నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
సాహితీమిత్రులారా!
రాయని భాస్కరునిలో ఈ గుణాలన్నీ ఉన్నాయని
ఒక కవి వర్ణించిన పద్యం
ఎంత చమత్కారంగా ఉందో
చూడండి.
నిత్యసత్య త్యాగనీతిలో శిబిఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
బహుపరాక్రమమునఁ బరశురామునిఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
రఘుకులోత్తముఁడైన రామచంద్రునిఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
సుకుమార తను సరి సురరాజసుతుఁ జెప్పి
నినుఁ జెప్పి మఱియును నిన్నుఁ జెప్పి
చెప్పదగుఁగాక యితరులఁ జెప్పఁదగునె
కలియుగంబున నీవంటి ఘనుఁడు కలఁడె
అమిత గుణసాంద్ర! మానినీ కుముద చంద్ర!
భాగ్య దేవేంద్ర! రాయని భాస్కరేంద్ర!
ఓ రాయని భాస్కరా!
నిత్యము సత్యము త్యాగము నీతిలో శిబిచక్రవర్తిని చెప్పిన తరువాత
నిన్ను చెప్పిన తరువాత మరొకరు లేరు కావున నిన్నే చెప్పాలి.
అలాగే పరాక్రమంలో పరశురాముని చెప్పిన తరువాత
నిన్ను చెప్పి మరల మరొకరు లేరు కావున నిన్నే చెప్పాలి.
సకలగుణాలలో రఘుకులంలోని రామచంద్రుని చెప్పిన తరువాత
నిన్ను చెప్పిన తరువాత మరొకరు లేరు కావున నిన్నే చెప్పాలి.
సుకుమారంలో ఇంద్రకుమారుడైన జయంతుని చెప్పిన తరువాత
నిన్ను చెప్పి తరువాత మరొకరులేరు కావున నిన్నే చెప్పాలి.
నిన్నే చెప్పాలిగాని మరొకరిని చెప్పవచ్చునా?
కలియుగంలో నీవంటి ఘనుడు మరొకరు కలరా?
- అని పై పద్యభావం.
No comments:
Post a Comment