భార్యకు భర్త ఎలాంటివాడు?
సాహితీమిత్రులారా!
మనదేశంలో పెళ్ళయిన పడుచుకు
చెప్పేనీతుల్లో ఇది ఒకటి.
భర్తను ఎంతగా గారవించాలి
భర్త భార్యకు ఎలాంటివాడు? - అనే విషయాలను
అప్పగింతలకంటే ముందుగా చెప్పి
అత్తవారింటికి పంపుతారు.
ఇదికదా మన ఆచారం.
శకుంతలాపరిణయంలోని ఈపద్యం చూడండి.
వనితకు విశిష్టదైవము జీవితేశుండు
భామకు ముంగొంగు పసిడి భర్త
సుదతికి నరలేని చుట్టంబు పెనిమిటి
తరుణికి ప్రాణమిత్రుండు ధవుడు
వనజలోచనకుఁ బెట్టనికోట దయితుండు
నాతికి సకలార్థదాత ప్రియుడు
కాంతకు మానరక్షకుఁడింటియాతండు
సతికి వాఱడిలేని హితుఁడు వరుఁడు
కంబుకంఠికి నిత్యశృంగార విభవ
వల్లికకు నాలవాలంబు వల్లభుండు
పల్లవోష్ఠికి సౌభాగ్య భాగ్యలక్ష్మి
గణన మొనరింపనేల యేడ్గడయు మగఁడు
(శకుంతలా పరిణయము)
వనితకు ఇష్టదైవము,
భామకు కొంగు బంగారం,
స్త్రీకి అరమరికలులేని చుట్టం ,
ప్రాణస్నేహితుడు, పెట్టనికోట,
సకలప్రయోజనాలను చేకూర్చే దాత,
మానరక్షకుడు,
ఏ నష్టము కలిగించని హితుడు,
నిత్య శృంగారానుభవమనే వైభోగలతకు
పాదు- ఆలవాలమైనవాడు,
చిగురాకులాంటి పెదవికలిగిన భార్య సౌభాగ్యం -
పసుపు కుంకుమలు అనే భాగ్యలక్ష్మి మగడే.
ఇన్ని భాగ్యలక్ష్ములను లెక్కపెట్టడమెందుకు
ఇల్లాలికి ఏడుగడ మగడే - అని సారాంశం.
(ఏడుగడ = (ఏడు + కడ) - గురువు, తల్లి, తండ్రి, పురుషుడు,
విద్య, దైవము, దాత - అనే ఏడు. సప్తప్రాకారాలుగల)
No comments:
Post a Comment