Monday, September 12, 2016

భక్తి సంభజింతురీ పద్మబంధు


భక్తి సంభజింతురీ పద్మబంధు


సాహితీమిత్రులారా!

మయూరుని సూర్యశతకంలోని
ఈశ్లోకాన్ని చూడండి

సిద్దై: సిద్ధాన్త మిశ్రం, శ్రితవిధి విబుధై: చారణై శ్చాటు గర్భం
గీత్యా గంధర్వముఖ్యై:, ముహు రహిపతిభి ర్యాతుధానైర్యతాత్మ
సార్ఘ్యం సాధ్యై: మునీంద్రై ర్ముదిత తమమనో మోక్షిభి: పక్షపాతాత్ - ప్రాత:
ప్రారభ్యమాణ: స్తుతి రవతు రవిర్విశ్వవంద్యోదయో వ: 
                             (సూర్యశతకం - 81శ్లో.)

ఈ శ్లోకభావం  శ్రీనాథుడుని కాశీఖండంలో
3వ ఆశ్వాసంలోని 174 పద్యంగా
మనోహర రూపం దాల్చింది
ఆ పద్యం -

సిద్ధాంత సంశుద్ధి సిద్ధ సంఘాతంబు
                         విధ్యుక్త పరిపాటి విబుధకోటి
చాటు ధారాప్రౌఢిఁజారణవ్యూహంబు
                         కిన్నరవ్రాతంబు గీరసరణి
ఖచర సంఘము విశృంఖలవచోవైచిత్రి
                         యాతుధానశ్రేణి యధికభక్తి
గరుడలోకము నమస్కారవాక్యంబున
                         నేకాగ్రమతి దండశూకసమితి
ప్రతిదినంబునుఁ బ్రాతరారంభవేళ
నిర్ణిబంధన నిరుపాధి నిరవగాధ
నిర్ణిరోధ నిరాఘాట నిరుపమాన
భక్తి సంభజియింతురీ పద్మబంధు

ఈ పద్యం శివశర్మ అనే భక్తుని విష్ణుదూతలు దివ్యరథంలో
విష్ణులోకానికి తీసుకుపోతూ దారిలో కనిపించిన సూర్యలోకాన్ని
చూపుతూ దేవతలంతా సూర్యుణ్ణి ఎలా పూజిస్తారో వివరించే పద్యంగా
ఆ శ్లోకభావాన్ని మార్చారు శ్రీనాథుడు.

శ్లోకభావం -

అదిగో సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు.
యోగీశ్వరబృందం హృదయపూర్వకంగా
సూర్యుని ఆహ్వానం పలుకుతోంది
సిద్ధపురుషులు సిద్ధాంతభాగంతీసి
విధిహితంగా వినయాంజలి ఘటిస్తున్నారు.
దేవతాసమూహం వేదోక్తంగా ప్రమాణాలు చేస్తోంది.
చారగణాలు స్వామి గుణవర్ణన కావిస్తున్నవి.
గంధర్వవర్గం మనోహరమంజుల మధురగానం ప్రారంభించినది.
పన్నగరాజులు పడగలు విప్పి ప్రణమిల్లుతున్నారు.
యాతుధానులు ఆత్మనిగ్రహంతో నమస్కారాలు చేస్తున్నారు.
(యాతుధానులు - రాక్షసులు)
సాధ్యులు సాంజలులై అర్ఘ్యప్రదానం చేస్తున్నారు.
మహామునీంద్రులు ప్రసన్నహృదయాలతో సంస్తుతిస్తున్నారు.
యోగీంద్రులు స్వాత్మభావనతో ప్రశంసిస్తున్నారు.
అటువంటి శుభసమయంలో విశ్వవంద్యుడైన
రవిరాజు మెల్లమెల్లగా  వేంచేస్తున్నాడు.
ఆదిత్యుడు అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాడు - ఇది భావం.

No comments:

Post a Comment