“కొంచెమేం ఖర్మ, ఎక్కువే తీసుకోమను. పాట నలుగురి నోళ్ళలో నానితే చాలు.”

ఆశ్చర్యకరంగా ఆ పాట హిట్టయింది! ఆ రికార్డు ఎక్కువగా అమ్ముడవడమే కాక, సయానీకి ఆ పాట కోసమే ఎక్కళ్ళేనన్ని ఫోన్ కాల్సూ, అభినందనలూ అందసాగేయి. శ్రీదెవి డబ్బు ఇబ్బందులూ మాయమైపోయాయి. ఈ సంతోషంలో జీవి చిత్రం కూడా ఎవరైనా కొంటే బాగుండని ఎంతో ఆశ పడింది శ్రీదేవి. ఆ చిత్రం అమ్ముడు పోకపోగా, మోహన్ ఉపన్యాసాలూ, విమర్శలూ, సలహాలూ భరించలేని స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు జీవి గదిలో మోహన్ అలికిడి వినిపిస్తే కిందికి జారుకుంటుంది శ్రీదేవి.

ఒకరోజు మధ్యాహ్నం శ్రీదేవి గదిలో పని చూసుకొంటోంది. ఉన్నట్టుండి వరండాలో పబ్లిక్ ఫోన్ మోగిన చప్పుడు. అన్ని అపార్ట్‌మెంట్లకీ అదొక్కటే దిక్కు. అది ఇంకా మోగుతూనే వుంది. పాపం, ఏదైనా ముఖ్యమైన పనేమో.

“హల్లో! జీవి గారున్నారా?” అడిగిందొక బొంగురు గొంతు.

“లేరండీ! బయటికెళ్ళినట్టున్నారు. ఏదైనా మెసేజీ ఇస్తే ఆయనకిస్తాను.”

“అవునాండీ! పాండు ఫోన్ చేశాడని చెప్పండి. రోజూ పోస్ట్‌లో వస్తున్న ఆ కేసెట్లని ఏం చెయ్యమంటారని అడుగుతున్నానని కొంచెం చెప్పండి, ప్లీజ్!”

“కేసెట్లా?”

పాపం పాండు గారికి తన బాధ పంచుకోవటానికి ఎవరైనా పర్వాలేదు లాగుంది. ఆయన గోడు వింటే చాలు! అందుకే ఆగకుండా చెప్పుకుపోయాడు. “అవునండీ కేసెట్లు! పాటలు వింటాం చూడండి, రికార్డెడ్ కేసెట్లు అవి! ఒక్కటే పాటల కేసెట్టు వందల్లో కొన్నాడు. పోయిన నెలలో పోస్టులో పెద్ద పెద్ద పెయింటింగులు వచ్చాయి. నాలుగో ఐదో! ఎంత ఛండాలంగా వున్నాయనుకున్నారు? పగలు చూస్తే రాత్రి పీడకలలొస్తాయి! ఇంటి నిండా దిష్టి బొమ్మల్లా, ఇదేంటయ్యా మగడా అంటే, అవో గదిలో పడెయ్యవోయ్, నువ్వేం వాటి వంక చూడకూ అన్నాడు. సరేలే అని ఊర్కుంటే ఇప్పుడీ కేసెట్లు! అడుగెయ్యడానికి చోటు లేదు ఇంట్లో. నన్ను ప్రశాంతంగా రాసుకోనీకుండా ఏమిటండీ ఇది!”

పాండు కనక శ్రీదేవి మొహంలో మారుతున్న రంగులు చూసి వుంటే వెంటనే మాటలు ఆపేవాడే. కానీ చూడలేడు. కడుపులో వున్నదంతా కక్కేశాడు పాండు ఫోన్లో!

“పాటల కేసెట్టు ఏ కంపెనీది?”

“అదే నండీ, ఏదో తురక పేరు, ఈదీ అమీన్ లాటిది”

“అమీన్ సయానీ?”

“ఆ… అద్దీ! సరిగ్గా చెప్పారు. మరి ఆయనకి చెప్తారు కదా?…”

శ్రీదేవి ఫోన్ పెట్టేసింది.

గంటయింతర్వాత జీవి కూనిరాగం తీస్తూ మెట్లెక్కుతున్నాడు.

“ఒక సారిలా వస్తారా?” శ్రీదేవి గుమ్మంలోనించి పిలిచింది.

“తప్పకుండా! ఏమిటి సంగతి? మీ కాసెట్లు ఇంకా అమ్ముడవుతున్నాయా?”

“ఏమో, ఇంకా తెలియదు చిరంజీవి గారూ!”

ఒక్క క్షణం తడబడ్డాడు జీవి. అంతలోనే తేరుకున్నాడు.

“ఓ, నా పేరు తెలిసిపోయిందన్నమాట.”

“పేరే ఏం ఖర్మ, ఊరూ, ఉద్యోగం, మొత్తం మీ జాతకమే తెలుసుకున్నాను.”

ఏమనాలో తోచలేదు జీవికి.

“మీ పేరు చిరంజీవి. విశాఖపట్నంలోని కోటీశ్వరులలో మీరొకరు.”

“అది నా తప్పు కాదు! అది వంశపారంపర్యమైన జబ్బు. మా నాన్నా, మా తాతా, అంతా కోటీశ్వరులే. కోట్లు సంపాదించడం వాళ్ళ హాబీ!” సీరియస్ గానే అన్నాడు.

“అవును! ఆ కోట్లు ఉపయోగించి మాలాటి అమాయకులని మభ్య పెట్టడం మీ హాబీ కావొచ్చు!”

మళ్ళీ ఏమనాలో తోచలేదు జీవికి. శ్రీదేవే మళ్ళీ అందుకుంది, అతని మొహంలోకి సూటిగా చూస్తూ.

“అవునా కాదా? డబ్బుంది కదా అని మా లాటి తెలివి తక్కువ వాళ్ళకి జాలిగా బిస్కత్తులు పడేస్తూ వుంటారన్నమాట. పాపం, మోహన్, తన బొమ్మలు నిజంగానే ఎవరికో నచ్చి కొనుక్కుంటున్నారనుకొని సంబరపడుతున్నాడు. ఎప్పటికైనా నిజం తెలిస్తే ఆయన అసలు బొమ్మలు గీయగలరా? విసుగొచ్చి మీరు బొమ్మలు కొనడం మానేసినప్పుడు…”

తేలిగ్గా నిట్టూర్చాడు జీవి. “ఓస్! అదీ ఒక సమస్యేనా? ఆయన ఎన్ని బొమ్మలు వేస్తే అన్ని నేనే కొంటాను. ఆయనకసలు నిజం తెలిసే పరిస్థితే రాదు. ఆయన భవిష్యత్తుకేమీ ఢోకా లేదు.”

“ఓహో! అలాగా? మరి నా భవిష్యత్తు కూడా ప్లాన్ చేశారా?” వెటకారంగా అంది శ్రీదేవి.

“నీ భవిష్యత్తా? అదెలాగూ నా చేతిలోనే వుంది. ఎందుకంటే నువ్వు నన్నే పెళ్ళాడతావు గనక.”

శ్రీదేవి నిర్ఘాంతపోయింది.

“నిన్నా? నేనా? పెళ్ళా? నీ గురించి ఇంత తెలిశాకా?”

“నీ అభ్యంతరం ఏంటో నాకు బాగా తెలుసు. పెళ్ళాడితే మన ఇంటి నిండా మోహన్ గీసిన బొమ్మలుంటాయనే కదా? నేనా విషయం ఎప్పుడో ఆలోచించాను. అవన్నీ అటక మీద దాచేద్దాం. నర మానవుడికెవ్వరికీ ఆ బొమ్మలు చూసే అగత్యం పట్టదు!”

శ్రీదేవి గొంతు పెగల్చుకుని ఏదో చెప్పబోయింది. ఆమెని ఆపేడు జీవి.

“ఆగు! నేను నీతో ఎప్పట్నించో నా జీవిత చరిత్ర చెప్పాలని అనుకుంటూన్నను. నాకసలు నా జీవిత చరిత్ర చెప్పడమంటే చచ్చేంత ఇష్టం. వినేవాళ్ళకంత ఇష్టం వుండదు కానీ!”

“నీ బోడి జీవిత చరిత్ర మీద నాకేం ఇంట్రస్టూ లేదు.”

“వినకుండానే ఇంట్రస్టు లేదంటే ఎలా? అసలెన్ని మలుపులూ, హ్యూమన్ ఎలిమెంట్సూ వున్నాయో తెల్సా నా జీవిత చరిత్రలో? నేను పుట్టింతర్వాత ఇరవై యెనిమిదేళ్ళ జీవితం గురించి వదిలేద్దాం. అదుత్త బోరు! కానీ, సరిగ్గా నెలా పది రోజుల కింద ఆఫీసు పని మీద ఈ ఊరొచ్చిన నేను టాక్సీలో వెడుతూ, పక్క సందులో బస్సు దిగి ఇటు నడుస్తూంటే నిన్ను చూశాను.”

“ప్లీజ్! నాకు వినాలని లేదు.”

“ఇక్కణ్ణించే నా జీవితంలోకి యాక్షనూ, రొమాన్సూ, అన్నీ ప్రవేశించాయి. ఆ సంగతి అప్పుడే గ్రహించాను కాబట్టి టాక్సీ దిగి నీతో మాట్లాడదామని ఇటొచ్చాను. నువ్వు ఈ చిన్న అపార్ట్మెంట్ బిల్డింగులోకి వచ్చావు. ఎలాగబ్బా నిన్ను పలకరించడం అనుకుంటూంటే పైన “ఇల్లు అద్దెకివ్వబడును” అని బోర్డు కనబడింది. ఎన్నాళ్ళనించో ఒక ఆరునెలలు సెలవు పెట్టి బొమ్మలు వేయాలన్న కోరికా ఇలా తీర్చుకోవచ్చని, ఆఫీసుకి సెలవు పెట్టి పైభాగంలో అద్దెకి దిగాను!” ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు జీవి.

“ఎలాగైనా నిన్ను పైకి రప్పించాలని అలా బూట్లతో నేలమీద తాళం వేశానన్నమాట! ఎంతైన నా తెలివే తెలివి. అది సరే కానీ, నా గురించి నీకెలా తెలిసింది?”

“మీ స్నేహితుడు పాండు ఫోన్ చేశాడు.”

“వాడా! కథలు రాసుకోవడానికి ప్రశాంతమైన చోటు లేదు బ్రదర్ అంటే నేనే నాతో పాటు ఇల్లు షేర్ చేసుకోమన్నా! అసలు రచయితలు భలే సున్నితంగా…”

“చిరంజీవి గారూ!’

“నన్ను జీవి అనే పిలవొచ్చు! అసలు శివ ప్రసాద్ అనే మారు పేరు పెట్టుకుందామనుకున్నా కానీ…..”

“మీ ఉద్దేశ్యాలు మంచివే అయివుండొచ్చు. అయినా మీరు చేసిన పని హేయమైనది, మమ్మల్నెంతో అవమానిస్తున్నారు…”

జేబులో చేయి పెట్టి దేనికోసమో వెతుకుతున్నాడు జీవి. ఒక చిన్న ఉత్తరం తీశాడు.

“ఈ ఉత్తరం చదువుతాను, కొంచెం వింటావా?”

“మీ ఉత్తరాల మీద నాకేం ఇంట్రస్టూ….”

“చిన్నదేలే! విను మరి. నేను నా ‘పిల్లి-పిల్ల’ బొమ్మ ఇచ్చాను చూడు ఆ ఏజెంటు దగ్గర్నించన్నమాట. ‘జీవీ, నీ పిల్లి-పిల్ల బొమ్మ కొనాలనని ఒక కస్టమరు ఐదువేల రూపాయలు చెల్లించారు. బొమ్మ ఇచ్చేస్తాను. నీకేమైనా అభ్యంతరమా?” ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు జీవి. తలొంచుకుంది శ్రీదేవి.

“అయితే?” బింకంగా అంది.

“ఇప్పుడే ఏజెంటు దగ్గరికెళ్ళొస్తున్నా. ఆ పిల్లిని కొనే కస్టమరు ఎవరా అని కొంచెం ఆరా తీశాను. ఆ యిల్లు నీ దగ్గర సంగీతం నేర్చుకొనే అమ్మాయిదని తేలింది. ఆ అమ్మాయినడిగితే నువ్వే కొనమన్నావని కూడా చెప్పింది.”

శ్రీదేవి దించిన తల యెత్తలేదు. ఆమె దగ్గరకెళ్ళి నిలబడ్డాడు జీవి.

“వెళ్ళిక్కణ్ణించి!” శ్రీదేవి తల యెత్తకుండానే బలహీనంగా అంది.

“వెళ్ళను. నువ్వు ఒప్పుకునేదాకా ఇక్కడే వుంటాను.”

“ముందు వెళ్ళు. ఆలోచించుకుని చెప్తాను.”

చిరంజీవి మెల్లిగా గదిలోంచి బయటికి వెళ్ళి, మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళాడు. గదిలో ఆగకుండా పచార్లు చేస్తున్నట్టున్నాడు, బూట్ల చప్పుడు వినిపిస్తూంది.

శ్రీదేవి లేచింది. బట్టలారేయడానికి తను వాడుకునే పొడుగాటి కర్ర తీసుకుని సీలింగ్ మీద మూడు సార్లు గట్టిగా పొడిచింది!
(The Man Upstairs.)
-----------------------------------------------------------
రచన: శారద 
మూలం: పి. జి. ఓడ్‌హౌస్
ఈమాట సౌజన్యంతో