ఒక పుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ.....
సాహితీమిత్రులారా!
యథావాక్కుల అన్నమయ్య కృష్ణానదీతీరంలో
సత్రశాలలోని మల్లికేశ్వరుని సేవించి
సర్వేశ్వరా శతకాన్ని రచించాడట.
అది రచించే సమయంలో ఆయన ఒక ప్రతిజ్ఞచేసికొని
వ్రాయటం ప్రారంభించాడట.
అదేమిటంటే తను వ్రాసిన పద్యం కృష్ణానదిలో వేస్తే
అది ఎదురీది వస్తే తను తీసుకొని
తరువాత పద్యం మొదలు పెడతాడు
అదిరాక పోయిన గండకత్తెరతో తలను ఉత్తరించుకుంటాడట.
అలానే జరుగుతూంది పద్యాలు రాస్తున్నాడు
ఈ క్రింది పద్యం నదిలో వేశాడు అదిరాలేదు వెంటనే
గండకత్తెర అందుకొన్నాడట.
ఆ పద్యం చూడండి.
తరులం బువ్వులు పిందెలై యొదవి, తజ్జాతితోఁ బండ్లగున్
హర మీపాదపయోజ పూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ, నశ్వములౌ, ననర్ఘమణులౌ, గర్పూరమౌ, హారమౌ
దరణీరత్నములౌఁ, బటీరతరలౌఁ, దధ్యంబు సర్వేశ్వరా!
ఇంతలో పసులకాపరి ఆ తాటియాకు తెచ్చి ఇవ్వగా
ఆ ప్రయత్నము ఉపశమించెను. అయితే అందులో
ఈయన వ్రాసిన పద్యం బదులుగా మరొక పద్యం ఉంది
అందులో ఆ పద్యం........
ఒక పుష్పంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తిరం
జకుఁడై పెట్టిన పుణ్యమూర్తికిఁ, బునర్జన్మంబు లేదన్నఁ, బా
యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్, బెద్దనై
ష్ఠికుఁడై యుండెడివాఁడు, నీవగుట, దాఁజిత్రంబె సర్వేశ్వరా!
అని ఉన్నదట. ఈ గాథ ఎంతవరకు సత్యమో రెంటిలోను
శివార్చనకు ఫలితం రెండు రకాలుగా కనిపిస్తున్నది.
మొదటిది సకామార్చనగాను, రెండవది నిష్కామార్చనగాను ఉన్నదని
ఇందులో రెండవది మేలైనది కావున పసులకారికి దొరికినదని -
ప్రాజ్ఞులు చెప్పడం జరిగింది.
(ఈ విషయం శతకవాఙ్మయ సర్వస్వం పుట - 31,32లలో కలదు.)
No comments:
Post a Comment