Sunday, January 8, 2017

కమ్మతావులనీను కస్తూరి తిలకంబు


కమ్మతావులనీను కస్తూరి తిలకంబు




సాహితీమిత్రులారా!

సత్యవోలు సోమసుందర కవి కృత
రాధామాధవ విలాసములో
శ్రీకృష్ణుని కళ్ళముందు నిలిపే
వర్ణనతోకూర్చిన పద్యం చూడండి-

కమ్మతావులనీను కస్తూరి తిలకంబు
          మోము చందురు నందు ముద్దుగుల్కఁ
గోటి సూర్యప్రభన్ నీటు మీఱెడు తేజు
          గల కౌస్తుభంబు వక్షమునఁ గ్రాల
నమృతబిందువు లీల నలరుచుండెడు నాణి
          ముత్తెంబు నాసాగ్రమునను వ్రేల
దరమధ్యముననుండి ధారగాఁ బడురీతి
          నల ముత్తెముల సరు లఱుత మెఱయఁ
గరజలజముల రత్నకంకణము లలరఁ
దనువు నెల్లెడ రక్తచందనము దనర
మురళిఁబాడుచు నాడెడు పుణ్యశీలు
భక్తపరిపాలు వేణుగోపాలుఁగంటి
                                               (రాధామాధవ విలాసము - 1-4)


మురళి నూదుతూ, ఆ గానానికి అనుకూలంగా
నాట్యం చేస్తున్న పవిత్రమైన శీలం గలవాడూ,
భక్తులను రక్షించేవాడూ అయిన వేణుగోపాలుని
చూచితిని - అతడెలా ఉన్నాడంటే-
ఆ మోము చంద్రుణ్ణి పోలి ఆహ్లాదంగా ఉంది.
(చంద్రునిలో మచ్చలాగా)అందులో
నల్లని కస్తూరితిలకం ముద్దులొలుకూంది.
పైగా అది సుగంధ భరితమైనది(చంద్రునిలోని
మచ్చకు ఈ గుణంలేదు).
ఎదమీద మహాకాంతివంతమైన కౌస్తుభమణి
ప్రకాశిస్తోంది దాని తేజస్సు కోటి సూర్యుల
తేజస్సుతో సాటిగా ఉంది. ఆయన ముక్కు
చివఱ (నాసాగ్రమునను) ముత్తెపు నత్తు
వ్రేలాడుతోంది ఆ ముత్తెము స్వచ్ఛమైన
అమృతబిందువులా ఉంది.
కరములనే పద్మాలలో రత్నకంకణాలున్నాయి.
ఆ నీలమేఘ శ్యామలదేహం మీద
ఎర్రచందనపు మైపూత పూయబడి ఉంది.

(ఇక్కడ కంకణాలంటే కడియాలు, నీటి బిందువులు
రెండవ అర్థంలో పద్మాలపై నీటిబిందువులు చింది ఉన్నాయి
 అది సహజమేకదా)

No comments:

Post a Comment