ఇలాంటి వారున్నారా?
సాహితీమిత్రులారా!
పాండురంగమహాత్మ్యంలో తెనాలి రామకృష్ణకవి
పుండరీకుని గుణగణాలు వర్ణిస్తూ
వ్రాసినది ఈ పద్యం.
చూడండి.
చలి చీమనేనియుఁ జాఁ ద్రొక్క శంకించుఁ
బలుకఁడెన్నడు మృషాభాషణములు
కలుషవర్తనులున్న పొలము పొంతఁజనండు
కలిమికుబ్బఁడు లేమి కలగఁడాత్మఁ
దలయెత్తి చూడఁడెవ్వలనఁ బరస్త్రీల
ధైర్యంబు విడఁడెట్టి దద్దఱుటుల
నొరుల సంపదకునై యుపతపింపఁడు లోన
నిందింపఁ డెంతటి నీచునైన
మిన్నకయ చూడఁడాఁ కలిగొన్నకడుపు
సర్వభూతదయోదయోత్సవమొనర్చు
నిగమఘంటా పథైకాధ్వనీన బుద్ధి
బ్రహ్మవిద్యానవద్యుండు బ్రాహ్మణుండు
(పాండురంగ మహాత్మ్యము 2-6)
ఆ పుండరీకుడు వేదాలు అనే రాజమార్గంలోనే
అద్వితీయంగా పయనించు బుద్ధికలవాడు.
బ్రహ్మవిద్యయందు పేర్కోదగ్గవాడు.
చలిచీమను కూడా తొక్కడానికి జంకుతాడు
ఎక్కడ చస్తుందోనని.
ఏ పరిస్థితిలోను అసత్యం పలకడు.
పాపపు నడవడి గల వాళ్ళు ఉండే సమీపానికికూడ వెళ్ళడు.
ఉన్న సంపదకు సంతోషంతో పొంగడు.
దారిద్య్రానికి మనసులో శోకించడు.
ఏ పక్కనుండి గాని పరస్త్రీలను తల ఎత్తి చూడడు.
ఎటువంటి ఒడుదుడుకులలోను ధైర్యాన్ని కోల్పోడు.
ఎంత నీచుణ్ణయినా మనసులోకూడ నిందించడు.
ఆకలితో ఉన్నవాణ్ణి ఊరకే చూడడు(తిండి పెట్టి పంపుతాడు అని).
సర్వప్రాణులయందు అతనికి దయపుడుతుంది.
దానివల్ల అతడు ఆ ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తాడు -
అని భావం.
ఆకాలంలో ఏమో?గాని
ఈ కాలంలో మచ్చు
ఒకరైనా ఉంటాడా?
ఏమో !
అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాగైనా ఉన్నా - మంటారు కొందరు
నిజమేనా! అని అనుమానం రాకమానదు.
No comments:
Post a Comment