Saturday, July 30, 2016

ఆశ చేసిన పని ఇది


ఆశ చేసిన పని ఇది


సాహితీమిత్రులారా!

ఒకానొక కవి రాజసన్మానము పొంది తృప్తిపడక
దొడ్డిసంభావనకు(సంతర్పణలాంటిది) వెళ్ళాడట
అక్కడి తొక్కిసలాటలో అక్కడివారు త్రోయగా
సంతర్పణ గంజిబురదలో జారి పడ్డాడట.
బట్టలన్నీ బురదైపోయాయి.
అది చూచి రాజు "కవివర్యా! ఇదియేమి?" అని ప్రశ్నించాడట.
దానికి కవి చెప్పిన శ్లోకం ఇది-

క్షుత్ - తృట్ - ఆశా కుటుంబిన్య: మయిజీవతి నాన్యగా:
తా సా మంత్యా ప్రియతమా తస్యా: శృంగార చేష్టితమ్

రాజా! నాకు ఆకలి - దాహం- ఆశ -  అనే
ముగ్గురు భార్యలు ఉన్నారు.
వారు నేను బ్రతికి ఉండగా విడిచిపోరు.
వారిలో చివరి ఆమె నాకు చాలా ప్రియమైనది.
ఆమె చేసిన శృంగార చేష్టయిది - అన్నాడు కవి.

కవి క్రింద పడినా వాస్తవాన్ని 
ఎంత చమత్కారంగా! చెప్పాడు.

2 comments:

  1. దొడ్డిసంభావనకు అంటే అది సంతర్పణలాంటిది కాదండి. పూర్వం శ్రీమంతులు ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు విరివిగా దానధర్మాలు చేసేవారు. ప్రముఖులైన కొందరిని స్వయంగా సత్కరించేవారు. ఐతే మంచి సంభావన దొరుకుతుందన్న ఆశతో ఎందరో బ్రాహ్మణులు వచ్చినా అందరినీ‌ దాత స్వయంగా సత్కరించలేడు కదా కార్యక్రమంలో. అలా వచ్చినవారిలో అప్రముఖులందరినీ పెరట్లోనే నియంత్రించి ఉంచేవారు. కార్యక్రమం చివరన దాత స్వయంగా రావటమో ఆయన తరపున ఎవరన్నా మరొకరు రావటమో జరిగేది వీళ్ళ వద్దకు. అందరికి తలొక అణాయో రూకనో‌ చేతిలో పెట్టి పంపేవారు. దీనినే దొడ్డిసంభావన అనేవారన్నమాట. ఒకసారి అడిదం సూరకవిగారు ఒక శుభకార్యానికి ఆహ్వానం పైనే వెళ్ళినా అక్కడ గుమ్మంలోని కాపలావాళ్ళు ఈయన్ని గుర్తుపట్టక దొడ్డిలోనికి నెట్టివేసారట. ఆరోజున ఇంటాయనే స్వయంగా దొడ్డిసంభావనలు ఇస్తూ మధ్యలో సూరకవిని చూసి విస్తుపోయి, 'ఇదేమిటి భావగారూ మీరిక్కడ!' అని విస్తుపోయాడట.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంగారికి,
      మీరు చెప్పిందినిజమే నాకు దొడ్డిసంభావన అనేది
      మాపెద్దల ద్వారా వినిఉన్నానుకాని
      నిన్నటి రోజున సరైనదిగా గుర్తుకు రాలేదు.
      ఈ విషయమై మీకు నా ధన్యవాదాలు

      Delete