వారకామినుల వీక్షల్ నీ వపేక్షింతువే!
సాహితీమిత్రులారా!
ఈ పద్యం గణపవరపు వేంకటకవి రచించిన
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసములోనిది చూడండి.
బంధుద్వేషదవాగ్ని గంధవహముల్ బాపావలంబాజ్ఞతా
గ్రంధుల్ సంచిత విత్తభూరుహకుఠారంబుల్ సుసంసారజీ
ర్ణాంధుప్రస్పుట పాతహేతువులు వేదాంతజ్ఞధైర్యాబ్జినీ
గంధేభంబులు వారకామినుల వీక్షల్ నీ వపేక్షింతువే!
(ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము -681)
కవి ఇందులో వేశ్యాస్త్రీల చూపులను వర్ణిస్తున్నాడు చూడండి.
వేశ్యల చూపులు బంధుజనుల ద్వేషమనే
కార్చిచ్చునకు వాయువువంటిది.
ఇది చేరడంవల్ల మంటలు ఇంకా ప్రజ్వరిల్లుతాయి.
వేశ్యాలోలుడైన వానికి బంధువులు ద్వేషించడం ఎక్కువౌతుందని సారాంశం.
వేశ్యల పూపులు పాపాత్ముల అజ్ఞానానికి కూడళ్లు
అంటే వేశ్యాలోలుడు జ్ఞానంకోల్పోయి
పాపానికి ఒడిగడతాడని ఫలితార్థం.
సంపదలు అనే చెట్లపాలిట గొడ్డళ్ళు వేశ్యచూపులు
వాటివల్ల సంపదంతా నిర్మూలమౌతుందని సారాంశం.
పచ్చనిసంసారాలు పాడుపడిన
నూతుల్లో పడిపోవడానికి కారణాలౌతాయి.
వేశ్యాలోలుడు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండటంవల్ల
కుటుంబాలు కూలిపోతాయి అని సారాంశం.
వేదాంతవేత్తల ధైర్యమనే పద్మలతలకు
మదగజం వంటివి వేశ్యాచూపులు.
ఎంతటి వేదాంతినైనా తమచూపులతో
తిప్పుకుంటాయని సారాంశం.
ఎన్నివిధాలైన చూపులో
వెంకటకవి విపులంగా వివరించారు.
No comments:
Post a Comment