మేరలఁ గొల్వవచ్చు నిఁక
సాహితీమిత్రులారా!
కాణాదం పెద్దనసోమయాజి కృత ముకుందవిలాసములోని
ఈ పద్యం ఎంత చమత్కారంగా ఉందో చూడండి.
చేరలఁ గొల్వవచ్చు దయ చిప్పిలు గొప్పకు గొప్పకన్నులున్
మూరలఁ గొల్వవచ్చుఁ గడు ముచ్చటలిచ్చు వెడందవక్షమున్
బారలఁ గొల్వవచ్చుఁ గచపాళి భళీ హరికిన్ సమీపపున్
మేరలఁ గొల్వవచ్చు నికఁ మేలితఁ డీగతిఁ బ్రీతిఁజేసినన్
(ముకుందవిలాసము 2-234)
దయారసం చిందించడమనే గొప్పదనానికే గొప్ప అయిన
ఇతని కన్నులను చేరలతో కొలవవచ్చు.
చూడటానికి మిక్కిలి విశాలమయిన రొమ్మును మూరలతో కొలవవచ్చు.
అతని జుట్టును (కచపాళిన్) బారల కొల్వవచ్చు.
శభాష్! ఇతడు ఇదేవిధంగా(ఈ గతిన్) గనక - అంటే,
చేరలనుంచి మూరలకు, మూరలనుంచి బారలకూ పెరిగినట్టుగా
నాకు ఆనందాన్ని (ప్రీతిన్) కలిగిస్తే ఆహా! బళీ! మేలు. మేలు.
ఇక వైకుంఠాం లేదా స్వర్గం సరిహద్దులను (హరికిన్ సమీపపు మేరలన్)
కొలిచేయ వచ్చు. (హరి - విష్ణువు లేదా ఇంద్రుడు)
No comments:
Post a Comment