Monday, August 29, 2016

గిడుగు వ్యావహారిక అడుగు


గిడుగు వ్యావహారిక అడుగు

                                                                                    -అలంకారం విజయకుమార్

సాహితీమిత్రులారా!

సంస్కృత పదబంధాల గ్రాంథికభాషా సంకెళ్ళలలో బందీగా ఉన్న తెలుగును
వ్యావహారికభాషా ఉద్యమంతో పోరాడి సంకెళ్ళనుండి విముక్తికలిగించిన
భాషాభిమాని మన గిడుగు. వ్యావహారిక భాష పుస్తకాలలో పనికిరాదని
వాదించిన పండితులకు వ్యావహారికభాషలోని మాధుర్యాన్ని చవిచూపించినవాడు
మన గిడుగువారు.

మనం మాట్లాడే భాష పుస్తకాలుగా ఎందుకు పనికిరాదని
నిలదీసిన అడిగి పోరాడి గెలిచిన ఘనుడు గిడుగు ప్రాత: స్మరణీయుడు.
లిపిలేని సవర భాషకు లిపికూర్చి తన సమయాన్ని,
ధనాన్ని సర్యస్వాన్ని అంకితంచేసిన మహామనిషి
మన గిడుగువేంకటరామమూర్తిగారు.

100 సంవత్సరాల క్రితం గిడుగు చేసిన పోరాట ఫలితమే
నేటి మన పాఠ్యపుస్తకాలలోని జనసామాన్య భాష.
ప్రజల వ్యవహారంలో ఉన్నభాషే జీవభాషని
చాటిచెప్పిన మొదటివాడు గిడుగు.

తెలుగును ఇటాలియన్ ఆప్ ది ఈస్ట్ అనడమేగాని,
దేశభాషలందు తెలుగు లెస్స అనడమేగాని
తెలుగు వాడుక భాషలోని అసలుసిసలైన జాతీయనుడికారాల
మాధుర్యం వాడుక భాష వల్లనేకాని గ్రాంథికభాష వల్లకాదని బల్లగుద్ది
మరీ వాదించినవాడు గిడుగువారే.

గిడుగువారి జీవిత విశేషాలలోకెళితే
ఈయన 1863 ఆగష్టు 23న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో
వీర్రాజు, వెంకమ్మ అనే దంపతులకు జన్మించాడు.
విక్రమదేవ వర్మ వీరికి బాల్యస్నేహితులు. "నేను సంపాదించిన విద్యకు
మూలద్రవ్యమనదగిన భాషాజ్ఞానాన్ని భాషాభిమానాన్ని
నాకు కలిగించినవారు బొంతల కోడూరు "శిష్టి" కరణాలు-
 బైరాగి పట్నాయకులుగారు" - అని గిడుగువారు చెప్పుకొనేవారు.

మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో విజయనగరంలో
విద్యాభ్యాసం చేశారు. గురజాడ, ఆదిభట్ల వీరికి సహపాఠులు.
ఆ తర్వాత మెట్రిక్ పాస్ అయిన తరువాత
కలెక్టరాఫీసులో కొంతకాలం పనిచేసి,
పర్లాకిమిడి హైస్కూలులో చేరారు.
అక్కడ బి.ఏ. ప్రైవేటుగా చదవడం ప్రారంభించారు.
ఆయన తొలిసంతానం సీతాపతి 1885లో జన్మించారు.
అప్పటికి వారి బి.ఏ. పూర్తయింది. చిలుకూరి నారాయణరావుగారు
గిడుగువారి ప్రియ శిష్యులు. గిడుగువారిది ముక్కుసూటిగా పోయే వ్యక్తిత్వం.
చివరిలో వీరికి చెవుడు వచ్చిందట. గిడుగువారంటే అందరికీ భయమేనట.
ఈయన చివరికి 22 జనవరి 1940లో మరణించారు.

వ్యావహారిక భాషావాదాన్ని ప్రారంభించిన గిడుగువారు
 గ్రాంథిక భాషాద్వేషికాదు. ఆయన ప్రాచీన సాహిత్యంలో చదవని గ్రంథంలేదు.
తెలియని అర్థంలేదు - పదస్వరూపంలేదు.
గ్రాంథిక వాదులందరికంటే గొప్ప పాండిత్యం, భాషాధికారం గల గొప్ప
పండితుడు గిడుగువారు. అమోఘమైన జ్ఞాపకశక్తి కలవాడు.
ఇటువంటి వారి జన్మదినాన్ని మాతృభాషా దినోత్సవంగా
జరుపుకోవడం చాల సంతోషకరమైనది.
వారిని ఈరీతిగా మనం స్మరించుకొనే భాగ్యం మనకు దక్కింది.

చివరగా ఇక్కడ నార్ల చిరంజీవిగారి
ఒక చిన్ని పద్యాన్ని స్మరించుకుందాం

మధుర మధురమైన మనభాష కంటెను
చక్కనైన భాష జగతిలేదు
తల్లిపాలకంటె తనయునకేపాలు
బలమునీయగలవు తెలుగు బిడ్డ


No comments:

Post a Comment