Monday, May 31, 2021

సింహాద్రి నారసింహుని లీల

 సింహాద్రి నారసింహుని లీల




సాహితీమిత్రులారా!



ఒకమారు సింహాచల క్షేత్రం మీదకు మహమ్మదీయ సేనలు రాగా
గోగుపాటి కూర్మనాథకవి ఆక్రోశం చెందగా అప్రయత్నంగా
"వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!" అనే మకుటంతో
సీసాలు దొర్లుకుంటూ  కవిగారి నోటి వెంట ధారాపాతంగా వచ్చాయట.
ఆ భావతీవ్రతలో స్వామిని ఆయన బ్రతిమలాడాడు,
ఆక్షేపించాడు, ఎద్దేవా చేశాడు.
వాటిలో ఒకటి ........

పాశ్చత్యుల నమాజుపై బుద్ధి పుట్టెనో మౌనుల జపముపై మనము రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో విప్ర యజ్ఞములపై విసుగు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో దేవతా ప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో భక్తి నిత్యోత్సవ పరతమాని
వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ 
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరగద్రోలు
పారసీకాధిపుల పటాపంచలుగను
వైరి హరరంహ!  సింహాద్రి నారసింహ!


అభీర గృహముల అర కాగిన పామీగడల్ వడి దిగమ్రింగగలవు.
కాని యవనులపై వడి పారలేవు. కబళమున నోరు తెరతువు,
కళ్ళెమన్న మోము త్రిప్పు హయగ్రీవమూర్తి వహహ! - అని ఆక్షేపించాడు

పాలియ్యవచ్చిన భామిని ప్రాణాలు అపహరించినట్లు కాదయ్యా చేతనైతే
ఈ తురకలను నాశనం చేయమని వేడుకొన్నాడు.

మేము నిన్ను అగ్రహారాలను ఇవ్వమని అడగడంలేదు.
కరిహయాదుల మేము కాంక్షించలేదు.
జనులను దోచుకోకుండా చూడమనే మా ప్రార్థన - అని అంటూ
67 పద్యాలు పూర్తి చేసేసరికి కొన్ని లక్షల, కోట్ల గండుతుమ్మెదలు
కొండలోనుండి బయలుదేరి ప్రళయకాలంలో కారుమేఘాల్లా
కమ్ముకుని తురకల దండుపైకి మూగి, కండలు ఊడేట్లుగా కరచి,
నెత్తురు పీల్చి వారిని విశాఖపట్టణం దాకా బ్రతుకుజీవుడా! -  అని పారిపోయేలా
చేశాయట.
ఆ దృశ్యాన్ని చూచిన కూర్మనాథుడు ఇలా వర్ణించాడు.

కారుణ్య దృష్టిచే కని మమ్ము రక్షింప నీరజేక్షణ నీవు నేడు పంప
పారసీకుల దండుపై కొండలోనుండి గండుతుమ్మెదలు నుద్దండ లీల
కల్పాంతమున మిన్ను గప్పి భీరకమైన కారుమేఘంబులు గవిసినట్లు
తాకి బోరున రక్తధారలు దొరగగా కరచి నెత్తురు పీల్చి కండలెల్ల
నూడిపడ నుక్కు మూతులవాడి మెరసి
చించి చెండాడి వధియించె చిత్రముగను
నొక్కొకని చుట్టుముట్టి బల్మిక్కుటముగ
వైరి హరరంహ!  సింహాద్రి నారసింహ!


ఈవిధంగా
అనేకవిధాల నరసింహస్వామిని స్తుతిస్తూ ..................
మిగిలిన పద్యాలను పూర్తి చేశాడట.


Saturday, May 29, 2021

తిథి అంటే ఏమిటి?

 తిథి అంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!



తిథి అంటే శబ్దరత్నాకరంలో
1. పాడ్యమి లోనగునది
2. శ్రాద్ధదినము
అనే అర్థాలు ఇచ్చారు.

తన్యంతే కిలతా యస్మాత్తస్మాత్తాస్తిథ తిథయ స్స్మృతా
                                                                                                -సిద్ధాంతశిరోమణౌ(కాలమాధవీయే)
తినోతి అనేపదం నుండి పుట్టింది ఈ తిథి అనే పదం.
తినోతి అనగా విస్తరించునది అని అర్థం
(చంద్రకళలను దినదినము పెంచుట)

తిథులు మూడు విధాలు-
1. ఖర్వ
2. దర్వ
3. హింస్ర

ఖర్వ - అనేది సమతిథి
            అంటే సూర్యోదయంనుండి మరునాడు సూర్యోదయము వరకు
            తిథి ఉండే తిథికి సమతిథి - ఖర్వ అని పేరు.

దర్వ - అంటే వృద్ధియైన తిథి అని అర్థం
                  60 గడియలకన్నా ఎక్కువ ఉన్నతిథి.

హింస్ర - క్షీణత కలిగిన తిథి అని అర్థం.
                     60 గడియలకన్న తక్కువైన తిథి.

Thursday, May 27, 2021

అర్థాలు మార్చకున్న పదాలు

 అర్థాలు మార్చకున్న పదాలు




సాహితీమిత్రులారా!



కాలగమనంలో పదాలు అర్థాలు మారిపోతుంటాయి 

అలాంటి కొన్ని పదాలను ఇక్కడ గమనిద్దాం-

సెలవు - నేటి అర్థం- హాలిడే
             అసలు అర్థం - ఆజ్ఞ, ఖర్చు
రేపు - నేటి అర్థం - మరుసటిరోజు
           అసలు అర్థం - ప్రొద్దుట(ప్రాత: కాలం)
సవ్యమునేటి అర్థం - సక్రమం
                 అసలు అర్థం- కుడి, ఎడమ, ప్రతికూలం
సభాజనము - నేటి అర్థం - సభలోని ప్రజలు
                        అసలు అర్థం - చుట్టములను ఆలింగనము మొదలైన
                                               వాటితో సంతోషపరచుట.
ఆకట్టు నేటి అర్థం - ఆకర్షించు
              అసలు అర్థం - అడ్డగించు
అవాంతరము - నేటి అర్థం - అనుకోని సంఘటన
                         అసలు అర్థం - లోపలి భాగం
సొద - నేటి అర్థం - గోల, అల్లరి
           అసలు అర్థం - శవమును కాల్చటానికి పేర్చిన కట్టెల ప్రోవు
బ్రహ్మరథం - నేటి అర్థం - గొప్పగా ఆదరించు
                      అసలు అర్థం - మృతి చెందిన సన్యాసులను తీసుకుపోవు వాహనము.
చీర - నేటి అర్థం - స్త్రీలు ధరించే వస్త్రం
          అసలు అర్థం - వస్త్రం


Tuesday, May 25, 2021

''మదం'' అంటే ఏమిటి?

 ''మదం'' అంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!



మదం అంటే గర్వం.
ఇది ఎనిమిది రకాలని పెద్దలంటారు
ఇవి మానవత్వాన్ని మంటగలిపే సాధనాలు
ఇవి కలిగిన నాడు కన్ను మూసుకు ప్రవర్తిస్తారు.

అవి
1.ధనమదం - 
ఇది అన్నిటికంటే ముందు చెప్పాల్సింది.
దీనివల్ల ప్రపంచమంతా తమ ఆధీనంలో ఉన్నట్లు
భ్రమసిపోతుంటారు.

2. కుల మదం-
ఇది వారు పుట్టిన కులం గొప్పదని
మిగిలిన కులాలవారు చాల తక్కువవారని
వీరి అపోహ దీనితో లేనిపోని ధ్వేషాలకుమూలమై
సమాజ విచ్ఛన్నకర శక్తులుగా తయారవుతారు.

3. అధికార మదం -
ఇది ఏ అదికారమైనా కావచ్చు
వారు గొప్పవారు అధికారులని
మిగిలినవారు సేవకులనీ వీరి భావన

4. శాస్త్ర మదం -
తనకంటే గొప్ప పండితుడు లేడని.
తానే గొప్ప పండితుడనని
అన్ని శాస్త్రాలు తనకే తెలుసని
వీరు విర్రవీగుతుంటారు.

5. తపోమదం-
వీరు కొంత తపస్సుకే తమవంటివారు లేరని
గర్వించి ఏవో వారు సాధించిన చిన్న చిన్న
విషయాలకే పరిమితమై మోసపూరిత మాటలతో
ప్రజలను వంచించి కాలం గడుపుతుంటారు.

6. బలమదం -
ఇది శారీక బలం అండచేసుకొని దౌర్జన్యాలకు
పాల్పడి వారు సమాజానికి ప్రతినాయకులై
ప్రజలను ఇబ్బంది పెడుతుంటారు.

7. యవ్వన మదం -
వీరు బలహీనులను తమకోరికలకు బలి చేస్తుంటారు

8. రూపమదం-
వీూరు తాముమాత్రమే అందంగా ఉన్నామని
తమ అందానికి తామే మురిసి ఇతరులను గేలి చేస్తుంటారు
అసహ్యించుకొంటుంటారు

ఇవి ఏవీ మనిషికి ఉండరాదని అన్నా
ఏదో ఒకటి మనిషిని పట్టి పీడించడం
నేడు మనం గమనిస్తూనే ఉన్నాము
వీటిని మార్చడం ఎవరికి వారికే సాధ్యం

Sunday, May 23, 2021

పూర్వం ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడిన స్త్రీలు

 పూర్వం ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడిన స్త్రీలు




సాహితీమిత్రులారా!



పూర్వం ద్రౌపది వలె అనేక మందిని
పురుషులను వివాహమాడిన స్త్రీలు
ఎవరైనా ఉన్నారా?

అలాంటివారిలో కొంతమందిని ఇక్కడ చూద్దాం-

మత్స్యపురాణం, దేవీభాగవతాల్లోని విషయం.

1.కీర్తమతి అనే స్త్రీ ఐదుమందిని వివాహమాడింది
   వారు శుకమహర్షి, పీవరకి పుత్రులు.
  1. భూరిశ్రవుడు, 2. గౌరప్రభుడు, 3. కృష్ణుడు,
   4. శంభుడు, 5. దేవశ్రవుడు
   (ఈ ఐదుగురూ అన్నదమ్ములే)
   (జనకరాజర్షి గృహస్థాశ్రమమే
    ముక్తిదాయకమని బోధించడం వల్ల
    శుకుడు పీవరను వివాహమాడాడు)

2.అజిత - ఔశీనరపతి కుమార్తె.
  నితంతుడు అనే రాజర్షి కుమారులు
  ఈమెను స్వయంవరంలో వివాహం చేసుకున్నారు.
  1. సాల్వేయుడు, 2. శూరసేనుడు, 3. శ్రుతసేనుడు,
  4. బిందుసారుడు, 5. అతిసారుడు
     ఈ గాథ వ్యాసభారతంలోనిది.
3. మారిష -ఈమె 11మందిని వివాహమాడింది
   ప్రాచీన బర్హి యొక్క పుత్రులు ప్రచేతసులు
   ప్రచేతసులకు మారిషకు కలిగిన పుత్రుడే దక్షప్రజాపతి.
   విష్ణుపురాణంలోను, మత్స్యపురాణంలోను
   వీరి కథ విపులంగా ఉంది.
4. జటిల - జటిలుని పుత్రిక
   (గౌతమ మహర్షి వంశంవాడైన జటిలమహర్షి కుమార్తె)
   ఈమె ఏడుగురు ఋషులకు భార్య అయింది.
   ఈ గాథ వ్యాసభారతంలో ఉంది.


Friday, May 21, 2021

సాష్టాంగ దండప్రణామము అంటే?

 సాష్టాంగ దండప్రణామము అంటే?





సాహితీమిత్రులారా!



నమస్కారాలలో సాష్టాంగ దండప్రణామము ఒకటి.
రెండుచేతులు జోడించి నమస్కరిండం అందరికి తెలిసిందే
సాష్టాంగ దండప్రణామము అంటే నేలపై సాగిం పడి మ్రొక్కడం
అంతేకదా
నిజమే
దానికి అర్థం ఏంటని?
స అంటే కూడుకొన్న,
అష్ట - ఎనిమిది,
దండప్రణామము-
నమస్కారము - అంటే ఎనిమిదింటితో కూడిన నమస్కారం.
ఈ పద్యం చూడండి-

కరయుగములు, చరణంబులు
నురములలాటస్థలంబు నున్నత భుజముల్
సరిధరణిమోపి మ్రొక్కిన
పరగున సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్


రెండు చేతులు, రెండు కాళ్ళు, రొమ్ము, నుదురు,
రెండు భుజాలు మొత్తం ఎనిమిదింటిని నేలకు
ఆన్చి మ్రొక్కిన అది సాష్టాంగదండప్రణామమనబడును-
అని భావం

Wednesday, May 19, 2021

ఆస్తికులు, దైష్టికులు - ఎవరు వీరు?

 ఆస్తికులు, దైష్టికులు - ఎవరు వీరు?




సాహితీమిత్రులారా!


మనం ఎన్నివిన్నా కొన్ని పదాలు తెలియవు

అలాంటివి ఇక్కడ కొన్ని..........

ఆస్తికులు అంటే దేవుడు ఉండాడని నమ్మేవారు అని అనుకుంటాము
                              కానీ మరణానంతర జీవితం మీద  నమ్మకం 
                              కలవారనికూడ అర్థం

నాస్తికులు - దేవుడు లేడని వాదించేవారు.  అనికాదు 
                     మరణానంతర జీవితంపై నమ్మకం లేనివారు.


దైష్టికులు - జరిగేది జరగకమానదని భావించే హేతువాదులు


శాక్తికీ - అంటే బల్లెం ప్రయోగించే స్త్రీ


ఛాత్రుడు - అంటే గురువును ఛత్రంలా పోషిస్తాడని అంటారు 
                                 అంతేకాదు గురువుకు సమీపంలో ఉండేవాడు

ఐకాన్యిక - వేదపఠనంలో పరీక్షపెట్టిపుడు తప్పుల 
                   సంఖ్యను గుర్తిస్తారు. ఒక తప్పు మాత్రమే 
                   చేసిన విద్యార్థిని ఐకాన్యిక అంటారు.

అధ్యయనం అంటే గురువుగారి పెదవులనుండి 
                                  వెలువడిన వాక్కులను పునరుక్తం చేయడం.

వేదనమ్ అంటే గురువుగారి పెదవులనుండి వెలువడిన 
                            వాక్కులకు అర్థం తెలుసుకోవడం 

Monday, May 17, 2021

అయోధ్య అంటే ఏమిటి?

 అయోధ్య అంటే ఏమిటి?




సాహితీమిత్రులరా!



మనం సర్వసాధారణంగా అయోధ్య అనేది
ఒక నగరంగానే అనుకుంటూంటాం. కానీ
దాన్నిగురించి అధర్వణవేదం(10-2-30 తై ఆ1-27-2-3)
లోని ఈ శ్లోకం చూడండి-

అష్టాచక్రా నవద్వారా దేవానాం పూ రయోధ్యా
తస్యాగ్ం హిరణ్మయః స్వర్గో లోకో జ్యోతిషా  వృత్తః
యో వై తాం బ్రహ్మణోవేద, అమృతే నా  వృతాం పురీం
తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః



త్వగా ద్యష్ట(చర్మ, మాంస, రక్త, మజ్జ, అస్థి మొదలైన)
ధాతు రూపములైన 8చక్రములతో
కన్ను మొదలైన 9 ద్వారములతో అయోధ్య అనే
సార్థక నామంతో దేవతా నిలయమైన శరీరం అనే
పట్టణం ఉంది. (శరీరం పుడతూ, చస్తూ జనన మరణ
చక్రపరిభ్రమణం కలది ఈ జననమరణాలతో యుద్ధం
చెయ్యడం అసాధ్యం కాన శరీరానికి అయోధ్య అంటే
గెలువ శక్యంకానిది అనే పేరు ఏర్పడింది.)
ఈ శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి
స్వర్గమనిపేరు.  అది జీవచైతన్యస్వరూపమైన
జ్యోతిస్సుచే ఆవరించబడి ఉంది. ఈ పట్టణాన్ని
ఎవడు బ్రహ్మసంబంధమైనదిగా తెలిసికొంటాడో
వానికి బ్రహ్మ, ప్రజాపతి, ఆయువు, కీర్తి, సంతానం
మొదలైనవానిని ఇస్తారు- అని పై వాక్యముల అర్థం.
దీన్ని బట్టి అయోధ్య అంటే మామూలు పట్టణం కాదని,
శరీరానికే అయోధ్య అని పేరు అని తెలుస్తున్నది.


Saturday, May 15, 2021

పురుషులు ఆభరణాలు ధరిస్తారా!

 పురుషులు ఆభరణాలు ధరిస్తారా!





సాహితీమిత్రులారా!



భాగవతంలోని ఈ పద్యం చూస్తే
పురుషులు ఎక్కడెక్కడ ఆభరణాలు
ధరించేవారని రూఢిగా తెలుస్తుంది

రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతమైగళాభరణమై, సౌవర్ణ కేయూరమై
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘట్టమైనూపుర
ప్రవరంబై, పదపీఠమై, వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్
                                                               (భాగవతము - 8 -627)

శిరోభూషణాలు(తలకుధరించేవి) - కిరీటము
కర్ణభూషణాలు(చెవులకు ధరించేవి)- కుండలాలు,
కంఠాభరణాలు(మెడలో ధరించేవి) - ముత్యాల రత్నాల దండలు,
కూర్పరోపరి భూషణాలు(మోచేతికి పైన
ధరించే ఆభరణాలు) - కేయూరము(భుజకీర్తులు)
బాహునాళీ భూషణాలు(చేతులకు వేసుకునేవి) - కంకణాలు
కటి విభూషణాలు(మొలచుట్టూ ధరించేవి) -తలకము, సూత్రము
పాదాలకు ధరించేవి - నూపురుము
ఇలా అనేక రకాలైనవి మగవారు కూడ పూర్వం ధరించేవారు.

Thursday, May 13, 2021

ముక్కోటి దేవతలు ఎవరు?

 ముక్కోటి దేవతలు  ఎవరు?




సాహితీమిత్రులారా!



విష్ణువు స్వరూపములైన ముప్పది ముగ్గురు
దేవతలనే ముక్కోటి దేవతలు అంటారు.

ఆ దేవతలు -
1. అష్టవసువులు - 8
   1. వరుణ, 2. వృషభ, 3. నహుష, 4. జయ
   5. అనిల, 6. విష్ణు 7. ప్రభాను, 8. ప్రత్యూష

2. రుద్రులు - 11
  1. ఉగ్ర, 2. సోమ, 3. శర్వ, 4. మృగవ్యాధ
  5. బిక్షక, 6. అహిర్ - బుధ్న్య, 7. పినాకీ,
  8. ఈశ్వర, 9. కాపాలిక, 10. భీమ, 11. భిషక్

3. ఆదిత్యులు - 12
   1. ఆర్యమ, 2. మిత్ర, 3. వరుణ, 4. అర్క, 5. భగ,
   6. ఇంద్ర,  7. వివస్వన్, 8. పూషా, 9. పర్జన్య, 10. త్వష్టా,
   11. విష్ణు, 12. అజ

4. ఇంద్రుడు,
5. బ్రహ్మ

మొత్తం = 8 + 11+ 12+ 1 + 1= 33

ఈ ముప్పది మువ్వురు విష్ణు స్వరూపులు.
వీరినే ముప్పదిమూడు కోట్ల దేవతలుగా చెబుతారు.

(శ్రీమాన్ దిట్టకవి నరసింహాచార్య కృత
 విజ్ఞాన కాంతి పుంజాలు నుండి.)