Sunday, September 4, 2016

నాకుచున్ సుముఖులై యొసఁగెన్ నిజవత్సకోటికిన్


నాకుచున్ సుముఖులై యొసఁగెన్ నిజవత్సకోటికిన్


సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణుని పరీక్షించాలని బ్రహ్మదేవుడు గోవులను, దూడలను,
గోపాలకుల్ని అంతర్ధానం చేశాడు. ఆసమయంలో బాలకృష్ణుడు గోవుల,
 గోవత్సాల, గోపాలకుల రూపాలు ధరించి తన విశ్వమయతను
బ్రహ్మకు తెలియజేస్తాడు.
ఆ సందర్భములోని పోతన పద్యం చూడండి.

పాయని వేడ్కతో నునికిపట్టులకుం జని గోవులెల్ల నం
బేయని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచతిల్లి పె
ల్లై యతిరేకమై పొదుగులం దెడ లేక స్రవించుచున్న పా
లా యెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్
                                                 (ఆంధ్రమహాభాగవతము - 10-518)


ఆవులు వీడిపోని సంతోషంతో తాము ఉండవలసిన
స్థానాలకు వెళ్ళి 'అంబే' అని తమ దూడల్ని పిలుస్తున్నాయి.
హుంకారంతో ఆ వత్సములను సమీపించాయి. వాటి వాసన చూస్తూ
ఆ ఆనందంవల్ల మూత్రవిసర్జన చేస్తున్నాయ్. తమ సంతానంపై ప్రేమ
ఎక్కువైపోగా, వాటి పొదుగుల్లో పాలు ఎక్కువై మరీ ధారాళంగా స్రవించసాగాయి.
అవి తమ బిడ్డల్ని నాకుతూ అనురాగవతులై వత్సములకు పాలిచ్చాయి - అని భావం.

No comments:

Post a Comment