Monday, August 8, 2016

పెండ్లొక్క సమయమయ్యె జరుగు నపుడు


పెండ్లొక్క సమయమయ్యె జరుగు నపుడు


సాహితీమిత్రులారా!

ఒకసారి తాళ్ళూరనే ఊరిలో ఒక సంపన్న
గృహస్థు ఇంట్లో పెళ్ళి జరుగుతున్నది
అక్కడి తురగా వెంకమరాజకవి గారు వెళ్ళి
తనువచ్చానని చెప్పిపంపాడు.
ఆ యజమాని పెళ్ళి పనుల హడావిడిలో విసుగుగా ఉండి
ఇప్పుడు "నా కీ కవుల ఏడుపుకూడానా" - అని చిరాకు పడ్డాడట.
ఆ విషయం తెలిసి వెంకమరాజుగారు
"నా ఏడుపుదేముంది -
పెళ్ళి అంతా ఏడుపుల మయంగానే ఉందిలే" - అని
ఒక సీసపద్యం చెప్పాడు.
ఆ పద్యం చూడండి.

పెండ్లి పేరంటాండ్రు పెను రంకులకు నేడ్వ బాజా భజంత్రీలు పప్పు కేడ్వ
రాజ బంధువు లంత రంకుముండల కేడ్వ బజారు వెలదులు పసుపు కేడ్వ
వచ్చి పోయెడు వారు వక్కలాకుల కేడ్వ గుగ్గిళ్ళకై పెళ్ళి గుర్రమేడ్వ
పల్లకి బోయీలు భత్యాలకై యేడ్వ బలు పురోహితుడు నేబులకు నేడ్వ
హారతి రూకల కాడు బిడ్డలు నేడ్వ కుర్రవాండ్రందరు కూటి కేడ్వ
అల్లుడనాథయం చత్త మామలు నేడ్వ కట్నంబుకై గ్రామకరణ మేడ్వ
పెద్ద మగండని పెండ్లి కూతురు నేడ్వపిల్ల చిన్నదటంచు పెనిమిటేడ్వ
చాలుగా నిన్ని యేడ్పుల సాగె పెండ్లి..........

ఇలాంటిదే చందుపట్ల గ్రామ వాస్తవ్యుడు
శ్రీరాఘవాచార్యులు చెప్పినది చూడండి.

సంభావనేదంచు సకల బ్రహ్మణు లేడ్వ తాంబూల మేదంచు తరుణులేడ్వ
బాజా భజంత్రీలు బత్తెంబునకు నేడ్వ పప్పు కూటికి పెండ్లి బాప డేడ్వ
రెండవ పెండ్లంచు పెండ్లి కూతురునేడ్వ పోరి చిన్నని పెండ్లి పోరడేడ్వ
వచ్చిన చుట్టాలు ఫలహారముల కేడ్వ ముత్తైదు లందరు బొట్టు కేడ్వ
చావు పెండ్లని డప్పు చాటువారలు నేడ్వ బ్రుతుకు పీన్గును మోయ రజకు లేడ్వ
చేసె నీ పెండ్లి........
ఔర దినవారముల కేము నరిగినా
టంచు దూషింప మొదలిడి రఖిల జనులు
చావు పెండ్లొక్క సమమయ్యె జరుగునపుడు

చూడండి పెండ్లిలో
ఎన్నిరకాల ఏడుపులున్నయో?
నిజమే ఎవరిగోల వాడిదేగా!

No comments:

Post a Comment