తెలుగుభాష - మంజుఘోష
సాహితీమిత్రులారా!
తెలుగుభాష గొప్పదనాన్ని ఎంతమంది
ఎన్నివిధాలుగా చెప్పినా అది సరిపోదు
కాని మనం మనభాషను మనభాషాగొప్పదనాన్ని
చెప్పకుండా ఉండలేం ఎలాగంటే
మన తల్లిని ఎప్పుడూ తలవకుండా ఉండగలమా?
అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు
మనభాష గురించి చెబుతూనే ఉంటారు
ఇప్పుడు మన సాహితీసోదరుడు
కామనూరు రామమోహన్ గారు
తెలుగుభాష - మంజుఘోష అంటున్నాడు
ఆయన మాటల్లో విందాం.
పసిపాప ముద్దుగా పలుకరించినయట్లు
చిలుకలు కమ్మగా పలికినట్లు
విరజాజి లతలెల్ల విరబూసిన నవ్వగా
పులకింత హృదయాన కలిగినట్లు
శారదరాత్రుల చంద్రికా తరగల
తూగుటుయ్యలలోన వూగినట్లు
ఇక్షురసంబు నాపేక్ష మీరగ గ్రోలి
తీయని త్రేన్పులు త్రేన్చినట్లు
కోయిలమ్మ కూకూయని కూసినట్లు
పంచమంబున వీణియ పలికినట్లు
నెమలి పురివిప్పి యెదురుగా నిలిచినట్లు
హాయి గొల్పెడి భాష నా యాంధ్రభాష!
పసిడి పలుకుల మనసార పలుకరించు
పద్య మన్నచో తనువెల్ల పరవశించు
పలుకు పలుకుకూ, మేనెల్ల పులకరించు
తెలుగు భాషకై హృదయము కలవరించు
విమల జీవన శైలుల విశదపరచు
తేట నీతులనేకము తెలియపరచు
మానవతను సంరక్షించు మతినియిచ్చు
అర్థమిచ్చు మరియు పరమార్థమిచ్చు
వెతికి చూడుము సాహితీ లోతులందు
పదము పదమున తీపిని పొందవచ్చు
పద్యమెవరైన మనసార పాడవచ్చు
తీపి తెలియనోడె తెలుగు తేల బలుకు!
No comments:
Post a Comment