Saturday, January 14, 2017

ఈ కాలం మహిమ ఎంతో!


ఈ కాలం మహిమ ఎంతో!




సాహితీమిత్రులారా!

కలికాలంలోని గొప్పదనాన్ని
కూచిమంచి తిమ్మకవి తన
కుక్కటేశ శతకంలో వివరించారు
ఆ పద్యం చూడండి-

వేదశాస్త్రపురాణ విద్యలక్కరగావు
           పరిహాసవిద్యలు పనికివచ్చు
గద్యపద్యవిచిత్ర కవితలు గొఱగావు
           గొల్లసుద్దుల్ తల్ పెల్లుమీరు
దేవతాభాషల తీరులేమియు గావు
           పారసీకోక్తులు ప్రణుతి కెక్కు
శైవ వైష్ణవ మతాచారంబు లొప్పవు
           పాషండమతములు బాళినలరు
నౌర ఇక్కాల మహత్మ్యమెంతొ
వింతయై తోచుగద ధరాభ్యంతరమున
భూనుతవిలాస! పీఠికాపురనివాస!
కుముదహితకోటి సంకాశ! కుక్కుటేశ!

రెండుపాదాల మకుటాలుగల శతకాలలో
కుక్కుటేశ శతకం ఒకటి.
ఆంధ్రనాయక శతకంలోను
చిత్రచిత్రప్రభావ దాక్షిణ్యభావ
హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ -
అని రెండు పాదాల మకుటం ఉంది.

వైదికవిద్యల మీద అనాదరము,
గద్యపద్య కవితమీద చిన్నచూపు,
సంస్కృతభాషపై అగౌరవము,
శైవాది మతాలపై అశ్రద్ధ,
జానపదవిద్యలపైన మక్కువ,
అన్నయభాషా వ్యామోహం,
హాస్యపు కవితల మోజు,
నాస్తిక మతాల మీద ఆసక్తి -
అనే విషయాలు కలిప్రభావం
వలన వ్యాపించాయని -
ఇది వింతగా ఉందని
కుక్కటేశ్వరస్వామికి
కవి ఆవేదనతో నివేదించుకున్న
పద్యం ఇది.

ఈ కవి క్రీ.శ. 18వ శతాబ్దిలో ఉండినవాడు
కుక్కటేశ్వర శతకంతోపాటు
రసికజన మనోరంజనము,
అచ్చతెలుగు రామాయణము,
భర్గా శతకము మొదలైనవనేకము
కృతిచేసిన కవి ఈయన
కాలానుగుణంగా వచ్చే మార్పులను
మన కళ్లకు కట్టినట్లు పై పద్యంలో
వివరించారు తిమ్మకవిగారు.

No comments:

Post a Comment