Friday, August 12, 2016

వేకువజామున తావులు దిగంతాలకు ........


వేకువజామున తావులు దిగంతాలకు ........


సాహితీమిత్రులారా!

అయ్యలరాజు నారాయణామాత్యుని
హంసవింశతిలో హేమంతర్తువు వ్యాపించిన తీరు
వర్ణించబడిన పద్యాలు ఎంత మనోహరముగా ఉన్నవో
చూడండి.

సకలదిశావ్యాప్త బకసితీకృతములు
      బహుళనిద్రాముద్ర పంకజములు
నిబిడవర్షితమహానీహారకణములు
      శీతలోత్తరుజాతవాతగతులు
వర్ధితనిర్ధూమ వహ్నిహసంతులు
        కైరవవికసన కారణములు
తాళవృంతవిహార కేళివారణములు
       యామినీసముదయాయామదములు
సరసమృగమద మేచకాగురు సుగంధ
బంధుర స్త్రీకుచద్వంద్వ బాఢయుక్తి
చకితపురుషావళీ శీతసాధ్వసములు
భాసురములయ్యె హేమంతవాసరములు
                       (హంసవింశతి 3-171)
(హేమంతవాసరములలో కొంగలు విస్తరించి తిరుగుటచే
ఆకసమంతా తెల్లబడిపోయింది
పద్మములు పూర్తిగా ముడుచుకొనిపోయినవి.
మంచు దట్టంగా కురియసాగింది. చల్లని గాడ్పులు వీచసాగినవి.
కుంపట్లు తీయకుండా మండుచున్నవి. కలువలు బాగా వికసిస్తున్నవి.
విసనకర్రలకు విశ్రాంతి చేకూరింది. రాత్రులు విస్తారంగా పెరిగిపోయినవి.
కస్తూరి కాలాగురు మొదలైన పరివళద్రవ్యములతో సుగంధపు పూతలు
పూసుకొన్న యువతులపాలిండ్ల గాఢపరిరంభణముతో పురుషులకు
శీతబాధ నివారణమవుతూన్నది.)

శాంతములయ్యె నెండలు, నిశాంతములయ్యె వధూకుచంబు ల
త్యంతము వాడి వేఁడిమికిఁదాంతములయ్యెఁబయోజముల్, వ్రణా
క్రాంతములయ్యె వాతెఱలు, కాంతములయ్యె మహోష్ణవస్తు, లా
శాంతములయ్యెఁ దావులు నిశాంతములన్ హిమవారిబారికిన్
                        (హంసవింశతి 3-172)
హేమంతర్తువులో మంచునీటిదెబ్బకు, ఎండలు శాంతములైనవి.
వధూకుచములు పసుపుతో(ఉష్ణాధిక్యమునకు పసుపు పూసుకొనడం సహజం)
శోభాయమానములైనవి. పద్మములు ఎండవేడికి వాడి శుష్కములైనవి.
పెదవులు పగిలినై. మిక్కిలి వేడిగా ఉన్నపదార్థములు చాలా ప్రియమైనవి.
వేకువజాములందు పుష్పవాసనలు దిగంతాలకు వ్యాపించినాయి.

(నిశ - రాత్రి, పసుపు,
నిశాంతములు - వేకువజాములందు,
                         పసుపుతో పూయబడు,
వాతెఱలు - పెదవులు)

No comments:

Post a Comment