Friday, August 19, 2016

త్రోవదొరికిన వట్టి గందోళిగాడు


త్రోవదొరికిన వట్టి గందోళిగాడు


సాహితీమిత్రులారా!

పద్యాలలో హాస్యాన్ని ఉత్పాదింప చేసినవారిలో
తిరుపతివేంకటకవుల శిష్యులు
మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారొకరు.
ఆయన గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం హీరో
గిరీశం మీద చెప్పిన పద్యం చూడండి.

గొంగడి పురుగు కట్టింగు మీసలవాడు
        గంపశ్రాద్ధపు తలకట్టువాడు
ఎపుడు కాఫీ దుకాణపుఠేవిణీవాడు
      సిగరుపీలుపు బుగబుగలవాడు
పైపటారమును లోపలలొటారము వాడు
       పట్టుతప్పిన చలోభాయిగాడు
తుదమొదల్ లేని గాడిద గత్తరవాడు
        జలసాలతో పడి చచ్చువాడు
తడి యనెడి దున్నచో చేత తుడుము మొదలు
దేవతార్చన వర కొక్క తీరువాడు
వలను పడకున్న శ్రీశుకు వంటివాడు
త్రోవ దొరికిన వట్టి గందోళిగాడు

(గిరీశం ఎలాంటివాడంటే, ముక్కు మొదట్లో గొంగళిపురుగువలె,
ప్రెంచి కట్టింగు నల్లని మీసాలతో ఉండేవాడట.
అతని తలకట్టు గంపశ్రాద్ధం కొలుపువంటిది,
ఎల్లపుడూ కాఫీహోటలులో తిష్ఠవేసి, సిగరెట్టు పొగవాసనలు
బుగబుగ వ్యాపింపజేసేవాడు, పైన పటారం లోన లొటారంగా, దబాయిస్తూ,
పట్టుతప్పితే, మళ్ళీ కనబడకుండా మాయమయ్యేవాడు.
మొదలు చివర, క్రమంలేని గాడిద కొలువు, జల్సాలంటే జారిపడి చచ్చేవాడు.
బండతడి గుడ్డతో, ఒకడే అన్నిపనులు చేసేవాడు,
వీలుపడితే, విడవకుండా ఉపయోగించుకొవడం,
లేకపోతే శుకబ్రహ్మ దారే, దారిదొరికితే మాత్రం
తోలుబొమ్మలాటలోని గందోళి(హాస్య)గాడు సుమా!
గిరీశం అలాంటి విలక్షణవ్యక్తి.)

(దీనిలోని కొన్ని దేశీయ నుడికారాలు
ఇప్పటివారికి కొత్తగా కనబడతాయి.
అవి ఆకాలంలో వాడే నుడికారాలు.)

No comments:

Post a Comment