కుమారసంభవంలోని గ్రీష్మము -2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
అవియనిగండశైల మన నంఘ్రులతోడన యెండకున్న భూ
భవ మన నింకి బీటగిలఁ బాఱని యేఱన మస్తకం బొగిన్
బవులనిమార్గి సంఘ మనఁబట్టదు లోకములోన నిట్టివే
సవి గలదయ్య నా నఖిలసాధ్వస మయ్యె నిదాఘ ముగ్రమై
(138)
బ్రద్దలుకాని పెద్దకొండఱాయా అన్నట్లు,
వేరులతోనే ఎండని చెట్టా అన్నట్లు,
ఇంకి బీటలువాఱునట్లు ప్రవహింపని నది
అనునట్లు, తలపగుతుందా అని బాటసారులు
అనునట్లు, ఆక్రమిస్తూ, లోకములో ఇలాంటిదుంటుందా
అన్నట్లు వేసవి తీవ్రమయి అందరకూ భయావహమైంది.
హరి శరధిఁ గ్రుంకె నభవుఁడు
సురనదిఁ దాల్చె నబ్జజుఁడు గ్రమ్మఱ నం
బురుహంబు సొచ్చె నతిదు
స్తర దుస్సహతీవ్రతరనిదాఘభయమునన్ (139)
మిక్కిలి దుస్తరము, దుస్సహము, తీవ్రతరము అయిన వేసవి
వలని భయంతో విష్ణువు సముద్రంలో మునిగాడు,
శివుడు గంగను నెత్తిన పెట్టుకున్నాడు,
బ్రహ్మ మళ్ళీ పద్మంలోకి ప్రవేశించాడు.
ఇట్లతిదారుణం బైనఘర్మదివసంబునం బార్వతి పంచాగ్నిమధ్యాగ్ని ముఖాధోముఖోర్ధ్వముఖాది
ఘోరతపంబు సేయుచు. (140)
ఈవిధంగా అతి ఘోరమైన వేసవిలో పగటిపూట పంచాగ్ని
మధ్యము, అగ్నిముఖము, అధోముఖము, ఊర్ధ్వముఖము,
మొదలైన భయంకర తపస్సులు చేయుచూ.........
(తరువాతి పద్యంతో అన్వయం)
(పంచాగ్ని మధ్యము - నాలుగువైపులా నాలుగు
అగ్నులను ఏర్పరచుకొని పైకి సూర్యునివైపు
చూస్తూ చేసే తపస్సు.
అగ్ని ముఖము - అగ్ని వైపు చూస్తూ చేసే తపస్సు.
అధోముఖము - ముఖము క్రిందికి పెట్టి చేసే తపస్సు.
ఊర్ధ్వముఖము - ముఖము పైకి ఉంచుకొని చేసే తపస్సు.)
ఆతపభీతి నీడలు రయంబున మ్రాఁకులక్రిందుఁ దూరెనో
యాతరులుం దృషాభిహతులై తమనీడలు తార త్రాగెనో
భాతి ననంగ నీడ లురుపాదపమూలములం దడంగె గ్రీ
ష్మాతపమధ్యవాసరములందుఁ జలింపకయుండు నెండలన్ (141)
వేసవి తాపములలో మధ్యాహ్నములందు
చలనములేని ఎండలలో నీడలు ఎండవలని
భయంతో శీఘ్రంగా చెట్లక్రిందిభాగాన ప్రవేశించెనో
ఆ చెట్లును దప్పికచే కొట్టబడినవయి తమ నీడలను
తామే త్రాగివైచెనో అన్నట్లు నీడలు పెద్దచెట్లమొదళ్ల
యందు అడగి యుండెను.
పరితాపోగ్రనిదాఘవేళ శిల పైఁ బంచాగ్ని మధ్యంబునన్
బరమధ్యానసమేత యై నిలిచి విభ్రాజిల్లె నుద్యత్తప
శ్చరణాలంకృతశైలనందన గనత్సంధ్యారుణాంభోధరో
త్కరమధ్యస్థిరకాంతకాంతియుతశీతద్యోతిలేఖాకృతిన్ (142)
పూనుకొన్న తపస్సుచే అలంకరింపడినదైన పార్వతి
మిక్కిలి తాపముచే భయంకరమైన వేసవి సమయమున
ఱాతిమీద, అయిదగ్నుల నడుమ, గొప్పధ్యానముతో కూడి
ఉండి ప్రకాశించు సంజవేళ ఎర్రనైన మేఘసముదాయము
నడుమ నిలకడగల మనోహరమైన కాంతితో కూడుకొన్న
చంద్రరేఖవలె మిక్కిలి ప్రకాశించెను.
No comments:
Post a Comment