మన గురజాడ
సాహితీమిత్రులారా!
మన కరుణశ్రీగారి మాటల్లో
మన గురజాడ చూడండి.
ఎవ్వ రీ నవ్య సాహిత్య వైతాళికులు!
ఎవ్వ రీ భవ్య సాహిత్య సంచాలకులు!
ఎవ్వ రీ దివ్య సాహిత్య నవ నందనము
ముద్దుముద్దుగ తీర్చిదిద్దు వనపాలకులు!!
వ్యావహారిక భాష కావాహనము పల్కి
యావదాంధ్రుల నాల్కలందు తేనెలు చిల్కి
అందాల ఆణిముత్యాల సరముల కల్పి
ఛందాలు కూర్చు స్వచ్ఛంద కవితా శిల్పి!!
హృదయమున సరిక్రొత్త ఊహ రేకెత్తించి
ఉదయమును మేల్కొల్పు ఉత్తమ కళావేత్త
చకచకా గతము చీల్చుకు భవిష్యత్తులో
కాలుబెట్టిన నిత్యకల్యాణ యుగకర్త!!
హాస్య రసమును ప్రజల ఆస్యాలపై నిలిపి
లాస్యాలు నేర్పు కన్యాశుల్క నిర్మాత
జగ మెఱుంగుల నవ్యసాహిత్య మందించు
జగ మెఱింగిన ప్రజా సారస్వత విధాత!!
తళుకు చెక్కిళ్ళ పుత్తడిబొమ్మ
చిన్ని గుండెలలోని కన్నీటి కెరటాలు
పలుకు పలుకున పొంగి పై పైకి ప్రవహింప
తిలకించి ప్రకృతియే పులకించిపోయింది!!
తలపోసి కొత్తపాతల మేలు కలయికను
కొలబోసి సరిపాళ్ళు కలబోసిన యశస్వి
ప్రజలలో నిజదేశభక్తి రేకెత్తించి
ధ్వజమెత్తి చెడుగుపై దండెత్తిన మనస్వి!!
ఎవరొహో యీ నవ్య కవితా భగీరథులు!
ఎవ రీ నవీన మానవతా మహారథులు!
జవసత్వముల పాంచజన్యంబు పూరించు
నవ కురుక్షేత్ర విప్లవ విజయసారథులు!!
(ఉదయశ్రీ నాల్గవభాగం నుండి)
No comments:
Post a Comment