Tuesday, September 27, 2016

నీకుమారులు మోక్షవిరోధులా!


నీకుమారులు మోక్షవిరోధులా!


సాహితీమిత్రులారా!


డా. వానమామలై వరదాచార్యులుగారి
శ్రీ స్తవరాజ పంచశతిలో 5వది
శ్రీనృకేసరీ, శ్రీహరీ
మకుటాలతో కూర్చారు.
దానిలోని 39, 40 వ పద్యచమత్కారం వ్యాజస్తుతిలో
ఎంతచక్కగా ఉన్నదో చూడండి.

నీరజనాభ ప్రాణులకు నీవన మోక్షమిడం దలంతు వా
లారసగర్భుడన్ మరుఁడు స్వామి భవత్ సుతులయ్యు ముక్తి సం
స్కారవిరోధులై సకల సత్వములం దగ సృష్టకార్య సం
చారులుగా నొనరుర్తు రిది చాల విచిత్రము శ్రీనృకేసరీ! (39)

ఓ కమలనాభా! నీవేమో ప్రాణులకు మోక్షమివ్వాలనుకుంటావు.
నీకుమారులైన బ్రహ్మ, మన్మథులు ముక్తికి విరోధులా అన్నట్లు
సకల ప్రాణులకు సృష్టికార్యోన్ముఖలుగా చేస్తున్నారు ఇదేమి విచిత్రముగా
ఉన్నది స్వామీ! నృకేసరీ!


ధనధాన్యముల నాసఁ జూపుదురు శ్రీధాత్రీ సతుల్  నిత్యమున్
వనితాలోకము వంక కీడ్చు మము దేవా  నీసుతుండంగజుం
డును నీవో మరి వారి నేమి యన వెప్డున్ మమ్ము శిక్షింతు మా
ఘన పంకమ్ముల  నూడ్చు నీ దుహిత శ్రీగంగమ్మయే శ్రీహరీ! (40)

శ్రీదేవి భూదేవీ నీకు భార్యలై కూడ ధనమునొకరు
ధాన్యమునొకరు ఆశ చూపుతున్నారు
ఓ దేవా!  నీకుమారుడైన మన్మథుడున్నాడే -
అతడు మమ్ములను స్త్రీ వ్యామోహము వంక కీడుస్తున్నాడు
నీవు వీరందరినీ ఏమనవు మమ్మలినే శిక్షిస్తావు
నీకుమార్తె గంగమ్మే మాపాపాలను పోగొడుతున్నది స్వామీ! నరహరీ!


No comments:

Post a Comment