క్రోధము
సాహితీమిత్రులారా!
మానవులకు శత్రువులు ఆరుగురు
వాటిని అరిష్ట్వర్గములు అంటాము.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేవి ఆరు.
వీటిలో కోపం అదే క్రోధం గురించి
వేదగిరి వేంకటనరసింహరాయశర్మగారి ఖండిక చూడండి.
మొదట కోపానికి నమస్కారం చేసి మిగిలినవి
చెబుతున్నారు వేదగిరివారు.
క్రోధమ! కామాదులు నీ
సోదరును మాట నిజము శోధింపకుమీ
బాధింపకు వేధింపకు
సాధింపబోకు మమ్ము సాష్టాంగ నతుల్
అలుక, కస్సుబుస్సు ఆగ్రహంబును, కుస
రుస, చురచుర, కినుక రూఢికెక్కె
చిఱ్ఱు బుఱ్ఱు మఱియు చీకాకు, కొరకొర
కోప మనెడు పేర్లుఁగూర్చి రిలను
కోపమ పెద్దలు నిన్నిల
కాపురుషుని లక్షణంబుగాఁబలికి రహో!
శాపమునకు మూలమవై
కోపమ! పరమార్థతతినిఁగూల్చెదవుఁగదా!
పన్నులు పటపట కొరుకుట
కన్నులు యెరుపెక్కుటయును గంతు లిడుటయున్
మిన్నందు నట్లు వాగుట
తన్నుట, తన్నులనుఁదినుట తథ్యము నీకున్
పరుషములనుఁబలికించుచు
దురితములను ప్రోత్సహించి దుందుడుకొప్పన్
మురియుచు నుందువు నిరతము
సరియెవ్వరు? కామ మోహ సహజన్ములెగా!
అతి చేరువ మౌఢ్యమునకు
వ్యతిరేకము సజ్జనులకు యతివర్యులకున్
పతనంబునకును మార్గము
మతిమంతులఁజేర చెలిమి మాయమొనర్చున్
అహమునుఁబెంచును నిరతము
సహనంబును చంపు శీల సంపద నణచున్
ఇహపర సుఖములఁద్రుంచును
మహనీయులనయిన మందమతులనుఁజేయున్
సుడిగాలి వలెనుఁదిరుగుచు
కడు భీకరమూర్తి వగుచు కనుపించెడి, ఓ
మిడిమేలపు దొర క్రోధమ
చిడిముడిపాటేల? బుధులు ఛీ! ఛీ! యనరే!
పురహరుఁడును మును లంకా
పురహరుఁడును కాల్చరయిరి పూనికతో నిన్
ఖరహరుఁడు కూల్చడయ్యెను
మురహరుఁడగు చక్రి మౌనముద్ర వహించెన్
తుదముట్టింపగఁజాలవు
గదలు కృపాణములు శూల కార్ముకములు నిన్
పదునుఁగల కుఠారమ్ములు
బెదరని మొనగాడనివీవు వీసంబయినన్
జినుఁడును గౌతమబుద్ధుఁడు
ఘనుఁడగు నయ్యేసు క్రీస్తు 'గాంధి'యు నెహ్రుల్
నిను గెలిచి విజయకేతన
మును నాటిరి, వారు పుణ్యపురుషులు జగతిన్
నీమూలమునఁగదా! నిజముగా "కాశిని"
శపియించె మును పరాశరసుతుండు
నీమూలముఁగదా! నిజముగా భీముఁడు
ఊరువుల్విరిచె సుయోధనునకు
నీమూలమునఁగదా! నిదురించు పాపలు
హతులైరి ద్రోణుని సుతునిచేత
నీమూలమునఁగదా! నిజముగా గాధేయ
దుర్వాస మౌనులు దోషులయిరి
నీ మహిమ నెన్నగాఁజాల కామ లోభ
మోహమద మత్సరములతో పొందొనర్చి
ఆటలాడుచు నుంటివి అహహ! ఏమి
క్రోధమా! నీవుయెంతటి కుటిలమతివి
No comments:
Post a Comment