వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!
సాహితీమిత్రులారా!
కొందరి నోటివాక్కు అమోఘం.
శాపానుగ్రహదక్షులైన కవిపుంగవులు అనేకులు ఉన్నారు
వారిలో గోగుపాటి కూర్మనాథకవి ఒకరు.
ఒకమారు సింహాచల క్షేత్రం మీదకు మహమ్మదీయ సేనలు రాగా
గోగుపాటి కూర్మనాథకవి ఆక్రోశం చెందగా అప్రయత్నంగా
"వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!" అనే మకుటంతో
సీసాలు దొర్లుకుంటూ కవిగారి నోటి వెంట ధారాపాతంగా వచ్చాయట.
ఆ భావతీవ్రతలో స్వామిని ఆయన బ్రతిమలాడాడు,
ఆక్షేపించాడు, ఎద్దేవా చేశాడు.
వాటిలో ఒకటి ........
పాశ్చత్యుల నమాజుపై బుద్ధి పుట్టెనో మౌనుల జపముపై మనము రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో విప్ర యజ్ఞములపై విసుగు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో దేవతా ప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో భక్తి నిత్యోత్సవ పరతమాని
వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరగద్రోలు
పారసీకాధిపుల పటాపంచలుగను
వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!
అభీర గృహముల అర కాగిన పామీగడల్ వడి దిగమ్రింగగలవు.
కాని యవనులపై వడి పారలేవు. కబళమున నోరు తెరతువు,
కళ్ళెమన్న మోము త్రిప్పు హయగ్రీవమూర్తి వహహ! - అని ఆక్షేపించాడు
పాలియ్యవచ్చిన భామిని ప్రాణాలు అపహరించినట్లు కాదయ్యా చేతనైతే
ఈ తురకలను నాశనం చేయమని వేడుకొన్నాడు.
మేము నిన్ను అగ్రహారాలను ఇవ్వమని అడగడంలేదు.
కరిహయాదుల మేము కాంక్షించలేదు.
జనులను దోచుకోకుండా చూడమనే మా ప్రార్థన - అని అంటూ
67 పద్యాలు పూర్తి చేసేసరికి కొన్ని లక్షల, కోట్ల గండుతుమ్మెదలు
కొండలోనుండి బయలుదేరి ప్రళయకాలంలో కారుమేఘాల్లా
కమ్ముకుని తురకల దండుపైకి మూగి, కండలు ఊడేట్లుగా కరచి,
నెత్తురు పీల్చి వారిని విశాఖపట్టణం దాకా బ్రతుకుజీవుడా! - అని పారిపోయేలా
చేశాయట.
ఆ దృశ్యాన్ని చూచిన కూర్మనాథుడు ఇలా వర్ణించాడు.
కారుణ్య దృష్టిచే కని మమ్ము రక్షింప నీరజేక్షణ నీవు నేడు పంప
పారసీకుల దండుపై కొండలోనుండి గండుతుమ్మెదలు నుద్దండ లీల
కల్పాంతమున మిన్ను గప్పి భీరకమైన కారుమేఘంబులు గవిసినట్లు
తాకి బోరున రక్తధారలు దొరగగా కరచి నెత్తురు పీల్చి కండలెల్ల
నూడిపడ నుక్కు మూతులవాడి మెరసి
చించి చెండాడి వధియించె చిత్రముగను
నొక్కొకని చుట్టుముట్టి బల్మిక్కుటముగ
వైరి హరరంహ! సింహాద్రి నారసింహ!
ఈవిధంగా
అనేకవిధాల నరసింహస్వామిని స్తుతిస్తూ ..................
మిగిలిన పద్యాలను పూర్తి చేశాడట.
No comments:
Post a Comment