Thursday, August 25, 2016

కారుచీకటివంటి చోరులను తెగటార్చి....


కారుచీకటివంటి చోరులను తెగటార్చి....


సాహితీమిత్రులారా!


సంస్కృతంలో మయూరకవి సూర్యశతకం చేశాడు.
దాన్ని అనేకమంది అనేక భాషల్లోకి అనువదించారు.
అలా అనువదించినవారిలో తెలుగువారు ఉన్నారు.
మయూర క్రేంకృతి పేరున
జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రిగారు అనువదించారు
అందులోని రెండవ శ్లోకం అనువాదం ఇక్కడ చూద్దాం.


భక్తిప్రహ్వాయ దాతుం ముకుళపుటకుటీకోటర క్రోడలీనాం
లక్ష్మిమా క్రష్టుకామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే యే
కాలాకారాంధకారాన సపతిత జగత్సాధ్వసధ్వంస కల్యా:
కల్యాణం వ: క్రియాసు: కిసలయరుదస్తే కరా భాస్కరస్య

సూర్యుడు తన భక్తుల్ని శ్రీమంతుల్ని చేద్దామని లక్ష్మీదేవికోసం వెదకసాగాడు.
ఈ వెదకులాటలో సూర్యుడు కాస్తా కనుమరుగయ్యాడు.
అంతలో అంధకారం వ్యాపించింది. కమలాలు ముడుచుకు పోయాయి.
తిమిరాసురుడు లక్ష్మిని నళిన గుహల్లో బందీ చేశాడు.
లోకం చీకట్లో చీకాకై పోయింది.

జగత్తుకే కన్నైన కమలబాంధవుడు లక్ష్మికి
విముక్తి కలిగించటాని కంకణం ధరించాడు.
ఉపకారానికి ఉపక్రమించాడు.
ఆ క్షణమే అంధకాసురులపై దండెత్తాడు.
తన సహస్రకిరణాల వంటి బాణాలనువేసి
తిమిర సైన్యాన్ని పారద్రోలి తిమిరాన్ని అంతంచేశాడు.
లోకం భయాన్ని వదలింది.

పద్మవనాలు వికసించాయి.
లక్ష్మీదేవి కళకళలాడుతూ భక్తుల్ని కటాక్షించింది.
విష్ణవు వక్షస్థలంపై లక్ష్మి ప్రకాశించింది.
భక్తులకై లక్ష్మిని విడిపించటం -
భార్యాభర్తల్ని కలపటం -
అంధకారాన్ని హరించటం
ఆర్తులను ఆపదల్లో ఆదుకోవడం అనేవి -
ఆదిత్యునికి అతి సహజగుణాలు.

లోకమంతా ఉత్సాహకాంతులు వెల్లివిరిశాయి.
మంగళతోరణాలు ద్వారాలపై మిలమిలలాడాయి.
మామిడి చిగురాకు తోరణ కిరణాలు దశదిశలా వ్యాపించాయి.
దేవాలయాల్లో మంగళతూర్యనాదాలు మ్రోగాయి.
స్వామి దర్శనమిచ్చాడు. లోకానికి మేలు కలిగింది.

ఈ భావంతో కూర్చిన పద్యం ఇది చూడండి.

ముకుళిత పంకజమ్ములలోన బందియౌ 
                   ఇందిర చెరవిడిపించదలచి
ఆ సుందరీమణి నత్యంత హర్షాన
                   శ్రీవిష్ణుమూర్తి కర్పించ నెంచి
ముదముతో రాజీవ హృదయమ్ము విచ్చగా
                   నీటుగా తగిన ఏర్పాటుచేసి
కారుచీకటివంటి చోరుల తెగటార్చి
                   జగతికి శ్రేయమ్ము సలుపగోరి

పచ్చనాకుల తోరణ పంక్తినుండి
అరుణకిరణాలు లోకాన బరపి నేడు
వచ్చుచున్నది దివ్య దివాకరార్చి
అనుజ! పల్కుమా! వేగమ్ము స్వాగతమ్ము!

1 comment:

  1. చాలా చాలా అద్భుతమైన వర్ణన మాస్టారు... సూర్య శతకములో మిగిలిన పద్యాలూ కూడా వివరించగలరు

    ReplyDelete