Friday, August 26, 2016

శ్రీ సాయి శతకము


శ్రీ సాయి శతకము

                                   -----శ్రీ అలంకారం కోటంరాజు


సాహితీమిత్రులారా!

(41వ పద్యం నుండి 50 పద్యాల వరకు శ్రీ సాయిశతకము)

సన్యాసిన్ గొలువంగ నేమియగు - యీ సంసార మాధుర్య - శ్రీ
విన్యాసంబందియే మెఱుంగునని - నేవిన్నాను, అన్నారు - నే
ధన్యుండితకు వారి మాట వినకన్ ధ్యానించుచున్నాను - గా
దే! న్యగ్రోధ మహాకృతీ! మనుపు షిర్దీ సాయినాథ ప్రభూ!     -41

ఉన్మత్తాకృతి నీది చూడ, నిను నీ యుర్వీస్థలిన్ యెవ్వరున్
కన్నోసామి తలంపబో రెవరు - నేకాంతంబు నీకేల - యే
త్నమధ్యంబున యేమినీకొఱిగె - సందర్భంబుగాదే యిటన్
ఏన్మాత్రంబు దలంచుచుందు నెద షిర్దీ సాయినాథ ప్రభూ!    -42

కాలూనంగను లేని యూబి యిది నే కష్టించి కష్టించి - నీ
కాళుల్ బట్టితి ప్రోవు మంచు దయతో కామ్యంబు లీడేర్చి - సు
శ్రీలంగూర్చగ జేతువో! యెవడు నేజేయంగ వీడందు వో!
రేలిట్లే తలపోయుచుంటి గద! షిర్తీ సాయినాథ ప్రభూ!   - 43

క్రమ్మన్ జూడుము కారుమబ్బగమి నాకామ్రేడితంబౌచు, యీ
దుమ్మేమో ననుముంచి వేసినది చేతోమోద మెట్లబ్బు, చి
క్కమ్ముల్ మూతికి గట్టినట్లొ యే కాంతిచ్ఛటాపుంజముల్
దు్మేక్కించును నాకు యింక ధర షిర్దీ సాయినాథ ప్రభూ!  -44

తరువాతంచును తేపవేసితివి యాతర్వాత తర్వాత - యీ
తరమాయెన్న యిది నాడె పూర్తియయినన్ దాన్మేలుయేమౌనొ? యీ
తిరకాసుల్ యికనైన మానుకౌను నాతీరేమి కన్గొందు - సు
స్థిరమంచెంచెద నీదు బాసటెద షిర్దీ సాయినాథ ప్రభూ!  -45

జనితోన్మాదముతోడ లెక్కగొనకన్ సంసార చక్రంబులో
నను దేహమ్మిటు నల్గినూకయె గదా! నానాటికిన్ క్రుంగి, కా
చిన యీ కాయలజూచి కొంచు తుదకున్ స్రీకాంతుడంచెంచి, యీ
దిన మందే నిను జేర వచ్చితిని షిర్దీ సాయినాథ ప్రభూ!   - 46

ఏదోదారి, యిదొక్కటైనను ధరన్ ప్రీతిన్ దలుర్పంగ - నీ
వేదో దారిని జూపగా గలవు యంచెంచున్ ప్రజానీక మీ
రేదో దారిని జూపులుంచితిరి - సారింపంగలేవా? ధరన్
ఈదీనాళిని బ్రోవనీవయగు షిర్దీ సాయినాథ ప్రభూ!   - 47

నైరాశ్యమ్మిది యెంత యెంత యయి యీనాడెంతయై నిల్చెనో!
యీరోజేనను కన్ను విచ్చి కనుమా! యీవెంత దైవంబవై
నా? రూఢంబయి పోయె, యిద్ది, నను యీ నాడైన బ్రోవంగదే!
ధీరాత్ముండవు నిన్ను యెన్నెదను షిర్దీ సాయినాథ ప్రభూ!   - 48

గారింపంగను యేల మమ్మిటుల విఖ్యాతెట్లు నీకబ్బు, శో
భా రమ్యాకృతి నీయెడంద గద యీ బ్రహ్మాండ భాండంబు, కూ
లారింపంగను, బెంపనీవెయట దుర్మార్గంబు ద్రుంపంగ, నీ
వే! రా ఖడ్గము బట్టి చెండుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!   - 49

వాలారుంగొనగోళ్ళ మీటితివి గావా మాదు డెందాలు, గీ
తాలాపంబులు నించ, నెంచగ మనస్తాపంబు, మాయింప, బెం
బేలిప్డేల, తమంత వేల్పిట మమున్ బెంచంగ లోటేమి? యో
లీలామానుష విగ్రహుండ! ధర షిర్దీ సాయినాథ ప్రభూ!   - 50

No comments:

Post a Comment