Tuesday, September 13, 2016

నేను - నీవు


 నీవు - నేను 


సాహితీమిత్రులారా!

ఈ రోజు అంటే 13-09-2016 మన సుకవి  అదే మనసు కవి
ఆత్రేయగారి వర్థంతిరోజు అందుకే
ఆయన గురించి కొంత ఆయన కవిత ఇంకొంత
చూద్దాం.

అసలు పేరు - కిళాంబి వేంకటనరసింహాచార్యులు
కలం పేరు - ఆచార్య ఆత్రేయ (ఆత్రేయ - గోత్రం)
పుట్టింది - 07-05-1921
        నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట తాలూకా, మంగళంపాడు గ్రామం
తల్లిదండ్రులు - శ్రీమతి సీతమ్మ, శ్రీ కృష్ణమాచార్యులు

చదువు - ఇంటర్మీడియట్, టీచర్ ట్రైనింగు

ఉద్యోగాలు - అనేకం

వివాహం - 1940లో శ్రీమతి పద్మావతితో

బిరుదలు - మరచిపోయినవి పోగా జనం నోళ్ళలోనిది మనసు కవి
         మే,1989లో సార్వత్రిక విశ్వవిద్యాలయంవారి డాక్టరేట్
మరణం - 13-09-1989 బుధవారం రాత్రి 10గం. మద్రాసులో
     

============================*****************============================

అందలమెక్కి కవ్వించు అందమీవు
అందు కొన చెయి చాచెడి ఆశ నేను

నందనమ్మున విరియు ఆనందమీవు
లోకలోకాల ముంచెడి శోకమేను

గగనవీధిని వెల్గు నక్షత్రమీవు
భువిని మిడికెడి మిణుగురు పురుగు నేను

అంతుతెలియని అపురూప కాంతివీవు
మూలలన్ నక్కు చీకటి ముద్ద నేను 

కలుషముల నెల్ల హరియించు గంగవీవు
పూర్వజన్మల పాపాలపుట్ట నేను

మధురభావమ్ము చిమ్ము సుమమ్ము నీవు
మండిపడు రాగ హోమాగ్ని గుండ మేను

ముట్టుకున్నంత కందెడి మొగ్గ వీవు
మొదలు తుదలేని భయదకాముకుడ నేను

శివుని నెవైన కైలాస శిఖరి నీవు
సిరిని దాచిన శ్రీహరి యురము నేను

సఖుని మదిలోన నమిడిన చలివి నీవు
చలికి మొద్దుబారిన హిమాచలము నేను

ఆటవిడుపు కోరు అల్లరాటవు నీవు
అలుపు సొలుపులేని వలపు నేను

మాటలే రాని పక్షి యారాటమునకు
కరిగి చిలికిన తొలకరి కవిత నీవు

ఆదికవి రాతి ఎదనూచినట్టి క్రౌంచ
మిథునముల ఎల్గులో మూల్గు వ్యధను నేను

తప్పటడుగులు వేయుచు దారితప్పి
జారిపడి ఏడ్చు పాప కన్నీరు నేను

చేయి నందించి గుండెకు చేర్చి సేద
తీర్చ తల్లి కడుపులోని తీపి నీవు

ఇది గేయంకాదు పద్యం తేటగీతి, ఒక్కచోట ఆటవెలది
ఆయన డైరీలో కవితలు పద్యాలు వ్రాసేవారట.
వారి డైరీ లోనిదే ఈ కవిత.


No comments:

Post a Comment