శ్రీ సాయి శతకము
--శ్రీఅలంకారం కోటంరాజు
సాహితీమిత్రులారా!
ఈ రోజు నుండి ప్రతిరోజు కవికులాలంకార, కవిరాజు బిరుదాంకితులు
శ్రీఅలంకారం కోటంరాజుగారి శ్రీసాయి శతకం చూద్దాం.
ఇది 02-07- 1987 నుండి 28-07-1987 మధ్యకాలంలో వ్రాయబడినది.
ఈ కవిగారిది ప్రకాశంజిల్లా మాచవరగ్రామం పుట్టిన ఊరు.
ఉపాధ్యాయవృత్తిలో మంచి పేరు సంపాదించుకొని 1998లో
పదవీవిరమణ చేసి ఈ మధ్య 2012 నవంబరు నెలలో పరమపదించారు.
వివిధ ప్రక్రియల్లో 40 కి పైగా గ్రంథాలు రచించారు.
వీటిలో చాలవరకు అముద్రితాలు.
ఈశతకం కూడ 2013 డిసెంబరు నెలలో ముద్రించబడిది.
ఇందులో అన్నీ మత్తేభవిక్రీడితాలు, శార్దూలవిక్రీడితాలే.
వద్దన్నా యెటులూరకుందును సుధా భాండమ్మువే నీవు నన్
ఎద్దేవా యొనరించినన్ ప్రజలు, నా కింతైన సిగ్గేల, నీ
యొద్దేగా బ్రతుకంతా నాకి కను, యీ యుర్వేల బర్వేల - స
ర్దిద్దే వాడవు నీవు గాదె ధర షిర్దీ సాయినాథ ప్రభూ! -1
సిద్ధాంతంబుల జోలి బోను, పరులన్ చేసాచి, యాచింప ఈ
రాద్ధాంతంబుల వెన్నియున్నను, యికన్ లక్ష్యంబు నాకేల నే
శుద్దుండయ్యెద, నీదయార్ధ్రతను, సంశోభింపగా హర్హముల్
దిద్దింతయ్యని సాగ మోదమున షిర్దీ సాయినాథ ప్రభూ! -2
స్తవనీయంబగు సాధు హర్షజనితోత్సాహుండవై యుండి, మా
నవులెవ్వారలు వక్రమార్గగతులై నర్తింప మేల్సూచి, ది
ద్దవె నీ యంతటి వేల్పు కాన నగునే ధాత్రిన్ మరెచ్చోట? యి
ద్ది వహింపంగను చాలవే జగతి షిర్దీ సాయినాథ ప్రభూ! -3
నిను గొల్వంగను బారుదీరి రిట - కానీ నీవు నీ గుండె పై
ననుజేవెట్టి నిజంబు చెప్పుము - చిదానందుడవే బొంక నే
లను, యవ్వారికి నేమి గూర్చెదవొ - జాలంబేల తెల్పంగదే!
దినముల్ యిట్లిపుడెన్ని జరిగె షిర్దీ సాయినాథ ప్రభూ! - 4
స్వామీ యేమని విన్నవింతును - ప్రజల్ స్వార్థంబులో పండి - యీ
భూమిన్ వాస మొనర్చు చుండిరి, నిజంబూహింప, నీవన్న వా
రేమింతైనను లెక్కబెట్టరు - రసార్ద్రీ భూత చిత్తమ్ము, నీ
దేమీయంచనిపించుకోవలెన? షిర్దీ సాయినాథ ప్రభూ! - 5
No comments:
Post a Comment