Thursday, September 15, 2016

ఇలాంటి వాళ్ళు ఉన్నారా?


ఇలాంటి వాళ్ళు ఉన్నారా?


సాహితీమిత్రులారా!

భాగవతం నవమస్కందంలో రంతిదేవుని చరిత్ర ఉంది.
అందులో రంతిదేవుడు దానధర్మాలు చేసి చివరకు
అడవిలో సకుటుంబంగా తిరుగుతూ 48 రోజులు నిరాహారుడై
48వ రోజు పాయసము, మంచినీళ్లు బొరుకుతాయి అవి
తన కుటుంబ సభ్యులకు పంచి తినేలోపు ఒక బ్రహ్మణుడు
ఆకలిగొనిరాగా  తన భాగంలోనిది పెట్టి పంపుతాడు అతడు వెళ్ళగానే
మరొక శూద్రుడు వస్తే అతనికి మిగిలినది పెట్టేస్తాడు. చివరికి నీళ్ళు త్రాగే సమయంలో
ఒక చండాలుడు దప్పికతో ఉన్నాను మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోమంటాడు అప్పుడు
అతకు ఎంత దప్పిక ఉన్నా అతనికి నీరు పోస్తాడు. ఆ పోసే సందర్భములోనిది ఈ పద్యం -

అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి; ద్రావుమన్న; రా
వన్న, శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపద
ల్గ్రన్నన మాన్పి వారి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కడు సుమ్ము పుల్కసా!                     
 (ఆంధ్రమహాభాగవతము 9-648)

ఓ అన్నా! అన్నం లేదు కాని తియ్యటి మంచినీళ్ళు ఉన్నాయి.
 దగ్గరకురా! దప్పిక తీరేట్లు త్రాగు. తనతోటి దేహధారులకు ఆపద
 కలిగితే వెంటనే వారి కష్టాలను పోగొట్టి వారిని ఆదుకోవడం కంటే
 మానవులకు వేరే పరమార్థం ఉందా? ఆ పురుషోత్తముడు ఒక్కడే నాకు దిక్కు!
- అని భావం

No comments:

Post a Comment