Saturday, August 27, 2016

ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్య మబ్బదే?


ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్య మబ్బదే?


సాహితీమిత్రులారా!


మనదేశంలో పొగాకు అడుగు పెట్టిన దగ్గరనుంచి
చుట్ట నస్యం రూపాల్లో మొదట, బీడీ, సిగరెట్ గా
తరువాత ప్రజలను ఆకర్షించింది.
నస్యానికి సభాపూజ్యత రావడం వల్ల దానిమీద
పద్యాలు చాలామంది రాశారు. వాటికి సంబంధించిన చాటువులను
వేటూరివారు, దీపాలవారు సేకరించి ప్రకటించారు.
నస్యం తయారీ పద్ధతిని సూచిస్తూ ఒక కవి
ఇలారాశాడు చూడండి.

మట్ట పొగాకులో నడుమ మందము గల్గినచోట తీసి తా
పట్టుగ పక్వశుద్ధిగను బాగుగ కాచి ఒకింత సున్నమున్
బట్టన వ్రేల నొత్తి తన బల్మికొలందిగ నల్చి నస్యమున్ 
బట్టపు డబ్బిలో నునిచి ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్యమబ్బదే?

ఇది ఇలా అయితే కృష్టిపాటి వేంకట సుబ్బకవి అనే ఆయన నస్యప్రియుడు.
ఆయనకు ఓబళాచార్యుడనే పండితునికి జరిగిన సంభాషణ
తెలుగు సంస్కృత పద్యాలుగా వెలిశాయి.

కృష్టిపాటి వేంకట సుబ్బకవి -

నస్యము లేదుగా పవననందన దివ్య కటాక్ష వీక్షణా
వశ్య వరప్రభావ విభవానుభ వాద్భుత భూమి భృద్ధను:
కైశ్య ఘుమంఘుం ఘమిత గాంగఝరీ విలుఠత్తరంగ సా
దృశ్య కవిత్వ తత్వ ముఖరీకృత వేంకట సుబ్బ సూరికిన్

అనగా
ఓబళాచార్యుడు -

కోకో! నస్య మవస్య మీశ్వర జటాకోటీరటద్యోధునీ
ప్రాకాశోర్మి సకాశ పేశల సుశబ్ద ప్రక్రియోపక్రమా
నేక గ్రంథ నిబంధ నార్జిత సమున్నిద్ర ప్రతాప ప్రధా
స్తోక శ్రీకర కృష్టిపాటికుల సింధు స్వచ్ఛ చంద్రోదయా!

అన్నాడట.

బుక్కపట్టణం తిరుమల తాతాచార్యుడు
నస్యం ఇవ్వని శాస్త్రిని ఎలా దూషించాడో చూడండి.

శాస్తుర్లట ఈ నీచుడు
పాస్తొత్తుల మగడు వీని పరువేమోకా
కాస్తింత నస్యం మడిగిన
నాస్తే యని పలుక వీని నాలుక పీకా 

అన్నాడట.
చూడండి
నస్యం ఎంతగా మాదకద్రవ్యంలా ఉండినదో ? ఆకాలంలో. 

No comments:

Post a Comment