Thursday, September 8, 2016

వికచవారిరుహానన రమ్ము రమ్మికన్


వికచవారిరుహానన రమ్ము రమ్మికన్


సాహితీమిత్రులారా!


కవిచంద్ర వేదగిరి వేంకట నరసిహరాయశర్మ గారు
కవితాకన్యను పిలిస్తూ ఎదురుచూపులు చూస్తున్న
ఈ ఖండిక పేరు ఎదురుచూపు 
ఇది ఖండకావ్యం(కావ్యశ్రీ లోనిది) చూడండి.

నీ దరహాస చంద్రికలు నీ కనుబొమలు నీదు చూడ్కులున్
నీదు కుచద్వయంబు మఱి నీదు మనోహర బాహుయుగ్మమ్మున్
బాధితుఁజేసె నన్నలరు బాణుని వాడి శరంబులన్ సదా
వాదములేలనో! వికచవారిరుహానన! రమ్ము! రమ్మికన్


సుందరి! నీకు సాటియగు సుందరులం గననైతి నెచ్చటన్
చందురుఁబోలు నెమ్మొగము చక్కని మక్కువఁ గొల్పు భాషణల్
బంధితుఁజేసి వైచినవి; భామిని! నా హృదయాపహారిణీ!
పొందెద నిన్నుఁగూడి సురభూగములన్ మధురానుభూతులన్

మల్లెలు సన్నజాజులను మాలతులన్ విరజాజి బంతులన్
దెల్ల గులాబులం గలిపి తేజ మెలర్పగ కొప్పుఁబెట్టి; బల్
మెల్లగ గున్న మావికడ మేలము లాడు నిన్నుగాంచి, నా
యుల్లము సంతసాంబునిధి నూగుచునుండె, పయోరుహాననా!

చక్కఁ దనమును వెదఁజల్లు సత్యవీవు
నయన వాగురఁ జిక్కిన నంద సుతుఁడ!
పండు వెన్నెల కన్నుల పండువాయె
రమ్ము బృందావనికి శరద్రాత్రినేడు

చేయి చేయిఁ గలిపి సెలయేటి తీరాన
గున్నమావి చెట్ల గుబురులందు
ఆశలెల్లఁదీఱ నానంద వార్నిధి
నోలలాడరమ్ము! ఓ లతాంగి

కోమలీ! మున్ను నే రంగు కుంచెఁబూని
హృదయమున గీచుకొన్న నీ మధురమూర్తి
చెరిగి పోలేదు నేటికి తరుగలేదు
మాటి మాటికి నీకనుమానమేల?

మరుని దావాగ్ని కీలల మానసంబు
కుమిలిపోవుచు నున్నదో కువలయాక్షి!
మధుర రాగామృతముఁజల్లి మదికి సుంత
శాంతిఁ గలిగింప వేడెద! చంద్రవదన!

నాటి పెద్దన కావ్యరత్నాల మేడ
కాపురమున్న గంధర్వకాంతవేమొఁ?
గాకయున్నను నిజమిది కమలనేత్ర!
భవ సంజాతు నారవ బాణమీవు!

రసతరంగిణి వీవు! రాజహంసను నేను;
              క్రీడింపగా రమ్ము కీరవాణి!
గోపకామిని వీవు, గోపాలుఁడను నేను
              కూడియాడుదమింక, కువలయాక్షి!
వరవల్లకివి నీవు వైణికుండను నేను
        పాడి యాడుదమింక ప్రణయగీతి
కావ్యలక్ష్మివి నీవు కవి కుమారుఁడ నేను
        కదనుఁద్రొక్కించెద కలికి మిన్న!

కమ్మగాఁ బాడు మన కోకిలమ్మ పాట
కర్ణపుటముల కానందకరముఁగాగ
కోమలీ! రమ్ము! నీ ప్రేమ కొల్లఁగొందు
కైత పూఁదోటలో నిన్ను కౌగిలించి

No comments:

Post a Comment