Monday, January 23, 2017

నేను నీడను మీకు


నేను నీడను మీకుసాహితీమిత్రులారా !


డా. రామచంద్రగారి ఈ గేయ కవిత వినండి-
తాను తరువై పలికిన పలుకులు
తరు రక్కసుని ఎద ములుకులు-


ఎవడు బీజము వేసెనో, తొట్టతొలి
నెవడు నీరము పోసెనో, ఈ రీతి
మొలకనై - చివురునై, వర్ణాలపర్ణమై
కొమ్మనై, తన్నంటి రెమ్మనై, చేవనై
                  - తల్లిగర్భములో నిలచితీ

పక్షులకు, పాంథులకు నీడనై, ఆకటికి
పండునై, వేకటికి దైవమై, జగతికంతకు
కల్పతరువుగా, చిక్రోడక్రీడలకు నిశ్రేణినై
సుస్థిరత గగన మంటగ నెదిగి పైపైకి
                                       - ఎగిసిపోయితినేను

నన్ను నరికేవాడు ఘనుడా? వాడు ఏపాటి
మొనగాడు?  గణనకెక్కిన దుర్మదుడు,
నికరంపు దానవుడు, తప్పొప్పులే యెరుగనోడు
బొగ్గులకు కల్పతరువును నఱుకువాడు
                                          - కృతఘ్నుడుకాడోవాడు

నన్ను గసటనుబెట్టి ఏమి తిని బతికేడు?
రోగాల రోదనల కడ తేరు తుదకతడు
జీవాళి కంట నెత్తుటి చారికల నెరుగడు
విష వాయువులు గ్రోలి నేలనే కూలబడు
                           - వేసరిలి తిరిగి లేవగలేడు

పామొకటి బుసకొడుచు తొర్రలోపల ముడిగి
పైపైకి ఎగబాకి, పక్షి గూళ్ళను తాకి
గుడ్లన్నీ తెగనాకి, సంతతిని కడతేర్చె
ఈడ్చి కొట్టేందుకు చేతులాడగలేదు నాకు
               - దానికి ఆహారమది, కట్టడికినాకేటి హక్కు?
                                                           వీడు అట్టీడు కాడో!

పిట్టా!  ఏడ్వకే, నేనుంటి నీ వెంట, కాదు కాలము గడ్డుది
పశువా!  నీకేల అలజడి!  గడ్డి పరకల మేతకు?  కాదిది చోటిది
అమృతమొసగెడి కల్ప భూజమ్మునకు చోటిది
వింజామరల మీకుమరల వీవనా మనసార/ సేదదీరుడు నాయొడి
                                                                      - తల్లివలె కాయనా మిమ్ము?

నా ప్రాణములు ఊడ్చి, పొయి కట్టెలుగ మాడ్చి
మింట మేఘముడుల్చి, పంట నిప్పుల కాల్చి
పాపమిట్టిది మోయు శాపంబుకద నీకు తెరువరీ!
నుగ్గు నూచముకాగ / ఫలమేమి ప్రాణులకు?
                                 - ఊతకొమ్మను నరుకుతావా?


ప్రజల మున్నుడి ఒకటి వినవా!  మూర్ఖడా!  - నాలోని
ఆకాకునొక్క దివిజుడట యెరుగవా?  కబోదివా!
"ఛందాంసి యస్యపర్ణాని" అంది గీతామాత - తెలియదా!
లేకున్న పూ రజము - తేనెపట్టగుటెట్లు?
                                                         - అది అమృతంబు కాదా!

అటు బోయడొకడు నానీడ వెలయించె రామకృతి
ఇటు నొక్క గౌతముడు పొందెనట జ్ఞాన ధృతి
అటు వీరబ్రహ్మయ్య - ఇటు యోగివేమయ్య
నానీడ మానవత నెకొల్ప లేదా బోధనల!
                                                         - అవి నీకు తలకెక్కలేదా!

పికకూజితంబులు - నెమలి క్రేంకారాలు
తూగుటూయెలలూగు - కోతి పిల్లలగుంపు
శాఖోపశాఖలిడు చలువల్ల రిమఝిమలు
పలువా!  ఎరుగవా!  ప్రకృతి చూపెడి హొయలు!
                                                              - తెరువరీ కబోదివా!

నానివాసము చలువ పందిళ్ళు, సమయింప ప్రళయమే!
నీదేమీ నాగాస్త్రమా!  - కాక గరుడాస్త్రమా!  పరుశువా!
నీకుఠారము తుప్పలుగ తూలు నాకడ - తెలియవో!
చిగురాకునైనను - పెకలించగాలేవు
                                                         - గరువంపు తెరువరీ!

వర్గమే స్వర్గమని - వర్ణమే స్వర్ణమని
కులమంటె బలమని - ధనమంటె ఘనమని
అపవర్గ స్వప్న సౌధంబునీయది - 
అపరిపక్వ మనస్వివీవుజడుడా
ప్రకృతిపై వికృత ప్రవర్తనము విడనాడు - ఇదేమి నర్తనమా?
                                     - లేకున్నా చండ్రనిప్పులె నిను కాల్చు

ఇంటి వెనుకకొకటి కంటి తుడుపుగా నేదో మావియో
మానో మాకో మీరు మెచ్చినది - కాకచిన్న మొలకో
ప్రకృతి యొడి బిడ్డలం - మము పెంచు ముబ్బిడిగ
మేమంటే యెరుగవా!  తెరువరీ!  ప్రాణవాయువు దాతలం 
                                                            - నీ శ్రేయోభిలాషులం

ఒక విషాద స్మృతిమమ్ము కెరలించు నపుడపుడు
ఋతుచక్రమున బడి - నలిగి పోయెడినాడు
ఎంత సంతసమో, గిలిగింతలో వసంతం నాడు
హేమంత శిశిరాలు మముమాడ్చు గిలకొట్టి నేడు
                                - కావడికుండే కద బతుకంటే

వీణనై వేణువై, వాయులోలీనమై - నావ నాగలి పట్టెమంచమై
బిడ్డ డూగే ఊయలై, మరి రాజు లెక్కే గద్దెనై
శవములను మోసేటి పాడెనై - ఆపై రాణులెక్కే పల్లకీ పడకనై
ఇన్ని అవతారాలు నావి - నీకులాగా కలవు తండ్రీ!
                                                                             - నీదేటి గొప్ప?

గోపాలుడా!  వాడు భూపాలుడా!  కాక ధనపాలుడా!
ఎవడైనా నేమి?  వితర్దికతోడ వాడికొక చోటు నానీడ
యాతాయాతా జనులకగు చలివేంద్ర నానీడ
నిదాఘ తప్తులకు - నిరీహులకు - విరహులకు
                                   - అమ్మకౌగిలి కదా నానీడ- డా. యన్. రామచంద్ర
 అధ్యక్షులు, సాహితీమిత్రమండలి
ప్రొద్దుటూరు, కడపజిల్లా, ఆం.ప్ర.
వేమన సాహితీ కళాపీఠం వారు(22-01-2017) 
నిర్వహించిన  శతాధిక కవి సమ్మేళనంలో 
చదివిన కవిత

No comments:

Post a Comment