Wednesday, August 17, 2016

పదమున్ బూనెడు సత్కవీంద్రు డలరున్


పదమున్ బూనెడు సత్కవీంద్రు డలరున్


సాహితీమిత్రులారా!

శివభారత కర్త గడియారం వేంకటశేషశాస్త్రిగారు,
రాణాప్రతాపసింహచరిత్ర కర్త దుర్భాక రాజశేఖర శతావధాని
ఇద్దరు జంట కవులుగా అవధానవిహారం చేశారు.
1920-26 సంవత్సరాలలో వీరి అవధానాలు బాగా ప్రకాశించినవి.

ఒకచోట కవిని దొంగతో పోల్చి చెప్పమని
ఒక పృచ్ఛకుడు వీరిఅడిగారట.
అప్పుడు వారు చెప్పిన పద్యం చూడండి.

పదమున్ మెల్లన చేర్చి, శబ్దముపలిన్ భావంబు సంధించుచున్
గదియన్ జిత్రతరార్థ జాతము నలంకారమ్ములం గొంచు న
మ్ముదమారంగ రసాంతరస్థితి దగన్ బొందించి దోషైక దృక్
పదమున్ బూనెడు సత్కవీంద్రు డలరున్ బాటింప జోరున్ బలెన్


(దొంగ - మెల్లగా అడుగులు వేస్తూ ఏ చప్పుడు వినిపించినా,
             మనసు దాని మీద ఉంచుతూ కార్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు.
కవి- పదాలను మెల్లగా కూర్చి శబ్దములు ఆలోచించి సంధించి, చిత్రార్థాలుగల
        అలంకారాలను గ్రహిస్తూ తప్పు లేకుండా, కవితా రససిద్ధిని సాధిస్తాడు.
ఈ పద్యంలో పదములు, శబ్దములు,
అలంకారములు, చిత్రతరార్థజాతము
మొదలైన పదాలు రెండర్థాలలో ఉపయోగపడి
పద్యానికి వన్నె తెచ్చినవి.)

ఇది చూడగా అవధానంలో చెప్పిన పద్యంలా కాక
ఆలోచనాంచితమై శ్లేషాశ్లేషితమా అద్భుతంగా ఉందీ రచన.


ఇందులో వీరు దొంగను - సుకవితో పోల్చారు.
అల్లసాని పెద్దనగారు కుకవిని దొంగతో పోల్చి చెప్పాడు.
ఆ పద్యం చూడండి.

భరమై తోచు కుటుంబ రక్షణకుగా ప్రాల్మాలి చింతన్ నిరం
తర తాళీ దళ సంపుట ప్రకర కాంతారమ్మునం దర్థపున్
దెరువాటుల్ తెగి కొట్టి తద్జ్ఞపరిషద్విజ్ఞాతచౌర్యక్రియా
విరసుండై కొఱఁతన్ బడున్ గుకవి పృథ్వీభృత్సమీపక్షితిమ్
                                                             (మనుచరిత్ర పీఠిక-9)

No comments:

Post a Comment