మధుర స్వప్నము
సాహితీమిత్రులారా!
స్వప్నం అందరం కంటూనే ఉంటాం
కాని ఆ సుందర సుమధుర స్వప్నానికి
అక్షరాకృతి ఇచ్చామా? అందరూ ఇవ్వలేరు
అలా ఇచ్చారు చాలామంది కవులు
అలాంటి కవులలో
మన వేదగిరి వేంకట నరసింహరాయ శర్మగారొకరు.
ఈయన స్వప్నంలో శ్రీకృష్ణదేవరాయలను దర్శించారట
దానితో ఆకృతి దాల్చిన ఖండిక ఇది
చూడండి.
నింగిలో నుండి రేరాజు తొంగి చూడఁ
గలువ జవరాలి మోమునఁ గాంతి హెచ్చ
మెల్ల మెల్లగ వీచెను పిల్లగాడ్పు
రామణీయంబుఁ గద శరద్రాత్రి భువికి
భువనమును మోహకెరటాల ముంచివైచు
పండువెన్నెల రేయి పరుండి యుండి
గాఢ నిద్రార్థినై సుంత కన్నుమూయ
మధురతర స్వప్నముంగంటి మఱువఁజాల
ఆ కలయందుఁ గాంచితిని అంబర చుంబిత సౌధపంక్తితో
శ్రీ కవిరాజితంబులయి చెన్నెలరారు నదీతటంబునన్
వాకొనరాని శిల్పములు వర్ణనఁ జేయగలేని కోటలున్
నా కనులారఁ గాంచితినంత మనోజ్ఞ విశాల పట్నమున్
చెంగు చెంగున ప్రవహించు తుంగభద్ర
యూర్మికల నూగు రాయంచ యొప్పులరసి
తమ్మి పూవులఁ గన హృదయమ్ము నుండిఁ
బొంగె కవనంబు గంగాతరంగ మట్లు
వెడలు చుంటిని పట్టణ వీధులందు
కవులకాణాచి యనఁదగు భువనవిజయ
సభను దరిశింపగాఁ గడు సంబరమున
న్మ్యమై యొప్పు భర్మ హర్మ్యంబుఁ గంటి
రాజరాజుల నోడించు నాజులందు
విశ్వవిఖ్యాతుఁడై విఱ్ఱవీగె నెవఁడు?
అట్టి నరసింహ కృష్ణరాయాధిపుండు
పాలనంబునుఁ గావించు పట్టణమది
వేదమంత్రాశీర్ని నాదముల్వెల యించు
భూసుర ప్రవరులు భాసిలంగ
భార్గవ రాముని పరిహసింపగఁజాలు
సకల సామంతులు సన్నుతింప
కమనీయ మృదుపద కైతలందించెడి
అష్టదిగ్గజ కవులభినుతింప
గంధర్వనిభులగు గాయకాగ్రణు లెల్ల
మధుర గీతంబుల మనవి సేయ
అంగనలుఁజేరి బంగారు హారతులిడ
ఆంధ్రహాటక పీఠంబు నధివసించి
దేవతాధిపు కైవడి తేజమెసఁగ
రమణ కొలువుండె, "శ్రీకృష్ణరాయ నృపుడు"
శ్రీరమ్యంబగు శేషశైలమున వాసింగాంచి భక్తావళీ
ప్రారబ్ధంబులఁ బాపునట్టి హరి తా పద్మావతీదేవితో
సారాచార వివేకవర్తనములన్ సత్కీర్తులంగన్న, మా
ధీరాగ్రేసరు కృష్ణరాయ నృపతిన్ దీవించి రక్షించుతన్
శ్రీకరుఁడగు పరమేశుఁడు
పాకారినుతుండు హైమ భామిని తోడన్
శ్రీకృష్ణరాయ భూవిభుఁ
బ్రాకటమౌ సిరులొసంగి, భవ్యునిఁ జేయున్
సతతము హర్షమ్మున, భా
రతితో పద్మాసనమున రాజిల్ల మునుల్
స్తుతిసేయ మొదటి వేలుపు
మతిమంతుని కృష్ణరాయ మాన్యునిఁ గాచున్
అని ముదంబున నేనిటు లాశుధార
పద్యములఁ జెప్పగా విని ప్రభువరుండు
ఆసనంబునఁ గూర్చుండ ననుమతించి
భాషముఁ జేసె కవిజన భూషణముగ
కవివర నీ వృత్తాంతము
వివరింపగ వేడుచుంటి వీనులెలర్పన్
గవి చంద్రుని రాక సభా
భవనంబు పవిత్రమయ్యె భవ్యుఁడనైతిన్
నరసింహ రాట్కవీంద్రుఁడ
నరనాధ వినంగనెంతు నాదగు పూర్వుల్
సరస కవిసార్వభౌములు
సరసాంతకరణ విమల సౌజన్యనిధీ
పాల సంద్రాన నల కౌస్తుభంబు భాతిఁ
బ్రాభవంబంది నాఁడనో ప్రభువతంస
సరస సంగీత సాహిత్య స్నుతమగు
వాసిఁ గాంచిన వేదగిర్వంగడమున
జనని "సుబ్బమాంబ", జనకుండు "వేంకట
రమణ బుధవరుండు" రమ్యగుణుఁడు
కందుకూరి సీమ కవిత కాకరమగు
జానకమ్మ పేట జన్మభూమి
వ్రాసితి మారుతిస్తవము వ్రాసితినేను కరావలంబమున్
వ్రాసితి బిల్వమాల పదవైభవమొప్ప బుధుల్ నుతింపగా
వ్రాసితి ఖండకావ్యమును వ్రాసితి కొన్ని సుధామయోక్తులన్
ఆసల దీర్చి నన్ను తరితార్థునిఁ జేయుము, "కృష్ణరాణ్ణృపా"!
కవిలు నుతింప విబుధులు కరముమెచ్చ
కరము హర్షించి కవిజన కల్పశాఖి
మందహాసము చెవ్నొంద సుందర తర
పచ్చడంబును పౌఁగప్పి పలికెనిట్లు
లలిత కమనీయ మృదుపద లాలితమయి
తెలుఁగుఁదనమున నీకైత తేజరిల్లె
వెలయఁగల వీవు సాహితీ వీధులందు
రాజితానంద నరసింహ రాట్కవీంద్ర!
అష్టదిగ్గజ కవికోటి కంజలింప
పలికి రీరీతి మృదు ధార లొలుకు నుడుల
ముద్దులొలికెడు పదముల మూటఁ గట్టు
కావ్యములవ్రాసి మించుమో కవికుమార
జయము కన్నడత్రైలింగ్య జగతిపతికి
జయము శ్రీకృష్ణవిభునకు జయమటంచు
వందిమాగధ ఘోష మిన్నందెనంత
సార్వభౌముండు నాటికి సభ ముగంచె
సంతసాంబుధిఁ దేలెడు సమయమందు
కుక్కుటంబులు గొంతెత్తి కూయఁ దొడగె
తండ్రి పఠియించు సుప్రభాతమువినంగ
పడక విడనాడి లేచితిఁ బరవశమున
(కావ్యశ్రీ నుండి)
ఎంత చక్కగా
శ్రీకృష్ణదేవరాయలతో తన గురించి
తన కృతులగురించి
చక్కని వర్ణనలతో అక్షరాకృతి
కల్పించాడు కవిగారు.
No comments:
Post a Comment