జీవులకు దొడ్డ సంపదల్ చేటుగాదె
సాహితీమిత్రులారా!
కుచేలుడు కృష్ణభక్తుడై అవసానకాలంలో
దివ్యవిమానంలో భార్యతో కూడి
దివ్యలోకాలకు పోతూ తన కుమారులకు
చేసిన ధర్మోపదేశంలోని ఒక పద్యం -
ఇది దేచిరాజు లక్ష్మీనరసమ్మ గారి
కుచేలోపాఖ్యానములోనిది-
శాల్యోదనాపూప సద్యోఘృతంబులు
మెసఁగ మేనునఁగండ మెండు గలిగి
రక్తమాంసప్రపూర్ణత నింద్రియంబులు
ప్రబల మోహంబు లోభంబు నిగుడ
దారసుతులయందుఁ దనివిచాలక బహు
ద్రవ్యమందునపేక్ష దారసిల్ల
మున్నె యర్థాతురాణాన్న గురుర్నబం
ధు వనెడు వాక్యంబు తోడుగాఁగఁ
బేదలకు బాంధవులకునుఁ బెట్టు లుడిగి
పరమనాస్తికులై జనుల్ బ్రదుకునాస
పడి చెడుడు రంతమున జముబారిఁద్రెళ్లి,
జీవులకు దొడ్డ సంపదల్ చేటుగావె
(కుచేలోపాఖ్యానము - 3- 43)
దారేషణ(భార్య కావాలి), పుత్రేషణ (పుత్రులు కావాలి),
ధనేషణ (ధనం కావాలి) అనే ఈ మూడిటిని ఈషణత్రయం
అంటారు. ఇవి మనిషి పుట్టినపుడే పుడతాయి. అయితే
ఈ మూడింటిలో చివరిదైన ధనేషణ చాల బలవత్తరమైనది.
కూడబెట్టిన డబ్బు ఎక్కువగా ఉండటం చేత చాల నాణ్యమైన
ధాన్యపు (మంచి బియ్యంతో వండిన)అన్నాన్ని, మంచి
పిండివంటలను, అప్పుడే కాచిన నేతిని బాగాతిని
బలియడంచేత శరీరంలో కండలు మెండుగా కలిగి
బలిష్ఠులై ఉంటారు.
ఆ రీతిగా శరీరం బాగా కండపట్టడం వలన
రక్తమాంసాలు కావసినంతగా ఏర్పడి ఇంద్రియాలు
బలపడి సుఖానుభవాల మీద లోభమూ మోహమూ
ఏర్పడతాయి.
దీనితో మనిషికి భార్య విషయంలో కుమారుల
విషయంలో తృప్తిచాలని తీవ్రమైన కోరికలు కలుగుతాయి.
అంటే ఎక్కువమంది భార్యలు - పిల్లలు కావాలనే వాంఛ
కలుగుతుంది. దానికి క్రమంగా హద్దుమీరిన ధనాన్ని
కూడబెట్టాలనే బలీయమైన కోరిక తోడవుతుంది.
డబ్బు పిచ్చి ఉన్నవాళ్లకు
ఈయన గురువు,
ఈయన బంధువు
- అనే విచక్షణ
ఉండదనే మాయ లోకంలో ముందే ఉన్నదాయె.
ధనసంపాదన విషయంలో వారు తొక్కే అక్రమమార్గాలకు
ఇది తోడవుతుంది.
ఇంకేముంది, డబ్బు సంపాదనలో పడి మానవ ధర్మాన్నే
మరిచిపోతారు. పేదలకుగాని బంధువులకుగాని చేయి విదిలించి
పెట్టడం మానివేస్తాడు చివరకు నాస్తికులై కేవలం బ్రతుకుమీద
ఆశతో జీవిస్తూ మరణకాలంలో యమధర్మరాజు బాధలకు చిక్కి
చెడిపోతుంటారు.
కాబట్టి జీవునికి అధికసంపదలు
చేటును కలిగించేవే కదా!
No comments:
Post a Comment