Wednesday, August 24, 2016

తనరు వంశ కీర్తి తనయ వల్ల


తనరు వంశ కీర్తి తనయ వల్ల


సాహితీమిత్రులారా!

నేటికాలంలో ఆడపిల్ల పుడితే చాలా మంది
తప్పనిసరి పరిస్థితిలో పెంచుకొంటున్నారు
కొందరైతే గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు.
ఇలాంటి వారికై మన యువకవి
మహతీ సేవకులు తన్నీరు బాలాజిగారి
పద్యాలను మనం చూసి
అలాంటి వాళ్ళకు చూపుదాం.

ఆడపిల్ల జనింప యవనికి బరువండ్రు
          అవని దేవతని యంజలింత్రు
ఎదుగు తనయఁజూచి ఎదను కుంపటియండ్రు
         నిక్కమైన సతిని నిప్పుయండ్రు
అమ్మాయి జన్మంబు అడవిలో మానండ్రు
         వెలసిన దేవత వేప యండ్రు
అమ్మాయిఁ బుట్టంగ అయ్యదిగాల్పడు
         ఇంటికి దీపము యింతియండ్రు
తనయుడుదయింప పుకింత్రు తల్లిదండ్రి
తనయఁబుట్టిన శోకించు తల్లిగూడ
అర్థనారీశుని నుతించు  యవనిలోన
ఆడమగ తేడఁజూప ఈయవనిలేదు

చదువులతల్లి యా సరస్వతి బ్రహ్మకు
        నాల్గుముఖంబులన్ నాల్కయయ్యె
సిరుల పంటయగు యాశ్రీలక్ష్మిని హరియు 
        నిక్కముగ ఎదలో నిల్పుకొనియె
సగముతనువునిచ్చి సతికి యా శ్రీపార్వ
         తీశుడు అర్థనారీశుడయ్యె
ముగ్గురు మూర్తుల మూలపుటమ్మను
       ఆదిశక్తిగ నంతా యాదరింత్రు
చెట్టు పుట్టలోన స్త్రీదైవమునుఁ జూచి
రాతిరప్పలోన నాతిఁజూచి
చద్దిముద్దఁబెట్టి చక్కగ మ్రొక్కడి 
తల్లులార! మరియు తండ్రులార!

ఆడపిల్లయన్న అలుసుగాఁజూడకు
అబలకాదు నెలత సబలఁజూడ
కొడుకుకన్న బిడ్డ కురిపించు ప్రేమరా
తనరు వంశ కీర్తి తనయ వల్ల

No comments:

Post a Comment