Showing posts with label కాశీమజిలీకథలు. Show all posts
Showing posts with label కాశీమజిలీకథలు. Show all posts

Saturday, June 26, 2021

కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2

 కాశీమజిలీ కథలు - కొన్ని విషయాలు - 2





సాహితీమిత్రులారా!



కాశీమజిలీ కథల్లో మణిసిద్ధుడు, గోపడు ఇద్దరూ ఊరూరూ

మజిలీలు చెస్తూ వెళుతున్నారు కాశీకి. మధ్యలో కనపడ్డ

వింతలు విశేషాలూ వివరిస్తున్నాడు గోపనికి మణిసిద్ధుడు.

ఇలా వెళుతూండగా ఒకఊరిలో గోడమీద క్రింది పద్యం

చూశాడు శిష్యుడు(గోపడు) ఈ పద్యం పై ఒక బొమ్మకూడ

ఉంది. ఆ పద్యం-


భూపతిఁజంపితిన్, మగఁడు భూరిభుజంగము చేతఁజచ్చె, నే

నాపదఁజెంది చెంది యుదయార్కుని పట్టణముఁజేరి వేశ్యనై

పాపము గట్టుకొంటి, తన పట్టి విటుండయి కౌఁగిలింప, సం

తాపముఁబొంది, యగ్గిఁబడి, దగ్ధనుగా, కిటు గొల్లభామనై

యీ పని కొప్పుకొంటి, నృపతీ వగపేటికిఁజల్ల చిందినన్


దీన్ని చూచిన తరువాత గోపనికి కొండెత్తు కుతూహలం పెరింది

ఈ బొమ్మేమిటి, ఈ పద్యమేమిటి, ఇందులో ఎన్నో సన్నివేశాల

ప్రసక్తి ఉంది. దాని పూర్వాపరాలేమిటి

ఈ గొల్లభామ ఏ భూపతిని చంపింది

ఆమె మగడు ఎందువల్ల పాముకాటుతో మరణించాడు

వారికి పుట్టిన కుమారుడెక్కడ పెరిగాడు

ఆమె వేశ్యగా ఎందుకు మారింది

ఆమె దగ్గరకే ఆమె కొడుకు విటునిగా ఎందుకొచ్చాడు

ఇవన్నీ తెలిసి తెలిసి అగ్నిప్రవేశం చేయకుండా

ఎందుకు చల్లనెత్తుకొంది

అందులోంచి చల్లచిందితే ఏ నృపతి ప్రశ్నించాడు

శిష్యుడు వేసిన ప్రశ్నలన్నిటికి గురువుగారు మణిసిద్ధుడు

పూసగ్రుచ్చినట్లు సమాధానం చెప్పాడు ఇదంతా వింటుంటే

చదువుతుంటే ఎంత ఆసక్తికా కథాకథనం వుందో మదిర

సుబ్బన్నదీక్షితుల గొవ్వభామ కథలో


   ఈ పద్యంలోని సంఘటనలుగాని, ఇందులోని కల్పనలుగాని

సుబ్బన్నదీక్షితులు సృష్టించిన కల్పనలుకాదు. ఇందులోని

కథాకథనమే వారిది. ఈ పద్యం మూలశ్లోకం రసిక జీవనం అనే

సంస్కృత ప్రబంధంలో ఉంది.


ఆ శ్లోకం-

హత్వా నృపంపతి మవేక్ష్య భుజంగదష్టం

దేశాంతరే విధివశాద్ గణికాస్మితాజాతా

పుత్రం భుజంగ మధిగమ్యచితాం ప్రవిష్టా

శోచామి గోపగృబిణీ కథ మద్యతక్రమ్


రసిక జీవనం కంటే ప్రాచీనమైన ఇంకొక సంస్కృత సంకలన గ్రంథం

ఒకటుంది. దానిపేరు ప్రబంధ చింతామణి దాన్లో రెండవ ప్రకరణంలోని

12వ శ్లోకంలో ఉన్న గోపగృహిణీ ప్రబంధం ఈ కథకుమూలమని

చాటుపద్య రత్నాకంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు పొందుపరిచారు.

ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులుగారు మూలశ్లోకాన్ని

వివరాలుతెలిపారట. కాశీమజిలీ కథలు కపోల కల్పితాలు కావని

దీని బట్టి తెలుస్తున్నది.

Thursday, June 24, 2021

కాశీమజిలీకథలు - కొన్ని విషయాలు

 కాశీమజిలీకథలు - కొన్ని విషయాలు




సాహితీమిత్రులారా!




ఒకనాడు ఆబాలగోపాలాన్ని అలరించిన కథలు
కాశీమజిలీకథలు వీటిని మధిర సుబ్బన్నదీక్షితులు
కూర్చారు. ప్రజాబాహుళ్యంలో ప్రచారంలోని కథలకు
మంచి కథనంతో కూర్చాడు మధిర సుబ్బన్నదీక్షితులు.
ఇవి మొదట్లో వ్యానహారిక భాషలోనే వ్రాయబడ్డాయి.
తరువాతి కాలంలో ఇవి గ్రాంథికంలోని మార్చారు.

ఇవి ఎంత ప్రచారంలోకి వచ్చాయో ఈ పద్యం చెబుతుంది.

పండితులైన మెచ్చవలె, పామరకోటికినైన నింపుగా
నుండవలెన్, ప్రబంధమునయోక్తుల నిర్వురకున్ హితంబుగా
కుండిన తత్ప్రబంధమది యొక్క ప్రబంధమె సాధుపాఠకా
ఖండ సుఖ ప్రదం బగుటగా ఫలమా కవితా ప్రసక్తిన్

దీన్ని బట్టి పామరులకుకూడ ఇంపుగా వుండాలంటే
వ్యావహారిక భాషలోనే సాధ్యం. మనకు ఇప్పుడు దొరికే
పుస్తకాలు గ్రాంథికంగా ఉన్నాయి. మరొక విషయమేమంటే
ఇటీవల వీటిని చదువగలిగే సామర్థ్యం ప్రజల్లో తగ్గిందనే
చెప్పవచ్చు అందుకే వీటిని సాధారణ కథల్లాగా అనువదించి
బజారులో ఉంచారు. అంటే ఎంత ప్రసిద్ధమైనవైతేనో
అనువాదాని పూనరుకదా.  పూర్తి విషయంలోకి వస్తే
ఇవి పండ్రెండు భాగాలు 359 మజిలీలు 12 ప్రధాన
కథలతోపాటు 496 ఉపకథలున్నాయి.
వీటినుండే మనకు కొన్ని సినిమాలు కూడ వచ్చాయి
అందులో భామావిజయం, కీలుగుర్రం, చిక్కడు దొరకడు
(కొంత భాగం) మొదలైనవి..ఇలా చెబితే చాలా వున్నాయి.

         మధిర సుబ్బన్నదీక్షితులు (1868-1928) తూర్పగోదావరి జిల్లా
తాళ్లపూడి గ్రామంలో జన్మించారు. ఈయన ఇవిగాక అనేక పుస్తకాలు
వ్రాశారు. అష్టావధానాలు చేశారు. ఈ పుస్తకాల ఆదరణ
చూసి ఆ కాలంలో అనేక కథా పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి కానీ
వీటివలె ప్రసిద్ధం కాలేదు.

1. కాశీమజిలీకథలు - మధిర సుబ్బన్నదీక్షితుల(1898)
2. నిజమైన కాశీమజిలీలు - నంది చలపతిరాజు(1903)
3. శ్రీరంగమజిలీలు - బత్తల లక్ష్మయ్య(1911)
4. కాశీరామేశ్వర మజిలీలు -గుడిపాటి శేషగిరిరావు(1915)
5. రామేశ్వరపు మజిలీలు - కె. వెంకటరంగనాయకమ్మ(1919)
6. కాశీమజిలీలు - నందిరాజు చలపతిరావు(-)