Tuesday, March 31, 2020

ద్రౌపదికి పాండుపుత్రులు?


ద్రౌపదికి పాండుపుత్రులు?




సాహితీమిత్రులారా!

ద్రౌపదికి పాండుపుత్రులు ఏమౌతారు?  అంటే ఏమౌతారు?
భర్తలౌతారు కదా!  ఇంకేముంది. అంటే సరిపోదు.
బావ - మరుదులు అంటే ఎవరు బావ? ఎవరు మరిది?
అందరూ బావలౌతారా?
అందరూ మరదులౌతారా?
ఇందులో ఏముందో
ఈ శ్లోకంలో చూడండి....

ద్రౌపద్యా పాండు తనయా:
పతి దేవర భావుకా:
న దేవరో ధర్మరాజ:
సహదేవో న భావుక:

అంటే ద్రౌపదికి పాండుపుత్రులు
భర్త, మఱది, బావ లౌతారు.
అందరూ భర్తలౌతారు
కానీ ధర్మరాజు మఱిది కాలేడు.
సహదేవుడు బావకాలేడు.
ఇదీ విషయం.

Saturday, March 28, 2020

కవి చమత్కారం - 2


కవి చమత్కారం - 2




సాహితీమిత్రులారా!

కాళిదాసుకు వివాహమైన తరువాత గదిలో  పడుకొని ఉండగా
ఆయన భార్య ఆయన అరసికత చూసి
అస్తి కశ్చి ద్వాగ్విశేషః -  అని అడిగిందట.
 అది ఆయనకు అర్థంకాక
భార్యను అనాదరణ చేశాడని చెబుతారు.
వాగ్విశేషమేమైనా కలదా అని దాని అర్థం.
అంటే ఏమైనా పాండిత్యం కలదా - అని.
తరువాత కాళికాదేవి వరప్రసాదం వలన
పండితుడైన తరువాత భార్యను వీడుకొని
దేశాంతరములకు బోయి భార్యవలననే
తనకు అట్టి విద్యావిశేషములు కలిగెనని
ఆమె మీది విశ్వాసం కలిగి మొట్టమొదట
తనను ఆమె ప్రశ్నించిన ప్రశ్నలో ఉన్న
అస్తి, క్వచిత్వాక్, విశేషః - అను
నాలుగు పదాలను  నాలుగు కావ్యాలలో
మొదట చేర్చి గ్రంథరచన చేసెనని
ఆర్యులంటారు.
కుమారసంభవము మొదటి శ్లోకంలోని
మొదటి పాదం-
అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా- దీనిలో
అస్తి అనే మొదటి మాటను.
మేఘసందేశంలోని మొదటి శ్లోకం
మొదటిపాదం
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారా త్ప్మ్రమత్తః
అనే మాయలో కశ్చి అనే మొదటిమాటను

రఘువంశములోని మొదటిశ్లోకంలోని
మొదటిపాదము
వాగర్థావివసంపృక్తౌ-
లో వాగ్ - అనే మొదటిమాటను,
ప్రయోగించాడు. కాని
విశేషః - అనేమాటను ఏ కావ్యంలో
ప్రయోగించాడో తెలియరాలేదు
ఇది కాళిదాసు రచనా చమత్కారం
అంటారు.

Thursday, March 26, 2020

అందరూ ఒకలాటివారుకాదు కదా!


అందరూ ఒకలాటివారుకాదు కదా!



సాహితీమిత్రులారా!

ఒక కవి అన్యాపదేశంగా చెప్పిన పద్యం ఇది
చూడండి-

రేరే చాతక! సావధాన మనసా మిత్ర! క్షణం శ్రూయతామ్
అంభోదా బహవో వసన్తి గగనే సర్వేపి నైతాదృశా:
కేచిత్ వృష్టిభి రార్ద్రయన్తి వసుధాం గర్జన్తి కేచిద్వృథా
యం-యం-పశ్యసి తస్య-తస్య పురతో మాబ్రూహి దీనం వచ:

మిత్రా!
చాతకమా!
 ఒక్కమాట సావధానంగా విను.
ఆకాశంలో మేఘాలు అనేకములు.
అన్నీ ఒక లాటివేకాదు.
కొన్ని భూమిని ఫలింపచేస్తాయి.
మరి కొన్ని కేవలం ఉఱిమిపోతాయి.
కనిపించిన ప్రతి మేఘం దగ్గర
దీనంగా యాచించవద్దు.
అంటున్నాడు కవి.
నిజమేకదా!

Monday, March 23, 2020

గుట్టెక్కడ?


గుట్టెక్కడ?




సాహితీమిత్రులారా!

ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు
"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే
ఈ పద్యం చూడండి.
ఎంత
చమత్కారంగా ఉందో!

జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్
కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ
పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!
గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే

(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా
మాట్లాడుకోవటానికి నోచుకోలేదట
ఎందుకంటే .........
తలమీద గంగ, చంద్రుడు, మెడలో పాము, నొసట అగ్ని
- ఇన్ని విడవనివి ఉంటే
ఇక గుట్టెక్కడ)

Wednesday, March 18, 2020

కవి చమత్కారం


కవి చమత్కారం






సాహితీమిత్రులారా!

అడిదము(కత్తి)సూరకవికి విజయనగర ప్రభువు
పెద విజయరామరాజుకు అంతగా పడేదికాదని ప్రతీతి.
రాజేమో అహంకారి అది వారికి సహజం సూరనేమో కుర్రవాడు
ఒకసారి తురక సరదారు దండయాత్రకు
వస్తే సూరకవి ఏమన్నాడో చూడండి.

మెత్తనైనట్టి అరటాకు మీదగాక
మంటమీదను చెల్లునే ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల మీద గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీద 

(ముల్లుకు అరిటాకు మీద చెల్లినట్లుగా
మంటమీద చెల్లుతుందా? కాలిపోదూ.
అలాగే రాజుగారి జులుం కింది సరదార్లమీదనేకాని,
నవాబుగారి సేనాపతి బాదుల్లాఖాను మీద చెల్లుతుందా - అని భావం.)

అయితే ఆ దండయాత్రలో రాజుగారు గెలిచారు.
అప్పుడు మళ్ళీ రాజుగారిని ప్రశంసిస్తూ ఈ పద్యం చెప్పాడట.


ఢిల్లీ లోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గులాల్
బల్లాలం బొడిపించి హుమ్మని అరబ్బా నెక్కి పైకొంచు బా
దుల్లాఖానుని బారద్రోలితివి నీ దోశ్శక్తి సూ బాలకున్
మళ్ళింపం దరమౌనె శ్రీ విజయరామా! మండలాధీశ్వరా!

చూడండి అటైనా ఇటైనా ఎటైనా చెప్పగలవాడు,
మెప్పించగలవాడు అడిదము సూరకవి.
సూరకవేకాదు ప్రతిభావంతుడైన కవి ఎవరైనా
ఇలాగే చేయగలరు.
అందుకే కవి ఎటైనా అంటే
రెండు వైపులా పదునే.

Monday, March 16, 2020

కవి ఊహకు అందనిదేది?


కవి ఊహకు అందనిదేది?



సాహితీమిత్రులారా!

ఈనాడు మన వీఐపీలు ప్రధానంగా ముఖ్యమంత్రులు,
మంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధినేతలు
ఒకచోట అల్పాహారం మరోచోట భోజనం, ఇంకోచోట
పానీయం ఇలా స్వీకరిస్తూ వారి దినచర్య జరుగుతూ
ఉంటుంది. కానీ మన కవి పానకాలరాయకవి
తన మనసుకు ప్రబోధిస్తూ
విష్ణువును తలవమని చెబుతూ చెప్పిన పద్యం
తన మానస శతకంలో ఎలా మనరాజకీయ వీఐపీల
దినచర్యను శ్రీమహావిష్ణువుకు ఆపాదించారో గమనించండి -

తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!


తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!

Saturday, March 14, 2020

వ్యాజస్తుతి అంటే?


వ్యాజస్తుతి అంటే?





సాహితీమిత్రులారా!

వ్యాజము అంటే కపటము, చెడ్డతనము అని నిఘంటువు చెబుతుంది
మరి వ్యాజస్తుతి అంటే నిందచేత స్తుతిగాని, స్తుతిచేత నిందగాని
ప్రకటితమైతే దాన్ని వ్యాజస్తుతి అంటారు.

పైకి నిందలా ఉండి పొగిడే దానికి ఉదాహరణ-

ఓ గంగా!  పాపాత్ములైన జనులను కూడ స్వర్గానికి చేర్చే నీకు వివేకమెక్కడిది?

దీనిలో గంగ గొప్పతనమే చెప్పబడుతోంది కాని పైకి నిందలా కనిపిస్తున్నదాకదా

అలాగే పైకి పొగడుతూ లోపల నిందవున్న ఉదాహరణ పద్యం ఇక్కడ చూడండి-
ఇది ఒక బావమరిది తన బావను వేళాకోళం చేస్తున్న పద్యం-

అందమున జూడ రాముబంటైన వాడు,
నాగరకతకు డము వాహనమున కీడు,
శుచికి హేమాక్షుజంపిన శూరుజోడు
వసుధలోలేడు మాబావవంటివాడు

అందంలో మాబావ హనుమంతుడు అంటే కోతి,
నాగరకతకు యముని వాహనానికి సమానం అంటే దున్నపోతు,
పరిశుద్ధిలో హిరణ్యాక్షుని చంపిన శూరునికి జోడి అంటే
వరాహము(పంది)తో సమానం అన్నమాట.
మాబావ వంటివాడు ఈ భూమిమీద లేనేలేడు అంటున్నాడు
బావమరది. చూడండి
ఎంత చక్కగా వేళాకోళం చేశాడో.

చూశారుకదా! వినడానికి ఎంతబాగా పొగిడినట్లున్నది.
అంతర్గతంగా నిందించినట్లుంటుంది.

Thursday, March 12, 2020

ఇచ్చటికేలవచ్చె రుసి


ఇచ్చటికేలవచ్చె రుసి




సాహితీమిత్రులారా!

ఠంయాల లక్ష్మీనృసింహాచార్యులుగారు
శుద్ధాంధ్రరామాయణ సంగ్రహం కూర్చారు
1925లో శ్రీకారం చుట్టి 100 పద్యాలు బాలకాండలో కూర్చారు
కానీ అది అంతటితో ఆగిపోయింది. ఇది అచ్చతెనుగు కావ్యం
ఇందులో  దశరథుని దగ్గరకు విశ్వామిత్రుడు వచ్చి
తన కోరిక తెలిపిన పిమ్మట రాముని పంపే విషయంలో
దశరథుని మనసులో కలిగిన మనోమథనం ఈ పద్యంలో
చూద్దాం. అంటా తెలుగు మాటలే ముచ్చటగా ఎలావుందో
గమనించండి.

ఇచ్చటికేల వచ్చె రుసి, హెచ్చుగ వచ్చిన గోలె తొల్త నే
నిచ్చెద కోరుకొమ్మనుచు నేటికి బల్కితి, బల్కితింక బో
ముచ్చటఁ దీర్చు బిడ్డలను పోరను సోకుల ద్రుంచగోరగా
వచ్చున జోగి యెంతటికి వచ్చెను యిట్టుల నౌత నేరనే

ఈ విధంగా కొనసాగుతూ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునకు
మంత్రాలు ఉపదేశించే ఘట్టంలో ఆగిపోయిందీ కావ్యం.

Tuesday, March 10, 2020

నేడు మసలదు తల్లీ

నేడు మసలదు తల్లీ





సాహితీమిత్రులారా!

అబ్బూరి వరదరాజేశ్వరరావు 
కవితా సంచిక నుండి-

నిరుడు విరిసిన నీలగగనం
నేడు కనపడదమ్మా!
నిరుడు విరిసిన శీతవాయువు
నేడు మసలదు తల్లీ!

నీలిరెక్కల కాలవిహంగం
నీడ జిక్కితి తల్లీ!
జాలికన్నుల కారుచీకటి
మ్రోల నిలిచితి నమ్మా!

ఖంగుమన్నవి మృత్యుదేవత
కాలి యందెలు తల్లీ!
చరమ రాత్రించరుల సన్నిధి
జలదరించితి నమ్మా!

కలల బతుకున గాలిమేడలు
కరిగిపోయిన వమ్మా!
వెలితి కన్నుల వెలుగు కోసము
వెదకికొందును తల్లీ!

స్వేచ్ఛకోరిన పేదరక్తం
వెల్లబారిన దమ్మా!
జనసమరమున పరాజితుడను
సెలవొసంగుము తల్లీ!

ద్వేషబుద్ధిని ధిక్కరిస్తే
దోషమెవరిది తల్లీ!
తిరుగులేనిది నేటి లోకము
నేర మెవరి దమ్మా!

దీన్ని శ్రీశ్రీ రాసిన  "ఏవి తల్లీ" కవితతో పోల్చండి-

ఖడ్గసృష్టి లోని ఈ కవిత చూడండి.
("THE SNOWS OF YESTER YEAR" )
 (ఇది F. Villon  అనుసరణ.)

చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?

కాళిదాస మహా కవీంద్రుని 
కవన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది? చూపించు?

షాజహాన్ అంత:పురములో
షట్పదీ శింజాన మెక్కడ!
ఝాన్సీ లక్ష్మీదేవి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ?

రుద్రమాంబా భద్రకాళీ
లోచనోజ్వల రోచులేవీ!
ఖడ్గతిక్కన కదనకాహళ
కహకహ ధ్వనులెక్కడమ్మా?

ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహు జాగ్రద్బాడబగ్నులు?
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవి తల్లీ?

జగద్గురువులు, చక్రవర్తులు, 
సత్కవీశులు, సైన్యనాధులు
మానవీరులగు మహారాజ్ఞులు
కానరారేమీ?

పసిడిరెక్కలు విసిరికాలం
పారిపోయిన జాడలోవీ?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?

Saturday, March 7, 2020

ఏగుదెంచెను లక్ష్మి సర్వేశునీడ


ఏగుదెంచెను లక్ష్మి సర్వేశునీడ




సాహితీమిత్రులారా!
Image result for gajendra moksham images
మనమందరం ఎక్కువగా పోతన భాగవతంలోని
గజేంద్రమోక్షణమే చదివివుంటాం.
అందులో శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించే సమయంలో
లక్ష్మీదేవి ఏ విధంగా వెళ్ళిందో విష్ణువుతోటి తెలిపే
ఆదిభట్లనారాయణదాసుగారి ఈ పద్యం అవధరించండి-

అంసభాగంబున నాడెడు గొప్ప కొ
            ప్పున సన్నజాజులు పుడమిరాలఁ
జిన్ని కెంజాయ వాల్గన్నులు కమ్మల
            దివిటీల మును నటుల విధమొప్ప
హరికరాకృష్ట చేలాంచలంబున నీవి
            యందునఁ బాణిద్వయంబు మెఱయ
మోము వేకువ చందమామ పోల్కిని వెల్గ
            నధరంబుపై కెంపులలరుచుండఁ
గాలి పావడ జీరాడ కాంచి వీడ
కౌను జవ్వాడ నారద మౌని పాడ
మేచకముతోడఁ  దొల్కరి మెఱుపుజాడ
నేఁగు దెంచెను లక్ష్మి సర్వేశునీడ

Thursday, March 5, 2020

ఆంధ్రకవితా పితామహుని పుత్రిక


ఆంధ్రకవితా పితామహుని పుత్రిక


సాహితీమిత్రులారా!

పోతన భాగవతంలో గజేంద్ర మోక్షణం రాసే సందర్భంలో
"అలవైకుంఠపురంబులో" - అనే పద్యం రాస్తూరాస్తూ
మధ్యలో విడిచి ఆలోచనకోసం బయటికి వెళ్ళగా అది
శ్రీరామచంద్రుడే పూర్తిచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

అలాగే పెద్దనకు సంబంధించి ఒక కథ వుంది.
అది చూద్దాం.
ఒకనాడు పెద్దన
ఈ క్రింది పద్యం రాయడం మొదలు పెట్టాడు.

మృదు తల్పంబు వికారలీలదిగి ధమ్మిల్లంబుఁ జేబూని రా
గద దృగ్జాలముతోడఁ గౌనునులి యూఁగన్మోము మార్వెట్టు చున్
వదలం జాఱిన నీవిఁబట్టుకొని యావామాక్షి యట్లేఁగెఁ......

అని అంతవరకు రాసి ఆపై ఎలాముగించాలో స్ఫురించక తాటాకు,
గంటాన్ని అక్కడ పెట్టి బైటకు వెళ్ళాడట.
పెద్దనగారి కూతురు ఆ   అసంపూర్ణ పద్యాన్ని చదివి
ఇలా పూరించిందట.
                                                                                                                                         " స
త్సదన భ్రాజిత రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్"

తిరిగి వచ్చిన పెద్దన తాను పూరించ దలచిన దానికంటె
ఈ పూరింపు రసవంతంగ ఉన్నదని దానినలాగే ఉంచాడట.
"ఆంధ్రకవితా పితామహు"ని పుత్రిక పండిత పుత్రిక కాకపోవడమా!

Tuesday, March 3, 2020

నీ రక్తనాళాల్లో యూరపు రక్తమే ఉన్నదా?


నీ రక్తనాళాల్లో యూరపు రక్తమే ఉన్నదా?





సాహితీమిత్రులారా!

మనం ఏ వేషంలో ఉన్నా మనం భారతీయులం
అనే విషయాన్ని మరిచిపోలేం కదా
అదే విషయాన్ని అక్బర్ అలహాబాదీ(1846-1921)
అనేకవి భారతీయుణ్ణి నిలదీసిన
కవితావాక్యాలు గమనించండి-

హర్ చంద్ కె కోట్ భిహై పత్లూన్ భిహై
బంగ్లాభీహై పాట్ భిహై సాబూత్ భిహై
లేకిన్ మై తుఝ్ సే పూచ్తా హూ హిందీ
యూరప్ క తెరీ రగోమ్మె కుఛ్ ఖూన్ భిహై

నీకు కోటున్నది. పంట్లామున్నది. భవనమున్నది.
సబ్బుబిళ్ల ఉన్నది. సబ్బు పెట్టె ఉన్నది. అయినా
ఓ భారతీయుడా!  ఆలోచించి చెప్పు.
యూరప్ వేషమయితే అమరిందిగాని
నీరక్తనాళాల్లో యూరప్ రక్తమే ఉన్నదా?

నిజమేకదా మనలో మన భారతీయ రక్తంకాక
అమెరికా యూరప్ రక్తం ఉంటుందా
అంటే మనం భారతీయుల్లాగానే ప్రవర్తిస్తాంకదా

Sunday, March 1, 2020

పిండిరుబ్బంగఁ గన్నుల పండువయ్యె


పిండిరుబ్బంగఁ గన్నుల పండువయ్యె





సాహితీమిత్రులారా!

శ్రీనాథుని పద్యాలు వినని వారు
వాటిపై ఆసక్తి లేనివారు బహుశా
మన తెలుగు సాహితీవేత్తలలో
ఉండరని నాభావన.
అందమైన ముద్దుగుమ్మ
ఒకతె రోటిపై కూర్చొని
పిండిరుబ్బుతుండగా
శ్రీనాథుని కంటబడింది.
ఆమెను గురించిన పద్యం ఇది
ఆస్వాదించండి-

తాటంకయుగధగద్ధగిత కాంతిచ్ఛటల్
                     చెక్కుటద్దములపై జీరువార
నిటలేందు హరినీలకుటిలకుంతలములు
                    చిన్నారి మోమునఁ జిందుద్రొక్క
బంధురమౌక్తిక ప్రకటహారావలుల్ 
                    గుబ్బచన్నులమీఁద గునిసియాడఁ
గరకంకణక్వణక్వణనిక్వణంబులు
                   పలుమారు ఱాతిపైఁ బరిఢవిల్ల
ఓరచూపుల విటచిత్తమూఁగులాడ
బాహుకుశలతఁ జక్కనిమోహనాంగి 
పాఁటఁబాఁడుచుఁ గూర్చుండి రోటిమీఁదఁ
బిండి రుబ్బంగఁ గన్నుల పండువయ్యె

తాటంకాల కాంతి చెక్కపై పడగా
కుటిల కుంతలాలు మోముపై ఆడుతుండగా
దట్టమైత ముత్యాలహారాలు స్తనములపై కదులుతుండగా
చేతికున్న కంకణాల ధ్వని రాతి బండలకుతగిలి వస్తుండగా
ఓరచూపులతో చంచలచిత్తంతో చక్కగాపాటపాడుచూ
రోటిమీద కూర్చొని పిండిరుబ్బుతున్న మోహనాంగిని చూడ
కన్నుల పండుగయ్యిందట -

ఎంత మనోహరంగా వర్ణించాడో కదా!